చరిత్ర రచనను కొత్త దారి పట్టించిన కోశాంబి

సాధారణం

చరిత్ర అర్థశాస్త్రాలు చదువుకుని అధికారంలోకొచ్చిన ఒక పెద్ద మనిషి ఐటి, బిటిల గురించి అ,ఆ,ఇ, ఈ లు తెలియకుండానే చరిత్రను ఎద్దేవా చేస్తూ ఈ కాలం పిల్లలు ఇంకా చరిత్ర ఎందుకు చదువుకుంటున్నారో ఏమిటో అని వాపోయారట! చరిత్ర సమగ్ర అధ్యయనంతోటే సుందర భవిష్యత్తు నిర్మాణం సాధ్యం అన్న కోశాంబి మాటలు ఆయనకు చెప్పడం వృథాకూడా. ప్రజాస్వామ్య విలువలు, స్ఫూర్తిని ఉగ్గుపాలతో రంగరించడానికి వీలుకల్పించే విద్యర్థి ఎన్నికలను అన్ని కాలేజీల్లోనూ, యూనివర్శిటీల్లోనూ రద్దు చేసిన ప్రబుద్ధుడాయన. చరిత్ర అనగానే చంద్రబాబు గురించి ఈ రెండు మాటలు అనాలనిపించింది. డి.డి. కోశాంబి రాసిన ఆరు వ్యాసాలను హెచ్చార్కె తెలుగులోకి అనువదించగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన భారత చరిత్ర పరిచయ వ్యాసాలను ఈ వారం పరిచయం చేస్తున్నాను.

అన్ని విషయాల్లో మాదిరిగానే చరిత్ర విషయంలో కూడా బ్రిటిష్ చరిత్రకారులు చెప్పిందే మనకు వేదం. భారతదేశ చరిత్రను మార్పులేనిదిగా నూతిలోని కప్ప మాదిరి సమాజమని వర్ణిస్తూ మొగలుల పరిపాలనను దూదేకుతూ దాంతో వారి పరిపలన ఎంతో గొప్పదిగా ఉన్నట్టు చిత్రించడమే ఆ చరిత్రకారుల కర్తవ్యం. అనంతరం జాతీయోద్యమం ద్వారా ప్రభావితమైన చరిత్ర మరిన్ని కొత్త పోకడలు పోయింది. సుసంపన్నమైన చరిత్ర గర్వించదగ్గ సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయంటూ కీర్తించడంతో అతి మొదలైంది. వీటన్నింటిని తోసిరాజంటూ భౌతిక శక్తుల నేపథ్యంలో చరిత్రను పరిశీలించడం భారత దేశానికి తెలియజేసింది దామోదర ధర్మానంద కోశాంబి.

ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన ఈ ఆరు వ్యాసాలు వేటికవి విడిగా చదివినా అన్నింటిని కలిపి చదివినా ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. విజ్ఞానాన్ని అందిస్తాయి. ప్రాచీన భారత చరిత్ర అధ్యయనానికి తెరతీసిన మొదటి వ్యాసంలో గ్రామ స్థాయిలో సాంఘిక, ఆర్థిక వ్యవస్థలు ఎలా స్థిరపడ్డాయన్న విషయాన్ని వివరిస్తారు. చరిత్ర అధ్యయనంలోనూ రచనలలోనూ కోశాంబి ఎంచుకున్న పద్ధతి మార్క్సిస్టు చరిత్రకారులందరికీ మార్గదర్శకమైంది. ప్రచారంలో ఉన్న, వ్యప్తిలోవున్న కథలు, గాథలు, పుక్కిటి పురాణాలను పక్కన పెట్టి సాహిత్య ఆధారాలను పాక్షికంగా మాత్రమే గుర్తిస్తూ పురాతత్వ తవ్వకాలలో లభించిన శిలాజాలు, అవశేషాలు, నాణేలు, శాసనాల ఆధారంగా చరిత్రను పూసగుచ్చుకుంటూ పోవడం అధునాతన పద్ధతి. ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి సంబంధాలలో వరుసగా వచ్చిన మార్పులను కాలానుగుణంగా వర్ణించడమే చరిత్రగా కోశాంబి నిర్వచిస్తారు. సాహిత్యంలో చరిత్రకు తీరని ద్రోహం చేసింది బ్రాహ్మణులే అని చీల్చి చెండాడుతారు. “ప్రతిఫలం దొరికితే బ్రాహ్మణులు ఎటువంటి కల్పనలు చేయడానికైనా సంసిద్ధులయ్యారు. దండిగా దక్షిణలు ముట్టిన సందర్భంలో ఆయా ఆటవిక రాజుల పూర్వీకులు ఇక్ష్వాకులని, భరతులని పురాణాలు కల్పించారు.

