ఆలోచన, ఆవేశం, భావుకతల మేళవింపు ‘ఆధునికం’

సాధారణం

seshenనటుడికి ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, వంటవాడికి భోంచే సేవారు వేసే లొట్టలు, రచయితకు పాఠకుడి ప్రశంసలు ఇంతా అంతా ఆనందాన్ని ఇచ్చేవికావని ఒక సినిమాలో జంధ్యాల అనిపిస్తారు. పాఠకుడి మెప్పుతో పాటు ఉత్తమాభిరుచి గల పాఠకులు కలిసి అందించే పురస్కారం రచయిత బాధ్యతను మరింత పెంచుతుంది. మరి పురస్కారాలలో కూడా ఎక్కువ తక్కువలు కనిపిస్తాయి. సాహిత్యంలో అతి గొప్ప పురస్కారంగా నేబెల్ బహుమానాన్ని గుర్తిస్తున్నాం. ఆసియా ఖండంలోనే తొలి నోబెల్ పురస్కారం మన భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగోర్ తన “గీతాంజలి”కి పొందారు. తర్వాత ఇండియాకు మరి నోబెల్ సాహిత్య పురస్కారాలు లేవు. రుడ్యార్డ్ కిప్లింగ్ ఇండియా వచ్చేసిన త్ర్వాతే నోబెల్ బహుమానం పొందినా అది ఇండియా ఖాతాలో జమకాలేదు. ఇటీవల ఆర్.కె. నారాయణ్ లిస్టింగులో నిలిచినా కొద్ది పాయింట్ల తేడాతో నోబెల్ రెండుసార్లు మిస్సయ్యారు. ఇక తెలుగు విషయానికొస్తే ప్రపంచం గర్వించదగ్గ రచయితలున్నా భాష విశిష్టతను సరిగ్గా నోబెల్ కమిటీకి వ్యక్తం చేయలేక భంగపడుతున్నాం. మన వీరేశలింగం, మన గురజాడ, మన శ్రీశ్రీ, మన వట్టికోట, మన విశ్వనాథ ఎవరికంటే తక్కువ?

ఇంతటి నిరాశామయ వాతావరణంలో తెలుగు సాహిత్యలోకాన్ని ఆనంద పరవశం చేసిన మాటొకటి రెండేళ్ల కిందట పట్టి కుదిపింది. మన గుంటూరు శేషేంద్రశర్మ సృజించిన “ఆధునిక మహాభారతం” కావ్యం నోబెల్ సాహిత్య పురస్కారం పరిశీలనలో ఉందని సంతోషపడ్డాం. బహుమతి సరే, తెలుగువాడి వాడి, వేడి, భాష సొగసు, ఆలోచనల అంతర్మధనం, సమాజంపట్ల బాధ్యత, తోటి మనిషి పట్ల సానుభూతి, ఇవన్నీ ప్రపంచమంతా తెలుసుకుంటారు కదా అని సంబరపడ్డాం. ఈ వారం ఆ మహాకావ్యం ఆధునిక మహాభారతాన్ని పరిచయం చేస్తున్నాను.

వ్యాసుడు రాసిన మహాభారతం ఎనిమిది వేల శ్లోకాలు గల “జయం” అనే ఇతిహాసం. భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరు కథనమైన ప్రాచీన భారతం చదివితే పుణ్యం వస్తుందని అంటారు. అదే భూమి కోసం, భుక్తి కోసం వర్గ చేతన కథనం ఆధునిక భారతం చదివితే ఎన్నో లాభాలు. రచయిత సూచించినట్లుగా ఎన్ని లాభాలో చూడండి — గులాం మనస్తత్వం కారణంగా వంగిపోయిన మోకాళ్లలో బలం వచ్చి, మనిషి కాళ్లు నిటారుగా నిలుస్తాయి. దాని పైన వంగి వంగి సలాములు చేసి చేసి వంకరటింకర్లు అయిపోయిన వెన్నెముక ఇనుప చువ్వలా నుల్చుంటుంది. సిగ్గు విడిచి తల వంచివంచి మెలిగే అలవాటుచేత సదా వేలాడే తల ఒక్కసారి భుజాలమీద లేచి నిర్భయంగా నిలబడుతుంది. మనిషి మనిషిగా మారిపోతాడు. భూగోళానికి ఇరుసు అవుతాడు.

