స్త్రీవాద ఉద్యమ సాహిత్యానికి తొలి పరిచయం ‘నీలిమేఘాలు’

సాధారణం

జీవితం ఏ సూత్రాల ఆధారంగా చలనం సాగిస్తుందో చెప్పే సాహిత్యం కాలక్రమంలో జీవితాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. జీవితం, సాహిత్యం పేనిన తాడులాగా ముందుకు సాగుతున్నాయి. ప్రజల ఆలోచనలను చక్కదిద్ది, జీవనం సులభతరం చేసేందుకు సాహిత్యం ఓ ఉద్యమంలా కృషి చేస్తోంది. తరాల తరబడి మగవాడి పక్కటెముక నుంచి పుట్టినట్టుగా స్త్రీని చిత్రించి మనిషి మనుగడలో కీలక భూమిక వహిస్తున్న మహళలను వంటింటి కుందేలుగా మార్చి పారేశాం. కొన్ని వందల ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసిన మహిళ ఇప్పుడిప్పుడే  స్వతంత్ర వ్యక్తిగా గుర్తింపు పొందుతోంది. తమ సమస్యలను, తమ బాధలను, తమ అనుభవాలను, తమ అనుభూతులను, తమ ఇష్టనిష్టాలను, తమ దృష్టికోణాన్ని తమదైన శైలిలో తమకుతాము చెప్పుకోవడంతో మొదలైన స్త్రీవాద సాహిత్య ఉద్యమం మరే ఇతర ఉద్యమం కన్నా మంద్రంగా, గంభీరంగా, ఉరవడిగా సాగుతూ ప్రవహిస్తోంది. ఫ్రెంచ్ లో సిమోన్ డి బావ్, ఇంగ్లిషులో వర్జీనియా వుల్ఫ్ లు నాటిన విత్తులు తెలుగులో శాఖోపశాఖలుగా విస్తరించిన వృక్షమైంది. “కవిత్వం మనకు విలాసం కాదు. మనకు కవిత్వం సరదా పనికాదు. మన ఉనికి కోసం మనం అత్యవసరంగా కవిత రాస్తాం. కవిత్వ కాంతి పుంజంలో మనం మన కలల్నీ, కోరికల్నీ చూస్తాం” అంటూ కొంతమంది స్త్రీవాద ఉద్యమ స్పృహను అలవరచుకున్న తెలుగు కవయిత్రులు తమ భావాల పుష్పాలను ఒకచోట గుదిగుచ్చి అందించిన పుష్పహారం “నీలిమేఘాలు” స్త్రీవాద కవిత్వ సంకలనాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నాను.

ఎన్నో కువిమర్శలను, వ్యక్తిగత దాడులను నిబ్బరంగా ఎదుర్కొన్న ఫెమినిస్టు మూవ్ మెంట్ కొంతమంది పురుషాహంకారం నిండిన రచయితల, విమర్శకుల విమర్శల్లో అశ్లీల సాహిత్యమంటూ నానాఅగచాట్లు పడి. అయినా కొనసాగి, అందరి నోళ్లూ తన స్వచ్ఛమైన కవిత్వంతో మూయించగలిగింది. అంతకుమించి మరొక ముఖ్య లక్ష్యాన్ని సాధించగలిగింది. పితృస్వామ్యం, జండర్, అణచివేత, ఇంటి చాకిరీ స్వభావం, సంతానోత్పత్తి, స్త్రీలు వాడే భాషల గురించి ఎంతో చర్ఛకు తెరదీసింది. ఈ విషయాల గురించి ప్రజలలో కొత్త ఆలోచనలు రేపింది. 90లలో వచ్చిన కొండేపూడి నిర్మల ‘లేబర్ రూమ్’ భాష, భావం రెంటిలోనూ తీవ్ర అలజడి సృష్టించింది. దీనిగురించి వసంత కన్నబీరన్ ఇలా అంటారు: “ఆ కవితంతా నిరాశ, పరాయీకరణల ఉపమానాలతో నిండిపోయింది. పురుషులు పరోక్షంగా మాత్రమే ఉంటారు. బూటకపు కలలు, భ్రమలలో ఈ ప్రపంచమంతా తమ చుట్టే తిరుగుతుందనే విషయాన్ని ఎన్నడూ సందేహించని, ప్రశ్నించని పురుష పుంగవులకు, ఒక స్త్రీ – పవిత్ర మాతృత్వ వ్యవస్థనిలా తీసిపారెయ్యటం నిజంగా చాలా భయాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవస్థ చుట్టూ భ్రమలను, మిత్ లను ప్రశ్నించడమంటే దాని మీద దాడిచేయడమే“. ఇదే కవిత గురించి ఓల్గా చాలా శక్తిమంతంగా విశ్లేషిస్తారు. “పిల్లల్ని కనటం, మాతృత్వం ఒకటి కాదని స్త్రీలు తెలుసుకుంటున్నారు. ఈ రెండు వేరువేరు విషయాలని అర్థం చేసుకున్న స్త్రీలు, పిల్లల్ని కనటం మీసామాజిక బాధ్యత అనటానికి సాహసించే వారికి వారి సామాజిక బాధ్యతల్ని గుర్తు చేస్తారు. పిల్లల్ని కనలా వద్దా అని ఎంచుకునే హక్కు స్త్రీకి ఉందని, అది మానవ హక్కుల్లో ఒకటనీ చెబుతారు“.

