మందస రైతుల తిరుగుబాటు – నివురు గప్పిన నిప్పు

సాధారణం

భారతీయులు చరిత్ర రచనలో నిర్లక్ష్యం చూపించారని పాశ్చాత్యులే కాదు, మన చరిత్ర పరిశోధకులు కూడా అంటుంటారు. మన చరిత్రను మనం నమోదు చేసుకోకపోవడానికి ప్రధాన కారణం భారతీయ తాత్విక దృక్పథమే. మనం సాధించిన అభివృద్ధి లేదా మనమనుభవిస్తున్న క్లేశాలు అశాశ్వతమనే విశ్వాసమే చరిత్ర రచనకు ప్రేరణ కలిగించకపోవడానికి ప్రధాన కారణం. భారతీయుల్లో సామ్రాజ్యవాద కాంక్ష లేకపోవడం కూడా మరో కారణం. మన మీదకి దండెత్తి వచ్చిన వారిని నిలవరించే ప్రయత్నాలు చేశామే కాని పొరుగు దేశాన్ని దురాక్రమించి వాటిని దోచుకుందామనే దురాశ మనకేనాడు లేకపోవడం వల్ల కూడా చరిత్ర రచన జరగలేదు. వాణిజ్యం నిమిత్తం ప్రపంచమంతా చుట్టివచ్చిన మన పూర్వీకులకు ఆ వివరాలను రికార్డు చెయ్యాలనిపించక పోవడం విడ్డూరమే. స్వదేశీ వ్యాపారులు విదేశాల్లోను, విదేశీ వ్యాపారులు స్వదేశంలోను వదిలిపెట్టిన నాణేలు, పాత్రలు, ఇతర గుర్తుల ఆధారంగా ఆ గతాన్నంతటినీ నెమ్మదిగా మననం చేసుకుంటున్నాం. ఇంతగా ఆదానప్రదానాలు జరిగినప్పటికీ పాశ్చాత్య భావజాల ప్రభావానికి లోనుకాకపోవడం కూడా మన చరిత్ర నమోదు కాకపోవడానికి మరొక కారణమని చరిత్రకారుల భావన.

దీనివల్ల మనకు చరిత్ర రచన అంటే తెలియకుండా పోయింది. చరిత్ర రచన పట్ల ఆధునిక అవగాహనలు ఏర్పడడానికి ఇరవై శతాబ్దాలు పట్టింది. ముఖ్యంగా దామోదర ధర్మానంద కోశాంబి చరిత్ర రచనలో విస్పష్టమైన మార్క్సిస్టు దృక్పథాన్ని, దృక్కోణాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాలను అవగతం చేసుకున్న తెలుగు చరిత్రకారులు కూడా ఆ ప్రమాణాలు అందుకోవడానికి ప్రయత్నించినవారే. చరిత్ర రచన అంటే ప్రగతిపథంలో పయనించే ప్రపంచాన్ని భావి లక్ష్యాల దృష్ట్యా గతం వెలుగులో చూడడం తప్పనిసరనే అవగాహన కొచ్చారు. చరిత్రను రచించడమంటే మరిత్రను పునర్నిర్మించడమనే ఆలోచనలో రెండొ అభిప్రాయం లేకపోయింది.

ఈ నేపథ్యంలో వృక్షశాస్త్ర పరిశోధకుడు డాక్టర్ బి.వి.ఏ. రామారావునాయుడు తనదైన దృక్పథంతో ఒక చరిత్ర వ్యాసాన్ని వెలువరించారు. “మందసా జమీందారీ రైతుల తిరుగుబాటు – గున్నమ్మ” పేరుతో. ఈ పుస్తకాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నా.

