దేశ ముఖచిత్రాన్ని మార్చిన వ్యక్తి కథ

సాధారణం

చాలా రోజుల కిందట అవుట్ లుక్ ఇంగ్లిషు వారపత్రికలో కుష్వంత్ సింగ్ రాసిన “ఐ టూ హాడ్ ఏ డ్రీమ్” పుస్తక పరిచయం చదివి ఆసక్తితో ఆ పుస్తకం తెప్పించుకుందామని చాలా ప్రయత్నం చేశా. ఇండియాప్లాజాలో వెతికా. జీవిత చరిత్రలు కొని చదివే కణుగుల వెంకటరావు గారిని కూడా అడిగా. కానీ ఎక్కడా దొరకలేదు. అదృష్టవశాత్తూ కొన్ని నెలల కిందట ఆలకనంద ప్రచురణ సంస్థ ఆ పుస్తకం తెలుగు అనువాదం “నాకూ వుంది ఒక కల” పేరుతో ప్రచురించింది. వర్గిస్ కురియన్ ఆత్మకథగా ప్రసిద్ధిగాంచిన ఈ పుస్తకాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నా.

వర్గీస్ కురియన్ ఎవరని ఈ తరం యువతను ప్రశ్నించినపుడు తెలీదన్న సమాధానమే దొరికింది. బహుశా వర్గీస్ కురియన్ పేరు మనకు తెలియకపోవచ్చు గాని పాలు, పాల సంబంధిత ఉత్పత్తుల సంస్థ ‘అమూల్’ పేరు తెలియని వారుండరు. ఆ అమూల్ నిర్మాత వర్గీస్ కురియన్. భారత దేశంలో హరిత విప్లవానికి పితామహుడని ఎం.ఎస్. స్వామినాధన్ ను పిలుచుకుంటాం. శ్వేత లేదా పాల విప్లవానికి పితామహుడిగా కీర్తించుకోవడానికి ఈ కురియన్ అక్షరాలా అర్హుడు. భారత స్వతంత్రం వచ్చేనాటికి కొన్ని వందల కోట్ల రూపాయల పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే స్థితిలోవున్న దేశం నాలుగైదు దశాబ్దాలలో పాల ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలను గడించే స్థితికొచ్చింది. ఈ వైనం తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. అతనికి ఆ దారిలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను మనం తెలుసుకోవాలి. కొత్త తరాలకు తెలియజెప్పాలి. పాల వెల్లువ కల సాధనలో కురియన్ కష్టసుఖాల జ్ఞాపకాల కలబోత మనకెంతో ఉత్తేజం కలిగిస్తాయి.

kurien1921లో కేరళలో సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. తమిళనాడులో బియస్సీ తర్వాత గిండీ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. టిస్కోలో ఇంజనీరుగా ఉద్యోగం వచ్చింది కానీ ఎక్కువ కాలం పని చేయకుండా పై చదువులకు అప్పటి బ్రిటిషు ప్రభుత్వానికి స్కాలరుషిప్పు మంజూరు చేయమని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. మెటలర్జీ చదవాలనుకున్న కురియన్ కు డైరీ ఇంజనీరింగ్ లో సీటు రావడంతో ఖంగుతిన్నారు. అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీలో కోర్సు పూర్తి చేసుకుని వచ్చేనాటికి ఇండియా స్వతంత్ర దేశమైంది. భారత తొలి ఆర్థిక మంత్రి జాన్ మత్తయ్ స్వయంగా కురియన్ మామయ్య. అయినా ఎలాంటి సిఫారసు చేయకుండా 600 రూపాయల నెల జీతంతో ఆనంద్ లో ఉద్యోగం సిద్ధంగా ఉంది. ఆ ఉద్యోగం చెయ్యడానికి కురియనుకు ఇష్టం లేదు. ఎందుకంటే జీతం చాలా తక్కువ. అలాగే ఆనంద్ గుజరాత్ రాష్ట్రంలో ఓ మారుమూలనున్న చిన్న పల్లెటూరు. వీటన్నింటికి మించి అక్కడ చెయ్యడానికి పనేమీ లేదు.

