వ్యర్థత అరికడితేనే దేశ ప్రగతి

సాధారణం

gurajadaఇవాళ్టి తెలుగు నాటక రంగం పరిస్థితి చూస్తే గుండె తరుక్కు పోతుంది. నాటకాల్లో కాస్త అనుభవం సంపాదించాక సినిమా రంగంలో ప్రయత్నించడం సాధారణమైపోయింది. సినిమారంగంలో సెటిలైతే సరేసరి లేదంటే బుల్లితెర మీదకు దాడిచేయడం దురదృష్టకర పరిణామంగా మారింది. కాని తమిళ, కన్నడ, మరాఠీ దేశాలలో పరిస్థితి వేరు. ఆంధ్రదేశంలో మాదిరిగా కాకుండా రచయితలు, నటులు, కళాకారులు, నాటకాభిమానులంతా ఏకమై ఒక్కతాటిమీద నిలిచి ప్రయోగాత్మక నాటకానికి జీవంపోస్తూ నాటక రంగం శోభాయమానంగా వెలుగొందడానికి కృషి చేస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణగా గిరిష్ కర్నాడ్ నాటకాలు, విజయ్ టెండూల్కర్ నాటకాలు దేశవిదేశాల్లో విజయవంతంగా ప్రదర్శించడాన్నే చెప్పుకోవచ్చు. మన తెలుగులో నాలుగు గొప్ప తాజా నాటకాలు పేర్లు చెప్పమని అడిగితే మనం తలదించుకుంటున్నాం. అక్కడా ఇక్కడా కొన్ని మంచి నాటకాలు వస్తున్నా (టెక్నికల్ గా ఎంత అధ్వానంగా వున్నా) పరిషత్తు పెద్దల పాలిట్రిక్స్ వల్ల అవి పురిట్లోనే ఉసురు పోసుకుంటున్నాయి. అదృష్టవశాత్తూ పూర్వం పెద్దలు అనితరసాధ్యమైన నాటకాలు కొన్నింటినైనా ఆవిష్కరించడం వల్ల ఇప్పటికీ మన మూతులు వాసన చూసుకోవడమే మనకు మిగిలింది.

ఇరవయ్యో శతాబ్ధి ఆరంభంలో వచ్చిన గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ అన్ని విధాలుగా హిమాలయ పర్వతంలాగా మన కీర్తి శిఖరంగా భాసిల్లుతోంది. అంతటి గొప్ప నాటకంలో ఒక చిత్రాతి విచిత్రమైన పాత్ర గిరీశం. గిరీశం స్వరూపం, స్వభావం అంచనా వేయడానికి తెలుగులో విమర్శకులు ఎంత ప్రయత్నం చేశారో అంత సులువుగా అంచనా వేయలేం. ఈ ప్రయత్నాలను కేవీయార్ లాంటి మహానుభావులు ఎంత సంకలించ ప్రయత్నించినా చేయాల్సిన పని ఇంకా ఎంతో మిగిలేవుంటుంది.

