రాయలసీమలో ఆధునిక సాహిత్యం

సాధారణం

ఇరవయ్యో శతాబ్దపు మొదటి దశకంలో ఫ్రెంచ్ దేశపు భాషా శాస్త్రవేత్త ఫెర్దినా ద ససూరె తన ఉపన్యాసాల్లో మాండలికాల గురించి విపులంగా చర్చించారు. ససూరే రచన “సామాన్య భాషా శాస్త్రం పాఠ్య క్రమం“ను అనువదించి 1978లో తెలుగు అకాడెమీ ప్రచురించింది. తెలుగు కంటే ఇంగ్లిషు మూలం చదువుకోవడమే హాయి అనిపించేటట్లు ఎంతో ‘సౌకర్యంగా’ చేసిన అనువాదం సాగిన ఆ పుస్తకం పేజీ 212లో ఇలా ఉంటుంది: “పూర్తి స్వేచ్ఛనిస్తే భాషకు, ఒకదానికంటే ఇంకొకటి ఉపయుక్తం కాని మాండలికాలు మాత్రమే ఉంటాయి; ఈ కారణంచేత అది మామూలుగా విభజన అవటం జరుగుతుంది. కాని అభివృద్ధి పొందుతున్న నాగరికతో సందేష ప్రేషణాలు (కమ్యూనికేషన్స్) కూడా అభివృద్ధిలో ఉన్నవి కనుక ఏదో విధమైన నిర్వివాద ఆచారం వాడుకలో ఉన్న మాండలికాల్లో ఒక దానిని, దేశం యావత్తుని ప్రభావితంచేసే ప్రతి విషయం యొక్క సాధనంగా ఎన్నుకుంటుంది. ఈ ఎన్నికకు కారణాలు చాలావరకు భేదిస్తాయి. ఒక్కొక్కప్పుడు నాగరికత ప్రబలిన ప్రాంతం మాండలికాన్నిగాని లేదా రాజకీయంగా ఆధిక్యతను పొంది కేంద్రంలో శక్తిమంతమైన రాష్ట్రం యొక్క మాండలికాన్ని గాని ఎన్నుకోవడం జరుగుతుంది“. గాబరా పడ్డారు కదూ, ససూరే కొచ్చిన తిప్పలు చూసి.

ఒక ప్రాంతంలో చలామణిలో ఉన్న భాష అంతటా ఒకేలా ఉండదు. దాదాపు ప్రతి ఇరవై కిలోమీటర్లకు స్వల్పంగా విభేదిస్తుంటుంది. వాటినే మాండలికాలని పిలుస్తామని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒక్కో భాషలో ఒక ప్రత్యేక ప్రాంత మాండలికం ఆధిక్య స్థానాన్ని పొంది ఆ భాషా ప్రాంతమంతటా ప్రమాణ భాషగా చెలామణికావడం పట్ల ససూరేకు “ఏదో విధమైన” కారణాలు కనిపించినప్పటికీ ‘నాగరికత’, ‘రాజకీయ ఆధిక్యత’లను చూచాయగా సూచించారు. ఆ తరువాత అదే శతాబ్దపు నడివయసులో భాషా శాస్త్రవేత్తలు మాత్రం సామ్రాజ్యవాద పోకడలతో సహా అనేకానేక కారణాలను స్పష్టంగా గుర్తించి, వాటిని కుండబద్దలు కొట్టినట్టు తేల్చేశారు.

