మార్పు మూలాల శోధన : ది టిపింగ్ పాయింట్

సాధారణం

కొన్ని చిన్న నిచ్చ విషయాలే ఎంత పెద్ద పెద్ద మార్పులకు దారి తీస్తాయో వివరించి చెప్పే పుస్తకం “ది టిపింగ్ పాయింట్”ను ఈ వారం పరిచయం చేస్తున్నాను. tippingpointవాషింగ్టన్ పోస్ట్, న్యూయార్కర్ టైమ్స్ పత్రికలకు విలేకరిగా పనిచేసిన మాల్కం గ్లాడ్వెల్ మార్పు ఎలా సంభవిస్తుందని చేసిన పరిశోధనలో వెల్లడైన సత్యాల ఆధారంగా రాసిందే ఈ పుస్తకం. మార్కెట్లో విడుదలైన కొద్ది రోజులకే ఎంతో సంచలనం సృష్టించింది. కొన్ని వారాలకే గ్లాడ్ వెల్ల్ కోటీశ్వరుడైపోయాడు. పుస్తకంలోని కీలక విషయాలను జీర్ణం చేసుకుని మరికొంతమంది తమ ఆలోచనలను ఒక దారిలో పెట్టగలగడంతో అనతికాలంలోనే ఈ టిపింగ్ పాయింట్ సెల్ఫ్ హెల్ప్ లేదా వ్యక్తిత్వ వికాస గ్రంథాల జాబితాలోకి చేరి అగ్రస్థానానికి ఎగబాకింది.

‘ది టిపింగ్ పాయింట్’ పుస్తకంలో రచయిత మార్పును అంటువ్యాధితో పోలుస్తాడు. అదీ మామూలు అంటువ్యాధి కాదు. ఒక మహమ్మారి (ఎపిడెమిక్)తో పోలుస్తాడు. సమాజంలోకి ఒక ఉప్పెనలాగా వచ్చే మార్పు ఏదైనా చిన్నగా మొదలవుతుంది. అలా అలా నెమ్మదిగా పెరిగి ఒక చోటుకు చేరుకుని అక్కడ లావాలా చిమ్ముతుంది. ఆ ప్రదేశానికే టిపింగ్ పాయింట్ అని పేరు పెడ్తారు రచయిత. ఇవ్వాళ ఇండియాలో కూడా పాపులర్ అయిన తేలికపాటి సింతటిక్ సోల్ వున్న షూ (హుష్ పప్పీస్ షూ అని అమెరికాలో మొదట విడుదలయ్యాయి) 1995లో టిపింగ్ పాయింటుకు చేరుకున్నాయి. అంతకుముందు అమెరికా అంతా కలిపి 30వేల జతలయినా అమ్ముడుపోని ఆ షూలు 95 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏటికేడాది మిలియన్ మిలియన్ల జతలు అమ్ముడుపోసాగాయి. న్యూయార్క్ సిటీలో క్రైమ్ రేట్ కూడా 1992 తర్వాత ఒక్కసారిగా పడిపోయింది. ఇలాంటివే మరికొన్ని అంశాలను (కేస్ స్టడీ)లను పరిశీలించి “భావాలుగానీ, వస్తువులుగానీ, సందేశాలుగానీ, ప్రవర్తనలుగానీ వైరసుల మాదిరిగానే వ్యాప్తి చెందుతాయని” వివరించే ప్రయత్నం చేశారీ పుస్తకంలో.

మార్పును వ్యాప్తి చెందించే మూడు మూల కారణాలుగా లా ఆఫ్ ది ఫ్యూ (కొద్ది మందే కీలకం), స్టికీనెస్ ఫ్యాక్టర్ ( జిగురు స్వభావం), పవర్ ఆఫ్ కాంటెక్స్ట్ (సందర్భ శక్తి) లను వివరిస్తారు. ఒక విషయాన్ని కొద్దిమందే ఓపిగ్గా ప్రచారం చేయడం ద్వారా పాపులారిటీ తేవడం మొదటిది. దీనినే ఆర్థిక రంగ నిపుణులు 80:20 సిద్ధాంతమని పిలుస్తారు. సాధారణంగా ఏ చోటనైనా జరుగుతున్న పనుల్లో 80 శాతం పనిని అక్కడ పనిచేస్తున్న 20 శాతం మంది కార్మికులే పూర్తి చేస్తుంటారు. పోలీసు రికార్డులు పరిశీలిస్తే 20 శాత నేరగాళ్లు 80 శాతం నేరాలకు కారకులు. 20 శాతం వాహన చోదకులు 80 శాతం ప్రమాదలకు కారకులు. విచిత్రమేమిటంటే 20 శాతం మంది బీరు సేవకులు 80శాతం బీరును లాగించేస్తున్నారు. ఇలా కొద్దిమంది వ్యక్తులే ప్రచారాన్ని గాని, పనినిగాని, కార్యక్రమాన్నిగాని మునుముందుకు నడిపిస్తుంటారు.