గిరీశం శిష్యుడు వెంకటేశం. కొన్నాళ్లపాటు శిష్యరికం చేసిన వెంకటేశానికి తన గురువువల్ల సిగరెట్లు కాల్చడం తప్ప మరో విషయం నేర్చుకోలేదేమోనన్న సందేహం కలుగుతుంది. పసితనం వల్ల గిరీశాన్ని అదే మాట అడిగేస్తాడు కూడా. అప్పుడు గిరీశం తానెంత గొప్పవాడో వెంకటేశానికి జ్ఞానబోధ చేస్తాడు. “డామిట్! ఇలాంటి మాటలంటేనే నాకు కోపం వస్తుంది. పూనా డెక్కన్ కాలేజీలో నేను చదువుకుంటున్నపుడు – ‘ది ఎలెవెన్ కాజెస్ ఫర్ ది డిజెనరేషన్ ఆఫ్ ఇండియా’ను గూర్చి మూడు గంటలు ఒక్కబిగిన లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయిపోయినారు” అంటాడు. ఆ నాటకంలో ‘డామిట్’, ‘మనవాళ్లు వుట్టి వెధవాయలోయ్’ అన్న మాటలు మొదటిసారి ఇక్కడే వాడతాడు గిరీశం. ఇంతకీ ఆ ఎలెవెన్ కాజెస్ ఏమిటి? పూనా డెక్కన్ కాలేజీలో ఎవరు, ఎప్పుడు, ఏ విధమైన లెక్చర్ ఇచ్చారు? అప్పారావుగారి మాటలను మామూలుగా తీసి పారెయ్యలేం. గురజాడ ఎప్పుడేనా లెక్చరిచ్చారా? లేదా మరెవరిదైనా లెక్చర్ విన్నారా? ఇలాంటి ఆలోచనలతో సతమతమైన అనేక మందిలో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు పూర్వ ఉపాధ్యక్షులు కట్టమంచి రామలింగారెడ్డి గారు ఒకరు. రెడ్డిగారు బళ్లారి రాఘవకు ఈ అసైన్ మెంట్ అప్పగించారు. బి.ఏ.,బి.ఎల్., చదువుకుని బళ్లారిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్న టి. రాఘవాచార్యులుగారు అప్పటికే భారతదేశమంతా కళాప్రపూర్ణ మహా నట శేఖరుడు బళ్లారి రాఘవగా సుపరిచితుడు. ఆ ‘ఎలెవెన్ కాజెస్’ గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి, తన చదువునూ, రంగస్థల అనుభవాన్ని రంగరించి తన ఉపన్యాసాన్ని తయారుచేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ రెడ్డిగారి తర్వాత యూనివర్శిటీ పగ్గాలు చేపట్టిన వారు ‘డంగ్ హిల్స్’, ‘కుక్కగొడుగులు’, ‘దుర్మదాంధులు’ కావడంతో ఆంధ్రజాతి ఒక అమూల్య వ్యాసాన్ని కోల్పోయింది. జానుమద్ది హనుమచ్చాస్త్రి చొరవతో బళ్లారి రాఘవ ఇంట్లోనే ఆ వ్యాసాన్ని సంపాదించారు. దాన్ని ఆవంత్స సోమసుందర్ తెలుగులోకి అనువదించారు. అలా వెలుగుచూసిన ఒక గొప్ప వ్యాసం “భారతదేశ పతనానికి పదకొండు కారణాలు”. ఆ వ్యాసం పరిచయం ఈ వారం…

ఈ వ్యాసమంతా చదివాక రాఘవగారికి గిరీశం అంటే ప్రేమా కోపమూ ఉన్నాయనిపిస్తుంది. ఒకవైపు గిరీశం ఎంతవరకు ఆలోచించగలడో మధిస్తూనే అతని వ్యక్తిత్వంలోని స్వల్పలోపాలను ఉదాహరిస్తారు. భారత యువతకు గొప్ప సందేశం ఇవ్వగల ఈ వ్యాసంలో అనేక విషయాలను రాఘవ వివరంగా చర్చిస్తారు. కొన్ని శతాబ్దాలుగా బానిసగా ఊడిగం చేసిన భారతదేశానికి ఆత్మపరమైన దివాళాకోరుతనం అలవాటైంది. దానివల్ల మనం చేసే పనులు కొన్ని అత్యంత మూర్ఖమైనవని తెలిసినా ఆ పనులు మానుకోం. రకరకాల ఆత్మవంచనల, సమర్ధనల ముసుగులు తొడుక్కుంటాం. వీటన్నింటి వల్ల ఆలోచనల ఆవరణానికి ఆచరణల జీవకాంతికీ నడుమ ఎంతో అఖాతం ఏర్పడుతోంది. ముఖ్యంగా భారత జాతీయ లక్షణంగా వ్యర్థతను మనలో పెంచి పోషిస్తున్నాం. రుణగ్రస్త జీవితాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. అప్పు తీసుకుంటే ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినట్టే అని మనమెప్పుడూ భావించం. ఈ బుద్ధి మనకే కాదు మన దేశానికీ లేదు. దేశానికి లేదు కాబట్టి మనకు లేదేమో! మన జాతిలో పేరుకుపోయిన వ్యర్థం చేసే అలవాటు వల్ల అనేక ఉత్తమ జీవశక్తులను విధ్వంసం చేసుకుంటున్నాం. మనమెంతో గొప్పగా భావించే మన సంస్కృతే ఆలోచనకూ ఆచరణకూ నడుమ దూరాన్ని పెంచుతోంది. చదువుల పేరిట కాలాన్నీ, ఆడంబరాల పేరిట ధనాన్నీ, పూజలు కర్మకాండలు పేరిట ఆత్మానందాన్ని, శారీరక శక్తులను వ్యర్థం చేసుకుంటున్నాం. ధన వ్యయం, ఆవేశాలను దుబారా చేయడం, అపాత్రదానం ద్వారా వితరణ గుణం నిరుపయోగం కావడం, యువశక్తుల అస్థిత్వాన్ని వ్యర్థం చేయడం, ఉచ్చ్వాస నిశ్వాసాలను నిరుపయోగపరచడం, సార్వత్రికంగా భౌతిక శక్తులను నిరుపయోగపరచడంతో పాటు మత, దైవాలపట్ల మనకున్న భ్రాంతులను కలిపి మొత్తం పది కారణాలవల్ల భారత దేశం పతనానికి దారితీసినట్లుగా వివరిస్తారు. అయితే పదకొండో కారణాన్ని ఊహించలేకపోతారు. మరెవరినైనా ఆ పదకొండో కారణాన్ని పరిశీలించమని రాఘవ కోరుతారు. యువతరం తప్పక చదవాల్సిన పుస్తకమిది. దీంతోపాటుగా ఏంగెల్స్ రచించిన “వానరుడు మానవుడిగా మారే క్రమంలో శ్రమ నిర్వహించిన పాత్ర” అనే చిన్న వ్యాసం కలిపి చదివితే మనకెన్నో కొత్త ఆలోచనలు వచ్చి తీరుతాయి.

