“జర్నలిజంలో సృజనరాగాలు” : అక్షరంపై అంతులేని అనురాగం

సాధారణం

4838_front_cover.jpgథానిలయానికి ఈ మధ్యన అలా వెళ్లినపుడు కారా మేష్టారు కల్మషంలేని స్వచ్ఛమైన అదే చిరునవ్వుతో ‘మరో మంచి పుస్తకం వచ్చింది చదువుతావా?’ అని నాకో పుస్తకం అందించారు. సాహితీ జ్ఞానభాండాగారంలోంచి అందమైన పుస్తకం తీసిచ్చారు. ఒక అర్థం తెలియని సర్రియలిస్ట్ పెయింటంగ్ రమణ జీవిది ఆ పుస్తకం ముఖచిత్రంపై ఉంది. ‘పుష్పాలు – ప్రేమికులు – పశువులు’ కథల రచయిత మునిపల్లె రాజుగారి కథలలో వేదాంత భావనకు దాసోహమనని తెలుగు పాఠకులు వుండరమో. ఆ పుస్తకానికి ముందుమాట రాసిన పోరంకి దక్షిణామూర్తి ‘ఋఅజుగారు మీకేమవుతారు?’ అన్న కాప్షన్ ఎప్పటికీ మర్చిపోలేం కదా! అదే అసాధారణ రచయిత రాసిన ఈ పుస్తకం పేరు “జర్నలిజంలో సృజనరాగాలు” పేరు వినగానే జర్నలిస్టులకు నాలుగు వినసొంపైన మాటలేమైనా చెప్పారేమోనన్న ఆతృతతో గబగబా తిరగేసిన మనకు ఇది జర్నలిజంపై పుస్తకం కాక, మరో సాహిత్య విందుగా కనిపిస్తుంది. ఎక్కడలేని ఉత్సాహంతో పుస్తకంలో మునిగిపోయాను. సరిగంగ స్నానమాడాను. ఈ వారం ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.

ఈ పుస్తకాన్ని గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఇవి ఒక పథికుడి జీవన యానంలో అడుగడుగునా ఎదురైన అపురూప క్షణాలను మనకు అద్భుతమైన పద లాలిత్యంతో అందివ్వడమే. మొత్తం ఎనభై ఏడు వ్యాసాలు. ఎందరో మహనీయులు. వారు సృజించిన అద్భుత సాహిత్యం, వెలయించిన కళాఖండాలు, వారి రమణీయ వ్యక్తిత్వం, ఎంతో ప్రేమతో, పక్షపాతంతో, వల్లమాలిన ఇష్టంతో వారందరికీ మునిపల్లె రాజుగారు పట్టిన అక్షర నీరాజనం ఈ సృజన రాగాలు. అమితాబ్ తొలి చిత్రానికి సంగీతం అందించింది డాక్టర్ ఏల్పూరి విజయ రాఘవరావుగారని ఎంతమందికి తెలుసు? జిడ్డు కృష్ణమూర్తి తత్త్వ అధ్యాయి శ్రీవిరించి కొన్ని కథానిక బులెటిన్లు నడిపారని ఎంతమందికి తెలుసు? నటుడిగానే చిరపరిచితమైన రక్తకన్నీరు నాగభూషణం గొప్ప సాహిత్య పాఠకుడనీ, మార్క్సిష్టు ఆలోచనాధోరణి గలవాడని ఎంతమందికి తెలుసును? ఇలాంటి కొన్ని వందల విశేషాలను ఈ పుస్తకం చదవడం ద్వారా తెలుసుకోవచ్చును. సాధారణంగా సాహిత్య అధ్యయం అంటే పత్రికల్లో వచ్చే కథలు, కవితలు, విడిగా వచ్చే నవలలు విరివిగా చదవడమే అనుకుంటాం. కాని ప్రతి సృజన అవతరించడం వెనక కళాకారునిలో జరిగే ఆంతరంగిక సంఘర్షణ ఏ స్థాయిలో ఉంటుందో మునిపల్లె మనకు అరటిపండు వలిచిపెట్టినట్టు చెబుతారు. అంతేకాకుండా అలాంటి సృజనలను మనం చదవడం మనలో వేదాంత తాత్విక స్థాయిని ఎలా విస్తృతపరుచుకోవడానికి సహకరిస్తుందో అన్యాపదేశంగా తెలియపరుస్తారు.