నదీలోయ ప్రాంతాలలో స్తబ్దంగా వున్న లేదా వున్నట్టు కనిపిస్తున్న గ్రామీణ ప్రాంత వాతావరణం ఆర్యుల రాకతో ఉత్తేజంగా, గొడవలతో, దాడులతో ఒక వ్యాపకాన్ని పొందింది. ఆ వ్యాపకపు ఫలితమే స్తరీకరణ. నెమ్మదిగా వర్గ సమాజపు ఏర్పాటు, అలా కుల వ్యవస్థ వేళ్లూనుకోవడం గమనించిన కోశాంబి పేజీ 11లో ఇలా అత్యాశను వ్యక్తపరుస్తారు: ‘యంత్రయుగం ఆవిర్భవించినపుడుగాని ఈ (ఫ్యూడల్ విధానపు) దశకు సంపూర్ణంగా తెరపడదు. అది బ్రిటిషు ఆక్రమణతో ప్రారంభమైంది. నూతన ఉత్పత్తి సాధనాలు, వర్గాలు, కుల నియమాలను కూల్చివేస్తున్నాయి. ఏనాడో శతాబ్దం కిందట మార్క్స్ జోస్యం చెప్పినట్టుగా ముఖ్యంగా మన పారిశ్రామిక నగరాలలో కులధర్మాల ఉక్కుచట్రం తునాతునకలవుతున్నది’. సమాచార విప్లవం వచ్చిన ఈ రోజుల్లో కూడా కులం చెక్కు చెదరకపోగా మరింతగా ఊడలు దించి విషం చిమ్ముతుండడం విషాద వాస్తవం.

రెండో వ్యాసంలో నగర జీవితాన్ని వర్ణించారు రచయిత. అయితే గ్రామీణ జీవితాన్ని వివరించినంతగా నగర జీవితాన్ని ఈ వ్యాసంలో స్పృశించలేదు. అంతేకాక, కొంత అస్పష్టతకూడా ఉందనిపించింది. అది అనువాదకుని లోపం కావచ్చు. లేదా ఈ పరిచయ కర్త అవగాహన లోపం కావచ్చు. ఈ వ్యాసంలో కోశాంబి క్రీస్తు పూర్వం మూడో సహస్రాబ్దిలో సింధునది బేసిన్ లో వెలసిన నగరాల సొగసును ప్రస్తుతిస్తారు. ఇంత సంక్లిష్ట రూపంలోవున్న నగర వ్యవస్థ ఆ కాలంలో ప్రపంచంలో మరెక్కడా కనిపించదని, తర్వాతి కాలంలో తలలుత్తుకు నిలబడిన భారతీయ నగరాలలో కాని ఈ పకడ్బందీ పథకం కనిపించదు. తీర ప్రాంతంలో పంటలు పండించడం, ఉత్పత్తిని పంచుకోవడంతోనే ఆగిపోతే నగర వ్యవస్థ ఏర్పడదు. అంతకుమించి పెద్ద ప్రయత్నాలు జరిగి ఉండాలి. సింధులోయ, మెసపటోమియాల మధ్య వాణిజ్య సంబంధాలు నడిచిన ఆధారాలు మెసపటోమియాలో లభించాయి. అంటే అప్పటికే అక్కడో రాజ్యం ఏర్పడివుండాలి. దానికొక హింసా యంత్రాంగం ఉండాలి. (చూ. పేజీ 24). వీటన్నింటి ఆనవాళ్లు ఒకేకాలంలో మూడు చోట్ల లభించడం విశేషం. టైగ్రిస్ – యుఫ్రేటస్ నదీ తీరాలలో సుమేరియా నాగరకత, నైలు నది ఒడ్డున ఈజిప్టు నాగరకత, సింధు నది ఒడ్డున హరప్పా నాగరకతలు చాలా చోట్ల విడిపోతూ కొన్ని చోట్ల కలుస్తూ దేనిదారిలో అదే అభివృద్ధి చెందడం విశేషం.