56 పేజీల ఈ వ్యాసాన్ని విశాలాంధ్ర పన్నెండు రూపాయలకే అందిస్తోంది. తప్పక చదవండి!

ఒక్కమాట – నాటక రంగానికి మళ్లీ పూర్వవైభవం రావాలంటే సినిమా అగ్ర నటులందరూ మళ్లీ నాటకరంగం వైపు చూడాలి. అప్పుడప్పుడూ రంగస్థలం మీద వారంతా కొన్ని ప్రయోగాల వంటివి చేస్తే ప్రేక్షకులు, నాటక రంగ కళాకారులు మళ్లీ అటువైపు దృష్టి మళ్లిస్తారు. కానీ ఇప్పుడు సినీజనమంతా రాజకీయ రంగం వైపూ, రియల్ ఎస్టేట్ రంగం వైపు చాలా సీరియస్ గా దృష్టి సారిస్తున్నారు. మీరేమంటారు?

ప్రకటనలు

4 responses »

 1. మంచి వ్యాసాన్ని పరిచయం చేసారు. నేను మైసూర్ లో చదువుతున్నప్పుడు అక్కడ ‘నాటక కర్ణాటక -రంగాయణ’ అనే సంస్థ వారు వేసిన చాలా నాటకాల్ని చూడటం జరిగింది. వారి కళా వులువలూ,సాంకేతిక విలువలూ, విషయ పరిజ్ఞానం చూసి అబ్బురపడేవాడిని.

  సంస్కృతి పరంగా మనం కన్నడిగులకు దగ్గరగా ఉన్నా మనలోని ఈ దివాలా తనానికి కారణం ఇంతవరకూ అర్థం కాలేదు.

 2. రవి గారు,
  మంచి వ్యాసాన్ని పరిచయం చేసారు. మీరు అందించే సమీక్షలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. తప్పక కొనాల్సిందే ఈ వ్యాసాన్ని! మొత్తం చదివితే ఇంకా క్లారిటీ వస్తుంది.

  ఇక చివర్లో మీరు చెప్పిన విషయం…నాటక రంగమంటే చిన్న చూపు చాలామందిలో ఉంది. సినిమా నటులు మాత్రం దీనివైపు ఎందుకు మొగ్గుతారు చెప్పండి? గొల్లపూడి మారుతీ రావు, చాట్ల శ్రీరాములు వంటి కళా కారులే కనీసం నాటకాలు రాయడం, నటించడం మానేసారు.(వృద్ధులైపోయారనుకోండి)అదే హింది సినిమా నటులు కొంతమంది వీలున్నపుడు నాటకాలు వేస్తూనే ఉంటారు చూడండి!

  బెంగుళూరులో ప్రతి వారాంతమూ థియేటర్లలో నాటకాలు ప్రదర్శితమవుతూనే ఉంటాయి ! జనం చూస్తారు కూడా…టికెట్ కొనుక్కుని మరీ!
  మనవాళ్ళలో ఈ కళాభిరుచిని జాగృతం చేయాలంటే ఏం చేయాలో మరి?

 3. పింగుబ్యాకు: కిందటేడాది మే, జూన్ నెలల్లో పరిచయం చేసిన పుస్తకాలు « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s