అయితే అప్పటికే పోల్సన్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులకు మార్కెట్ బొంబాయిలో ఉంది. దానిని ఒక భారతీయ పార్శీ పెస్తోంజీ ఎదుల్జీ, ఓ జర్మన్ కలిసి అప్పటికే సృష్టించారు. కానీ ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లో జరగడం వల్ల వ్యాపారులు అంతా లాభపడుతున్నా రైతులకు మాత్రం ఎలాంటి లాభమూ లేకుండా పోతుండేది. వారినసలు పట్టించుకునే నాధుడే లేడు. ఆనంద్ గ్రామం కైరా జిల్లాలో వుంది. అదే జిల్లాలో కరంసద్ అనే గ్రామలో పుట్టిన సర్దార్ వల్లబ్ భాయి పటేల్ స్వతంత్ర భారత తొలి ఉప-ప్రధాని. అంచేత కైరా రైతులంతా తమ సమస్యను ఆయనకు చెప్పుకున్నారు. కైరా జిల్లా పాల రైతుల సహకార సంఘాలు ఏర్పాటు చేయించి దానికి త్రిభువనదాస్ పటేల్ ను అధ్యక్షునిగా చేశారు. ఇదీ వర్గీస్ కురియన్ ఆనంద్ చేరుకున్నప్పటికి అక్కడున్న నేపథ్యం.

అక్కడ ప్రభుత్వ క్రీమరీలో పనిచెయ్యడం ఇష్టం లేదు కురియనుకు. ఉద్యోగం మానేస్తే స్కాలర్షిప్పు 30 వేల రూపాయలు తిరిగి కట్టాలి. అప్పుడో ప్రభుత్వోద్యోగి సలహామేరకు ఆఫీసులోనే పేకాట, సిగరెట్లు కాల్చడం, పనేమీ లేదు కాబట్టి చీటికీమాటికీ శెలవు పెట్టేసి బొంబాయి చెక్కేసి చక్కెర్లు కొట్టడం ఇదే ఉద్యోగంగా మెలిగిన కురియన్ ‘పనితీరు’ గురించి ప్రభుత్వం తెలుసుకుని ఉద్వాసన పలికేలోపు త్రిభువనదాస్ పటేల్ తో పరిచయమైంది. ఉద్యోగం ఊడిపోయిన తరువాత 60 రూపాయల జీతానికే కైరా పాల రైతుల సహకార సంఘంలో ఉద్యోగిగా చేరారు కురియన్. ఆ తర్వాత జరిగిన కథంతా చరిత్రలో నిలిచిపోయింది.

ఆనంద్ పాల కోపరేటివ్ కు పునాదిరాయి ప్రతిష్టించడానికి వచ్చింది ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్. భవన నిర్మాణమైన తర్వాత కోపరేటివ్ ను ప్రారంభించింది ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. “నీలాంటి వాళ్లుండడం నాకు చాలా సంతోషంగా వుంది. నీలాంటి వాళ్లు ముందుకు దూసుకెళ్లి అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేస్తారు” అని నెహ్రూ ప్రశంసించినప్పుడు పక్కనేవున్న ఇందిరాగాంధీ అప్పటికి బాలిక. తర్వాత కురియన్ కు ప్రభుత్వ యంత్రాంగం అడ్డు తగిలినప్పుడల్లా ప్రధానులు, గుజరాత్ ఎంపీలు, గుజరాత్ ముఖ్యమంత్రులు కవచంగా నిలిచారు. ఆ సంఘటనలు చదువుతున్నపుడు ఉద్వేగంతో మన కళ్లలో నీళ్లు తిరుగుతాయి. వ్యవసాయ శాఖ మంత్రి రావు బీరేంద్ర సింగ్ అవాంతరాలు సృష్టించినప్పుడు కురియన్ ప్రధాని ఇందిరను కలిసినప్పుడు వెంటనే ఆమె ఫోన్ తీసి “కురియన్ ని ఆయన మానాన ఆయన్ని వదిలెయ్యండి” అని హెచ్చరించారు. కానీ మూడు నెలల్లోనే మంత్రి మళ్లీ అన్ని పనులకు అడ్డు తగలడంతో మళ్లీ ప్రధానిని కలిసినపుడు, ఇందిర చాలా ప్రశాంతంగా “డాక్టర్ కురియన్, అయితే ఆయన్ని తీసేస్తాను” అని చెప్పి మూడు రోజుల్లో సింగును మంత్రిమండలి నుంచి తొలగించారు. 1970లో బాబూ జగజ్జీవన్ రామ్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నపుడు కురియన్ ను పిలిపించుకుని తన నియోజక వర్గంలో ఓ ప్రైవేటు డైరీ ఏర్పాటుకు సహాయం కోరినప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా ‘కుదరదు’ అని చెప్పినప్పుడు జగ్జీవన్ అగ్గిమీద గుగ్గిలమైపోయారు. జగజ్జీవన్ పగ ఎలాంటిదంటే ఆయన నీ గొంతు కోశాడంటే నీ తల కిందపడేవరకు ఆ విషయం నీకు తెలియదు. కానీ ప్రధాని ఇందిరకు సంగతంతా విన్నవించుకున్నపుడు “కురియన్ ను ఆయన మానాన ఆయన్ని వదిలెయ్యండి” అని జగ్జీవన్ ను గట్టిగా హెచ్చరించారు. అలాగే మిగిలిన అధికారులు, నాయకులతోనూ జగడాలే జగడాలు. కురియన్ వ్యవహార శైలి అలాంటిది.