సమాచారాన్ని సమర్ధంగా, అవతలి వ్యక్తులు చిరకాలం గుర్తుంచుకునేటట్లు చేసేది జిగురు స్వభావం. చెప్తున్న పద్ధతుల్లో చేసే చిన్న చిన్న మార్పులే సమాచారాన్ని అత్యంత ప్రభావశీలం చేస్తాయని రచయిత చెప్తారు. ప్రజల హృదయాలకు చేరువై వారిలో మార్పును తీసుకురావడానికి సహకరించే మూడో కారకం అవతల వారి గురించి పట్టించుకోకపోవడం. పరిచితుల పట్ల, ప్రజల పట్ల శ్రద్ధ తీసుకోవడం. ఈ సందర్భ శక్తి గురించి వివరిస్తూ మాల్కం గ్లాడ్ వెల్ మానవ సంబంధాల ప్రాముఖ్యతను వివరిస్తారు.

మిగిలిన పుస్తకమంతా ఈ మూడు కారకాలను సోదాహరణంగా చర్చిస్తారు. ‘కీలకమైన కొద్దిమంది’ అధ్యాయంలో ఈ కీలక వ్యక్తులను తిరిగి మూడు వర్గాలుగా విభజిస్తారు. కనెక్టర్స్ (సంధాన కర్తలు), మావెన్స్ (కలుపుగోళు వ్యక్తులు), సేల్స్ మెన్ (అంటగట్టేవారు) అని చెప్తారు. ఎంత వీలైతే అంత ఎక్కువ పరిచయాలు కొందరు చేసుకోగలుగుతారు. వారే కనెక్టర్స్. వీళ్లలో ఉన్న ప్రత్యేకత ప్రతి సందర్భాన్ని పరిచయాలు పెంచుకోవడానికే ఉపయోగించుకోవడం. ఇలా విభిన్న సోషల్ సర్కిల్స్ లో తమకు నచ్చిన లేదా నచ్చని విషయాలు, వస్తువులు, భావాల గురించి వీరు పరిచయం చేస్తుంటారు. వీళ్లకంటే ఒక మెట్టు ఎక్కువ మేవెన్స్. పరిచయాలు వందలు వేలుంటేనే సరిపోదు. మనకు తెలిసిన పరిచయస్తులందరికీ మన మీద, మన మాటమీద నమ్మకముండాలి. అప్పుడే మనం చెప్పే విషయాలకు విలువ సమకూరుతుంది. విలువలేని మనుషుల మాటలకూ విలువ ఉండదని మనకు తెలిసిందే. ఏదైనా ప్రచారం జరగాలంటే మన పరిచయస్తుల దగ్గర మనకున్న వెయిటే (విలువ) కీలకం. ఇక మూడో వర్గం సేల్స్ మెన్. ఎదుటివారిని కన్విన్స్ చేయడంలో దిట్టలు. విషయాన్నో, వస్తువునో పరిచయడం చెయ్యడంతో ఆగలేరు వీరు. మాటల మత్తు జల్లి, వాటిని అంటగడతారు కూడా. ఇలా వస్తువు గురించిన భావాలు ప్రచారం కావడానికి కొద్దిమంది కీలక వ్యక్తులు ఇలా రకరకాల స్థాయిల్లో సహకరిస్తుంటారు. ఈ విషయాలు మనకు బోధపడేలా వివరించడానికి అమెరికన్ సమాజంలో తనకు తారసపడ్డ అనేకానేక ఉదాహరణలు ఇచ్చుకుంటూ అరటిపండు వొలిచిపెట్టినట్టు మనకు గ్లాడ్ వెల్ చెబుతారు.