మూడో వ్యాసంలో ఆర్యుల ప్రవేశం గురించి కోశాంబి చెప్తారు. అసలు ఆర్యులు అంటే ఎవరు? వారు ఒక్క భారత దేశమే వచ్చారా? వచ్చి ఏమి చేశారు? ఈ ప్రశ్నలకు ఎలాంటి మొహమాటమూ లేకుండా జవాబులు చెప్తారు. సంచార జాతులైన ఆర్యులు ప్రపంచమంతటా పర్యటించారు. ఆర్య బృందాలమధ్య ఎన్ని తేడాలయినా ఉండవచ్చు. కాని వారు కాలుమోపిన ప్రతిచోటా చారిత్రక పరిణామాలకు నాంది పలికారు (పే. 33). అంటే ఆర్యులు జరిపిన ఇలాంటి దండయాత్రలను వరదలతో పోల్చారు కోశాంబి. వరదల్లో కూడా వినాశనం ఉంటుంది. కాని వాటివల్ల ఒండ్రు మట్టి పేరుకుని నేల సారవంతమవుతుంది. ఇక్కడి మొదటి వ్యాపకం వేట. అక్కడ నుంచి స్థిర జీవనం, వ్యవసాయం, దురాక్రమణల మీదుగా భారత సమాజంలో భూస్వామ్యం ఎలా వేళ్లూనుకుని, విస్తరించి, అభివృద్ధి చెందిందో చివరి మూడు వ్యాసాలలో అద్భుతంగా వర్ణిస్తారు.

‘అన్ని పూజల్లో కొబ్బరికాయ వాడడం భూమి పుట్టినప్పటి నుంచి కొనసాగుతుందని చెప్పే పంతుళ్లు కొబ్బరికాయ భారతదేశంలో క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో పరిచయమయ్యిందంటే ఏమంటారో కదా! ప్రేమ విషయంలో భారతీయ సాహిత్యంలో మొహమాటం చాలా తక్కువ. పరస్పర విరుద్ధ విషయాల మధ్య సామరస్యం కుదిరించ చూస్తూ, తీవ్రమైన వైరుధ్యాలను హాయిగా కలిపేస్తుంది’ అంటూ భగవద్గీత మీద చేసే వ్యాఖ్యానాల వంటివి ఎన్నో. అప్పటి బౌద్ధారామాలలో వాణిజ్యం జరిగేదని, అవి దాదాపు ఒక గొడవున్ లాగా, రెస్ట్ హౌస్ లగా, బ్యాంకులాగా పనిచేసేవనడం నిజంగా కొత్త కోణం.

సీరియస్ సాహిత్యమ్ చదివే పాఠకులు హాయిగా చదవగలరీ పుస్తకం. మీరూ ప్రయత్నించండి.

ప్రకటనలు

4 responses »

  1. చరిత్ర గురించి చంద్రబాబు అభిప్రాయం గురించి మరోసారి మీరు పునరాలోచించాలి, డిగ్రీల కోసం అవే పుస్తకాలు అనేక మంది చదివీ చదివీ తరువాత ఉద్యోగాలు దొరకడంలేదు, గవర్నమెంటోడు ఉద్యోగాలు ఇవ్వలేదు అని ఏదవడం కంటే చరిత్రను చదవ వద్దు అనడమే మంచిదేమో! ఎలాగూ ఆసక్తి ఉన్న వాళ్ళు చదివి ఉద్దరిస్తారు కదా! కాలేజీ ఎలక్షన్లు ప్రజాస్వామ్యాన్ని ఉగ్గుపాలతో నేర్పుతాయా? మరోసారి వెనక్కి తిరిగి చూడాండి, కేరళ కాలేజీలు అధ్యయనం చేయండి!

  2. పింగుబ్యాకు: కిందటేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ బ్లాగులో పరిచయమైన పుస్తకాలు « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s