ఒక విధంగా ఈ రచన రచయిత తనకు తానే వేసుకున్న బాటలో నడవడం కాదు, నలుగురు నడిచిన బాటలో నడవడమే. చరిత్రను వ్యాఖ్యానించడం, రచించడం, వివరించడం ఎలానో తెలుపుతూ ఇప్పటికే వందలాది వ్యాసాలు, పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ బ్రహ్మాండమైన వెలుగులో కళింగాంధ్ర మందసా జమీందారులపై నిరక్షరాస్యులైన బీద రైతులు తిరగబడ్డ వైనాన్ని ప్రదర్శించడమే రచయిత చెయ్యదలచుకున్న పని. ఈ కృషిలో రచయిత అర్థ సఫలీకృతులయ్యారు.

మట్టితో పెనవేసుకుపోయిన మమతానుబంధం రైతుది. రైతు జీవిత తాత్వికతను పునశ్చరణ చేసుకుంటూ రచయిత ఈ వ్యాసం ఆరంభిస్తారు. శ్రమ విభజన మనిషితోనే మొదలైన సంగతేమీ కాదు. ఫ్యూడల్ వాసనలు, రాజరికపు ఆనవాళ్లు లేకుండానే తేనెటీగలు, చీమలు లక్షలాదిగా సమష్టిగా శ్రమిస్తాయి- శ్రమ విభజనతోనే. కానీ కథ మనిషి దగ్గరకొచ్చేసరికి అడ్డం తిరిగింది. శ్రమ విభజన క్రమంలోనే నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థ ఏర్పడింది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ వేదనామయమైన సంక్లిష్టభరిత క్రమంలో పై మెట్ల మీది వర్గం కింది వర్గాలను అణగదొక్కడాన్ని సహించలేకనే సామాజిక విప్లవాలు రూపుదిద్దుకున్నాయి. ఈ క్రమమంతా కళింగాంధ్ర ప్రాంతంలో ఎలా జరిగిందో రచయిత సరళంగా, అరటి పండు వొలిచిపెట్టినట్టు వర్ణించారు.

ఈ వర్ణన కూడా కింది వర్గం తరపున నిలబడి భావోద్వేగ పూరితంగా, అలంకారయుత ధోరణిలో గొంతెత్తి గానం చేయడంవల్ల పాఠకులు వాటినీ శ్రద్ధగా ఆలకించేటట్టు రచయిత చేసుకున్నారు. కథనంలో బి.వి.ఏ. రామారావునేయుడు మూడు పాత్రలను పోషించారు. కథనాన్నంతటినీ ఒకటికి రెండుసార్లు శ్రద్ధగా చదివినప్పుడు కవిగా, కథకుడిగా, చరిత్రకారుడిగా రచయిత అవతారమెత్తడం కనిపిస్తుంది. అయితే ఏ పాత్రలోనూ అతి చేయకపోవడంతో ఎక్కడికక్కడ తగు పాళ్లతో రూపొందించిన సమగ్ర దృశ్య చిత్రంగా మందసా రైతాంగ తిరుగుబాటును ఆవిష్కరించారు. నిజానికి ఈ విషయంపై ఎవరైనా డాక్యుమెంటరీ తీయదలచుకుంటే దానికీ పుస్తకమొక స్క్రీన్ ప్లేగా ఉపకరిస్తుంది.

శ్రీకాకుళమ్ జిల్లాలో మందస ఇప్పుడు ఉద్దాన ప్రాంతంలో ఉంది. మందసా జమీందారీపై రైతులు తిరుగుబాటు చేసిన (ఏప్రిల్ 1, 1940) నాటికి ఆంధ్ర రాష్ట్రపు విశాఖ జిల్లాలో భాగంగా ఉండేది. 1936కు ముందు అంటే ఒరిస్సా రాష్ట్రం ఏర్పడక పూర్వం, మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాలో భాగంగా ఉండేది. మందసాకు తూర్పునగల సముద్ర తీర ప్రాంతాన్ని ఉద్దానం అని, పస్చిమాన గల అటవీ ప్రాంతాన్ని ఏజెన్సీ అని, రెంటికీ మధ్యగల సారవంతమైన ప్రదేశాన్ని పల్లపు ప్రాంతమనీ పిలుస్తారు. ఈ పల్లపు మైదాన ప్రాంత రైతులు వంట చెరుకు కోసం ఏజెన్సీ ప్రాంతపు అడవిపై ఆధారపడాలి. కాని ఈ అడవి రిజర్వు ఫారెస్ట్ (అదుపులో వున్న అడవి). బ్రిటిషు ప్రభుత్వం ఏర్పాటుచేసిన 1874 ఏజెన్సీ సనదు ప్రకారం అడవిపై అన్ని హక్కులు ఆ జమీందారువే.

