కళింగాంధ్ర కవిత్వం – ‘తూరుపు ‘

సాధారణం

scanimage002.jpgకళింగాంధ్ర సాహిత్య జీవితాన్ని కథారూపంలో ఏటేటా సంకలనం చేయడంలో కృషి చేస్తున్న సంస్థ ‘శ్రీకాకుళ సాహితి ‘. ఇదే కృషిని వ్యాస ప్రక్రియలో చేస్తున్నది ‘వెలుగు ‘సంస్థ. ఇక దాదాపుగా తొలి ప్రయత్నంగా ‘లైఫ్’ ప్రచురణ సంస్థ కళింగాంధ్ర కవిత్వాన్ని “తూరుపు” పేరుతో సంకలనం చేసింది. ఆ పరిచయం ఈ వారం…

సాహిత్యం, చరిత్ర, రాజకీయం వేటికవి విడివిడిగా మనగలిగే వస్తువులే. అందులో సందేహం లేదు. కానీ, సాహిత్యకారుడికి ఇతరేతర విషయాలపట్ల ఎంత అవగాహన పెరిగితే అతడి సృజన సమకాలీన జీవితాన్ని అంత విధేయంగా ప్రతిఫలించ గలుగుతుందని మనం చూస్తున్న సంగతి తెలిసిందే. మనం ఇప్పుడు పిలుస్తున్న కళింగం కులం కాదు. కళింగం భాష కాదు. కళింగం ఒక ప్రాచీన ప్రాంతం. ఒక ప్రత్యేక సాంస్కృతిక సంప్రదాయం కళింగ సొంతం. అన్ని వేళలా అందరికంటే విభిన్నంగా, వినూత్నంగా ఆలోచించగల కళింగసీమ పొడవు వెడల్పులు ఎత్తు పల్లాలు ఇప్పుడు మనకు అవసరం లేదు. గతాన్ని విడిచిపెట్టి వర్తమానాన్ని గమనంలోకి తీసుకొంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాలు మాత్రమే ఇప్పుడు కళింగ ప్రాంతంగా మమేకం కాగలిగేవి. మిగిలినదెంత ప్రాంతం ఒకప్పుడు మనలో భాగమైనా, అక్కడి ప్రజలతో, కళలతో, సారస్వతంతో, సంస్కృతితో ఎంత అవినాభావ సంబంధమున్నా, అక్కడి ప్రజలు మన సహోదరులే అయినా చారిత్రక కారణాలను తోసిరాజనలేం. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిని విడదీసి మనలో కలుపుకోలేం. వారికి పరిస్థితిని వివరించి మనపట్ల సానుభూతి ప్రకటించమందాం. మన ఆత్మగౌరవ ధిక్కార స్వరాన్ని ఆలకించమందాం. మనకు అన్ని విధాలా సహకరించమని అభ్యర్థించుదాం. కానీ ఈ మూడు జిల్లాల కలగలుపైన కళింగాంధ్ర గత వైభవాన్ని ‘మా పూర్వులు అపూర్వులు ‘ అంటూ తలచుకుంటూ మురిసిపోతుంటే మన కొరిగేదేమిటి? మన ప్రస్తుత పరిస్థితి ఏమిటి? వర్తమానమెలా వుంది? నిజంగానే దుర్భర దుస్థితిలో కునారిల్లుతున్నామా? అభివృద్ధి పేరిట జరుగుతున్న పంపకాలు అందరికీ సమంగా అందుతున్నాయా? అభివృద్ధితో మిడిసి పడిపోతున్నామా? రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో మన ప్రాంత పరిస్థితి, స్థితిగతులు, అభివృద్ధి తీరుతెన్నులు ఎలా వున్నాయి? గణాంకాలు ఏమి చెబుతున్నాయి? నిజంగా మనకు వనరులు లేవా? సహజ వనరులు లేవా? మానవ వనరులు లేవా? ఇవీ ఇలాంటివీ కొన్ని వందల ప్రశ్నలు మనకు మనమే వేసుకోవాల్సిన సమయమొచ్చింది. వీటన్నింటినీ పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన చారిత్రక సందర్భమిది.

