అప్పు ఎవరిస్తున్నారు? ఎందుకిస్తున్నారు?

సాధారణం

dalariఒక పుస్తకం చదవగానే మన వెన్నులో సన్నగా వణుకు పుట్టిందంటే ఆ పుస్తకాన్ని ఏమనాలి? మర్డర్ మిస్టరీయా? సస్పెన్స్ థ్రిల్లరా? ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల వెన్నులో వణుకు పు ట్టించి, చెమటలు పట్టించిన ఒక పుస్తకాన్ని నవల కూడా అని పిలవలేం. ఎందుకంటే అది కల్పిత గాధ కాదు. ఒక వ్యక్తి తన వృత్తి జీవితంలో చేసిన కొన్ని ఉద్యోగ విధులను మనకు చెపితే దానిని నవల అనిగాని, ఆత్మకథ అనిగాని పిలవలేం. ఆ పుస్తకాన్ని ఏ పేరుతో పిలవాలా అని చాలామంది ఆలోచించి చివరకు ‘పెద్దన్న చేస్తున్న కుట్ర’ అని పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పట్టి కుదిపేసిన ఆ పుస్తకం పేరు “కన్ఫెషన్స్ ఆఫ్ ఏన్ ఎకనమిక్ హిట్ మాన్”. కాగా ఇంత ప్రభావశీల పుస్తకాన్ని రాసిన అమెరికన్ జాతీయుడి పేరు జాన్ పెర్కిన్స్. వీక్షణం పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని కొణతం దిలీప్ తో అనువాదం చేయించి “ఒక దళారీ పశ్చాత్తాపం” పేరిట తెలుగు పాఠకులకు అందించారు. మన రాష్ట్రంలోకూడా దాదాపు అంతే సంచలనం రేపిన ఆ పుస్తక పరిచయం  ఈవారం మీ కోసం..

ఈ పుస్తకాన్ని మూసధోరణిలో కాకుండా మరోలా చూద్దాం. మనం ఎవరమైనా ఎందుకు అప్పు తీసుకుంటాం అని ప్రశ్నిస్తే అవసరానికని ఎవరైనా సమాధానం చెప్తారు. మరి అప్పు ఎలా ఇస్తారన్నది కీలకమైన ప్రశ్న. అప్పిచ్చేవాడు మనం ఎలా తీరుస్తామన్నది పరిగణనలోకి తీసుకుంటాడు. మనకిచ్చిన అప్పు మనం ఎలా వినియోగిస్తామన్నది ఆరా తీస్తాడు. ముందుగా మనం అడిగినంత సొమ్ము లేదంటాడు. ఆనక విడతలవారీ ఇస్తామంటాడు. తర్వాత లెక్కకు మించి  షరతులు పెడతాడు. ఇంతా చేసి అప్పిచ్చేముందు తాకట్టుగా ఏదైనా పెట్టమంటాడు. కానీ, ఇవ్వాళ కొన్ని బ్యాంకులు చాలా దేశాలకు ఉదారంగా అప్పులు ఇచ్చేస్తున్నాయి. అసలు మనమెక్కడికీ అప్పులకని వెళ్లకుండానే వేలకోట్ల రూపాయలు మన ముంగిటికి తీసుకొచ్చి మరీ ఇలా అప్పుగా గుమ్మరిస్తున్నాయే! దీనికి కారణం ఏమిటి? దీని వెనుక కథ ఏమిటి? నిజంగా ఆ దేశాలు, లేదా ఆ బ్యాంకులు పూర్తిగా సంపన్నమైనవా? ఆ దేశాల్లో అసలు పేదరికం లేదా? నాలుగు దశాబ్దాలు కిందట అప్పులు తీసుకున్న దేశాల ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఇలాంటివన్నీ మన దేశంలో రాజకీయ నాయకులు ఎప్పుడూ వేసుకోని ప్రశ్నలు. పైగా వారి పాలన చూసి మురిసిపోయి ఆయా దేశాలు అప్పులిస్తున్నాయని అస్మదీయ పత్రికల ద్వారా ఊకదంపుడు ప్రచారం చేసుకోవడమొకటి – సిగ్గు లేకుండా. ఇలాంటి అనేకమైన ప్రశ్నలకు సవివరంగా జాన్ పెర్కిన్స్ చెప్పిన సమాధానమే ఈ “ఒక దళారీ పశ్చాత్తాపం”.

