సమాజ శ్రేయమే వ్యంగ్య లక్ష్యం

సాధారణం

weakpoint.jpgవ్యక్తుల బలహీనతలను, రాజకీయ నాయకుల అరాజకత్వాన్ని, అధికారుల అవినీతి రీతులను కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడడమంటే జనమందరికీ భలే ఇష్టంగా ఉంటుంది. కాని ఆ వ్యక్తులకు, రాజకీయ శక్తులకు కోపం నషాళానికి అంటుతుంది. ఉన్నమాట అన్నవారిని, రాసిన వారిని శత్రువుల్లాగా చూస్తారు. ఇంతమంది శత్రువులను, మరెంతమందో స్నేహితులను సంపాదించుకునే ఈ నిజాలు నిజాయితిగా మాట్లాడడం అనితరసాధ్యమైన విద్య. ఇలా  మాట్లాడి , మాట్లాడి కొందరికదే ఓ బలహీనతగా మారుతుంది. నివురుగప్పిన నిప్పులాగా ఆ నిజానికి వ్యంగ్యం పూతపూస్తే, ఓహో… దానికి సాహిత్య విలువ ఏర్పడి, అదొక చురకగా, చురకత్తిగా, సమాజ ప్రక్షాళన దిశలో చిగురుటాకులా సామాజిక ప్రయోజనం సాధించితీరుతుంది. అలాంటి రచయితలు మన తెలుగులో ఎవరైనా వున్నారా అని లెక్క పెట్టాలనుకుంటే మన చేతివేళ్లు చాలా మిగిలిపోతాయి. అరుదైన అపురూప వ్యంగ్య వైభవం ప్రదర్శించే అతి కొద్దిమంది తెలుగు పత్రికా రచయితల్లో ఎం.వి.ఆర్.శాస్త్రి ఒకరు. దశాబ్దానికిపైగా “ఆంధ్రభూమి” దినపత్రికకు సంపాదకునిగా వ్యవహరిస్తున్న శాస్త్రి ప్రతి శనివారం ‘సాక్షి’ పేరుతో నిర్వహిస్తున్న శీర్షిక “వీక్ పాయింట్”. కొన్ని వ్యాసాలను అదేపేరుతో పుస్తకంగా ప్రచురించారు. ఆ పుస్తకాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నాను.

“ఆంధ్రభూమి” దినపత్రికలోనే ఎం.వి.ఆర్. శాస్త్రి ప్రచురిస్తున్న చరిత్రకు సంబంధించిన వ్యాసాలు కూడా పుస్తకాలుగా ప్రచురిస్తున్నారు. రచయిత చరిత్రను చూసే దృష్టికోణంతో ఈ బ్లాగరికి తీవ్ర అభిప్రాయభేదాలున్నాయి. అంచేత మిగిలిన పుస్తకాలను పక్కనపెట్టి సమాజ శ్రేయస్సుకు దోహదంచేసే ఈ వ్యంగ్య వ్యాసాలను మాత్రమే ఈ పరిచయంలో పరిశీలిద్దాం . సినీ నటుడు బాలకృష్ణ కాల్పుల కేసు ఉదంతంతో ఈ వ్యాస సంపుటి ఆరంభమవుతుంది. కేసు కోర్టులో ఉన్నప్పూడు మానవహక్కులవేదిక ప్రచురించిన కరపత్రం కూడా గొప్ప వ్యంగ్యంతో వున్నదే. అయితే ఈ “వీక్ పాయింట్”లో మాత్రం రకరకాల కోణాలనుంచి ఈ కేసులోని లొసుగులను ఎండగట్టడం విశేషం. ఓ వైపు పోలీసులను, మరోవైపు డాక్టర్లను, లాయర్లను, ఇంకోవైపు రాజకీయులను, అటువైపు బాలకృష్ణ భార్య, కుటుంబాన్ని, ఇటువైపు అభిమానులను రెండు లెంపలూ వాయిస్తారు. కానీ అన్ని వ్యాసాలు చదివాక మనకింకో కొత్త ఆలోచన తడుతుంది. అధికార, ప్రతిపక్షాల సంగతలా ఉంచండి. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, ప్రజలు కనీసం నిరసనైనా తెలపకుండా నివ్వెరపోయి ఈ హమేషా తమాషా చూడడం నిజంగా విడ్డూరం. బాలకృష్ణ తుపాకీతో కాల్చిన తరువాత తుపాకీ గుళ్లు తగిలిన బాధితులు ఇళ్లకు వెళ్లిపోయిన కొన్ని వారాలదాకా బొటనవేలికో, చేతికో తగిలిన గాయంతో అతడు మాత్రం ఆసుపత్రుల్లోనే ఉండడం నిజంగా విడ్డూరాల్లోకెల్లా విడ్డూరం. 2001లో కృషి బ్యాంకు మూతపడింది. ప్రజల సొమ్ముతో పరారై రాజభోగా లనుభవిస్తున్న చైర్మన్ మాత్రం 2006లో పోలీసులకు దొరికాడు (వారు పట్టుకోలేదు). ఈ సహకార బ్యాంకులు ప్రజలకు చూపిస్తున్న కారం రుచి కొన్ని వ్యాసాల్లో వివరించారు. ఆ కారపు ఘాటుకు మన కళ్లలో నీళ్లు తిరుగుతాయే కాని దున్నపోతు మాదిరి దళసరి చర్మపు రాజకీయులకుగాని, పోలీసులకు గాని చీమకుట్టినట్టయినా ఉండకపోవడం జీవిత విషాదం. మన పాత డీజీపి సేన్ శ్రీమతి అనిత పిల్లల దత్తత కేసు ఒక అడ్డుగోలు యవ్వారం. దానిపైకూడ ఘాటైన చెణుకులు ఇందులో ఉన్నాయి.