ఈ కీలక దశలో పదునైన పేరుతో వెలువడిన “తూరుపు”ను అమూలాగ్రం విశ్లేషించుకోవాలసిన అవసరాన్ని మనం మొదలుపెడుతున్నందుకు సంతోషంగా వుంది. తొలి ప్రయత్నం “తూరుపు”లో వేనవేల లోపాలు వుండనివ్వండి. అవన్నీ మనం ముందుకు పయనించడానికి సోపానాలుగా మలచుకుందాం. గతకాలపు వైభవపు కీర్తికి, వర్తమాన విధ్వంసానికి పెద్దపీట వేసిన తూరుపు కవితా సంకలనం జీవితపు అన్ని ఛాయలను స్పర్శించింది. సిరికి స్వామినాయుదు తన ‘కళ్లం’ కవితలో కళ్లం రైతు జీవితంలో ఇప్పుడు సృష్టిస్తున్న అలజడిని చూపించారు. పొలం నుంచి తెచ్చిన పంట ముడుధాతువును బస్తాలుకెత్తే లోహంగా మార్చుకునేది కళ్లంలోనే. ఒకప్పుడు కళ్లం తన ఇంటికి పంటను చేరవేసే జాగా అయితే ఇప్పుడది ఒట్టిపోయిన వల్లకాడు. కళ్లంలో పనిచేసుకునే రైతు జీవితాన్ని జానపద కళారూపాలలో వర్ణించిన సోవియట్ సాహిత్యంలో వున్నంత ప్రతిభావంతంగా తెలుగు కవులు కళ్లాన్ని వర్ణించలేదు. స్వామినాయుడు కళ్లాన్ని తలచుకుంటూ కళ్లంతో అనుభూతులన్నీ కనురెమ్మలకు వేలాడే తీయని జ్ఞాపకాలనడం ఎంతో అందంగా వుంది. ‘పోటెత్తిన జనసముద్రమీ నగరం’ కవితలో ఛాయరాజ్ ముందంతా నగర ఆకృతికి భయవిహ్వలుడవుతూనే నెమ్మది నెమ్మదిగా కూడదీసుకుని ఈ నగర నిర్మాణం వెనక శ్రామికుడి రక్తరేఖల పార్శ్వం వుందని సాంత్వన పొందుతారు. పడిలేచే వాడి పిడికిలికి, పనివాడి చేతికి ఈ నగరం పట్టుబడుతుందని భావిస్తున్నారు. కాని, తాజాగా బయటపడుతున్న భూబకాసురుల కుంభకోణాలు చూశాక, కవి స్పందన ఏమిటో వేచిచూడాలి.

