మానవీయ స్పర్శతో నిండిన కథలు

సాధారణం

సాహిత్యమెప్పుడూ హఠాత్తుగా ఆకాశంలోంచి ఊడిపడదు. జీవితంలోంచే పుడుతుంది. సాహిత్య రూపాలు జీవితాన్ని యథార్థంగా ప్రతిబింబించినప్పుడే అవి అందరి మన్నన పొందుతాయి. ప్రశంసలుపొందిన సాహితీవేత్తలు అటు జీవితాన్ని సునిశితంగా పరిశీలించడమే కాకుండా సాహిత్యాన్ని ఔపోశన పట్టినపుడే వాళ్లు సృజించిన ప్రతి అక్షరమూ పాఠకుడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జీవితపు చలన సూత్రాలను సమర్థంగా అర్థం చేసుకోవడానికి, రొటీన్ జీవితంలోనే చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆనంద సంతోషాలు నింపుకోవడానికీ సాహిత్య పఠనం ఎంతో ఉపకరిస్తుంది. మరి సాహితీకారులు భావుకులైతే మనం గబుక్కున చూడ(లే)ని అతి సూక్ష్మ అంశాలనూ ఒద్దికగా మనకు వివరించి మన చుట్టూ వున్న అందాలను, మనుషుల అంతరంగాలను ఆవిష్కరిస్తారు. మరదే భావుకులు చిత్రకారులైతేనో! ఇలాంటి లక్షణాలెన్నింటో కలబోత వారణాసి నాగలక్ష్మి. ఆమె ఇటీవల ఆలంబన కథల సంపుటిని వెలువరించారు.

కొన్ని నెలల కిందట కథానిలయంలో నాలుగు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్లినపుడు కారా మేష్టారు “నీకో పుస్తకముంచాను తీసుకుంటావా?” అని ఆత్మీయంగా అడిగారు. నేనెప్పుడు అక్కడ ఆరు పుస్తకాలు కొన్నా మరి నాలుగు కలిపి పది పుస్తకాలివ్వడం మేష్టారికి అలవాటు. అలా ఇచ్చిన పుస్తకాలలో ఈ “ఆలంబన” ఒకటి. నెమ్మదిగా కథ తర్వాత కథ చదవడం మొదలుపెట్టినాక ఈ రచయిత్రి ఎందుకు స్టార్ రైటర్స్ సరసన నిలబడలేదా అనిపించింది. దానికి కారణం మన సాహిత్య వాతావరణమే. ఎవరికి వాళ్లు చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఆ ఇరుకు గదుల్లో వుంటూ అక్కడి జీవనమే భద్ర జీవనమని భ్రమపడుతూ బతకడం అలవాటైంది. ఆ అ’జెండా’లు మోసేవాళ్లవే తప్ప మిగిలిన వారివైపు కన్నెత్తి చూడరు. నిజంగా ఒక మంచి పుస్తకాన్ని ప్రమోట్ చేసే సాహిత్య విమర్శ కరువవుతోంది. ఎలెక్స్ హేలీ రాసిన “ఏడు తరాలు” కంటే ఎంతో గొప్పగా సాగిన జి. కళ్యాణరావు “అంటరాని వసంతం” గురించి మనమెన్ని వ్యాసాలు చదవగలిగాం? ప్రపంచ సాహిత్యాలలో గొప్ప ప్రక్రియాపరమైన రచనలన్నింటిని తన నేపథ్య సంగీతంగా చేసుకుని సాహిత్య సృజన చేసే కాశీభట్ల వేణుగోపాల్ రచనలపై ఎన్ని విమర్శ వ్యాసాలు చదవగలుగుతున్నాం? ఇలాంటి నేపథ్యంలో మనసు ఆర్థ్రమయ్యేలా అపురూపమైన కథలు రచించిన నాగలక్ష్మి కథల సంపుటిని చదవడం మంచి అనుభూతి. రచయిత్రికి అభినందన చెప్తూ అబ్బూరి ఛాయాదేవిగారు చెప్పినట్లు ‘అభ్యుదయ భావాలతో, వాస్తవిక దృక్పథంతో, సామరస్య ధోరణిలో ఆలోచనాత్మకంగా కథలు రాస్తున్నారని’ కథలన్నీ చదివితే మనకు అక్షర సత్యమని తెలుస్తుంది. చదివించే గుణంతో పాటు కథా వస్తువును ఎంపిక చేసుకోవడంలోనూ వారణాసి నాగలక్ష్మి చతురత కనిపిస్తుంది.

