ఇసక దొంగలు

సాధారణం

నిండా పారుతున్న నది ఒడ్డున
నీళ్లు అమ్ముతున్నట్టు
చెరుకు తోట పెంచుతున్న రైతుకు
పంచదార రుచి చూపిస్తున్నట్టు
ఇరవైఒకటో శతాబ్దపు యువతకు
మాట్లాడే కళ బోధిస్తూ నేను….

 

ఇంటినుంచి కాలేజీకి కాలేజీనుంచి ఇంటికి
మూడు గంటల బస్సు ప్రయాణం
కోరుకుంటే కునుకుతూ విరామం
ఓపికుంటే సారస్వత అధ్యయనం
లేకుంటే కబుర్లతో కాలక్షేపం
అంతా పక్కన కూర్చున్న ప్రయాణీకుడి దయ

ఆకాశం పందిరిలో విరగబూసిన పుష్పాల్లా
యుక్తవయసులో మన యువతలా
ఉత్సాహంగా ముసురుకునే మేఘాలు
తొలిచినుకుల తడి మట్టివాసన

 

అప్పుడే వెలసిన వర్షం
ఎవరో స్నానం చేయించినట్టుగా
పచ్చగా మెరిసి మురిసిపోతున్న తూరుపు కనుమ
ముస్తాబు చెయ్యడానికి బయల్దేరిన గొర్రెల మంద

నాలుగు చినుకులకే నిండిన వంశధార
బ్రిటిషోడి బ్రిడ్జి కిందికి నీళ్లు
అలా నిండుగా నీటితో పారే నదీమతల్లిని చూస్తే
కడుపునిండా తరమాణి అన్నం తిన్నంత చల్లన

 

వర్షం తగ్గిన మర్నాడే వట్టిపోయిన వంశధార

కళింగాంధ్ర దైన్యాన్ని పట్టి చూపిస్తూ
పిల్లకాలువ కంటే సన్నంగా బలహీనంగా
ఆ ఇసకతిన్నెల నదిని చూస్తే ఏమనిపించదుకానీ…

ఆ ఇసకను లారీల్లో ట్రాక్టర్లలో మోసుకుపోతుంటే
నదీగర్భాన్ని తవ్వితవ్వి ఖాళీచేస్తుంటే
తాగిన తల్లిరొమ్ముల్నే గుద్దుతుంటే
చోద్యంచూస్తున్న రాజకీయుల్ని, అధికారుల్ని
నానాబూతులు తిట్టాలనుంది….

ఒక స్పందన »

  1. ఏమి చేస్తాం మనమేమి చేస్తాం….
    వంశదారకు తెలీదా…. తన మట్టిచీరను లాగుతుంది తన సుపుత్రుడేనని..
    లేచినిది మొదలు స్నానపనాడులుదాకా తనే ఆధరామని ..
    వంశదారకు తెలీదా.. లాలిపాటల తల్లి బలి పాటలు పాడగాలదని….
    కానీ
    ఏమి చేస్తాం మనమేమి చేస్తాం….

    ఆ సుపుత్రినికి తెలీదా… తను గాయపరుస్తుంది …తన తల్లినని,
    తెలియదా ఆ ఇసుకగుంతలు మన పాలిట బొందలగుంతలని …..
    తెలియదా ….అది రక్తం కారని నరమేధమని ….
    కాని
    ఏమి చేస్తాం మనమేమి చేస్తాం….

    కాసేపు అరుస్తం …. కవితలు రాస్తాం ….
    కానీ తవ్వేవాడు తల్లిని దోచి అమ్ముతూనే వుంటాడు….
    రాసేవాళ్ళం రాస్తూనే వుంటాం….
    సభల్లో మన ప్రతినిధులు ..అరుస్తూనే వుంటారు….

    లోపం లో మనలో లేదు… ఆ వంశధార లో తప్ప ..
    ఆ తల్లి .. నిర్వంశంకి పూనుకునే దాక…. మనం పెన్ను గుంతలు ……వాళ్ళు ఇసుకగుంతలు చేస్తూనేవుంటాం…..

  2. పింగుబ్యాకు: నా రెండో కవిత ‘వందనం’… « మీరు చదివారా?

  3. మీ కవిత మీరనుకొంటున్నట్లు పరవాలేదు కాదు చాలా బాగుంది.
    మీ రచనలో మంచి ఈజ్ ఉంది. కంటిన్యూ చెయ్యండి.

    జిగ్ జాగ్ గా చదువుకోవటం ఇబ్బందిగా ఉంది.

    క్రిష్ణారావుగారూ,

    మీ నాలుక రోజు రోజుకూ పదునెక్కిపోతుంది సుమా. 🙂

  4. మీరు ఇంత బాగా రాయగలిగి ఉండి కూడా కేవలం సమీక్షలకు పరిమితం కావడాన్ని ఇకపై మేమొప్పుకోము!

    నాకైతే ప్రతి లైనూ నచ్చింది.

Leave a reply to bhaskar స్పందనను రద్దుచేయి