“నాకూ ఉంది ఒక కల”లో వర్గీస్ కురియన్ కొన్ని విషయాలను చాలా స్పష్టంగా చెప్తారు. మొదటిది ప్రభుత్వ రంగంలో అధికారుల అలక్ష్యం. దేశ ప్రజానీకానికి ముఖ్యంగా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిసినా స్వప్రయోజనాల పట్ల మోజుతో చాలాపనులకి మోకాలడ్డుతుంటారు. కానీ సీనియర్ ఐఏయస్ అధికారులు కొందరు దేశంపట్ల ప్రేమతో ఉన్న అడ్డంకులు తొలగించడానికి కృషి చేయడంపట్ల వారికి జోహారులర్పించాలి. రెండవది సహకార భావనను కురియన్ విపులంగా వివరిస్తారు. నిజానికి పాల వెల్లువ విజయవంతమైన తర్వాత అదే రంగంలో అవే ప్రయోగాలు చేయడానికి చాలా దేశాలు కురియన్ ను ఆహ్వానం పలికాయి. పాకిస్థాన్, శ్రీలంకలలో కొన్నాళ్లపాటు పనిచేసిన కురియన్ ఆ దేశాల్లో అలవిమాలిన అవినీతిని ఎదిరించలేక వెనక్కి వచ్చేశారు. ఇండియాలో పాల రైతుల్లో విశ్వాసం పాదుకొల్పిన తర్వాత అవే ప్రయోగాలను వేర్వేరు ఆంశాలకు అనువర్తించి నూనె, పప్పు ధాన్యాలలో ప్రయోగాలు విజయవంతమైనప్పటికీ ప్రభుత్వ అధికారులు వాటిని విజయవంతం చెయ్యనివ్వలేదు. ఈ విధంగా సహకార భావన పట్ల మనకు కొత్త ఆలోచనలు కలిగిస్తారు.

మూడోది గ్రామాల్లోనే దేశ భవిత ఉందన్న విషయం చాలా స్పష్టంగా చెప్తారు. దేశ ముఖచిత్రాన్ని మార్చాలనుకునే రాజకీయ నాయకులు గానీ, ప్రభుత్వ అధికారులుగానీ, సామాజిక కార్యకర్తలు గానీ గ్రామాల ముఖచిత్రం మారిస్తే చాలు. ఈ సంగతి తెలియక వాజ్ పేయిగాని, చంద్రబాబు గాని పట్టణాల ముఖచిత్రం మార్చడానికి ప్రయత్నించి అధికారం కోల్పోయినారు. పల్లెసీమలే దేశ భవితకు పట్టుగొమ్మలు. నాలుగో విషయం ప్రతి సవాలులోనూ ఒక అవకాశముంటుందని చెప్తారు. విజయం సాధించలేక పోవటాన్నే చాలా మంది అపజయంగా భావిస్తారు. పాండవుల వద్దనున్న ఆయుధాలన్నీ వారు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు సంపాదించినవే. ఈ విషయాలను యువత జాగ్రత్తగా పరిశీలించాలి. కురియన్ జీవితమంతా ఈ పోరాటాన్ని గమనిస్తాం.