vallampati

null

కానీ మన తెలుగు భాషది ప్రత్యేక పరిస్థితి. మధ్య కోస్తా జిల్లాల ఉన్నత కులాల మాండలికం మొత్తంగా ప్రామాణిక భాషగా మారడం అంతుపట్టని సంగతేమీ కాకపోయినప్పటికీ, అక్కడి భాషతోపాటు మిగిలిన చాలా విషయాలు కూడా అందలమెక్కడం అద్భుతమైన సంగతి. ఆహారం విషయంలో, ఆహార్యం విషయంలో అందరికీ వారే ఆదర్శం కావడం విడ్డూరం వరకే అయితే విచారించక్కర్లేక పోయేది. కానీ తెలంగాణ, రాయలసీమ, కళింగాంధ్ర ప్రాంతాల వాడుకలు తక్కువ రకమైనవనే న్యూనత కోస్తా ప్రాంతవాసుల్లోనే కాక రాష్ట్రమంతటా రాజ్యమేలడానికి కారణాలు తేల్చడం కొంచెం కష్టమైన పనే. ఇందుకు కారణాలను సామాజిక శాస్త్రవేత్తలే అన్వేషించాలి. ఉదాహరణకు తెలంగాణ మేధావి కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ఆత్మగౌరవ ప్రకటనగా రాసిన ‘తెలంగాణ రాష్ట్రం – ఒక డిమాండ్’ పుస్తకాన్ని ఆయన శుద్ధమైన ప్రమాణ భాషలో అంటే కోస్తా మాండలికంలోనే రాశారు. రాయలసీమ ఆధునిక సాహిత్య విహంగవీక్షణం చేసిన వల్లంపాటి వెంకటసుబ్బయ్యకూడా తన పుస్తకాన్ని అదే భాషలో రచించారు. ప్రాంతీయ ఆకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న తరుణంలో మాండలికాల గురించి అందరం పునరాలోచించుకోవలసిన సందర్భమిది. “రాయలసీమలో ఆధునిక సాహిత్యం – సామాజిక సాంస్కృతిక విశ్లేషణ” అన్న చివరి గ్రంథం మొదటి రెండు అధ్యాయాల్లో వల్లంపాటి వెంకటసుబ్బయ్య వీటిగురించి చాలాలోతుగా చర్చించారు. ఈ చర్చ ఇంకా కొనసాగాలి.

చరిత్ర, సంస్కృతి, సాహిత్యల పట్ల అభినివేశం ఉండి ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసే పాఠకులు రెండు తలాల్లో ఇందులోని విషయాలను గ్రహించాల్సివుంది. ఉపరితలంలో రాయలసీమ సాహిత్య పరిణామ క్రమమూ, సమాజాన్ని ఎంతో యదార్థంగా సాహిత్యీకరణ చేస్తున్న సృజనశీలురు అపుడపుడూ విఫలమవుతున్న తీరు, అపుడపుడు విజయవంతమవుతున్న వైనమూ, బాధ్యతగల రచయితలకు, విమర్శకులకు వుండవలసిన నిబద్దత, అధ్యయన అవసరమూ అగుపిస్తాయి. ఇక అంతరతలంలో కొన్ని దృశ్యాలను మనం పరికించాలి. కవాతుచేస్తున్న సైనికుల మాదిరిగా బారులు తీరిన అక్షరాల నడుమ కనిపించే శ్వేతయవనికలో అసమ అభివృద్ధి క్రమంలో సమాజం ఎలా వెనుకబడేదీ, దేశభక్తిలేని నేతల చేతిలో కొన్ని ప్రాంతాల ప్రజల తలరాతలు ఎలా మారేదీ, దీనివల్ల మనుషుల జీవితాలే కాక అక్కడి నేలంతా ఎలా సైకతసీమ (వేస్ట్ లాండ్)గా మారేదీ గుండెలు ద్రవించే దృశ్యాల్లో అగుపిస్తుంది.

ఉపరితలంలో స్పష్టంగా అగుపించేదంతా మనకు ఇంతకుముందు వల్లంపాటి చెప్తూ వస్తున్నదే. తన ‘కథాశిల్పం’లోనూ, ‘నవలాశిల్పం’లోనూ, ‘విమర్శశిల్పం’లోనూ ఎన్నో ఉదాహరణలతో తెలుగు రచయితల శైలీశిల్ప విన్యాసాలను, కథాకథన పద్ధతులను, సామాజిక చిత్రణను విపులంగా వివరించేరు. అన్వయ విమర్శను తెలుగులో కొత్త పుంతలు తొక్కించిన వల్లంపాటి గత కొన్ని దశాబ్దాలుగా రచయితలపట్ల, రచనలపట్ల తన అభిప్రాయాలను మార్చుకున్న సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చేమో. అంత స్పష్టమైన, లోతైన, గాఢమైన, నిశితమైన చూపున్న విమర్శకుడు వల్లంపాటి. పైగా విశాలాంధ్ర ప్రచురించిన ‘వల్లంపాటి సాహిత్య వ్యాసాలు’లో “రాయలసీమ సాహిత్యం : సామాజిక, ఆర్థిక విశ్లేషణ” శీర్షికతో 1998లో రాసిన వ్యాసంలో చాలా విషయాలను ఒకేచోట ఈ కొత్త పుస్తకంలో గుది గుచ్చినట్లయింది. బహుశా ఇందువల్లనే పుస్తకానికి నిర్దిష్టమైన మార్గదర్శనం లేనట్టు అనిపించినా ఉపరితల నిర్మాణంతోపాటు అంతరతలాన్ని కూడా పరిశీలిస్తే ఈ పుస్తకం ప్రత్యేకత విశదమవుతుంది. కట్టమంచి, రారాల వారసత్వంగా విమర్శకుడు సృజనశిలురకు ఎప్పుడూ దీపధారే అని వల్లంపాటి మరోమారు నిరూపించి ప్రాంతీయతకు సంబంధించిన అనేక అంశాలపట్ల మరిన్ని వినూత్న ఆలోచనలను మనతో పంచుకున్నారు. 

