జీవితం మనది.. కథనం మాత్రం భిన్నం..”అసంగత సంగతాలు”

సాధారణం

ఎవరు సాహిత్య సృజనచేసినా జీవితాన్ని వదిలేసి ఏవేవో చెప్పడానికి ప్రయత్నిస్తే నేల విడిచి సాము గారడీ చేయడమే అవుతుంది. జీవితంలో ప్రతీదీ అనుభవించి నేర్చుకోవా లనుకోవడం మూర్ఖత్వం. ‘విన్నంత కన్నంత..’ అని భర్తృహరి ఏనాడో జీవన సూత్రం చెప్పాడు. జీవన మాధుర్యంలో రుచేకాదు జీవితాన్ని కొన్ని కీలక సూత్రాలు సైతం వినీ కనీ అనుభవించీ మాత్రమే కాక సాహిత్య అధ్యయనం ద్వారా కూడా నేర్చుకోవచ్చని మానవ చరిత్ర బోధిస్తోంది. అలా జీవితాన్ని అధ్యయనం చేయాలనుకునే వారికి కథా పఠనం కూడా ఒక సాధనమే. అయితే అలాంటి కథలు రాసేవారు మాత్రం అరుదు. మరి సామాన్య జీవితాన్ని సైతం అసామాన్యంగా కథనీకరణం చేస్తే అప్పుడే అధ్యయనం మొదలుపెట్టిన పాఠకుడు మాత్రం కంగారు పడిపోవడం ఖాయం. కానీ ఓపిగ్గా ఎలా చెప్తున్నారన్న అంశంతోపాటు ఏమిటి చెప్తున్నారన్న విషయం కూడా అవగతం చేసుకుంటే మనసు విశాలమవుతుంది. బుద్ధి వికసితమవుతింది.

అలాంటి కథల పుస్తకమొకటి ఈ వారం పరిచయం చేస్తున్నాను. శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఎ.వి.రెడ్డిశాస్త్రి గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ సాహిత్యాన్ని ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేస్తూ అప్పుడప్పుడూ తనకు తోచిన, స్ఫురించిన, గుట్టు తెలిసిన కొన్ని జీవన మర్మాలను కథారూపంలో వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాటిలో జీవిత పరమార్థం తెలుసు కోవాలని, తెలుసుకునేందుకు ప్రయత్నించి, తెలుసుకునేందుకు ఏమీలేదని నిర్ధారించుకుని, అయినా తెలుసుకునే ప్రయత్నం కొనసాగిస్తున్న పద్ధతిలో పుట్టిన అసంగతవాదం (అబ్సర్డిటీ)లో ప్రయత్నించిన కథలన్నింటినీ ఒకచోట చేర్చి “అసంగత సంగతాలు” అనే పుస్తక సంపుటిగా ప్రచురించారు.

రెండు ప్రపంచ యుద్ధాల బీభత్సాన్ని కళ్లారా చూసిన కవులు, చిత్రకారులు, మేధావులు ప్రపంచాన్ని మానవ సంబంధాలను కొత్త దృష్టితో చూడడం మొదలుపెట్టారు. పికాసో చిత్రాలలో కనిపించే అస్పష్టత అలాంటిదే. సర్రియలిస్ట్ ధోరణిలో మొదలైన చిత్రకళ మరో రకంగా సాహిత్య రంగంపై ముద్ర వేసింది. అలా మయలుదేరిన అస్తిత్వవాద ధోరణులు యూజీన్ అయొనెస్కో రచనల్లో అసంగతత్వానికి పునాదులు వేశాయి. అబ్సర్డిటీ అంటే ఏమిటో ఆల్బర్ట్ కామూ తన ‘మిత్ ఆఫ్ సిసిఫస్ ‘ వ్యాసంలో బాగా చెప్పినా అయొనెస్కో ‘ముక్కు ‘ అన్న రచన ఎంత బాగా వివరిస్తుందో చూడండి. ఒకబ్బాయికి వయసొచ్చింది. అతడి తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటారు. రెండు ముక్కులున్న అమ్మాయి కోసం వెతుకుతుంటారు. అతడికది నచ్చదు. వెతికి వెతికి చివరకి మూడు ముక్కులున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అర్థ రహితమైన మానవ ప్రయత్నాలను బట్టబయలు చేయడం లేదూ!