ఇక తెలుగు జర్నలిజం గురించి నాలుగు వాక్యాలు రాయాలంటేనే భయమేస్తోంది. అలవిమాలిన కోపంతో, నిస్సత్తువతో ఏమి అనకూడని మాటలు అనాల్సివచ్చేస్తుదేమోనని. జరిగింది జరిగినట్టుగా రాయాల్సిన వార్తల స్థానంలో ‘ప్రజా ప్రయోజనం’ పేరిట వార్తలకు వ్యాఖ్యానం జోడించడం అనే దుష్ట సంప్రదాయాన్ని తెలుగు జర్నలిజంలో “ఈనాడు” ప్రవేశపెట్టిన తరువాత తెలుగు పత్రికారంగం గురించి మాట్లాడడం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడమే అవుతుంది. కానీ వీక్ పాయింట్ లో ఆ బాదరబందీలు ఏమీలేవు. నిలబెట్టి వ్యక్తులకంటిన బురదను కడగడమే పని. చెప్పిచ్చుకుని కుక్క కరిచిన చోట కొట్టడమే విధి. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే ధర్మం. 26 ఏప్రిల్ 2006నాడు ఏమి రాశారో చదవండి:

“గ్రామీణ విలేకరుల అవార్డుల ఎంపికకు యూనియన్ సిఫారసుపై సర్కారువారు ఏరికోరి ఏర్పరిచిన కమిటీలో అధికారంలోని వారికి అనధికారిక పి.ఆర్.ఓ.లుగా పనిచేసి, ఆ పలుకుబడితో పైరవీలుచేసి, పోస్టింగులు ఇప్పించి, కా0ట్రాక్టులు, లైసెన్సులు సాధించి బినామీ సంస్థలు పెట్టి, బినామీ ఆస్తులు గడించి, అనేక విధాల బాగుపడ్డవారు ఒక్కరూ లేరని ఎవరైనా గుండె మీద చేయివేసుకుని చెప్పగలరా?” ఇదీ ఆ శైలి. ముందుమాటలో ముళ్లపూడి వెంకటరమణ చెప్పినట్టు ఈ శైలీ ప్రవాహం ‘మన నాయక వినాయకులూ నిర్మాతలూ దుర్మాతలూ, కళాంబోతులూ, రచకీచకులూ, మాటల పచయితలూ ‘ అందరినీ క్షాళన చేసేవే.

‘వీక్ పాయింట్’ వ్యాసాలన్నీ చదివాక మనకు బొధపడేది అధికారంలో ఉండే రాజకీయ నాయకులే అవకాశవాదులైన అధికారులతో అన్ని అఘాయిత్యాలు చేయిస్తుంటారని. కానీ ఆ రాజకీయ నాయకుడికి సరైన దిశలో దేశభక్తి లేకుండా, రాజనీతిజ్ఞుడు (స్టేట్స్మన్)గా వ్యవహరించకుండా, కేవలం రాజకీయ నాయకుడు (పొలిటీషియన్)గా ఉంటూ, అధికారమే పరమావధిగా భావిస్తూ గడిపితే ఆ సమాజం భ్రష్టుపట్టిపోక ఏమవుతుంది? దీనికో సజీవ ఉదాహరణగా ఈ వ్యాసాలలో చంద్రబాబు నాయుడు నిలబడతారు. జడ్జీలకు అంబాసిడర్ కార్లు బదులు అధునాతన జీపులివ్వడం, ఐఏయస్ అధికారులకు జూబ్లీహిల్స్లో స్థలాలివ్వడం, జర్నలిస్టులకు పదివేల రూపాయల అవార్డులకు బదులుగా రెండేసి లక్షల అవార్డులు అదీ అడ్డగోలుగా ఇవ్వడం, ఇళ్ల స్థలాలివ్వడం… ఇలా ఒకటేమిటి ఎన్ని పనులో అన్నీ కుక్క బిస్కట్లు విసరడమే. అది కాక ప్రపంచ బ్యాంకు ఇచ్చే అప్పుల కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాలరాయాలనుకోవడం తదితరాలను ఏమనుకోవాలో ఏ ఆర్థికవేత్తయినా ఎలా విశ్లేషించగలడు? అధికారంలో ఉండగా చంద్రబాబును తన మాటల తూటాలతో నిరంతరం అప్రమత్తం చేసిన రచయిత అధికారం పోయాక బాబు చర్యల్ని, చేష్టలను ఇలా విసుక్కుంటారు:

“అధికారంలో ఉండగా ఆయనను మించిన ఆదర్శవాది లేడు. పవరుపోయాక ఆయనను మించిన అవకాశవాదీ ఉండడు. సుప్రసిద్ధమైన స్టీవెన్సన్ నవలలో పగలు పెద్దమనిషి అయిన డాక్టర్ జెకిల్ రాత్రివేళ మహా భయంకరుడైన మిష్టర్ హైడ్ గా మారటం చాలామందికి గుర్తుండే ఉంటుంది. అలాగే శ్రీమాన్ బాబుకూడా! అధికార ప్రభ వెలిగినంతకాలమూ ఎక్కడెక్కడి అధ్యాత్మిక గురువులను, ‘జీవన కళా’కారులను పిలిపించి యోగం, ధ్యానం, సత్ప్రవర్తన, నైతిక విలువలు, క్రమశిక్షణ వగైరా విద్యలను చంద్రస్వాములవారు అందరికీ చావగొట్టి నేర్పిస్తారు. అధికారం కాస్త పోయాక ‘చంద్రబాబా’ కాస్తా ‘చంద్రదాదా’గా మారి సరిగ్గా సర్కారీ బస్సులమీదే మూడోకన్ను తెరుస్తారు” (29 జనవరి, 2005). అలాగని ఇప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిని వదిలేశారనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎవరినీ క్షమించడమ్ ఆ కాలం కలానికి తెలీదని వ్యాసాలన్నీ చదివాక మనకు అవగతమవుతుంది.

ఇవన్నీ చదువుతుంటే ధర్మారావు పేరుతో బూదరాజు రాధాకృష్ణ “ఈనాడు”లో రాసిన ‘పుణ్యభూమి’ వ్యాసాలు గుర్తొస్తాయి. ఈ రెంటినీ పోల్చడం నేరమేమీ కాదు కాబట్టి ఈ ఒక్కమాటా అనడమ్. ధర్మారావు పేరిట బూదరాజుది సమాజ సంఘటనలపట్ల ఆక్రోశం. వేడి నిట్టూర్పుతో ధర్మాగ్రహం వ్యక్తపరచడంతో సరి. సాక్షి పేరుతో ఎం.వి.ఆర్. శాస్త్రిది ఆ గీతకు మరికొంత పొడిగింపు. వ్యగ్రతలకు  వ్యంగ్యపు పూత పూయడంద్వారా సమాజ ప్రక్షాళనకు సమాయత్తం కావడం ఇందులో నిబిడీకృతమై ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఆర్ట్ బుచ్ వాల్డ్ లో కూడా లేనిదిది. జార్జి ఆర్వెల్ లోనూ, బెర్నార్డ్ షాలోనూ కనిపిస్తుందిది. కానీ సాహితీ ప్రక్రియలు వేరనుకోండి. జర్నలిజమ్లో ఈ తరహా రచనలను విరివిగా మనం ఆహ్వానించాలి. వస్తున్న ‘వీక్ పాయింట్ ‘ వ్యాసాలకు తగు ప్రచారమీయాలి.

మరి మీరూ చదువుతారుగా!

ప్రకటనలు

5 responses »

 1. ఈనాడు‌ గురించి పుస్తకంలోదా లేక ..?

  పుస్తకం ధర, ప్రచురణ కర్త, సంస్థ, ఎక్కడ లభ్యం అన్నది తెలియజేస్తే బాగుండేది.

  అప్పుతచ్చులు మరీ ఎక్కువైనవి.

  మాట్ఆడ, కోడ, వ్యగ్రతల్కు = ?
  ఆర్ట్బుచ్వాల్డ్లో = ఇంగ్లిష్‌తో పరిచయం లేనివారికి ఇది Art Buchwald అన్నది తెలియడం కష్టం.

 2. నెటిజన్ గారూ.. నిజమే. చాలా అచ్చుతప్పులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం నేను పనిచేసిన మొజిల్లా గుంటనక్కలో తెలుగు ఖతులు విరిగిపోవడం. ఇదిగో ఈ రోజో, రేపో అన్నీ సరిచేస్తాను (ఎక్స్ ప్లోరరులో నాకీ సమస్య లేదు). ఈనాడు పై వ్యాఖ్యలు నా సొంతం. ఇకపై ప్రతి పుస్తకం దొరికే వివరాలు, ధర ఇస్తాను. కృతజ్ఞతలు.

 3. పుస్తకం చూడలేదుగానీ, పేపరులోనే కొన్ని వీక్ పాయింట్లు అప్పుడప్పుడు చదివాను. తప్పక చదవాల్సిన పుస్తకమే! చరిత్రపై శాస్త్రిగారితో మీరు విభేదించిన కారణాలు తెలిసికోవాలనుంది.

 4. పింగుబ్యాకు: పొద్దు » Blog Archive » మార్చి పోస్టుల మార్చిపాస్టు

 5. పింగుబ్యాకు: ఇవీ తల్లీ నిరుడు కురిసిన పరిచయ వ్యాసమ్ములు! « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s