ఒకప్పుడు రాజ్యాలు దురాక్రమణ చేసుకోవడానికి గజబలం, రథబలం, అశ్వబలం, సైనిక బలాలు ఉపయోగించేవారు. తరువాత మందుగుండు సామగ్రి కనిపెట్టి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు సులువుగా దాడులుచేసి దురాక్రమణతో ఇతర దేశాలను అన్ని విధాలుగా దోచుకునేవారు. ఆ తరువాత దాదాపు అన్ని దేశాలు తమ అమ్ములపొదిలో అణుబాంబులు నిల్వ వుంచుకుంటున్నాక యుద్ధాలకు వెనుకంజ వేస్తున్నాయి. ఇప్పుడు దోపిడీకి వేరే మార్గాలు అన్వేషించవలసి వచ్చింది. కొత్తగా కనిపెట్టిన ఆ ఆయుధం పేరు అప్పు. ఏదైనా ఒక సహజ వనరులు విస్తారంగా వున్న దేశాన్ని ఎంపిక చేసుకోవడం.. ఆ దేశానికి అప్పులు ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వడం.. ఆ దేశం ఆ అప్పులు తీర్చలేక, వడ్డీలు  కట్టలేక, ఏమీచేయలేని  నిస్సహాయ స్థితిలో వున్నప్పుడు ఆ దేశపు మూలుగ పీల్చి పిప్పి చేయడం.. ఇదంతా చాలా అందంగా దోచుకోవడం అనే అమెరికా నూతన పన్నాగం. మరి ఒకట్రెండు దేశాలు అలా సర్వనాశనమయ్యాక మరే దేశమైనా వారి దగ్గర అప్పు తీసుకుంటుందా? ఇలాంటి సందేహాలు మనకు అక్కర్లేదు. ఎందుకంటే ఆయా దేశాలు అప్పులు తీసుకోవడానికి కొందరు ఉద్యోగులను నియమిస్తుంది. వారిపేరే ఎకనమిక్ హిట్ మెన్. అలాంటి ఒకానొక హిట్ మానే మన జాన్ పెర్కిన్స్. తాను ఏయే దేశాలు ఎలా వెళ్లిందీ, ఎలా వారిని అప్పుల ఊబిలో ముంచిందీ వివరించి చెప్పే పుస్తకమే ఈ “పశ్చాత్తాపం”.