తెలుగు సాహిత్యానికి తన అపురూపమైన సేవలందించిన, తెలుగు కథా ప్రాభవానికి ఎంతో కృషి చేసిన మధురాంతకం రాజారాంను రచయిత వేనోళ్ల కీర్తిస్తారు. ఆ మాటల వెనక రాజారాంపట్ల రాజుగారికున్న అభిమానం ప్రతి అక్షరంలోనూ ద్యోతకమవుతుంది. మధురాంతకం కథలను మ్యూజియం ఆఫ్ హ్యూమన్ హిస్టరీ అని వర్ణిస్తారు. సినిమాల కోసం రక్తకన్నీరు నాగభూషణం ప్రయత్నిస్తున్న రోజుల్లో ఒకసారి రాజుగారికి ఒక పెద్ద పకోడీ పొట్లంతో ఆయన ఎదురవుతారు. అవీ ఇవీ అన్నీ మాట్లాడుతూ ఎందుకిన్ని పకోడీలు కొన్నారని అడిగినపుడు నాగభూషణం ఇలా జవాబు చెప్పారట: ‘ఎంతోకాదు, పావలానే. సగం ఈ పూటకి, మిగతావి రాత్రికి. మంచినీళ్లు తాగితే రోజు గడిచిపోతుంది” అని. ఈ వాక్యం చదివిన తర్వాత ఎంతమంది చార్లీచాప్లిన్ల జీవిత చరిత్రలు చదవాలి? అజంతా గురించి రాసిన నాలుగు నివాళి వాక్యాలు అజంతా కృషినంతటినీ పట్టిస్తాయి. ‘పరిత్యాగి పరివేదన’ శీర్షిక అజంతాకు దొరకడం కూడా కాకతాళీయమేనా? లేదా సాహితీ ప్రహేళికా పరిష్కారమా? అజంతాపై ‘కొత్త వెలుగు’ను ఎప్పుడో ప్రసరించిన నూతలపాటి గంగాధరం వ్యాం కోసం మళ్లీ కథానిలయంలో 1970ల నాటి భారతులను జల్లెడ పట్టాలి. ఎందుకంటే అవి మళ్లీ దొరకవు. అసలు అళాంటి అపురూప వ్యాసాలు వచ్చాయనే సంగతి మాతరానికి తెలిస్తే కదా? ఎక్కడో తమిళ దేశ కుగ్రామంనుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చి తెనాలిలో స్థిరపడి, తెలుగు నేర్చుకుని, శారదగా అవతారమెత్తిన హోటల్ కార్మికుడు నటరాజన్ మానవ జీవతంలోని మర్మాలను ఎరుకపరచడం కేవలం తెలుగు కళామతల్లికి సేవచేయడం కోసమే అంటే కాదనగలమా? తన రాగార్చనతో శంకరుని పూజించే బిస్మిల్లాఖాన్తో శారదలాంటి వ్యక్తులను పోల్చాలని నాకనిపిస్తుంది.

ఇల్లు కథను అంచెలంచెలుగా పరిశీలించి దానిని కాళీపట్నం రామారావు ఎలా ఇతిహాసంగా మలిచారో చెప్తారు. బి.నరసింగరావు ‘రంగుల కల’ సినిమాను సమీక్షిస్తూ 1986లో సినిమా పోషిస్తున్న కీలకపాత్ర గురించి ఒకచోట ‘ఒకనాడు ఏ జాతి నాగరకతనైనా కొలిచే చిహ్నాలు ఆ జాతి సంగీత సాహిత్యాలుగా పరిగణింపబడేవి. ఈనాడు వాళ్లు నిర్మిస్తున్న చినిమా చిత్రాలుగా మారిపోయినవి ఆ కొలబద్దలు. విష సాంసృక్తిక వృక్షఫలాలను మనభావి తరాలవారికి వారసత్వ సంపదగా అందజేయబడుతున్న రాక్షస నాగరికతా కాలంలో ‘ అంటారు. కానీ ఇప్పటి సినిమాలు చూస్తుంటే రాజుగారు ఏమని వ్యాఖ్యానిస్తారో, ఎలా మండిపడతారో తెలుసుకోవాలనుంది. ‘స్వగతం’గా వినిపించిన మాటలు కొత్తగా కలం పట్టిన వారందరికీ కొత్త చూపును, ఉత్సాహాన్ని, శక్తినిస్తాయి.

ఏవి సమీక్షలో, ఏవి పుస్తక పరిచయాలో, ఏవి నివాళులో, ఏవి ముందుమాటలో, ఏవి పరిచయాలో తెలియకుండా పోయింది. వ్యాసం అనంతరం రచనా కాలాన్ని సూచించే తేదీ తప్ప మరే సమాచారం లేదు. కేవలం రచయితల వివరాలు తప్పితే మరే వివరాలు లేవు. చాలా సమీక్షలనదగ్గ రచనలు ఏ పుస్తకానికి సమీక్షలో తెలియకుండా పోయింది. అలా కాకుండా వ్యాసం చివర ఆ పుస్తకం పేరు, ప్రచురణ కర్త వివరాలు ఇచ్చివుంటే అభిలాష, ఆసక్తి గల పాఠకులు మునిపల్లె రాజుగారి లాంటి పెద్దలను సంప్రదించి ఆయా పుస్తకాలను సంపాదించి చదువుకునే వీలుంటుంది. మలి ముద్రణలో ఈ విషయమై ఆలోచించాలి. ఇది టెక్నికల్ విషయమే గాని, పుస్తకానికి దీనివల్ల వచ్చిన నష్టమేమీ లేదు. ప్రతి వ్యాసం చివర రాజుగారు చదివిన ఒక గొప్ప వాక్యాన్ని కోట్ చేశారు. ఒక్కో విషయమూ ఎంతోసేపు ధ్యానం చేసుకోదగ్గవంటే అతిశయోక్తి కాదేమో.