వయసు మళ్లిన దశలో భార్య భౌతికంగా దూరమైన రామశాస్త్రికి ఒక్కసారిగా అంతా శూన్యంలా అనిపిస్తుంది. ఇన్నాళ్లూ అన్నింటికి భార్య తనపైనే ఆధారపడి వుందనే భ్రమ వదిలిపోయి తనెంతగా భార్యపై ఆధారపడేవాడో అవగాహనకు రావడం ఒక పార్శ్వం. తన కొడుకులిద్దరూ విదేశాల్లో ఉంటారు. సొంత గడ్డవీడి విదేశాలలో వారితో పాటు నివశించలేని అసక్తత మరో పార్శ్వం. అత్తాకోడళ్ల మధ్య తరతాలుగా ఏర్పడుతున్న వైమనస్వానికి కారణాలు ఇంకో పార్శ్వం. వృద్ధూలకు ఆశ్రయం ఇవ్వడం వృద్ధాశ్రమాల పని కాదంటూ, వారికో వ్యాపకం కల్పిస్తూ మరొకరికి జీవితంలో వెలుగు నింపడానికి ప్రయత్నం చేయడం అదనపు పార్శ్వం. ఇలా అనేక విషాలుగా ఎంతో ప్రభావితం చేసే నింపైన కథ ‘ఆలంబన’తో ఈ కథా ప్రస్థానం మొదలవుతుంది. మనకు కొన్ని ముందస్తు నమ్మకాలు ఉంటాయి. ఆధునికంగా వుండే అమ్మాయితో జీవితం సాఫీగా సాగదని, వారికుండే అహంకారం, స్వాతిశయాలతో బతుకు దుర్భరం చేసుకుంటారని అందరిలాగే ఒక ముసలి తల్లి అనుకుంటుంది. అందుకే ‘గెలుపు’ కథలో తన కొడుకు ఎంపికను తప్పు పడుతుంది. ఎంతో పరిణతిని ప్రసర్శించిన ఆధునిక మహిళ ప్రీతి నెమ్మదిగా తన అత్తగారి హృదయాన్ని గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సంబంధాలను నెమ్మదిగా విశ్లేషిస్తూ సాగిన కథలో హఠాత్తుగా సినిమాటిక్ గా మారిపోవడమే మింగుడుపడదు.

మనసును ఆకట్టుకునే మరో సందేశాత్మక కథ ‘ముసురు’. అత్యాచారానికి గురైన అబల, ఆమె తండ్రి రెండు తరాలలో ఎదుర్కునే సంఘర్షణను ఈ కథలో రచయిత్రి చిత్రించారు. అత్యాచారానికి గురైన వారిపట్ల సమాజంతో పాటు మీడియా ప్రవర్తన చాలా లేకితనంగా, ఏహ్యంగా ఉండడం చింతించాల్సిన విషయం. అయితే ఇటీవల బాధితురాళ్లు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తుండడం గొప్ప పరిణామం. ఇలాంటి కథలవల్ల ఆపసమయంలో వుండే అమ్మాయిలకు ఎంతో మనోధైర్యం చేకూరుతుంది. అయితే మ్య్ఖ్య పాత్రధారైన తండ్రి పాత్రలో తన ఆలోచనవిధానం పట్ల పస్చాత్తాపం కలిగి మరణించడమనే ముగింపునివ్వడం శిల్పపరంగా, కథనపరంగా గొప్ప సంగతి కాదు. కథను ఇంకాస్తా పొడిగిస్తే బాగుండేది.

