కోశాంబి తండ్రీ కొడుకులు

సాధారణం

(ఈ ఆదివారం (30 మార్చి 2008) ‘ది హిందూ’లో పాస్ట్ అండ్ ప్రెజంట్ శీర్షికన రామచంద్ర గుహ ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. దానికి ఒక స్వేచ్చానువాదం తయారు చేసి తెలుగు బ్లాగరుల లోకానికి అందిస్తున్నాను (రామ్ అనుమతి తీసుకుని మరీ). నిజానికి కోశాంబి మనకు బాగా తెలిసిన వ్యక్తి అయినప్పటికీ ఇందులోని వివరాలు నాకు తెలియనివి. నాబోటి ఇతర పాఠకుల కోసమిది. చదివి మీ అభిప్రాయాలు తెలియజెయ్యండి.)

కోశాంబి తండ్రీ కొడుకులు…
-రామచంద్ర గుహ

kosambi చాలా విషయాలలో పండితుడైన డి.డి. కోశాంబి శత జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సమావేశాలలో చర్చకొస్తున్న అంశాలు చాలా బావున్నాయని గోవాలో ఉంటున్న నా మిత్రుడు ఉత్తరం రాశాడు. చరిత్రకారిణి రొమిలా థాపర్, జర్నలిస్టు పి. సాయినాథ్ లు కూడా ఉపన్యసించారట. ఇద్దరూ వాళ్లవాళ్ల రంగాల్లో ఘనాపాఠీలే. ఇద్దరి లోతైన పరిశోధన, వారి పనిపట్ల అంకితభావం విషయంలో కోశాంబి ఉంటే ఆయన కూడా మెచ్చుకునేవాళ్లే.

దామోదర్ ధర్మానంద్ కోశాంబి ప్రత్యేకమైన వ్యక్తి. గణితశాస్త్రంలో నిష్ణాతుడైన కోశాంబి చరిత్రకారునిగా కూడా నిపుణత సంపాదించారు. టి.ఐ.ఎఫ్.ఆర్. (టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్)లో పగలంతా లెక్కలు ప్రొఫెసర్ గా పనిచేసేవారు. ఆఫీసునుంచి పూనాలో తన నివాసం వరకు రాను పోను రైలు ప్రయాణాలు, సాయంకాలాలు, రాత్రులు, ఆదివారాలు, తీరుబడి సమయాల్లో చరిత్రలో మొదటివి, మూలమనదగ్గవి రచనలు చేయడానికి అవసరమైన ముడుసరుకు, వనరులు సమకూర్చుకునేవారు. వాటి ఫలితమే “A Study of Indian History”, “The Culture and Civilisation of Ancient India”.

మూల పురుషుడు

పుస్తకాలే కాకుండా, కోశాంబి అనేక పరిశోధక వ్యాసాలు కూడా ప్రచురించారు. వాటిలో ఒక వ్యాసంలో అతని స్వస్థలం గోవాలో గ్రామీణ సముదాయాల గురించి రాశారు. అతనికి సంస్కృతం, పాళీ, మరాఠీ, ఇంగ్లిషు భాషల్లో ప్రావీణ్యం ఉంది. భారతీయ చరిత్రకారుల్లో నాణేలు (శాస్త్రం – న్యుమిస్ మాటిక్స్)ను, భాష (శాస్త్రం – లింగ్విస్టిక్స్)లను, అంతకుమించి మానవ శాస్త్రాన్ని చరిత్ర రచనలో వాడిన మొదటి వ్యక్తి కోశాంబి.

కోశాంబి వాదనలో దురుసుతనం అగుపిస్తుంది. స్వేచ్చా వ్యాఖ్యానంలో నిర్దయను చూస్తాం. మార్క్సిజానికి సానుభూతిపరుడు. ఎప్పుడో గతించిన నాగరకతల సామాజిక ఆర్థిక చిత్రాన్ని పునర్నిర్మించడానికి మార్క్సిజం చూపించే భౌతిక వాద దృక్పథం తోడ్పడుతుందని కోశాంబి భావించారు. కాని అప్పటి ఉమ్మడి భారత కమ్యూనిస్ట్ పార్టీ పిడివాదాన్ని, ఎవరినీ దరిచేరనివ్వని భావజాలాన్ని నిరసించేవాడు. ఒక పార్టీ విధానాన్ని అనుసరించడం అంటే కోశాంబికి బొత్తిగా పడని విషయం. అతని రాజకీయ వ్యాసాల్లో (వీటిని కూడా చాలా సంపుటాలుగా ప్రచురించారు. అందులో ఒకదానికి ఆకర్షణీయమైన “Exasperating Essays” అనే శీర్షిక పెట్టారు). ఈ “అధికారయుత మార్క్సిస్టు”లను నిశితంగా విమర్శించేవారు.