అక్షరాలలో అద్భుతమైన అందాన్ని, పదాలలో అంతులేని ఆనందాన్ని, భావాలలో అనంతమైన తాత్వికతను జుర్రుకోగల సహితీ పిపాస ఈ రచయితలలో మనం గమనిస్తాము. ఏ వాదాల వివాదాల జోలికీ పోకుండా కేవలం భావాన్ని, పద లాలిత్యాన్ని తన లోతైన చూపుతో దర్శించిన మునిపల్లె ఆ అక్షరాలకే ఎంతో సొగసును ఆపాదిస్తూ ఆ రచయితలపై, వారి అనుసృజనలపై కొత్త వెలుగులను ప్రసరిస్తారు. మనకు కొత్త దృష్టిని అందిస్తారు. అన్నింట్లోనూ అందం, అనురాగం, లోతైన వేదాంత భావనలను చూడగలగడం ఇటీవల అబ్దుల్ కలాం ఆత్మకథ తర్వాత ఈ పుస్తకంలోనే మనం దర్శించగలుగుతాం. సాహిత్యం పట్ల ఎంతో ప్రేమూండడమే కాదు, జీవితం పట్ల ఎంతో ఆరాధన ఉంటేనే ఇది సాధ్యమవుతుందనేది నిస్సందేహం. ముందుమాటలుగా ఆశిర్వచనాలు పలికిన ఆర్వీయార్ అన్నట్టుగా ఉత్తములకు అడుగడుగునా మిత్రులే కదా!

ఇంత మంచి పుస్తకాన్ని, అమూల్యమైన సమాచారాన్ని, ఆత్మీయమైన భావాలను అందించిన కారా మేష్టారికీ, తన జ్ఞానకొలనులో మనను ఓలలాడించే మునిపల్లె రాజు గారికి మనమెలా రుణం చెల్లించుకోగలం? కేవలం నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుకోవం తప్ప. ఈ విషయాన్ని పదిమందికీ చెప్పుకోగలగడం తప్ప…

మరి మీరూ చదువుతారుగా…..!

ప్రకటనలు

6 responses »

 1. ఎంత మంచి పుస్తకమయినా, స్పందించే పాఠకులు లేకపోతే రచయిత శ్రమ వ్యర్థం, రచన వ్యర్థం. మంచి పుస్తకాలని పాఠకులకు పరిచయం చేస్తున్నందుకు మీరు అభినందనీయులు . కారా మాష్టారు, కథానిలయం అందుబాటులో ఉండటం అనేది ఒక అదృష్టం లాంటిదే అని చెప్పాలి. అన్నీ అందుబాటులో ఉన్నా వాటిని ఉపయోగించుకోని వాళ్ళు ఉన్నారనుకోండి. అది వేరే సంగతి. ఏదయినా మీరు అభినందనీయులు

 2. చాలా రోజులుగా ఈ పుస్తకాన్ని గురించి నా భావనలు రాద్దామనుకుంటున్నాను కానీ రాయలేకపోయాను.
  మీరు రాసినందుకు అభినందనలు.

  చాలా అద్బుతమైన వాక్యాలు గుండెలను హత్తుకుంటాయి.

  చదవవలసిన పుస్తకం

  జాన్ హైడ్ కనుమూరి

 3. మీ పుస్తక పరిచయం బాగుంది.ఇటీవలె నేను కారా మాస్టారు గారిని కలిసాను.కథా నిలయం చూసాను.వీలయితె మీరు నా పుస్తకాలను చదివి మీ అభిప్రాయం తెలిపితే బాగుంటుంది.పాత రచయితలే కాక కొత్త రచయితలు ఏమి రాస్తున్నారో తెలుస్తుంది.

 4. మీ వ్యాసం చాలా బాగుంది. ఈ పుస్తకంలో చెప్పిన కొన్ని వందల విశేషాల్లో మూడింటిని మీరిచ్చారు. నిజానికి ఆ మూడు నాకు తెలియవు. ఇంక ఎన్ని తెలియకుండా వున్నాయో, తప్పకుండా వాటిని తెలుసుకుంటాను. ఇలాంటి కొత్త పుస్తకాలను, వాటిలో సారాంసాన్ని క్లుప్తంగా వివరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.

 5. పింగుబ్యాకు: సాహితీ ప్రియులకు నిజమైన విందు ఈ ‘సహృదయం’ « మీరు చదివారా?

 6. పింగుబ్యాకు: ఇవీ తల్లీ నిరుడు కురిసిన పరిచయ వ్యాసమ్ములు! « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s