మొదటి ఆధునిక తెలుగు కావ్యం: “ముసలమ్మ మరణం”

సాధారణం

ప్రబంధ కవిత్వ యుగం నుంచి ఆధునిక కవితవైపు (ముఖ్యంగా భావ కవిత్వంవైపు) తెలుగు సాహిత్యలోకపు దృష్టి మళ్లించిన కవిగా కట్టమంచి రామలింగారెడ్డిగారిని చెప్పుకోవచ్చు. సి.ఆర్.రెడ్డిగారిని కవిగా యువపాఠకులు గుర్తించరు. వారికి తెలిసిందల్లా సి.ఆర్.రెడ్డిగారు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు మొదటి వైస్ ఛాన్సలరని మాత్రమే. కాని ఆయన బహుముఖ ప్రతిభావముతులు. తెలుగు కవిత్వాన్ని కొత్తదారి పట్టించిన ఆయన కావ్యం ‘ముసలమ్మ మరణం’ ను ఈ వారం పరిచయం చేస్తున్నాను.

రెడ్డిగారు తన పంతొమ్మిదవ ఏట పోటీలకోసమని రచించిన ఈ కావ్యం బహుమతి పొందాక 1900లో ప్రచురించారు. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ రంగానికి తొలి గ్రంథమని చెప్పుకోదగ్గ ‘కవిత్వ తత్వ విచారం’ ను 1914లో ప్రచురించారు. ఇది పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నము గ్రంథాల గురించిన విమర్శ గ్రంథం. చిన్న వయసులోనే రచించిన ‘ముసలమ్మ మరణం’ కావ్యం మాత్రం ప్రముఖ కవి, విమర్శకులందరి ప్రశంసలు, విమర్శలు పొందింది. రాచమల్లు రామచంద్రారెడ్డి ఈ కావ్యాన్ని విశ్లేషిస్తూ ఇదెలా సంధిదశ (బ్రిడ్జి) కావ్యమైందో వివరిస్తారు. “కథా నిర్మాణంలోనూ, శృంగార వర్ణనలు పరిహరించడంలోనూ ప్రబంధ కావ్యం కంటే భిన్నమైన ఈ కావ్యం పద్యాల శైలి, సమాస నిర్మాణం, పదాల కూర్పు, కవి సమయాలు మొదలైన కవితా సామగ్రి విషయంలో ప్రబంధ కవిత్వానికి నకిలీగా మారింది” అంటారు రారా.

107 గద్య పద్యాలున్న చంపూ కావ్యం ‘ముసలమ్మ మరణం’ కథ ఒక్కముక్కలో చెప్పాలంటే ముసలమ్మ అనే పేరుగల ఒక స్త్రీ తన గ్రామ ప్రజల క్షేమం కోరి తన ఊరి చెరువుకు బలయ్యింది. 17వ పద్యంతో కథ మొదలవుతుంది. 104వ పద్యానికి కథ ముగిసిపోతుంది. ప్రాచీన కావ్య సంప్రదాయాన్ని అనుసరించినప్పటికీ చాలాచాలా క్లుప్తంగా మొదటి పదమూడు పద్యాలలో ‘ఉపక్రమణిక ‘పేరుతో ఇష్టదేవతా స్తుతి వుంటుంది. మరో మూడు పద్యాలలో ఈ కావ్యాన్ని తన మిత్రుడు రఘునాధరెడ్డికి అంకితమిస్తారు.