భారతీయ చరిత్రకారుల్లో ఏకంగా కోశాంబి అనుచర బృందమే ఒకటుందని చెప్పుకోవాలి. కోశాంబికి నివాళులు అర్పిస్తూ దేశమంతటినుంచీ వచ్చిన మేధావులు చెప్తున్న మాటలను ఆలకించే శ్రద్ధ చూపిస్తున్న గోవా  పౌర సమాజానికి నెనర్లు. కానీ ఇదే సమయంలో మరో ప్రముఖ కోశాంబిని మనమంతా మర్చిపోతున్నాం. అది మరెవరో కాదు, చరిత్రకారుని తండ్రి ధర్మానంద్.

నేను మొట్టమొదటిసారి బెర్కెలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో జైనిజం పండితుడైన నా మిత్రుడి నోట ధర్మానంద్ కోశాంబి పేరు విన్నాను. ఆ మిత్రుడి పేరు పద్మనాభ జైని. కోశాంబి తండ్రి గురించి కొన్నేళ్ల కిందట నాకతడు ఎన్నో విషయాలు చెప్పారు. యువకుడిగా ఉన్నపుడే సంస్కృతం నేర్చుకోవాలని ఆయన కోరిక. మొక్కలా ఉన్న ఆ కోరిక వటవృక్షంలా ఎదిగేసరికి ఇంక ఆగలేక భార్యను కొడుకును వదిలి పూనా చేరుకుని సంస్కృత పండితుడైన ఆర్. జి. భండార్కర్ దగ్గర శిష్యుడిగా చేరిపోయారు. అక్కడి చదువు మరిన్ని కోరికలను పెంచి, కొత్త లక్ష్యాలను ఏర్పరిచింది. వాటిలో ఒకటి బుద్ధిజంపై మక్కువ. దేశమంతా తిరుగుతూ బుద్ధ గయలోనూ, సారనాథ్ లోనూ కొన్నాళ్లు గడిపారు. బుద్ధుడు జ్ఞానోదయం అయ్యాక నివశించిన ప్రదేశమైన అలహాబాద్ సమీపంలోని  కౌశాంబిలో కూడా కొన్నాళ్లు గడిపారు. ఈ చివరి ప్రదేశాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్న ధర్మానంద్ తండ్రీ కొడుకులు కొత్త పేరుతోనే ప్రపంచానికంతటికీ పరిచయమయ్యారు. నాకు తెలిసినంతవరకు గోవాలోనూ, భారత్ లోనూ, ప్రపంచంలోనే ఏకైక కోశాంబి కుటుంబం వీరిదే.

వర్తమాన  బౌద్ధ  సంప్రదాయాన్ని వెతుకుతూ కొన్నేళ్లు శ్రీలంక (అప్పటి సిలన్)లో గడిపినప్పుడే పాళీ భాష నేర్చుకున్నారు. అప్పటికి తొలిదశ బౌద్ధ మత భాషా సంస్కృతులకు సంబంధించి ప్రపంచంలో దిట్టగా ధర్మానంద్ పేరు పొందారు. తర్వాత కొన్నాళ్లు బొంబాయిలోనూ, పూనాలోనూ అధ్యాపకత్వం నెరిపారు. అప్పుడే సూదంటురాయిలా అమెరికన్ విద్యావేత్తలను ఆకట్టుకున్నారు. భార్యా కొడుకుతో సప్త సముద్రాలు దాటి కేంబ్రిడ్జి, మసాచుసెట్స్ చేరుకుని హార్వర్డ్  విశ్వ విద్యాలయం సిరీస్ గా ప్రచురించిన పాళీ భాషా గ్రంథాలను ఎడిట్ చేసే మహత్కార్యంలో పడ్డారు.