నోబెల్ బహుమానం కూడా సంపాదించిపెట్టిన ‘వెయిటింగ్ ఫర్ గోడో’ అన్న నాటకంలో శామ్యూల్ బెకెట్ అన్న మరో ఐరిష్ రచయిత (ఆ నాటకం ఫ్రెంచి భాషలో నోబెల్ పురస్కారం పొందిందనుకోండి) అసంగత తత్వాన్ని మరింత సులువుగా బోధిస్తాడు. ఇద్దరు రోడ్డు పక్కన ఎప్పుడొస్తాడో తెలియని ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తుంటారు. అలా చాలాకాలం ఎదురుచూశాక ఎవరొస్తారో కూడా తెలియనితనానికి వచ్చేస్తారు. విసుగు భరించలేక ఇద్దరిలో ఒకడు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తాడు. కాలక్షేపానికి అర్థంపర్థంలేని కొన్ని మాటలుకూడా చెప్పుకుంటారు. అనంతరం ఫ్రాంజ్ కాఫ్కా ‘ది ప్లేగ్’, ‘ది ట్రయల్’ నవలల్లో ఈ అస్తిత్వ, అసంగత వాదాలకు తోడుగా సామాజిక వర్గ వైషమ్యపు కోణాలు ఆవిష్కరించడంతో ఆ ధోరణులు బాగా జనంలోకి వెళ్లాయి.

రెడ్డిశాస్త్రి ఆ కథలు అధ్యయనం చేసి ఆ స్ఫూర్తితో రాసిన ‘ఆఖరి న్యాయం’ కథ జీవితంలో అబ్సర్డిటీని వేదాంతపరంగా చెప్తే, ‘పోస్టాఫీసు’ కథలో ఎవరికైనా అర్థమయ్యేట్టుగా వివరిస్తారు. ఆ కథా పరిసరాలు శ్రీకాకుళం పట్టణ ప్రజలు ఇట్టే పట్టేస్తారు. టి.ఎస్. ఇలియట్ లండన్ లో ఆఫీసులకెళ్లే ప్రాంతాన్ని ‘ది వేస్ట్ లాండ్’ పద్యంలో వర్ణించినట్టుగా, ఏడురోడ్ల జంక్షన్ నుంచి గాంధీ పార్కు వరకూ ఉన్న ప్రాంతంలో జరిగిన సంఘటనతో జీవితంలో ఎవరూ ఎవరికీ ఏమీకాని తనాన్ని సరళంగా చెబుతారు. ఉత్తరాలంటే ఏమిటని మరో మనిషి కథకుడ్ని ప్రశ్నిస్తాడు. మనవాళ్లకు రాసుకుంటాం కదా, ఆ ఉత్తరాలని కథకుడు చెప్పాక మనిషి బిత్తరపోతాడు. “మన వాళ్లా? ప్రపంచంలో మనవాళ్లని వున్నారా? అందరూ పైవాళ్లే కదా? నా మట్టుకు నేను పుట్టిన దగ్గర్నుండి ఒక్కడినే. ఎవర్ని చూసినా ఎవరూ లేనివాళ్లగానే కనిపిస్తున్నారు. అలాంటప్పుడు ఉత్తరాలేమిటి? రాయడమేమిటి” అంటాడు. ఈ సారి బిత్తరపోవడం మనవంతవుతుంది.

