మట్టికీ మనిషికీ మధ్య…

సాధారణం

వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పినట్టుగానే రుతుపవనాలు ఈ ఏడాది వచ్చేశాయి. కాని ఎందుకో శ్రీకాకుళం జిల్లామీద కరుణ ప్రసరించడం లేదు. గత మూడు నాలుగు రోజులుగా ఈదురు గాలి, ఉరుములు, మెరుపులతోనే రుతుపవనాలు ఊరిస్తున్నాయి. బహుశా ఈ రోజో రేపో ఆ బెట్టు మానేస్తాయి. తనివితీరా వర్షాలు కురుస్తాయి. కళింగాంధ్ర నేలంతా ఆ వర్షంలో తడిసి ముద్దవుతుంది. భయంకరమైన ఎండలనుభవించిన ప్రజలంతా హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. పిల్లలు కొత్త వర్షంలో తడిసి జలుబులు జ్వరాలు తెచ్చుకుంటే తల్లులంతా తమ పిల్లల్ని కాకుండా ఈ వర్షాన్ని ముద్దుముద్దుగా విసుక్కుంటారు. ఆఫీసనో, బజారనో ఏదో ఒకటని బయటకు వెళ్లాలనుకున్నపుడే కరెక్టుగా వర్షం కురుస్తుంటే తండ్రులందరూ భలే చిరాకు పడిపోతుంటారు – వర్షం మీద. రెండు రోజులు పోయాక ఆ వర్షానికనుగుణంగా తమ దైనందిన టైంటేబుల్ సరిచేసుకుంటారు. వీళ్లందిరిదీ ఒక రకమైతే రైతన్న ఆనందం మరో రకమైనది. గుండెల్నిండా ఆనందంతో, కోటి ఆశలతో అక్షరమ్ముక్క చదువులేని రైతు గొప్ప శాస్త్రవేత్త మాదిరిగా వర్షాన్ని తదేకంగా పరిశీలిస్తుంటాడు. వర్షపు వాలు, గాలి తీవ్రత చూస్తాడు. ఊరి చివర చెరువులోకి ఎంతనీరు చేరిందో, ఊరి ముందున్న బావిలోకి నీరెంత పైకి వస్తోందో గమనిస్తాడు. దానిమీదే ఈ ఏడాది వ్యవసాయం ఆధారపడి వుంది. తన జాతకం తేలిపోతుంది. దేశ భవిష్యత్తు నిర్ణయమవుతుంది.

మట్టికీ రైతుకీ మధ్య బంధం భార్యాభర్తల బంధంతోనో, భగవంతుడికీ భక్తుడికీ మధ్యనున్న బంధంతోనో పోల్చలేం. అదొక అలౌకిక అవ్యాజానురాగ జీవన బంధం. ఇలా రుతుపవనాలను స్వాగతిస్తూ గత నాలుగు సాయంకాలాల్లో  రెండు దీర్ఘ కవితలు చదివాను. అందులో ఒకటి గంటేడ గౌరునాయుడు రాసిన “నాగలి” కాగా, రెండోది రాచపాలెం చంద్రశేఖర రెడ్డి రాసిన “పొలి”. ఈ రెండింటిలో ఒక కావ్యం పరిచయం ఈ వారం మీకోసం….

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు అధిపతిగా పనిచేస్తున్న ఆచార్య రాచపాళెం సాహితీ హాలికుడే గాని కృషీవలుడు కాదు. ఆయన తండ్రి మాత్రం నేలను నమ్ముకుని బతికిన వ్యక్తి. నేలతో బంధం లేకపోయినా తండ్రి ద్వారా మట్టికీ మనిషికీ మధ్యనున్న సంబంధాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నారాయన. వ్యవసాయం చేస్తూ తన తండ్రి అనుభవించిన సుఖదు:ఖాలను ఎప్పటికప్పుడు మనసు పొరల్లో దాచుకున్నారాయన. వృత్తివ్యావృత్తుల రీత్యా రైతులను కలిసి మాట్లాడినప్పుడల్లా వారు చెప్పిన విషయాలను విని కదిలిపోయి ఆ అపురూప కథనాలను గుండె అరల్లో భద్రపరచుకున్నారాయన. అలాంటి భావాల, ఆలోచనల, ఆగ్రహావేశాల పేర్పు ఈ “పొలి” సేద్యం-కావ్యం రైతు జీవితం.