గాంధీ ప్రభావం
ధర్మానంద కోశాంబి దశాబ్ద కాలం అమెరికాలోనే ఉన్నారు. ఈ సమయంలోనే అతని కొడుకు బోస్టన్ యూనివర్శిటీలో లెక్కలు చదువుకున్నారు (ఇంటి దగ్గర నేర్చుకుంటున్న సంస్కృతం, పాళీలకు అదనంగా). గాంధీ ఉద్యమం గురుంచి పేపర్లో చదివిన సీనియర్ కోశాంబి అమెరికాకు, బుద్ధిజం అధ్యయనానికి శెలవు చీటీ ఇచ్చేసి, ఇంటిదారి పట్టి, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు కాడా అయ్యారు. గాంధీతో కలిసి సన్నిహితంగా పనిచేశారు. 1934లో మహాత్ముడు వార్ధా వెళ్లిపోయినపుడు ధర్మానంద్ కూడా అతనిని అనుసరించారు. కొన్నేళ్ల కిందట సేవాగ్రామ్ ఆశ్రమాన్ని నేను సందర్శించినపుడు అక్కడున్న సీనియర్ గైడ్ గాంధీ నివశించిన గుడిసెను, ఆయన సన్నిహిత సహచరులైన మహదేవ్ దేశాయ్, మీరా బెన్ (మేడలిన్ స్లేడ్)ల గుడిసెలు కూడా చూపించారు. మరో గుడిసెను చూపిస్తూ “ప్రొఫెసర్ సాబ్ కుటీరమది” అని చెప్పడం నాకింకా గుర్తు. ఒకప్పటి గోవా నివాసి, బౌద్ధ  పండితుడు, హార్వర్డ్ ఆచార్యుడు చివరి దినాలు గడిపిన చోటది.

ఈ అసామాన్య వ్యక్తి జీవితంలో మరో అసమానమైన విషయం ఆయన చనిపోయిన విధానం. 1947 వేసవిలో, భారత స్వతంత్ర సంబరాల వేళ, ధర్మానంద్ కోశాంబి తానింక జీవించనవసరం లేదని నిర్ణయించున్నారు. దాంతో  బౌద్ధ సంప్రదాయం ప్రకారం చివరి క్షణాల వరకు ఉపవాసం (ఆమరణ నిరాహారం) కొనసాగించారు.

మరాఠీలో సీనియర్ కోశాంబి జీవిత చరిత్రను కొంతవరకు రాసినట్టు ఎవరో నాకు చెప్పారు. ఇంగ్లిషులో కోశాంబి తండ్రీ కొడుకుల (ధర్మానంద కోశాంబి, దామోదర ధర్మానంద కోశాంబి) గురించి ఒక పుస్తకానికి చోటు ఖచ్చితంగా ఉంటుంది. దీనిద్వారా ఇద్దరు విశిష్ట వ్యక్తుల గురించి తెలుస్తుంది. వీరి ద్వారా గోవా చరిత్ర, ఇండియా చరిత్ర, ప్రపంచ చరిత్ర తెలియగలదు.

ప్రకటనలు

6 responses »

  1. ఆదివారం నాడు వ్యాసం చూసాను కానీ చదవలేదు. ఇప్పుడు మీ అనువాదం చదివాను…చాలా విషయాలు తెలిసాయి. అచ్చుతప్పుల వల్ల కాస్త ఇబ్బందిగా ఉండింది. సరిచూసుకోగలరు.

  2. kotha vishayalanu parichayamu chesinanduluku santhoshamu, kaani vaaru vaari group american point of view+ marxist point of view lo charithranu entho gabbu pattinchaaru. indian history indian ga chadavaali raayaali, . mana telugu vaalla laaga indian hindu ani cheppu kovadamu asyanga bhaavisthu raase vakra koothalaku communists assadhaarana prachaaramu, labhinchaayi vaariki. anthe kaadu motham insians vaallu cheppe dantha nijame nani namme sthayi ki cherukunnadi, charthra gurinchi.

  3. రామచంద్రగుహ రచనల్లో చరిత్ర చదవడమంత ఉల్లాసకరమైన విషయం మరొకటి లేదు. ఆయన శైలి అమోఘం.
    ఇంతటి చక్కని వ్యాసం మాకందించినందుకు కృతఙ్ఞతలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s