“పెద్దవ్వనీ చెప్తా” అనే కవితలో శ్రీమతి స్త్రీ, పురుష సమానత్వం గురించి చాటిచెప్తుంది. వరకట్నాల దృష్ట్యా ఆడపిల్లలు మైనస్సులు, మగ పిల్లలను ప్లస్సులుగా వ్యవహరించి వదిలేయం. అన్నింటిలోనూ లెక్కలు వేసి మరీ తక్కువ చేస్తాం. అందుకే ఎంతో ఆశావహ దృక్పథంతో కవయిత్రి ఇలా అంటారు. “కానీ ఇప్పుడు నేనేం చెయ్యగలను / పెద్దయ్యాక ఓ ప్రయత్నం చేస్తా / నాకు ఒకమ్మాయి పుట్టాక / అమ్మకు తన తెప్పేమిటో తెలిసేలా చేస్తా!” ఘంటశాల నిర్మల “జుగల్ బందీ”, పాటిబండ్ల రజని “క్షుద్రానందం”, జయప్రభ “పైటని తగలెయ్యాలి” కవితలు కొందరు పురుషాహంకారపూరిత ప్రేలాపనలకు తొంబైవ దశకంలో స్త్రీవాదులు ఘాటుగా చెప్పిన జవాబులు. అక్షరాలు తూటాల్లా, తూనికరాళ్లలా, నూతన పదకోశంలా వాడడమంటే ఇదేననాలి. ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాధశాస్త్రి ఒకసారిచ్చిన ఇంటర్వ్యూలో ఫెమినిష్టులను గయ్యాళులంటారు. అది జస్ట్ ఒక ఫ్రాయిడియన్ స్లిప్ ఆఫ్ టంగ్ అని అనుకోవడానికి వీలులేకుండా “సోకాల్డ్ మధ్య తరగతి స్త్రీలకు వేరే పనీపాటా లేక చేసే అల్లర్లుగా” ఫెమినిస్టుల కృషిని నీరు గార్చేస్తారు. అధోజగత్తు సహోదరుల గురించి మార్క్సిస్టు అవగాహనతో దోపిడీతత్వపు విశ్వరూపాన్ని గొప్ప ప్రతిభావంతంగా చిత్రించిన మహారచయిత కూడా అంత అవగాహన రాహిత్యంతో మాట్లాడడం తెలుగు స్త్రీవాద కవయిత్రులు జీర్ణించుకోలేక పోతారు. “ఔను మేం గయ్యాళులమే” అంటూ ఓల్గా పెలుసుగా జవాబిస్తారు. “నూరేళ్ల క్రితం మధురవాణి మందలింపులు / మీ దళసరి చర్మాలకు ఆననప్పుడు / మే ఈటెల్లాంటి మాటలతోనే పొడుస్తాం / మా గుండెలమీద కూర్చున్నది / పురుషాహంకారపు పెద్దపులి అని తెలిశాక కూడా / సుతిమెత్తగా ప్రేమ పలుకులు పలుకుతామా? / మేం గయ్యాళులమే కాదు భయంకర కాహళులం” అంటూ హెచ్చరిస్తారు.