శేషేంద్ర కవిగా సాగుచేసిన ఫలసాయమంతా ఒకచోట చేరిస్తే అదే “నా దేశం నా ప్రజలు” అనే ఆధునిక మహాభారతం. నిరంతర శ్రమ ఫలితమే మానవ నాగరికత. నగరీకరణలో ఎక్కడ, ఎప్పుడు, ఎలా లోపం జరిగిందో తెలీదు గానీ, దాని ఫలితమే నేడు మనం చూస్తున్న అసమ సమాజం. ఎందుకిలా జరిగిందో ఊహించగలం. మనిషి స్వార్ధంవల్ల, విశాల దృష్టి లేకపోవడం వల్ల, సంకుచితత్వం వల్లనే ఇదంతా. శేషేంద్ర దీనికి విరుగుడు స్పష్టంగా చెప్తారు. వీటన్నింటి గురించి బాగా ఆలోచించిన కవి కొన్ని చోట్ల విపరీతంగా ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తారు. మళ్లీ తనను తాను సముదాయించుకుంటారు. “నీకెందుకింత అశాంతి నీకెందుకింత ఆవేశం అంటే ఏం చెప్పను? సముద్రాన్ని అడుగు నీ కెందుకింత అశాంతి అని, ఝంఝామారుతాన్ని అడుగు నీకుందుకింత ఆవేశం అని“.

కావ్యం ప్రారంభంలోనే మనకు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పేస్తారు. “పోట్లాట నేను బతకడానికి పీల్చే ఊపిరి! నా అవయువాలకు నీచంగా వంగే భంగిమలు తెలియవు. నేను సత్యాగ్రాహి! సత్యం నా గుండెల్లో బద్దలవుతున్న అగ్ని పర్వతం. నా గొంతులో గర్జిస్తున్న జలపాతం!”

పిల్లల చదువులను విసుక్కుంటారు శేషేంద్ర. ఈ చదువుల గమ్యం అంతు చిక్కదంటారు. ప్రత్యామ్నాయంగా ఏం సూచిస్తున్నారో చదవండి: “నీవు కాలేజీకి పోతుంటే బాబూ! నిన్ను పొలాలు బిక్క మొహంతో చూస్తున్నాయి. ప్రతిరోజూ ఈ పుస్తకాల ఊరేగింపు ఎందుకు ఈ దేశపు వీధుల్లో… మీరు పలకా పుస్తకాలు పట్టుకుని పోతుంటే బాబూ! మీరు శిలువలు మోసుకుపోతున్న బాల క్రైస్తవుల్లా కనిపిస్తారు నా కళ్లకు – లే బాబూ లే, నీ బాల్యంలోంచి లే! పుస్తకాలవతల పేరెయ్! నాగలి భుజాన వేసుకో! ఈ కులాలు విడిచిపెట్టు ఆ పొలాల్లో కలువ్… పొలాలు మీకు స్వేచ్ఛాదానం చేస్తాయ్. హాయిగా పేల్చే ఊపిరి కానుకగా ఇస్తాయ్, పీఠభూమిలాంటి ఛాతీనిస్తాయ్, ఇనప ఊచల్లాంటి కాళ్లిస్తాయ్…!