కళింగాంధ్ర వాసులకు “పొలి” కొత్త పదం (కనీసం వ్యవసాయం ఒక పనిమాలిన వృత్తి అని అనుకునే నా తరానికి). అందుకే పొలి అంటే ఏమిటో రాచపాళెం మాటల్లోనే చూద్దాం (కొంచెం పొడుగైన ఉటంకింపే!) : “చిత్తూరు జిల్లాలో వరిపైరుకు రోగం వచ్చినపుడు ‘పొలి’ చల్లుతారు. ఇంటింటికిపోయి బియ్యం అడుక్కొని  వచ్చి, ఇగరేసి కళ్ళం గడ్డమీద దేవుడి ముందు (పసుపు, కుంకుమ పెట్టిన ఇటుకరాళ్ళు) తళిగవేసి, పూజచేసి మేకపోతునో, పొట్టేలునో నరికి ఆ రక్తంలో వేపాకులు వేసి అన్నంలో కలుపుతారు. నెత్తురు కూడు తయారవుతుంది. కర్పూరం ముట్టించి టె 0కాయ కొట్టగానే అందరూ నెత్తురు కూడును భాగాలుగా పంచుకుని ‘పొలోపొలి’ అని అరుస్తూ పోయి వరి పొలాల మీద చల్లుతారు. వరిపైరు పండిన తర్వాత కళ్ళంమీద వరిపన కొట్టితే వడ్లు రాలడాన్ని కూడా పొలి రాలడం అంటారు. వడ్లను తూర్పారబట్టేటప్పుడు కూడా గాలికోసం పొలి పొలి అంటుంటారు. రాలిన వడ్లను కుప్పబోసి చుట్టూ పొలి తిరుగుతారు. గంగజాతర జరిగినప్పుడు కూడా గ్రామాల్లో దున్నపోతును నరికి దాని రక్తంతో కలిపిన అన్నాన్ని తీసుకుని దళితులు ఊరి సరిహద్దు చుట్టూ పొలి చల్లుతారు. సంక్రాంతి పండుగపోయిన మరుసటి రోజు పశువుల పండుగ. ఆ రోజు సాయంకాలం కాటమరాజు గుడి దగ్గరికి ఊళ్ళోని పశువులన్నిటిని తోలుకుపోయి పూజచేసి పొలి చల్లుతారు. ఇది సంప్రదాయ గ్రామీణ సంస్కృతి. ‘పొలి’లో ‘బలి’ అనివార్యం.”

22 ఉపశీర్షికలతో సాగిన పొలి కావ్యంలో రైతు వర్షాలు కురియడానికి కాస్త ముందునుంచే తన యాగానికి ఒక్కొక్కటే సామగ్రి సమకూర్చుకోవడాన్ని వర్ణించడంతో కావ్యం మొదలువుతుంది. మూడో ఉపశీ ర్షిక ‘నారు’లో నారు వదులుతున్నపుడు రైతు భగవంతుడ్ని ప్రార్థించడాన్ని “మన రైతు క్షేమం / ఇంకెవడి చేతుల్లోనో ఉందా! అనిపించేది / రైతు జీవితం / పరాధీనం కావడానికి ఇదే పునాదా?” అంటారు. ఈ నాలుగు లైన్లే కవి మనసును మనకు పట్టిస్తాయి – ఆయన ఎవరి పక్షపాతమో. ఆధునిక కాలంలో అందరికీ నోటికి కూడు అందించే రైతు ఉద్యోగం ఎందుకూ పనికిరానిది అయిపోయింది. తన పంట, తన బతుకు పరాధీనమైపోయాయి.