తాము వెళ్లబోయే దేశపు చరిత్ర, సంస్కృతి, సమగ్ర వివరాలు తెలుసుకోవడం, ఆ దేశపు ఆర్థిక రంగం బాగా  ఎదుగుతుందని అందరినీ నమ్మించడానికి దొంగ లెక్కలు, గణాంకాలు కట్టివ్వడం వారి పని. దానికోసమే రకరకాల పేర్లతో దొంగ అభివృద్ధి నివేదికలు తయారు చేస్తారు. అలా ఎదగడానికి అవకాశమున్న ఆయా దేశాలకు తాము అప్పుగా డబ్బు ఇవ్వడం ద్వారా దానితో ఎంతో అభివృద్ధి చెందగలరని అద్దంలో చందమామ చూపించడమే వారు చేసే ఉద్యోగం. దేశాధినేతలు ఒప్పుకుంటే సరి. లేదంటే వారిని డబ్బుతోనో, మద్యంతోనో, మగువతోనో కొనేయడం కూడా వారి వృత్తిలో భాగమే. అలా కూడా కుదరకపోతే వారు వెనక్కు వెళ్లిపోతారు. అప్పుడు అమెరికా గూఢచారి దళం సి ఐ ఏ రంగప్రవేశం చేస్తుంది. ఆ దేశాధినేతను హత్య చేస్తుంది. తరువాత తమకు అనుకూలురైన వారికి అందలాలెక్కించి, అప్పు కుమ్మరిస్తారు. హత్య చేయడం కూడా కుదరకపోతే ఆయా దేశాల్లో అల్లర్లు చెలరేగుతాయి. అంత ర్యుద్ధాలు సంభవిస్తాయి. అప్పు తీసుకోని పాత ‘పిచ్చి’ ప్రభువులు పదవీచ్యుతులవుతారు. అమెరికా చెప్పులు నాకే ‘తెలివైన’ కొత్త ప్రభువులు అధికార పీఠాలు అధిరోహిస్తారు. అప్పులు తీసుకుని తమ దేశ ఆర్థిక రంగాన్ని ‘పురోగతి’ మార్గాలు పట్టిస్తారు. అదెలా వుంటుందంటే అలా అప్పుగా తీసుకున్న డబ్బు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. రోడ్లు వేయడం, పట్టణాలు, నగరాలను సింగారించి సుందరీకరించడం, విద్యుదుత్పత్తి కేంద్రాలు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం.. అప్పుగా తీసుకునే డబ్బును ఆయా దేశాలు ఖర్చు పెట్టే తీరిది.

ఇవేవీ కట్టుకథలు కావు. నిజాలు. నగ్న సత్యాలు. వాటికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా చితికిపోయిన ఆయా దేశాలను ఇప్పుడు మనం చూడొచ్చు. జాన్ పెర్కిన్స్ స్వయంగా అప్పుల ఊబిలో ముంచిన ఈక్వెడార్, పనామా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, వెనెజులా, వంటి దేశాల చరిత్రలను పుస్తకంలో వివరంగా మనం చదవొచ్చు. ఎకనమిక్ హిట్ మేన్ చేయవలసింది రెండే రెండు పనులు. అందులో మొదటిది భారీ విదేశీ రుణాల గురించి దేశాధ్యక్షులను ఒప్పించడం, రెండోది అప్పులు తీసుకునే దేశాలను క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్టు చేసి వారిని అమెరికాకు, అప్పులిచ్చిన సంస్థలకు బానిసలుగా మార్చుకోవడం.

కన్జూమరిజం, గ్లోబలైజేషన్ చేసే విష పన్నాగం వల్ల ఏం జరుగుతుందంటే కొద్దిమంది ధనంలో ఓలలాడుతుంటే, అనేకమంది పేదరికంలో మగ్గిపోతుంటారు. ఇలాంటి అప్పుల బూటకానికి పనామా దేశాధ్యక్షుడు ఒమర్ టోరిజోస్ లాంటి అసలు దేశభక్తులు అతి దారుణంగా విమాన ప్రమాదాలలో మరణిస్తారు. అమెరికా విసిరిన విష మంత్రాంగానికి చిక్కకుండా ఎదురు నిల్చిన టోరిజోస్అమెరికాను ఎదిరించి నిలవడం మా లక్ష్యం కాదు. పేదవాడి పక్షాన నిలబడడమే మాకు కావలసిందిఅన్నప్పుడు మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రపంచ బ్యాంకు దగ్గర, ఆసియా అభివృద్ధి బ్యాంకు ముందు చేతులు దేబరించి నిల్చునే మన రాజకీయ నాయకులు గుర్తొచ్చి సిగ్గుతో చితికిపోతాం. దేశాన్ని కొల్లగొడుతున్న చమురు కంపెనీలకు ముకుతాడు వేస్తానని ప్రకటించి రాజకీయాల్లోకి వచ్చిన యూనివర్శిటీ ప్రొఫెసర్ జైమ్ రోలోస్ ఈక్వెదార్ అధ్యక్షుడయ్యాక చేసిన పోరాటం మనకు వీరోచిత జానపద చిత్రాన్ని గుర్తుకు తెప్పిస్తుంది. అమెరికాకు ఎదురొడ్ది నిలబడి అతను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలి మరణించాడు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కూడా అతని మరణంపై అనుమానాలు ప్రకటించింది. లాటిన్ అమెరికాలో ఉత్తుంగ తరంగంలా రేగిన అమెరికా వ్యతిరేక, ప్రపంచీకరణ వ్యతిరేక పోరాటాలు ఇప్పుడిప్పుడే ఒక రూపు దిద్దుకుంటున్నాయి.