‘లైబ్రరీలో’ అనే మరో కథలో కథకుడికి, ప్రొఫెసరుకి మధ్య ఎత్తుపొడుపులాగా జరిగే సంభాషణ కూడా అలాంటిదే. ఏదో తెలుసుకుందామంటూ, చదువుతూ చదువుతూ లైబ్రరీకే అంకితమైపోయిన డస్ట్ కోట్ ప్రొఫెసరుగారికి కథకుడు కూడా తోడవుతాడు. కథకుడిని లైబ్రరీ నుండి తరిమివేయాలని కొందరు లైట్ కూడా తీసేస్తే చీకట్లో చదవడానికి అలవాటు పడిపోతాడు. ప్రొఫెసర్ ఒకసారి ఎక్కడి నుంచి వస్తున్నావని కథకుడిని అడిగితే చీకటి నుంచని సమాధానం చెబుతాడు. తిరిగి ‘తమరెక్కడికి?” అని అడగగానే ప్రొఫెసర్ ‘చీకట్లోకి’ అంటాడు. మన బతుకులు అర్థం లేకుండా నడిచి అర్థాంతరంగా ఎప్పుడో ఎక్కడో ఆగిపోతుంటాయి… ఈ బోర్ డమ్ ని, అసంబద్దతను భరించడమే బతుకుగా భావించే రజనీ మరణం (!) కథకుడితోపాటు మననీ నివ్వెర పరుస్తాయి.

ఇలా అసంగత తత్వాన్ని వివరించే కథలు కొన్ని కాగా మృగ్యమైపోతున్న మానవ సంబంధాలను, అహంకారపు తెరల పొరల మధ్య గూడుకట్టుకుంటూ ఎవరికి వారే రారాజులమనుకుంటూ విర్రవీగే మనసుల స్వరూప స్వభావాలను ఆర్తితో, ఆవేదనతో ‘స్టాఫ్ రూంలో’, ‘ఫీనిక్స్’, ‘ఓటమి గెలిచిన వేళ’, ‘నాగావళి నవ్వింది’ కథలలో రచయిత పరామర్శిస్తారు. ఈ కథలు చదివాక కొన్నేళ్లపాటు మన జీవితంలో అనేక సందర్భాలలో ఈ కథల్లో సంఘటనలు గుర్తుకు వచ్చి తీరతాయి. ఇవాళ్టి విద్యా విధానపు నేపథ్యంలో రాసిన ‘స్టాఫ్ రూంలో’, ‘నాగావళి నవ్వింది’ కథలలో మొదటగా మనుషుల స్వభావాన్ని, తర్వాత విద్యా విధానపు మేడిపండు రీతిని పట్టి చూపిస్తారు. ఉపాధ్యాయులంతా చదివి తీరాల్సిన కథలు ఈ రెండూ. ఇక ‘ఫీనిక్స్’ గురించి ఏం రాసినా తక్కువే. చదివి తీరాల్సిందే.

పుస్తకాల్లో అచ్చుతప్పుల్ని ‘పంటి కింద రాళ్లతో’ పోలుస్తారు. అడుగడుగునా అడ్డుతగిలే అచ్చుతప్పుల వల్ల ఈ రకమైన ప్రక్రియాపరమైన కథలు చదవడం కొంచెం ఇబ్బంది. ముద్రాపకుడి పట్ల కోపమొస్తుంది. ప్రూఫ్ రీడింగ్ లో ‘శ్రీకాకుళ సాహితి’ ఇంత నిర్లక్ష్యం వహించడం ఘోరం. అలాగే తరువాత ‘అరుణతార’లో వచ్చిన రెడ్డిశాస్త్రిగారి కథ ‘మిస్సింగ్ ఫైల్’ను కూడా మలిముద్రణలో ఈ కథా సంపుటిలో చేర్చాలి.