అమెరికాలో చిన్న పిల్లల కోసం రూపొందించిన ఒక టెలివిజన్ కార్యక్రమం కొంతకాలం పాటు పిల్లలతోపాటు పెద్దలను కూడా ఆకట్టుకుని ఒక ఊపు ఊపేసింది. దీనికి కారణాలు తర్వాతి అధ్యాయం స్టికీనెస్ ఫాక్టర్ (జిగురు స్వభావం)లో రచయిత రాసుకొచ్చారు. ‘సెసేమ్ స్ట్రీట్’ అనే ఆ కార్యక్రమం పిల్లలను అద్భ్తంగా ఎద్యుకేట్ చేసిన కార్యక్రమంగా ఇప్పటికీ పేరుంది. ఆ కార్యక్రమం 1960లలో వచ్చేది. తర్వాత మూడు దశాబ్దాలకు 1990లలో నికొలిడియాన్ పిల్లల టీవీచానెల్ లో ప్రసారమైన ‘బ్లూస్ క్లూస్’ కూడా అవే పద్ధతులు అనుసరించి విశేష జనాదరణ పొందింది. దీనికంతటికీ కారణం స్టికీనెస్ ఫాక్టరని రచయిత సూత్రీకరిస్తారు. ప్రజలకు ఇష్టమవుతున్న కొద్దీ (అంటే వారికి నచ్చే అంశాలు ఉంటున్న కొద్దీ) ఆ వస్తువుకు దగ్గర దగ్గరగా జరుగుతుంటారు. అదే విషయంపై అభిమానం పెంచుకుంటారు. ఒకసారి ఆ అభిమానం స్థిరమయ్యాక చిన్నచిన్న లోపాలు, తప్పులను పెద్దగా పట్టించుకోరు. ఈ అభిమానాన్ని నిర్వచించడం కష్టం. ఇదంతా యాదృచ్చికంగా, సంప్రదాయ ధోరణికి భిన్నంగా సంభవిస్తుంది. ప్రజల అభిమానం పెరిగి అవధులు మీరాకే దానికి కారణాల గురించి సామాజిక శాస్త్రవేత్తలు నిర్ధారణకు వస్తారుగాని, ముందు మాత్రం ఏమీ చెప్పలేరు.

ఒక వస్తువు అకస్మాత్తుగా అంత ఆదరణ లేదా నిరాదరణ పొందడానికి గల కారణాలలో అతి ముఖ్యమైన మూడో కారణంగా పవర్ ఆఫ్ కాంటెక్స్ట్ (సందర్భ శక్తి)ని మాల్కం గ్లాడ్ వెల్ తన ‘టిపింగ్ పాయింట్’ పుస్తకంలో రెండు అధ్యాయాలు కేటాయించి వివరిస్తారు. వాతావరణంలో వచ్చే అతి చిన్న మార్పులు సైతం ఎలాంటి ప్రచండ మార్పులకు కారణమవుతాయో చెప్తూనే ‘సందర్భం’ అనే భావాన్ని చాలా విపులంగా చర్చిస్తారు. అల్ప మార్పులు, స్వల్ప చేర్పులు కొన్నిసార్లు ఎలాంటి విజయాలను అందిస్తాయో, మరికొన్ని సార్లు ఎంత ప్రమాదానికి కారణమవుతాయో అమెరికన్ సమాజంలోనే జరిగిన అనేక సంఘటనలను ఉదాహరిస్తూ వివరిస్తారు.
చివరగా ఆధునిక ఇంటర్నెట్ యుగంలో మనమంతా మరెంత మెలకువగా ఉండాలో హెచ్చరిస్తారు. వస్తువులను ఉత్పత్తి చేసే పారిశ్రామికవేత్తలు, వాటిని ప్రచారం చేసే సృజనశీలురు, వాటిని కొనాల్సిన వినియోగదారులు ఎవరికి తోచిన రీతిలో వారికి కొత్త కొత్త పాఠాలు నేర్పించే ఈ పుస్తకం యువతకు తమ వ్యక్తిత్వాన్ని ఎలా రూపొందించుకోవచ్చో, తద్వారా ఆధునిక ప్రపంచంలో మనమే రకమైన పాత్ర నిర్వహించబోతున్నామో తెలియజెప్తుంది. చాలా సరళమైన ఇంగ్లిషులో మాల్కం గ్లాడ్ వెల్ రాసిన ‘ది టిపింగ్ పాయింట్’ పుస్తకం చదవడం ఒక మంచి అనుభూతి.

మన తెలుగు రచయితలు కూడా ఇలాంటి పుస్తకాలు రాస్తే బాగుణ్ణు. రైతుల ఆత్మహత్యలు ఒక్కమారుగా ఉధృతమవడానికి కారణమేమిటి? రాజకీయాల్లో అవినీతి ఇంతగా పెచ్చరిల్లడానికి కారణమేమిటి? ఈ తరం యువతలో ఒక రకమైన విభిన్న ధోరణి (ఇండిఫరెంట్ ఆటిట్యూడ్) అలవడడానికి కారణమేమిటి? మన తెలుగు జర్నలిస్టులకు ఒక్కసారిగా అంతలా జీతాలు పెరగడానికి కారణాలేమిటి? వీటిని పరిశీలించి తెలుగులో పుస్తకమొకటి వస్తే బాగుణ్ణు కదా…

ప్రకటనలు

6 responses »

  1. పింగుబ్యాకు: కిందటేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ బ్లాగులో పరిచయమైన పుస్తకాలు « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s