అసమ అభివృద్ధి క్రమంలో పాలకుల నిర్లక్ష్యానికి, ప్రకృతి కన్నెర్ర కూడా తోడై వరస కరువులు దాడిచేసినపుడు రాయలసీమ ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతున్న దశలో, హింసాత్మక వాతావరణానికి సన్నద్ధం చేసిన ఫ్యాక్షనిజం పడగనీడలో బతుకులు గడపవలసిన దుస్థితి రావడం వారిపై ముప్పేటదాడి అనడం సబబేమో. మరి ఆ జీవిత చలనసూత్రాలను అవగతం చేసుకున్న సృజనశీలురైన రచయితలు వాటిని తమ రచనల్లో జాగ్రత్తగా పట్టి చూపించి ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యతను అంత ఆలస్యంగా, అదీ అరకొరగా ఎందుకు రాయలసీమ రచయితలు స్వీకరించినట్టో పరిశీలించాలి. ఇలా బాధ్యతలను నెత్తికెత్తుకున్న కళాకారులు తమ ప్రస్థానాన్ని ఎలా కొనసాగిస్తున్నారో గమనించాలి. ఈ క్రమంలోనే ఆర్థిక వనరుల అలక్ష్యానికీ, భౌగోళిక వంచనకుతోడు, సాంస్కృతిక నిరాదరణకు కారణాలను అన్వేషించడంతో సరిపెట్టుకోకూడదు. ఆ ప్రయత్నాన్ని సమర్ధంగా తిప్పికొట్టగలగాలి. మాండలికాలను అవహేళన చేస్తూ వచ్చిన సినిమాలను, సాహిత్యాన్ని, సాంస్కృతిక కళారూపాలను అన్ని మాండలికాల ప్రజలు నిరాదరించాలి. మన భాషనే కాదు, మన తిండిని, మన దుస్తులను, ఆఖరుకు మన జీవన విధానాన్ని సైతం అపహాస్యం చేయడం ఘోరం. కరువు ఒక్కటే కాదు అభివృద్ధి కూడా బ్రహ్మపదార్థమే. దానిని ఆర్థిక, సామాజిక, చరిత్ర శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా వివరించినప్పటికీ రచయితలు జీవితం కళ్లద్దాలలోంచి చూసి కొత్త భాష్యాలు చెప్పడం తక్షణావసరం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆలోచనలను ఈ గ్రంథం లోపలితలంలో వల్లంపాటి మనతో పంచుకుంటారు.

ఇక పుస్తకంలో లోపాలు లేవా అని రంధ్రాన్వేషణకు దిగితే రెండు మూడు విషయాలు తట్టకపోవు. పేజీ 153లో ‘గందరగోళం’ నవలను కొ.కు. ‘ముక్తకంఠంతో’ పొగిడినట్టు చెబుతారు. ఒక్కరే ముక్తకంఠంతోనా? ప్రసిద్ధులైన చాలామంది రాయలసీమ రచయితలను బి.నాదమునిరాజు ప్రభావితం చేశారంటారు. కాని నాదమునిరాజు రచనల ప్రస్తావన ఇందులో లేదు. కొన్నిచోట్ల కథ లేదా నవలల కథాంశాన్ని మరీ విపులంగా చెప్పారనిపించింది. కథ, నవలలతో పోలిస్తే కవిత్వానికి, కవిత్వం కంటే తక్కువగా విమర్శకు (తెలుగు విమర్శంతా రాయలసీమదే కదా!) స్థలం కేటాయించారనిపించింది. సరే, ఈ స్వల్ప లోపాల సంగతి పక్కన పెడితే, కొమ్మిరెడ్డి విశ్వమోహనరెడ్డి నవల ‘మానవ హోమం’ గురించి మాట్లాడుతూ చలసాని ప్రసాదరావువంటి మేధావి కూడా ‘కోస్తా సెంట్రిజం’ వల్ల రాయలసీమ సామాజిక జీవితం పట్ల అవగాహన ఏర్పరుచుకోలేదంటారు. కొందరు మేధావుల్లో ప్రాంతీయతా చైతన్యం లేదనడానికి కూడా దీనిని ఉదాహరణ గా  చూపించడానికే వల్లంపాటి ఈ ఉదాహరణ ప్రస్తావించారేమో. సరిగా ఆ అవసరం తీర్చడానికే ఇలాంటి పుస్తకాలు, ప్రాంతీయతా ఉద్యమాలు సహకరిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని స్పష్టంగా నినదించే ఈ ధిక్కార స్వరాల పల్లవిని అందరూ అందుకోవల్సిందే. వల్లంపాటి ఈ గ్రంథంలోనే ఆయన సాహితీవారసులకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. ‘సాహిత్యంలో సాహిత్యకీయత’ను గురించి చర్చ కొనసాగించడం ద్వారా నన్నెచోడుడు, నాచన సోముడు, పాలవేకరి కదరీపతి వంటి అసలు సిసలు తెలుగు ప్రయోక్తలను పునరావిష్కరింప జేసుకోవడం వరకు; వంగపండు, గద్దర్, గోరటి వెంకన్నల్లా ఘనులైన గాయక ప్రదర్శకులను రాయలసీమ ఏర్పాటుచేసుకోవడం దగ్గరనుంచి కథ, కథనాన్ని గురించి రచయితలు మనసుకు పట్టించుకోవలసిన ఎన్నో హితోక్తుల వరకూ ఆచరించవలసి వుంది. అప్పుడే మార్క్సిష్టు విమర్శను నిలబెట్టుకుని సమాజ సాహిత్యాలను ముందుకు తీసుకుపోగలుగుతాం.