ఇక అబ్సర్డ్ కథల్లో స్పష్టంగా కనిపించేది పెసిమిస్టిక్ (నిరాశాపూరిత) ఛాయలు. విశ్వాసభట్టు, రజని, దివ్యభూషణుడు, అతగాడు (ఆఖరిన్యాయం), మేథ్స్ హెడ్.. అందరూ జీవితంలో ఎదురవుతున్న అబ్సర్డిటీని తట్టుకోలేక చనిపోతారు. జీవన సూత్రాలను ఎరుకపరుస్తూ, మరింత మెలకువగా, ఆనందంగా, ప్రశాంతంగా గడపడం నేర్పవలసిన సాహిత్యం చావుదారులు ఎదుర్కోవడం ఎంతవరకు సబబు? ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన విధ్వంసం అనంతరం బయలుదేరిన వాదాల దారి, ముంచెత్తుతున్న మార్కెట్ శక్తుల ప్రభంజనంలో కొట్టుకుపోకుండా నిలవడం హర్షణీయం అయినా, 21వ శతాబ్దపు ది మోస్ట్ మోడర్న్ యువతకు తాత్విక భూమికను అందించే రహదారి కాగలిగితే మరింత బాగుణ్ణు.

“అసంగత సంగతాలు” మీరూ చదవండి. ప్రపంచ శ్రేణి సాహిత్యంతో పరిచయమవుతుంది. పది కథలు, 78 పేజీలు, ముప్పై ఐదు రూపాయల వెల గల ఈ పుస్తకమ్ కావలసిన వారు రచయిత ఫోన్ నెంబరు 09848375179కు ప్రయత్నించండి.

ప్రకటనలు

9 responses »

  1. రెడ్డి శాస్త్రి గారి కధల్ని చక్కగా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు! ఈ పుస్తకం చదివాను గానే, ఇంత చక్కగా పరిచయం చెయ్యొచ్చని తెలీలేదు. నాకు ఫీనిక్స్, స్టాఫ్ రూంలో కథలు బాగా నచ్చాయి. చదివి అవతల పడేయగలిగామంటే, ఆ సాహిత్యం న్యూస్ పేపర్ తో సమానం! ఈ కథలు చదివాక కూడా కొద్ది రోజుల పాటు వెన్నాడాయి.

  2. బ్రావో! పరిచయ సమీక్ష చాలా బాగా రాశారు. మామూలు కథనాల మూసలో కాకుండా, అలాగని విదేశీ ఆలోచనల గుడ్డి కాపీ కాకుండా తెలుగు కథ రచన చేసిన వారిలో రె్డ్డి శాస్త్రిగారొకరు. స్వోత్కర్ష లేకపోవడం వల్లనూ, శ్రీకాకుళం కదిలి బయటికి రాకపోవడం వల్లనూ బయట ఈయన పేరు అంతగా తెలీదు. ఇలా మీ పరిచయంతో వారి కథలకు ఒక వేదిక నిచ్చినందుకు అభినందనలు.

  3. బాగా రాసారు. కానీ “ది ప్లేగ్” నవల అల్బెర్ట్ కామూ రాసింది. అలాగే కాఫ్కా రాసిన “ద ట్రయిల్”లో “సామాజిక వర్గ వైషమ్యపు కోణాలు” ఏమీ “ఆవిష్కరించ” బడలేదు.

  4. పింగుబ్యాకు: ఎ.వి. రెడ్డిశాస్త్రి రెండో కథల సంపుటి “ఈ మంటలు చల్లారవు” « మీరు చదివారా?

  5. పింగుబ్యాకు: ఎ.వి. రెడ్డిశాస్త్రి రెండో కథల సంపుటి “ఈ మంటలు చల్లారవు” « ఆంధ్రప్రదేశ్ న్యూస్

  6. పింగుబ్యాకు: ఏడోవారం చదువు సంగతులు రెడ్డిశాస్త్రిగారితో… « మీరు చదివారా?

  7. పింగుబ్యాకు: కిందటేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ బ్లాగులో పరిచయమైన పుస్తకాలు « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s