1128లో మందసా రాజ్యం ఏర్పాటైంది. (పంజాబ్ నుంచి వచ్చిన వామనసింహుడు స్థాపించాడు.) అప్పటి నుంచి మనకు తెలిసిన మందసా చరిత్ర ప్రజల చరిత్ర కాదు. జమీందారుల వంశక్రమపు చరిత్ర మాత్రమే. బ్రిటిషు రాణి, ప్రభువులే స్వయంగా ఎన్నో అవార్డులు మందసా జమీందారులకు ఇచ్చారంటేనే వారిదెంత దుర్మార్గమైన పాలనయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రైతులను చిత్రహింసలు పెట్టి దోపిడీ చేసిన ఘనత ఆ జమీందారులది. అన్నింటినీ భరించిన రైతులు ఎండుపుల్లలు, కలప అడవినుంచి ఏరుకుంటున్నపుడు జమీందారు డబ్బు కట్టమనడాన్ని సహించలేకపోయారు. ప్రకృతి సంపద అడవిని జమీందారులు పెంచలేదు కదా, దానికి డబ్బులు కట్టడమెందుకని ప్రతిఘటించారు. ఆ ప్రతిఘటన ఒక్కసారిగా వచ్చింది కాదు. దానికో క్రమముంది. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా రగులుకుంటున్న సామాజిక విప్లవోద్యమాల సెగ కళింగాంధ్ర తీరాన్ని కూడా చేరింది. 1929నాటి మొదటి జమీన్ రైతు సభ (విశాఖపట్నం), 1930నాటి ఉప్పు సత్యాగ్రహం (నౌపడ), 1933లో జరిపిన రైతు రక్షణ యాత్రల్లో పాల్గొన్నది మార్పు పద్మనాభం, గౌతు లచ్చన్న, బెందాళం గురవయ్యలాంటి కొద్దిమంది నాయకులే కాక వందలాదిగా రైతులుకూడా. పొలాల్లో, కల్లాల్లో, తోటల్లో, మడుల్లో ఒకరైతు నుంచి మరో రైతుకు ఉద్యమాల సారం చేరి తీరుతుంది.

దీనికి పరాకాష్టగా 1940 మార్చి చివరి వారంలో ఘటనలన్నీ జరిగాయి. ఏప్రిల్ ఒకటోతేదీ మాత్రం కళింగాంధ్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేది. ఎందుకంటే అక్కడ నాయకులు లేరు. కేవలం రైతులే ఉన్నారు. అదికూడా ఆయుధాలు లేని రైతులు. చదువు సంధ్యల్లేని కర్షకులు. గొప్పగా ముందస్తు వ్యూహాలు వేయడం తెలియని అమాయక జనం. తమకు అన్యాయం జరుగుతోందన్న ఆగ్రహావేశాలే తప్ప చరిత్రలో నిలబడిపోదామన్న తాపత్రయం లేనివాళ్లు. జమీందారు ప్రతినిధులైన పోలీసుల మీద తిరగబడ్డారు. అరెస్టుచేసి పట్టుకెళ్లబోతున్న తమవారిని విడిపించుకున్నారు. పోలీసులు జరిపిన కాల్పులలో ఐదుగురు రైతులు అమరులయ్యారు.