ఒక స్పందన »

  1. ఈ వ్యాసాన్ని డెట్రాయిట్ లిటరరీ క్లబ్ వాళ్ళు ఈ వారంతం అనగా ఆదివారం మిచిగాన్ రాస్ట్రానికి చెందిన ఫార్మింగ్టన్ గ్రంధాలయం లో చర్చించనున్నారు. నేను వ్యాసం పూర్తిగా చదివాను, నా అభిప్రాయాలని కాగితం మీద రాస్తూ ఉన్నాను. మా సమీక్ష అయ్యాక నా అభిప్రాయాలను మీ బ్లాగులో రాస్తాను.

  2. ఇప్పుడే పూర్తిగా చదివాను.
    ముక్త కంఠం = liberated or unrestrained voice.
    This has nothing to do with the number of voices.
    అంచేత ఒకరైనా ముక్త కంఠంతో చెప్పొచ్చు. 🙂
    “మధ్య కోస్తా జిల్లాల ఉన్నత కులాల మాండలికం మొత్తంగా ప్రామాణిక భాషగా మారడం” ..
    ఇదొక బహుళ ప్రాచుర్యం పొందిన ఊహ (myth), నిజంగా నిజం కాదు. ఆధునిక రాత భాషగా చెలామణి అయినధి అదొక కృత్రిమ భాష. అది మధ్య కోస్తా జిల్లాల ఉత్తమ కులాల మాండలికం కాదు. నాకు తెలిసిన ఎవరూ అలా మాట్లాడరు. మాట్లాడే భాష వేరు, రాసే భాష వేరు. కాకపోతే ఆధునిక రాత భాష మరి ఆ రూపం ఎలా తీసుకుందో మనం వేరే పరిశోధించాలి, కానీ ఇదేమి మధ్య కోస్తా జనుల ఆధిపత్య కుట్ర కాదు.
    ఇక కొమ్మిరెడ్డి – చలసాని సంఘటన. కొమ్మిరెడ్డి రచనల్ని చదివి విభ్రాంతి పడిన సంగతి చలసాని గారే తన వ్యాసాల్లో ఒకదానిలో రాశారు. ఆయన అందులో దాపరికమేమీ లేకుండా నిజాయితీగానే రాశారని నాకనిపించింది. ఇందులో కొత్తగా చెప్పేందుకేం లేదు.

    ఇదంతా రాయడం, ఏదో ణాకు తెలిసిన, నా దృష్టికి వచ్చిన నాలుగు విషయాలు పంచుకోవడానికే. ంఈ సమీక్ష మీద విమర్శ కాదు. సమీక్ష చాలా బాగా రాశారు.
    “కవాతుచేస్తున్న సైనికుల మాదిరిగా బారులు తీరిన అక్షరాల నడుమ కనిపించే శ్వేతయవనికలో ..”
    అద్భుతం.

  3. పింగుబ్యాకు: కిందటేడాది మే, జూన్ నెలల్లో పరిచయం చేసిన పుస్తకాలు « మీరు చదివారా?

Leave a reply to శ్రీ స్పందనను రద్దుచేయి