ఫ్యూడల్ వ్యవస్థ పతనమై ధనస్వమ్య వ్యవస్థ అవతరించడంతో యాంత్రిక నాగరికత మధ్య తరగతి జీవితాన్ని మరింత దుర్భరం చేసింది. కార్మికుడు ధనస్వామి చేతిలో పనిముట్టుగా మారిపోయాడు. కర్షకుడు పాలకుల కుతంత్రాలలో చిక్కుకుని వ్యాపార సంస్కృతిలో పోటీపడలేక సంఘర్షణలో వున్న వ్యక్తికి సరైన దిశానిర్దేశం చూపగలిగేది నిశ్చయంగా కవి మాత్రమే. అందుకు ఉదాహరణలు ఈ కావ్యంలో కోకొల్లలు. మచ్చుకు కొన్ని: “దేవుడ్ని గూర్చి దీర్ఘ చర్చలు చేసేంతటి మూర్ఖులమూ కాము, ధనికులమూ కాదు. మనవి పనిచేసి బ్రతకవలసిన చేతులు“.
సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు. తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు. పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు. నేనింతా ఒక పిడెకెడు మట్టే కావచ్చు. కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.”
రూపాయి నలిపి వాసన చూపిస్తే ఆపాతంగా అలా మూర్చపోతే ఎలా? కొత్త యుగపు తొడనుంచి చీల్చిన కండతో నిర్మించిన గరుడిడివి కావాలి. ఝంఝామారుతాలకు ఎదురొడ్డే ఇనప రెక్కలు తొడుక్కోవాలి. నలుగురి ముందు నీ మూపు వంగితే నీ కాళ్లు రెండు బందూకుళ్లా ఖచ్చితంగా నిలవలేకపోతే నీవు నా యుద్ధాల్లో పనికిరావు.”
బాబూ మనం తుపాకుల్ని ఎదుర్కోగలం గానీ నియంతలు ప్రశ్నల్ని ఎదుర్కోలేరు.”
సోదరా ఎలాంటి గుడ్డితనాన్ని కూడా కాంతి క్రౌర్యం నుంచి కాపాడబోకు
అందరమూ ఏ చెట్టుకో పుట్టిన ఆకులం, ఏ శాఖకో పూచిన పువ్వులం. అందరమూ అన్నీ విడిచిపోతాము. మరికొన్నింటికి తావిస్తాం. కానీ జీవిస్తాం. ఒరే సిద్ధాంతీ, నీ పంచాంగం కట్టిపెట్టు. ఒరే రాజకీయ ప్రభూ నీ లౌడ్ స్పీకరు పీకేసుకో – పాత చెట్టు కూడా కొత్త పూలు పూస్తుంది“.
కొందరు పుట్టకముందే వాళ్లని గొప్పతనం నిరీక్షిస్తుంది. కొదరు చచ్చినతర్వాత కూడా వాళ్లని గొప్పతనం పరీక్షిస్తుంది. ఒకడు పుష్పహారాల బరువుతో పొంగిపోతాడు. ఒకడు గాయాలు లెక్కపెట్టుకుంటూ ఉప్పొంగిపోతాడు“. ప్రతి వాక్యం ఒక డైనమైట్ లా పేలే ఈ కావ్యం ఆలోచన, ఆవేశం, భావుకతల సమ్మేళనం.

420 పేజీల ఈ ఆధునిక మహాభారతం ఎవరి ప్రచురణో తెలిపే వివరాలు లేని పుస్తకం విశాఖ పేవుమెంట్ మీద నాకు దొరకడం వల్ల ప్రచుణకర్త, ధర వివరాలు చెప్పలేకపోతున్నాను. మన్నించండి. కాని తప్పక చదవాల్సిన మంచి పుస్తకం.

ప్రకటనలు

3 responses »

  1. శేషేంద్ర గార్ని కవిత్వాన్ని ఎంతో బాగా విశ్లేషించారు. కొన్ని పుస్తకాలు, లేదా కవిత్వం లేదా మరోటి చదివాక, ఏదో చెప్పాలనిపిస్తుంది. ఇంకెవరైనా మనకంటే దీన్ని బాగా విశ్లేషిస్తే బాగుండు, అనిపిస్తుంది. శేషేంద్ర గారి పుస్తకాలు చదివినపుడు నేను కూడా ఇదే అనుకునేదాన్ని.

    నీవు కాలేజీజి వెళుతుంటే బాబూ….నాకు చాలా ఇష్టం!

    బాగుందండి!

  2. పింగుబ్యాకు: కిందటేడాది మే, జూన్ నెలల్లో పరిచయం చేసిన పుస్తకాలు « మీరు చదివారా?

  3. ” నేను చేయి ఎత్తితే …………… దించితే వేయి కిరణాలూ వేలాడే సయం సంధ్య ,,,”

    అనే లైన్ నాకు బాగా నచినది. ఆ పుస్తకం విశాలాంద్ర పబ్లికేషన్స్ వారిది. వేల ౧౫౦.00

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s