అభివృద్ధి చెందామనిపించుకోవడం కోసం వున్నపళ్లు వూడగొట్టుకోవడం మాదిరిగా చెట్లను నరుకుతూ పోతుండదం మనిషి మూర్ఖత్వం. చెట్లులేని నేల జీవంలేని చిత్రం మాదిరిగా వుంటుందని కె.వరలక్ష్మి తన ‘నిర్జీవ దృశ్యం’ కవితలో చెప్తారు. జీవితంలో నాలుగోపాదమైన వృద్ధాప్యం కుటుంబ సభ్యులకు మాత్రం కూరలో కరివేపాకు అయింది. ఇది కూడా మన సాంస్కృతిక జీవనంలో ఇటీవల వస్తున్న మార్పు మాత్రమే. గ్లోబలైజేషన్ అందించిన మరో మహత్తర కానుక వృద్ధాశ్రమాలు. దాట్ల దేవదానం రాజు తన ‘ప్రవాస పర్వం’ కవితలో ముసలివారికి కుటుంబమంతా అందంగా బహుకరిస్తున్న వృద్ధాశ్రమపు జీవితాన్ని ‘ఒకప్పటి దుక్కిటెద్దుకు దాణా కరువయ్యింద ‘ంటారు. ‘కాపు పూర్తయ్యాక పందిరిని అల్లుకున్న పొదను లాగేసారం’టారు. ‘ఇప్పుడెవరికీ తక్షణ ఫలితాలు లేని అనుభవాల సంగతులు అక్కర్లేదు ‘అంటారు. గుండాన జోగారావు తన ‘కాడెద్దులు ‘కవితలో ఒక వూహను అందంగా చెప్తారు. ఉద్యమ కవిత కాదు గాని, మనుషుల కష్టాన్నీ, త్యాగాల్నీ గానం చేసే కవిత. ‘నా పల్లె తల్లి ‘ కవితలో బద్ది నాగేశ్వరరావు అప్పట్లో పల్లెటూరు ఎలా వుండేదో తలచుకుని విలపిస్తారు. విలాపం ఎందుకంటే ఇప్పుడలా లేదని. ఎలా వుండేదే వివరంగా వర్ణించిన కవి ఎందుకలా అయిందో పాఠకునికి చెప్పరు. ‘నాగరకత వలువలు చుట్తుకున్న పల్లె పల్లెతనం కోల్పోయి సత్తు రుపాయి బిళ్లలా మిగిలిపోయిందంటారు. ఇప్పుడిలా మిగిలిన పల్లె గురించి మాట్లాడుతూ కౌగిలించుకునేది., వలసలు పోయేవాళ్లు అంటారు – కాల స్పృహ లేకుండా (పేజీ31లో). ఎంకౌంటరుల పేరుతో పోలీసులు సాగిస్తున్న మారణకాండలో హతులవుతున్న యువకులను కీర్తిస్తూ మానేపల్లి ‘మళ్లీ..మళ్లీ..’ కవిత చెప్పారు.

ఎలా వుండేవాళ్లం ఎలాగయ్యేం అంటూ మనల్ని నిలదీస్తారు బెందాళం క్రిష్ణారావు తన ‘కన్న తల్లి కోసం…’ కవితలో. మన జీవితాల్లోకి చీకటి ఎక్కడినుంచి వస్తోంది? చేతివృత్తులు ఎందుకు చితికిపోతున్నాయి? కళలెందుకు కల్లలవుతున్నాయి? జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, నదులు దాటి, సముద్రాలు దాటి, దేశాలు దాటి ఎక్కడెక్కడికో వలసలెందుకు పోతున్నాం? ఇలాంటి విలువైన ప్రశ్నల్ని కవి సంధిస్తున్నాడు. ప్రశ్నలు అడిగితే కుదరదు అనడానికి లేదు. ఇప్పుడు అందరం కూడబలుక్కుని వీటికి సమాధానాలను వెతుక్కోవాలి. ఈ సమాధానాలను వెతుక్కునే ప్రయత్నంలో మరింత కొత్త, పదునైన, నిండైన కవిత్వం రావాలి. రైతును కీర్తిస్తూ ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి ‘ఒక్కడు ‘ కవితలో భూమిని నమ్ముకున్న మనిషి కాబట్టి భూమన్న అనే పిలుస్తానంటారు. తల్లి గోదావరి నది, ఆ పక్కనే తన పల్లె దృశ్యం ఇవాళ చెదిరిపోయినా తన గుండెల్లో పదిలపరుచుకున్న చిత్రాన్ని వాసా ప్రభావతి ‘నా వూరు ‘కవితలో ఆవిష్కరిస్తారు. పి.అనంతరావు తన ‘గెద్దరెక్కల నీడలో’ చెదిరిపోతున్న పర్యావరణ పరిస్థితి పట్ల ఆందోళన చెందుతారు. సాయంత్రాన్ని వివిధ పదచిత్రాలలో వర్ణించిన ఎస్.హనుమతరావు (‘సాయంత్రం’ కవితలో) ఎందుకు అవి అలా పేర్చిందో తనకు లేని స్పష్టతవల్ల అసంపూర్తిగా విడిచిపెట్టేస్తారు. దానితో పేర్చిన పదచిత్రాల ఉపయోగం లేకుండా పోతుంది. ఇరవై ఒకటో శతాబ్దపు యువతలో ఎగసెగసి పడుతున్న నిరాశ జ్వాలల నిరసన రూపాన్ని ‘పురోగమనంతో తిరోగమనం’ కవితలో సార్వకోటి ధనుంజయరావు పెద్దపెద్ద వాక్యాల కవితలో చూపిస్తారు.