ఈ పుస్తకం చదివాక మనకు ఓ నిరాశ, నిస్పృహ చుట్టుకుంటాయి. దేశాధినేతలు, రాజకీయ నాయకులు ఎలాంటి ముందుచూపు లేకుండా, దేశభక్తి లేకుండా చేసే ఇలాంటి అనర్ధదాయక పనులను మనం ఎలా అరికట్టగలమని తీవ్రమైన చింతనలో కూరుకుపోతాం. మనలాంటి వర్ధమాన దేశాలు చేసే అప్పులు ఒకపక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రాలు సైతం ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయేట్టు ఇప్పటికే చేసేశాయి ఘనత వహించిన ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు. మనకే పాపమూ తెలీకపోయినా ఇప్పుడు ప్రతి ఆంధ్రుడి నెత్తిమీద ఎనిమిదివేల రూపాయల అప్పు వుంది. అది వడ్డీతో పెరుగుతూనే వుంటుంది. ఎందుకంటే తీసుకునే అప్పు తీర్చే ప్రయత్నమేదీ ఇంతవరకూ మనం చేపట్టింది లేదు. దీని నుంచి మనం తప్పించుకునే మార్గమేమీ లేదు – రైతులు ఎంచుకుంటున్న ఒకే ఒక పరిష్కార మార్గం ఆత్మహత్యలు తప్ప. మరి బతకాలని నిర్ణయించుకున్నవారికి ఈ పుస్తక రచయిత కొన్ని సూచనలు చెప్తారు. మీడియా కూడా కార్పొరేట్ స్వామ్యంలో  భాగమే. రేడియోలో , టీవీలో, వార్తాపత్రికల్లో చెప్పే కథల వెనకనున్న నిజమేమిటో చూడాలి. వార్తల పట్ల మీ దృక్పథం మారాలి. పెట్రోలు, డీజిలు వ్యయం తగ్గించుకోవాలి. షాపింగ్ చేయడం కూడా తగ్గించుకోవాలి. స్వేచ్ఛా మార్కెట్లను, శ్రమశక్తిని, పర్యావరణాన్ని దోపిడీ చేసే బహుళ జాతి కంపెనీలను వ్యతిరేకించాలి. వీలైనన్ని చోట్ల ఈ విషయాల గురించి మాట్లాడాలి. సభలు, సమావేశాలలో ప్రసంగించాలి. ఉత్తరాలు, ఈ-మెయిల్లు రాయాలి. ఏదైనా కొనాల్సి వచ్చినపుడు బాగా ఆలోచించి కొనాలి. జాన్ పెర్కిన్స్ చెప్పిన మాటలు నిజంగా మనల్ని ఆలోచనలో పడేస్తాయి. ఎప్పుడైనా టీవీ పెట్టండి, ఏ పత్రికైనా తిరగేయండి. ప్రకటనలే ప్రకటనలు. ఊపిరి సలపనియ్యవు. అవి కొను.. ఇవి కొను… ఇంకా కొనలేదా.. ఈ వస్తువులు వినియోగించకపోతే నీ జీవితం దండగ.. అంటూ మనల్ని వేధించే ప్రకటనలకు తోడు వడ్డీరేట్ల తగ్గింపుతో ప్రభుత్వ ప్రకటనలు. డబ్బు దాచుకుంటే వడ్డీ వస్తుందనే ఆశను చంపి ప్రజల్లో వినియోగదారీ మనస్తత్వాన్ని పెంచడానికే తోడ్పడుతున్నాయి. పొదుపునకు బదులు వినియోగం, రకరకాల వస్తువులు కొనుక్కుని జల్సా చెయ్యమని బోధించే సినీ తారలు, క్రికెట్ హీరోలు.

ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకమే కాదు, తమ స్నేహితులందరి చేతా చదివించాల్సింది కూడా. కొణతం దిలీప్ అనువాదం గురించి ఒక్క మాట – సహవాసి అనువాదాలు ఆగిపోయిన తర్వాత అంతగొప్ప అనువాదకుడు లభించాడన్న సంతృప్తి. ఈయన  బ్లాగు http://hridayam.wordpress.com తప్పక చూస్తూ ఉండండి.

ఈ పుస్తకం కావలసిన వారు వీక్షణం పబ్లికేషన్స్, మైత్రీ రెసిడెన్సీ, 3-6-394, వీధి నెం.3, హిమాయత్ నగర్, హైదరాబాద్ – 500029 చిరునామాకు 50 రూపాయలు పంపించి తెప్పుంచుకోగలరు. మరి మీరూ చదువుతారు కదా!

ప్రకటనలు

13 responses »

 1. Thanks for nice post on ” దళారీ పశ్చాత్తాపం” a wonderful book ,Thanks to Prasnthi Uppalapai who is fonder of http://www.tmad.org I come to about this book by ger . we want to speared the massage of this book in the proess we distributed more that 100 books to our friends and relative , When I read this book I thought Mr.Dileep must me 40 + and must associated with communist party but when met Dileep at veeksham publications I wonder in person aged around 27- 30 and working in Google adwords ! . kudos to జాన్ పెర్కిన్స్. వీక్షణం పబ్లికేషన్స్ ,కొణతం దిలీప్

 2. ఈ పుస్తకం పూర్తయ్యాక, నిజంగానే చెమటలు పట్టాయి. ఒక రకమైన నిస్సత్తువ ఆవహించింది.అమెరికా ఎటువంటి సెక్యూరిటీలూ, బంగారం పెట్టుకోకుండా ఎంత కావాలంటె అంత డబ్బును అచ్చువేసుకుంటుందని చాలా మందికి ఈ పుస్తకం చదివాకనే తెల్సింది. (నాక్కూడా) ‘మేమిలా చేసాం, ఇన్ని కుట్రలు చేసాం, ఇంతమందిని చంపాం ‘ అని పెర్కిన్స్ చెపుతుంటే, చేష్టలుడిగి చూస్తుండిపోతాం! ముఖ్యంగా ఒమర్ టోరిజోస్ ని హత్య చేయడం!

  గ్లోబలైజేషన్, గ్లోబలైజేషన్ అనడమే తప్ప దాని పరిణామాలేమిటి, దుష్ఫలితాలేమిటన్నది రాజకీయ నాయకుల నుంచి, స్వచ్చంద సంఘాల వరకూ ఎవరూ సామాన్యుడికి వివరించలేదింతవరకూ! ఈ పుస్తకం చదివాక అది కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది.

  చివర్లో పెర్కిన్స్ చెప్పిన జాగ్రత్తలు, సూచనలు నిజంగా ఆలోచింపజేసాయి. అనువాదల మనుగడ సగం విషయం పైన గాక, అనువాదకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. దిలీప్ గారి అనువాదం చదువుతుంటే, అచ్చెరువొందుతాము.