సాగుబడిలో స్త్రీల పాత్ర అమోఘమైనది. ఇంటిదగ్గరా, పొలంలోనూ నిశ్శబ్దంగా జరిపే వారి కృషి తోడైతేనే వ్యవసాయ ఫలాలు పొందేది. కవి దానినే “ఇంటాబయటా / వాళ్లు కర్పూరంలా కరిగిపోందే / నేల పలకదు / మట్టి కరగదు / పైరు పెరగదు / పొలి రాలదు / సేద్యం సమిష్టి కార్యం” అంటారు. రెండు చేతులు కలిస్తే చప్పట్లు. అనేక చేతులు కలిస్తేనే వ్యవసాయం. “నీరు” అన్న కవితలో ఒక్కముక్కలో నీటిగురించి చెప్తారు. “మనిషికీ మట్టికీ మధ్య / సామరస్య నిర్మాత నీరే”. రకరకాల దుస్థితులవల్ల వర్షక్రమం చెదిరిపోయింది. వాటర్ మేనేజిమెంట్ గురించి ప్రజలూ, ప్రభుత్వమూ పట్టించుకోకపోవడం వల్ల ఏటికేడాది గాలన్ల కొద్దీ అమృతమంటి నదీమ జలాలు అపార సముద్ర జలరాశిలో నిర్వీర్యమైపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఊరుకుంటున్నాం. భూగర్భ జలాలు అడుగంటిపోయాయని తెలిసినా బావుల్లో బావులు, బోర్లు తవ్వుతూనే ఉన్నాం. పాతాళానికి వెళ్లినా చుక్కనీరు గుక్కెట పట్టలేక పోతున్నాం. గుండెని మెలితిప్పే ఆ బాధను కవి ఎలా చెప్తున్నారో చూడండి: “బావుల్లో బావులు బోర్లు వచ్చాయి / సేద్యం జూదమైంది / చేనంతా బోర్ల గుంతలే / రైతు వంటిమీద కురుపుల్లాగా / నీటికి రైతుకు పేగుబంధం తెగిపోయింది”. ఈ చివరి మాట చదివినప్పుడు గుండె కలుక్కుమంటుంది. ఈ దుస్థితికి కారణమెవరు? దీనిని పునరుద్ధరించడమెలా? ఇవి మనకు మనం వేసుకోవలసిన తీవ్రమైన ప్రశ్నలు.

మడుపులు తీసి, పిలవని పేరంటం కలుపును దిన్ని, అడవి ఆకుతెచ్చి పొలాల్లో వేసి నారుమడికి అంతా సిద్ధం చేస్తాడు ‘నాగలి పట్టిన వీరుడు’. వరిమొక్కల నాట్లు పొలమంతా పరుచుకున్నాక అక్కడ “అడుసునేల / అందమైన జానపద కావ్య మయ్యేది”. వరివెన్ను పెరుగుతున్న కొద్దీ దాని రక్షణ భారం రైతే తీసుకోవాలి. కొంగలు, కాకులు, పీతలు, కీటకాలు మొదలైన అన్నింటినించీ తన బిడ్డను తానే రక్షించుకోవాలి. నెలరోజులయ్యాక జానపద రాణిగా మారిన వరిపైరులో పెరిగిన కలుపుమొక్కల్ని పెరకడం మరో బాధ్యత. ఇక పంట ఏపుగా పెరగడం కోసం ఎరువులు వాడాలి. “పైరు గంట కట్టాలంటే / రైతు తిండిమానైనా / ఎరువులు వెయ్యాల్సిందే / అదెంత బరువైనా / రైతు మోయాల్సిందే” ఈ బరువు మోయలేకే రైతుల వెన్నుపూసలు విరిగిపోతున్నాయి. అశక్తుడైన రైతు అతీంద్రీయ శక్తులపై ఆధారపడాతాడు. కోడినో, మేకనో, గొర్రెనో ఆ ఊరి గ్రామదేవతకు  బలిచ్చి ఆ రక్తాన్ని అన్నంలోనో మరెందులోనో కలిపి పొలాల్లో చల్లడం గ్రామదేవత పైరును రక్షిస్తుం దన్న నమ్మకమే. కాని ఆవిడ రక్షించేది కేవలం ప్రకృతి నుంచి మాత్రమేననీ, తోటి మనుషులనుంచి రైతును ఆమె రక్షి0చలేదని రైతుకు తెలిసేదెలా?