ఈ “ముసలమ్మ మరణం” కథకు మూలం సి.పి. బ్రౌన్ ప్రచురించిన “అనంతపుతర చరిత్రము” అను గ్రంథం నుంచి గ్రహించినట్టు రెడ్డిగారు ‘ముఖపత్రం’ లో చెప్పుకున్నారు.అయితే ఆ కథకు కొన్ని మార్పుచేర్పులు యధేచ్చగా కవి చేసుకున్నారు – తన కావ్యంలో ఎఫెక్ట్ సాధించేందుకు. అందులో ముఖ్యమైన విషయం మూడు భాగాల మూల కథలో మొదటి, మూడవ భాగాలను నిర్లక్ష్యం చేశారు. కేవలం రెండవ భాగాన్నే ఎంచుకున్నారు. బుక్కరాయపట్నపు చెరువు నిండి పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఇంతలో ఆకాశవాణి చెరువు చుట్టూ గుమిగూడిన ఊరి ప్రజల నుద్దేశించి మాట్లాడుతుంది. అదే ఊరిలో ఉంటున్న బసిరెడ్డి చివరి కోడలు ముసలమ్మ మలి ఇచ్చుకున్నట్లయితే చెరువు కట్ట నిలుస్తుందని చెప్తుంది. విషయం తెలుసుకున్న ముసలమ్మ ప్రాణత్యాగానికి సిద్ధపడుతుంది. భర్త, అత్తమామల అనుమతి తీసుకుని, బిడ్డను భర్తకు అప్పగిస్తుంది. ప్రజల అనుమతిని కూడా తీసుకుని, దేవుడ్ని ప్రార్థించి ముసలమ్మ చెరువులో పడి ప్రాణాలు బలి ఇస్తంది. కవి స్వయంగా ఈ కావ్యాన్ని స్త్రీలకోసమే రాశానని చెప్పుకున్నారు – అయితే ఇందులో స్త్రీలకు సంబంధించిన ఏ అంశం ఉందో నాకైతే అర్థం కాలేదుగానీ, నాయిక త్యాగగుణమ్ మానవీయకోణమున్న అంశం. చెరువుకట్ట తెగిపోతోంది, గండిగా, లేదా గుమ్మడిగా, లేదా ఛాసంగా ఓ స్త్రీ తాను నిలబడతానని చెప్పడం మామూలు మాట కాదు. తాను ప్రాణత్యాగం చేయడం ద్వారా ఊరునీ, ఊరి ప్రజలందరినీ కాపాడుకోవడంతో నాయిక ముసలమ్మ ఇప్పటికీ అక్కడి ప్రజల హృదయాల్లో దేవతగా నిలిచివుంది.

మూలంలో నాయిక ఈడేరని పసిపిల్ల. కావ్యంలో రెడ్డిగారు ఆమెను బిడ్డడి తల్లిగా చూపించారు. పిల్లవాడి తల్లిగా పరిణతి చెందిన మనస్కురాలయి ఉంటుందని అప్పుడే అపార త్యాగ గుణాన్ని చూపించగలదని రడ్డిగారు భావించివుండవచ్చు. కావ్యరచన ఉద్దేశాలు రెండు. ఒకటి నాయికకు అత్యంత ప్రాధాన్యత కల్పించడం. హీరాయిక్ ఫిగర్ నుంచి మితికల్ ఫిగర్ గా మార్చడం. రెండు కావ్యాన్ని విషాదాంతం చేయడం. ట్రాజిక్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అప్పటికే ఆంగ్ల సాహిత్య అధ్యయనం చేస్తున్న రెడ్డిగారు స్పష్టంగా గుర్తించి, ఎమోషనల్ కెథార్సిస్ పాఠకుల్లో కలిగించడానికి నాయిక ప్రాణత్యాగంతో కథ ఆపేస్తారు.
ఇక ప్రబంధాలను పోలిన ఆధునిక కావ్యం కనుక కవి వర్ణనలు, సన్నివేశాలు, పాత్రలను ఎలా రూపకల్పన చేశారన్నది మనం గమనించాల్సిన మరొక అంశం. వర్ణనల తోనే కావ్యం రసాత్మకమవుతుందని భావించిన మన పూర్వకవులు ఒకే విషయాన్ని పేజీలకు పేజీలు వర్ణించేవారు. కట్టమంచి విపరీత వర్ణనల జోలికి పోలేదు. ఈ విషయంలో తనకు మార్గదర్శకంగా ఎవరిని ఎంచుకున్నారో మనం గమనిస్తే కట్టమంచి ఎంత పొదుపుగా, ప్రభావవంతంగా వర్ణనలు చేసివుంటారో అర్థం చేసుకోవచ్చు. పదవ పద్యంలో ఇలా ప్రార్థిస్తారు:

“కవికుల బ్రహ్మ దిక్కన గణనచేసి,

సూరనార్యుని భావంబు సొంపు బొగడి,

వేమన మహాత్ము సహజ విద్యా మయాత్ము

మ్రొక్కి, కవన మొనర్పంగ బూని నాడ.”

ఈ క్షణమో, మరుక్షణమో పొంగి ప్రవహించి ఊరిని ముంచెత్తబోతున్న భీకరమైన చెరువును కేవలం ఒక్క పద్యంలోనూ (20వ పద్యం – “చలదుత్తుంగ మహోగ్రభంగ పటలీ సంఘట్టనారావ, ముజ్జ్వల కూలాగ్రనటత్తరంగరవ…), బుక్కరాయపట్టణమన్న గ్రామాన్ని కేవలం రెండు పద్యాల్లోనూ (18, 19 పద్యాలు) కవి వర్ణిస్తారు. ఇక సన్నివేశాల కల్పన పరిశీలించాలనుకుంటే ముసలమ్మ తాను బలికావడానికి భర్త, అత్తమామల అనుమతి పొందే వివరాలు చూడాలి. కవి వీటికోసం 55 గద్య పద్యాల్ని కేటాయించారు. ఒక మహా త్యాగానికి తాను సిద్ధమవుతూ తన వాళ్లకు నచ్చజెప్పాల్సి వుంది నాయిక. అదే సమయంలో ఆ వివరాలు చదువుతున్న పాఠకులకు నాయికపై అభిమానం, గొఉరవాలు పొంగి పొర్లాలి. కట్టమంచి ఖ్చ్చితంగా ఆ ఎఫెక్టును సాధించగలిగారు.

కథావస్తువు సాంఘికమైనది తీసుకోవడం, నాయిక ప్రధానంగా శీర్షిక ఉండడమే కాకుండా ఒక సామాన్య రైతు కుటుంబానికి సంబంధించింది కావడం, విషాదాంత కావ్యం (ట్రాజెడీ), యూనివర్శల్ అప్పీల్ వున్న ప్రాణత్యాగం ద్వారా ఊరిని కాపాడడం అనే గొప్ప గుణం మీద కావ్యం నిలబడడం వంటి అంశాలు “ముసలమ్మ మరణం” కావ్యాన్ని వస్తునవ్యతను సాధించిన మొట్టమొదటి ఆధునిక కావ్యంగా తీర్చిదిద్దాయి.

తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన కట్టమంచి రామలింగారెడ్డిగారి “ముసలమ్మ మరణం” కావ్యానికి డాక్టర్ అనుమాండ్ల భూమయ్య సమ్పాదకుడిగా వ్యవహరించి విపులమైన సంపాదకీయం రాశారు. నిఘంటువులేవీ అవసరం లేకుండా చక్కగా అర్థం చేసుకోదగిన ఈ పద్య కావ్యాన్ని యువతరం తప్పక చదవొచ్చు. మీరూ చదవండి.

ప్రకటనలు

3 responses »

  1. ఇప్పుడే చూసానండీ మీసమీక్ష. అద్భుతంగా వుంది. నిజానికి ఇలాటి పరిచయాల మూలంగా మూలపడిపోతున్న తెలుగు సాహిత్యం వెలుగులోకి రాగలదు.
    నా అభినందనలు.

  2. పింగుబ్యాకు: ఇవీ తల్లీ నిరుడు కురిసిన పరిచయ వ్యాసమ్ములు! « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s