ఈ కథనాన్ని వివరించడంలో బి.వి.ఏ. రామారావునాయుడు దాదాపుగా దేశవ్యాప్తంగా జరిగిన రైతాంగ ఉద్యమాలను స్పృశించారు. జాతీయోద్యమంలో భాగంగా రైతులు పొందుతున్న రాజకీయ చైతన్యాన్ని తెలియజెప్పారు. మందస జమీందారుల అకృత్యాలకు పోయే ముందర రాష్ట్రంలో రాజుకుంటున్న రైతాంగ ఉద్యమపు పోరాటాగ్నిని చూపించారు. మందసాలో జరిగిన తిరుగుబాటును వర్ణించారు.

మొత్తం వ్యాసంలో ఎక్కడా స్థానికేతరులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా ప్రజల్ని పిలిచే “ఉత్తరాంధ్ర” పేరును వాడకుండా “కళింగాంధ్ర” అనే సొగసైన సొంతమాటనే వాడుతూ వచ్చిన ఈ వ్యాసం వాస్తవానికి చిన్నదైనా తాను పోషించబోతున్న పాత్ర అద్వితీయమైనది. ప్రాంతీయ స్పృహ పాపమేమీ కాదని అందరూ గుర్తిస్తున్న వేళ, ప్రాంతీయతా వాదాలపట్ల వివిధ ప్రాంతాల వారమంతా మన మన ఎరుకలను పంచుకుంటున్న వేళ కళింగాంధ్ర చరిత్రలో ఒక మేలితునకను బి.వి.ఏ. రామారావునాయుడు రికార్డ్ చేయడం అభినందించదగ్గ విషయం.

కేవలం ఇందుకే ఎన్ని లోపాలున్నా ఈ తరహా పుస్తకాలను మనం స్వాగతించాలి. మరీ ఎంచదగ్గ లోపాలని కాదుగానీ, భావి ప్రయత్నకారులు పరిహరించుకుంటారన్న ఉద్దేశంతో ఈ అంశాలు పరిగణించాలి. చరిత్ర, శాస్త్ర గ్రంథాలలో ప్రూఫులను ఒకటికి పదిసార్లు సరిచూసుకోవాలి. లేదంటే అచ్చుతప్పుల్ని కొట్టడమే ‘అందమైన’ పనిగా పెట్టుకున్న ప్రింటర్లను మార్చుకోవాలి. ‘సంప్రదాయం’ లేదా ‘సాంప్రదాయిక’ అనడం సబబు. కాని ‘సాంప్రదాయ’ పదం అరడజనుసార్లకు పైగా రావడాన్ని బట్టి అది అచ్చుతప్పనుకోలేం.

సహజంగా గొప్ప పాఠకుడైన రచయిత స్వయంగా కవి, కథకుడు, పైగా (వృక్షశాస్త్ర) పరిశోధకుడు. అయినప్పటికీ చరిత్రకారుడు కాకపోవడంతో చరిత్ర రచనా తత్వం తెలియక కొంత అయోమయపడ్డట్టు కనిపించింది. ఈ వ్యాసంలో రచయిత ఎత్తి చూపదలచుకున్నది చోదకశక్తుల చలనశీలతే చరిత్ర నిర్మిస్తుందన్న సత్యాన్నా? లేదా ప్రతిఘటనలో అమరులైన ఐదుగురిలో ఒకరైన గున్నమ్మ పాత్రనా? వ్యాస శీర్షికలో గున్నమ్మ పేరుండడాన్ని బట్టి రెండోవైపు మొగ్గు చూపించిన పాఠకుడు 27పేజీల వ్యాసంలో గున్నమ్మకు మూడున్నర పేజీలే కేటాయించడాన్ని చూసి ఖంగుతినడు, అక్కడి ప్రజలు ఆరాధించే గున్నమ్మను, ఆమె త్యాగాన్ని తేలిక చేయడంద్వారా చులకన పరచడాన్ని చూసి ఆందోళన చెందుతాడు.