చదువుల తీరులో వుండే లోపాలను గొప్పగా ఎత్తి చూపే కథ ‘తులసమ్మ కొడుకు’. పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడమే లక్ష్యంగా పిల్లలను నిర్బంధించడం మన చదువుల సారంగా మారింది. ‘చూసి నేర్చుకోగలిగే శక్తి వున్న వీరయ్యకు అర్థకాని పద్ధతిలో అక్షరాలను, అంకెలను వాడి బుర్రలో నింపాలని ఎంత ప్రయత్నించాను?’ అని కథకురాలు తనలో తాను వేసుకున్న ప్రశ్న ఉపాధ్యాయులంతా వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా! ఇక ఈ సంపుటిలోని కథల్లోకెల్లా నాకు బాగా నచ్చిన కథ ‘వర్షిణి’. ‘అమెరికాలో బుడుగు’ బాగున్నా అది కేవలం హ్యూమర్ ముసుగులో తల్లిదండ్రులను వెక్కిరించడంతో ఆగిపోతుంది. ‘వర్షిణి’ అలా కాదు. అది మానవ సంబంధాలల్ను, కుటుంబ సంబంధాలను గట్టిగా కుదిపి, మనిషి మూలాల్లోకి ఒదిగిపోతుంది. చిన్న పిల్ల పార్టీకి గిజుభాయి రాసిన మేనిఫెస్టో “చిన్నారి” చదివారా? ఇంచుమించు అంత గొప్పగా చిన్నారుల అంతరంగాన్ని ఆవిష్కరించిన ‘వర్షిణి’ పెద్దలకు ఎన్నో పాఠాలు చెప్తుంది. తల్లిదండ్రుల తీరికలేనితనం, వృత్తిపట్ల నిబద్దతతో కుటుంబాన్నే కాదు ఆఖరికి సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసికునే తీరు, పిల్లల పట్ల బాధ్యతల నిర్వహణ వీటన్నింటి చుట్టూ అందమైన పొదరిల్లులాంటి కథనల్లారు రచయిత్రి వారణాసి నాగలక్ష్మి.

మంచి కాగితం, అచ్చు తప్పుల్లేని ముద్రణ, సొంతంగా చిత్రించిన బొమ్మల మధ్య సాగే కథలన్నీ మంచి కాఫీ తాగిన అనుభూతినిస్తాయి. (ఈ కథల్లో అన్ని పాత్రలూ ఎప్పుడూ కాఫీలు తాగుతూనే ఉంటారు) అయితే కథల్న్నీ ప్రచురణ పొందిన వరుస క్రమంలో పొందుపరిస్తే బావుండేది. రచయిత్రిలో వచ్చిన పరిణతి, పరిణామాన్ని అంచనా వేయడానికి వీలుండేది. 200 పైన పేజీలతో 19 కథలున్న ఈ “ఆలంబన“ను నూరు రూపాయలు పెట్టి దర్జాగా  కొనుక్కోవచ్చు. మరి మీరూ చదవండి.

ప్రకటనలు

6 responses »

  1. మొన్న నవోదయ వారిని అడిగితే దొరకడం లేదన్నారు. రచయిత్రిగారినే అడగాలి ఇక. పరిచయానికి ధన్యవాదాలు.
    సో..మీకు కాశీభట్ల వేణుగోపాల్ రచనలు నచ్చినాయా? తపన చదివారా? దాన్ని గురించి ఏమన్నా రాస్తారా?

  2. బోలెడన్ని పుస్తకాలను పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.మీ వల్ల eleven minutes లాంటి మంచి పుస్తకం చదివాను. మీకిప్పుడే ఓ mail పంపిస్తున్నాను!!

  3. పింగుబ్యాకు: కిందటేడాది మే, జూన్ నెలల్లో పరిచయం చేసిన పుస్తకాలు « మీరు చదివారా?

  4. పింగుబ్యాకు: పుస్తకం » Blog Archive » రచయిత్రి వారణాసి నాగలక్ష్మి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s