ఇక పుస్తకం ముగింపుకొచ్చేసరికి కురియన్ లో కొంత నిర్వేదం కనిపిస్తుంది. నిజమే పుస్తకం రాయడం ముగించి విశ్రాంతి తీసుకుంటున్న దశలో ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హ్రస్వదృష్టిగల రాజకీయ నాయకులు అమూల్ చైర్మనుగా కురియన్ ను దించేశారు. ఆఖరికి ఆనంద్ లో కురియన్ స్థాపించిన మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్ నుంచి కూడా తరిమేశారు. ఈ విషయమ్మీద కొన్ని వారాల కిందట తెహల్కాలో ఆవేదనాభరితమైన వ్యాసం వచ్చింది, చూశారా? మహోన్నత వ్యక్తులను గౌరవించే సంప్రదాయాన్ని కొనసాగించాల్సింది పోయి ఆపేసుకుంటున్నాం.

యువతరానికి ఎంతో ఉత్తేజం అందివ్వగల ఈ “నాకూ వుంది ఒక కల”ను తుమ్మల పద్మిని, అత్తలూరి నరసింహారావు సరళంగా అనువాదం చేశారు. ‘సర్దార్ వల్లబ్ భాయి పటేల్’ ను పుస్తకమంతా ‘సర్దార్ వల్లభాయ్ పటేల్’ అనే రాశారు. సంప్రదాయం లేదా సాంప్రదాయిక కరెక్ట్. సాంప్రదాయం తప్పు. తప్పునే అనువాదకులు అనుసరించారు. సమర్ధవంతం బదులు సమర్ధం సరిపోతుంది. ఇవన్నీ పట్టించుకోదగిన తప్పులు కాదు గానీ పుస్తకం టైటిల్ నే “నాకూ ఉండేదో కల“గా అనువాదిస్తే బాగుండేదనిపించింది. ఎందుకంటే ఇప్పుడది కల కాదుగదా. వాస్తవ రూపం దాల్చింది. కలను సాధ్యం చేసుకున్న ధన్యజీవుడు వర్గీస్ కురియన్.

మంచి పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందించిన అలకనంద ప్రచురణ సంస్థకు అభినందనలు. 223 పేజీల ఈ గొప్ప పుస్తకం ఖరీదు 125 రూపాయలే. మరి మీరూ చదువుతారుగా!

ప్రకటనలు

10 responses »

 1. A very good introduction. So we can compare the lives of Abdul Kalaam and Verghese Kurien very closely. We can see failures in the beginning and later on they got huge successes. They are makers of India. We will certainly read the review.

 2. రవికుమార్ గారు,మీ పరిచయవ్యాసం చదివి అబ్బురపడ్డాను.అనగానగ రాగమతిశయీంచు అన్నట్లు రానురాను మీ రచనాశైలి కొత్తపుంతలు తొక్కుతుంది,అభింనందనలు.అనువాదకులు భార్యాభర్తలే,విశాఖనివాసులు.అత్తలూరి అనువాదాలు అతిసరళాలు.
  కురియన్ కు ఇప్పటి దుర్గతి పట్టేందుకు కారణాలు మీకు తెలిసీ ఉపేక్షించారా అనిపిస్తుంది.మీనుంచి మరిన్ని వ్యాసాలకోసం ఎదురుచూస్తూ…మీ అభిమాని

 3. సర్,

  మీ వ్యాసం చాలా బావుంది. ముఖ్యంగా వర్గీస్ గారు చెపారన్న నాలుగు అంశాలలో అన్నీ ముఖ్యమైనప్పటికీ నాల్గవది తప్పకుండా ఆచరించవలసింది. అపజయాలను చూసి భయపడకూడదు అన్న దానికి మంచి ఉదాహరణనిచ్చారు. ముందుగా దాన్ని పాటిస్తే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా సాధించగలమని నా అభిప్రాయం. మీ రచనలను చూసే నేను ఇన్స్పైర్ అయ్యి, రచించ్ట్లేదనుకోండి, కానీ రాస్తున్నాను. ఇంకా మీ రచనలు రావాలి, స్ఫూర్తిని కలిగించాలని ఆశిస్తూ….

  మీ
  ఇందు

 4. kurian ni pandavulato polchatam bagundi ninnane e book visalandra book show room lo chusa me saili veeru nu maro sari gurtu chesindi,kastakalam lo ayana samakurchu kunna manchi adi ayana ku indiragandhi rupam lo use avvadam super, endukante kastakalam lone nibadhata chupali appude mana samardhyanni poorti ga viniyoginchu ko galam kuda, thanks to ravikumar n hail to kurian

 5. పింగుబ్యాకు: కిందటేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ బ్లాగులో పరిచయమైన పుస్తకాలు « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s