డి.డి. కోశాంబి, ఎ.ఎల్. బాషమ్, కంభంపాటి, మల్లంపల్లి తదితరులు వాడిన మార్క్సిస్టు చరిత్రకారులకు సహజమైన నిరలంకార శైలి కాకుండా కవిమాదిరిగా కథనంలోకి దిగిన రచయిత ఆ స్వేచ్ఛను కూడా పూర్తిగా వినియోగించుకోలేదు. తన జీవితంలో ‘సీత’ పాత్ర లేకపోయినా నాటకం రక్తి కట్టించడానికి అల్లూరి సీతారామరాజు జీవితం విషయంలో స్వేచ్ఛను నాటక కర్తలు, కవులు తీసుకున్నారు. ఆ స్వేచ్ఛా పరిమితులన్నింటినీ తోసిరాజని ‘నిబద్దత’ పేరుతో “కలెక్టర్, మేజిస్ట్రేట్ కళ్లలో గున్నమ్మ కారం గుమ్మరించిందనీ, లేదు కలెక్టరును కాలెత్తి తన్నబోయిందనీ అమ్దుకే ఆమెపై కాల్పులు జరిగాయనీ, గొర్లె జగ్గయ్యను లేవనెత్తుతుండగా తుపాకి గుళ్ల దాడికి ఒరిగిపోయిందని – భిన్న కథనాలు. ఏమైతేనేం, ఆమె యుద్ధభూమికి ప్రణమిల్లింది” అని చరిత్ర పీఠంనుంచి తోసేశారు. ‘ఏమైతేనం’ అనే మాట నాకు ముళ్లులా గుచ్చుకుంది. నిజంగా ఆమె పాత్ర పూచికపుల్ల పాటిదే అయితే ఆమెపై అంత మౌఖిక సాహిత్యం వెలువడేది కాదు. జనపదాల్లో ఆమె త్యాగం నిలిచేది కాదు.

రచయిత కేవలం రైతుల తిరుగుబాటుపైనే దృష్టి కేంద్రీకరించాల్సింది. అమరవీరుల త్యాగాన్ని కొనియాడాల్సింది. కవి, కథకుడి గొంతుతో గున్నమ్మను ప్రత్యేక పాత్రగా నిలిపి, అనవసరపు ప్రిజుడీస్ తో ‘సాసుమాను గున్నమ్మ’ను తేలిక చేయడం మొత్తంగా చరిత్ర రచనకు, ప్రత్యేకంగా కళింగాంధ్ర చరిత్రకు అన్యాయం చెయ్యడమే.

27 పేజీల సంక్షిప్త వ్యాసంలో కళింగాంధ్ర చరిత్రలో కలికితురాయిగా చెప్పుకోదగ్గ మందసా రైతుల తిరుగుబాటును ఆసక్తిదాయకంగా మలిచిన బి.వి.ఏ. రామారావునాయుడు అభినందనీయులు. ఇలాంటి ప్రయత్నాలు మరింత విరివిగా జరగాలి. మన చరిత్రను మనమంతా చదివి ఆనందించాలి. తప్పక చదవాల్సిన ఈ పుస్తకం దొరికే చోటు: డాక్టర్ బి.వి.ఏ రామారావునాయుడు, హరిత, విశాఖ ఏ కాలనీ, శ్రీకాకుళం – 532001. వెల 20 రూపాయలే.

మరి మీరూ చదువుతారుగా!

ప్రకటనలు

2 responses »

  1. రవికుమార్ గారు,యధాప్రకారం మీ వ్యాసం సమగ్రంగా ఉంది.నేనా మందస కోటను చూసాను.అలాగే,గున్నమ్మ,మందస రైతుల తిరుగుబాటు గురించి యగళ్ళరామకృష్ణ శష్టిపూర్తి సంచికలో కూదా కొన్ని విషయాలు చదివినట్లు గుర్తు.కొనసాగిమ్చండి మీ యత్నాలు.

  2. పింగుబ్యాకు: కిందటేడాది మే, జూన్ నెలల్లో పరిచయం చేసిన పుస్తకాలు « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s