బిచ్చగాని ఆవేదనను తన ‘నిర్జీవ నేత్రాలు ‘లో బోనం శైలజ, బాల కార్మికుడి బతుకు చిత్రాన్ని ఎల్.కె.సుధాకర్ ‘లేకుండా వున్నవాడు ‘లో, బడికి మధ్యాహ్న భోజనానికి వెళ్లే బాలుడి మీద చింతా అప్పలనాయుడు ‘కన్నెతో పాటు…’ లో వివరిస్తారు. చింతాడ తిరుమల ఋఅవు ‘వారు-వీరు ‘కవిత చదివిన తరువాత ఇంటర్మీడియట్లో చదువుకున్న కమలాదాస్ కవిత ‘ది ఫాన్సీ డ్రెస్ షో’ గుర్తుకొచ్చింది. అయితే నిండా నేటివిటీ విన్న కవిత తిరుమలరావుది. ఇక ఈ సంకలం సంపాదకులలో ఒకరయిన శ్రీచమన్ రాసిన ‘సంకరవిత్తులు ‘ కవితలో మన జాతి తెగువనంతటినీ ఇవ్వాళ మార్కెట్ ను ముంచెత్తుతున్న హైబ్రిడ్ విత్తనాలతో పోల్చుతారు. కొమ్మలుండక, చిగుర్లుండక, కాయలు అకస్మాత్తుగా పళ్లవుతాయి. కాని, పళ్లలో విత్తనాలుండక పోవడం విషాదం కాక మరేమిటి? నిర్వీర్య జీవజాతి ఇదే తరహాలో మనుషుల్ని కూడా తయారుచేయడానికి సిద్ధమవుతోంది.

గంటేదు గౌరునాయుడు తన సహజ శైలిలో ఒక ఆలోచనాత్మకమైన కవిత ‘కట్టండి ప్రాజెక్టులు ‘ను అందించారు. ప్రాజెక్టులవల్ల ముంపు ప్రమాదానికి గురవుతాయనే ఆందోళనలో వున్న గ్రామాలను గురించి నెలల తరబడి చర్చల రచ్చలే తప్ప తీసుకున్న చర్యలు లేవు. పునరావాస పథకాలంటే ఎందుకో ప్రభుత్వానికి అంత కంటగింపు. ఋఅజకీయాల్లో నిరుద్యోగులను ఆశ్రయం కల్పించడానికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఆర్టీసీ, మార్కెట్లు మొదలైనవన్నీ చాలవని ఇప్పుడు శసనమండలిని కూడా పునరుద్ధరించారు. కానీ బతుకు కోల్పోతున్న పేదల ఇంటికి ఇల్లు, పొలానికి పొలం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం లేని రాజకీయ నాయకత్వం వున్నవాళ్లు కవులు, ఆలోచనాపరులు ఇలా కవితాత్మకంగా శపనార్థాలు పెడుతూనే వుంటారు. చేనేత పనిమీద ఇద్దరు కవులు కవిత్వం రాశారు. చేనేత సింగారాన్ని బయటనుంచి ఆస్వాదిస్తూ దూసి ధర్మారావు ‘రంగుల సంగీతాన్ని ‘పల్లవిస్తే, లోపలి మనిషిగా కాశిన వెంకటేశ్వరరావు ‘చేదు నిజాన్ని ‘పూర్తిగా వృత్తిపరిభాషలో పరిచయం చేస్తారు. కాలస్పృహ గురించి మాట్లాడిన బి.వి.ఏ.రామారావునాయుడు బతుకును పోరాటంతో పోల్చి యుద్ధం ఆపడమంటే మరణమనేనని తేలుస్తారు. సంపాదకులలో మరొకరైన అరుణ్ బవేరా ‘మనుషులు ఖాళీ చేసిన ఊరు ‘కవితతో సంకలనం ముగుస్తుంది. వలసల గురించి మహమ్మద్ అబ్దుల్ అజీజ్ ‘ప్రతిస్పందన ‘లో వలస వెళ్లటమంటే గుండె గుప్పిట్లో పెట్టుకోవడమే నంటారు. అలాంటి అనేక గుండెల్ని పిండిచేసే, మనసును ఆర్థ్రం చేసే భావనల్ని ఈ కవితలో అరుణ్ బవేరా పదచిత్రాలుగా ఆఫ్రికన్ కవుల కవితా సౌందర్యాన్ని తెలుగులో ఆవిష్కరిస్తారు.

కళింగాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాలు మాత్రమే అనే రంగు కళ్లద్దాలు ధరించిన ఈ సమీక్షకుడికి ఈ ‘తూరుపు ‘కవితా సంకలనంలో కొట్టొచ్చినట్టు కనిపించిందేమిటంటే… కళింగాంధ్ర కవులు కవితలన్నింటిలోనూ తమ బతుకునే గానం చేశారు. రైతు వెతలు, వలస చిత్రాలు, బతుకు బరువులు, ఆవేదనలు, ఆశలు, ఆక్రందనలు మొత్తంగా తమను తామే కవిత్వరూపంలో ఆవిష్కరించుకున్నారు. మిగిలిన అన్ని ప్రాంత కవులు రాసిన కవిత్వంలో అత్యధిక భాగంగతాన్ని నెమరువేసుకోడమో (నోస్టాల్జియా), దృశ్యాల్ని సుందరంగా, ఫ్యాన్సీగా, రొమాంటిగ్గా ఆవిష్కరించడమో గమనించండి. ఈ సంకలనంలో ఇమడనట్టు అనిపించిన కొద్ది పేలవమైన కవితలూ ఈ మూడు జిల్లాల కావలివారు రాసినవే కావడం యాదృచ్చికం. సంపాదకులు ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. ఇది ప్రాంతీయ తత్వం కాదు. దురభిమానం అంతకంటే కాదు. మన ఆకాంక్షలను, అభ్యంతరాలను, ఆశలను, భంగపాట్లను, వ్యక్తం చేసే ధిక్కార స్వరాల తీరు గురించి చెప్పడమే. అది ఉద్యమరూపంలో త్వరలో పునరాగమనం చెందబోతున్నదనే ఈ కవితలు బలంగా సూచిస్తున్నాయి.

ప్రకటనలు

5 responses »

 1. Dear Ravi garu,
  It is a fact that all of us should agree ..our North andhra region is most undeveloped area, especially Srikakulam districst is considered to be most backward place and its not because of natural resources availability…. its lack of commitment in political leadership to raise our voice and bring the attention of state and central leadership. See the case of TELANGANA .. all the leaders from all the political parties.. wherever they get chance they are talking about backwardness of telengana and make sure that most of the state budeget allocated to those districts of telengana for development.

  All of us feel bad about our backwardness but none of us show in action. At least these kind of stories/”vyasaalu” defintely motivate many people and start thinking of doing something.

  Once again thanks for providing these valuable stories in the BLOG.

  Thanks
  Jagan.

 2. పింగుబ్యాకు: నా రెండో కవిత ‘వందనం’… « మీరు చదివారా?

 3. పింగుబ్యాకు: ఇవీ తల్లీ నిరుడు కురిసిన పరిచయ వ్యాసమ్ములు! « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s