  పెర్కిన్స్ పాపాలన్నీ ఈ పుస్తకం రచనతో పరిహారమైనట్టే! నేను చదివాక ఆలస్యం చెయ్యకుండా నలుగురు స్నేహితులకు ఈ పుస్తకం కొనిచ్చాను. తెలుగు చదవ గలిగిన పదో క్లాసు విద్యార్థులకు, ఈ పుస్తకాలను పంచాలని ఉంది.

 3. ప్చ్! ఎన్ని చెప్పి ఏమి లాభం? ఈ స్వార్ధపూరిత రాజకీయవాదులు, ఈ అధికారధురందరులు, ఈ అత్యాశాపిపాశులు ఉన్నంతకాలం మన (అభివృద్ది చెందుతున్న దేశాల) పరిస్తితులుమారవు.

 4. it is good article to read and really thinkable to every person in this country.Countries like U.S.A and U.k why they are giving the money to poor countries. what they are expecting from them .

  we are all know that how the formers are suicide in the country in the same way poor countries may be devastated.Now iraq is facing the problem . country like india should face the problem.so that people in the country should know all these things.

  News papers and electronic media should come forward to bring these issues at the time of election time. then political parties know what they are doing in goverment.

 5. బహుసా నేను పుస్తాకాలు చదవటం మెదలు పెట్టింది ఈ పుస్తకంతో నేమో…. (ఒక హాబీలాగా) ….
  నిజంగా అలాంటి పుస్తకం రాయలంటే…భాష కంటే ..ధైర్యం,నిజాయితీ ఎక్కువకావాలి అని అనిపించింది..
  ఒరిజినల్ కంటే… అనువాదాన్నే… చదవమని చెప్పాలంటే.. ఈ పుస్తకం మంచి ఉదాహరణ……
  మరొక్కాసారి గుర్తుచేసినందుకు…. నెనెర్లు..

 6. నిజంగా చాలా బాగుంది. అంత కంటే ముఖ్యంగా ఆలోచింపజేసేలా ఉంది. దేశంలో ఇలా జరుగుతుంది అని చాలా మందికి తెలుసు అని నేనకుంటున్నాను. అయితే ఎవరూ ఏమీ చేయటం లేదు. చేసే ఆలోచనలో కూడా ఉండరేమో. ఎందుకంటే అంతా రాజకీయాలే కదా. ఇతర దేశాల్లో ఇలా జరుగుతుందని చదువుతుంటే నిజంగా వణుకు పుడుతుంది. ఆయా దేశాలనే కదా మన దేశం అనుసరిస్తుంది, ఈ దేశం కూడా ఏమి అయిపోతాదో. చివరగా సూచించిన జాగ్రత్తలు పాటించవలిసినవి. అలా పాటిస్తేనైనా కొంత మేర అప్పుల భారం తగ్గుతుందేమో. మార్కెట్లో ఏ వస్తువు కొత్తగా కనపడితే దాన్ని కొనేయాలనుకునే కంటే కొనే ముందు ఆలోచిస్తే బాగుంటుంది. నేను తప్పక ఈ పుస్తకాన్ని చదువుతాను. వీలయితే ఇతరులతో చదివించే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి పుస్తక పరిచయాలని చేస్తున్ననందుకు మీకు అభినందనలు, క్రుతజ్ఞతలు.

 7. పింగుబ్యాకు: గుండె చప్పుడు వెనుక… « గుండె చప్పుడు…

 8. Ee pustakam chala bagundi. Manaku enno kotta vishayalu telustai ee pustakam chadivaka. Alage America chestunna kutranu chala baga vivaristoo vatini ela vyatirekinchalo kuda chepatadu john perkins.Ituvanti suchanalu andaroo patinchadaggavi. Appude manam mana desanni corporate companies nunchi konthina kapadukogalugutam. Ippatike mana desanni prapanch bank nunchi appulu,Nuclear deal ani cheppi Americaku takattu pedutunnaru.Ituvanti vatini purtiga vyatirekinchali.

 9. పింగుబ్యాకు: కిందటేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ బ్లాగులో పరిచయమైన పుస్తకాలు « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s