ఆ తరువాత పొట్టను చీల్చుకుంటూ వరికంకు విలాసంగా బయటికి వస్తుంది. రైతు కుటుంబం గుండెల్లో పూలే పూస్తాయి. గువ్వలు తినగా మిగిలిందే రైతు పంట. పంటకోతకు సిద్ధమవుతూనే రైతులో ఆశలు రేపుతుంది. “పొలం మీదనే అంచనాలు / రాబడి ఖర్చు / లాభాల బేరీజులు / ఇరుగు పొరుగు వాళ్ల / పలకరింపులు / నాయన అంతరంగంలో / ఉద్రేక భావతరంగాలు”. నాలుగు నెలల శ్రమ ఫలితాన్ని కల్లానికి చేర్చిన రైతుచుట్టూ అవసరాల అర్జీలతో కుటుంబం, బంధువులు చేరుతారు. వడ్లరాశిని చూస్తూ అందరికీ అభయహస్తం అందించిన రైతుకు మరునాడు వ్యాపారి చెప్పిన రేటు శరాఘాతం అవుతుంది. ఈ సందర్భంగా కవి చెప్పిన నాలుగు మాటలూ అక్షరలక్షలు చేసేవి. తీవ్రమైన ఆలోచనలో పడేసేవి. “వ్యవసాయం తెలివి తక్కువ వాళ్ల చేతి రాట్నమై / వ్యాపారం తెలివిగల వాళ్ల చేతివాటమైతే / మా నాయన నవ్వులు మాసిపోక చేసేదేముంది? / ఉత్పత్తి మా నాయనది / ధర నిర్ణయం ఇంకొకడిది / ఎంత దుర్మార్గం? / సొమ్మొకడిది సోకొకడిది / సొమ్ము షోకు / రైతులదే అయితేనే అందం”.

మన వ్యాపారులు, మన రాజకీయ నాయకులు, మన ప్రభుత్వం, మన దేశం రైతును ఎలా దగా చేస్తున్నాయో ఆఖరి కవిత ‘చివరకు’లో రాచపాళెం చెప్తారు. కావ్యమంతా  పూర్తిచేశాక ఒక్కసారి మన గుండె బరువెక్కుతుంది. కళ్లు ఎరుపెక్కుతాయి. నోటికి ముద్దనందిస్తున్న రైతు నోట మట్టికొడుతున్న మన పాలన వైఫల్యాన్ని నిందించుకుంటాం. ఇంకాస్త ముందుకు వెళ్లి ఈ పెనుసమస్యకు పరిష్కారాలు కూడా మనమే ఆలోచించాలి.

వచ్చేవారం గంటేడ గౌరునాయుడిగారి “నాగలి” కావ్యాన్ని పరిచయం చేసుకున్నాక, ఈ రెండు వ్యవసాయ కావ్యాల్ని పోల్చి చూసుకుందాం. అందాకా కురవబోతున్న తొలకరి జల్లులో తడిసి ముద్దయి ఆనందించండి.

పొలి సేద్యం – కావ్యం (రాచపాళెం)
వెల 50 రూ.లు ప్రతులు కావలసినవారు కవి సెల్ ఫోన్ (94402 22117)కు సంప్రదించగలరు.

ప్రకటనలు

4 responses »

  1. ఈ వ్యాసం బాగుంది కాని, మునుపటిలాగా అంత లోతుగా ఉన్నట్టు లేదు. పొలి కావ్యాన్ని పైపైన చూపించినట్టుగా ఉంది కదా!

  2. పింగుబ్యాకు: పొద్దు » Blog Archive » ‘మే’లిమి బ్లాగులు జాబులూ

  3. పింగుబ్యాకు: మట్టికీ మనిషికీ మధ్య… (రెండవ భాగం) « మీరు చదివారా?

  4. పింగుబ్యాకు: కిందటేడాది మే, జూన్ నెలల్లో పరిచయం చేసిన పుస్తకాలు « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s