స్త్రీవాదులు వాడిన భాష విషయంలో రేగిన అలజడి ఉద్యమం దశాబ్దాలు దాటిన తర్వాత సద్దుమణిగింది. (అంటే అప్పటికి జనాలకు మింగుడుపడిందన్న మాట!) రజియాబేగం రాసిన “అలాగే అన్నారు” అనే మినీ కవితలో ఎలాంటి సంక్లిష్ట పదజాలమూ వాడకుండా, పురుషస్వామిక వ్యవస్థపట్ల విసుగునూ, తమ అసహనాన్ని, ఆందోళనను ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. “బాల్యంలో / ‘చిన్న పిల్లవి నీకేం తెల్సు కూర్చో’ అన్నారు / యవ్వనంలో / ‘ఉడుకురక్తం మంచిచెడూ తెలీదు కూర్చో’ అన్నారు / వృద్ధ్యాప్యంలో / ‘ముసల్దానివి ఇంకేం చేస్తావ్ కూర్చో’ అన్నారు / అవకాశం రానందుకు కోపంగా లేదు నాకు / కూర్చొని, కూర్చొని బద్దకం వచ్చినందుకే బాధగా ఉంది” . పురుష ప్రపంచం అంతా ఈ కవితలు చదివి అవగతం చేసుకుని, తమ జీవితంలో ఆ విలువలు ప్రతిష్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయ్తిఏ ఈ సంకలనంలో స్త్రీవాద సానుభూతిపరమైన పురుష దృక్కోణానికి చోటులేకపోవడం పెద్ద లోటు. ఇవి స్త్రీల అనుభూతులని చెప్పటానికి వీల్లేదు. ఎందుకంటే ఒక గృహిణి మనసులోకి, వర్కింగ్ వుమెన్ మనసులోకి, మెహందీల మనసులోకి, కాల్ గాళ్స్ మనసుల్లోకి స్త్రీ చొచ్చుకుపోగా లేనిది, పురుషుల పట్ల కినుక దేనికి?

230 పేజీలలో సుమారు 90 కవితల “నీలి మేఘాలు” స్త్రీవాద కవిత్వం కేవలం 40 రూపాయలే. మీరు చదవండి. మీ మిత్రులకు, ఇంట్లో కుటుంబ సభ్యులకు చదివి వినిపించండి.

ప్రకటనలు

6 responses »

 1. రవి కుమార్ గారు,
  నీలి మేఘాలు కవితా సంకలనంలో వచ్చిన చాలా వరకు అప్పట్లో ఆంధ్రజ్యోతి వీక్లీ లొ ‘ఈవారం కవిత ‘ శీర్షికలో వచ్చినవే! వాటిని కట్ చేసి దాచుకోవడం నా హాబీగా ఉండేది! ముఖ్యంగా నిర్మల గారి ‘లేబర్ రూం ‘ రజియా బేగం రాసిన ‘అలాగే అన్నారు ‘ కవిత భలే నచ్చుతాయి నాకు.

  నేనూ ఫెమినిస్టులని మీరడిగే ప్రశ్నే అడుగుతుంటాను. పురుషుల పట్ల కినుక దేనికని?

  మీ రివ్యూకి ఇక బాగుందని ప్రత్యేకంగా చెప్పేదేముంది?

 2. ఎప్పటిలానే మీ సమీక్ష చాలా బాగుంది. ఇక్కడ నాకో సంఘటన గుర్తు వస్తుంది. వ్యాఖ్య పెద్దదైనా ఇక్కడే ప్రస్తావిస్తా.. సందర్భం ఎటూ ఉంది కదా!!

  నేను ఒకసారి ఏదో బరువైన వస్తువు పట్టుకుని వస్తుంటే.. నా కోలీగ్ ఒక అబ్బాయి నా కష్టం చూడలేక గబ్బుక్కున నా చేతిలోనిది లాక్కున్నాడు. “నేనే తెచ్చుకోగలను.. మధ్య నువ్వెందుకు?” అని అడిగాను. “ఓహ్.. ఆడవారూ.. మగవారూ సమానమని నీ ఉద్ధేశ్యమా?” అని తిరిగి ప్రశ్నించాడు నన్నే!! “అది అంతా నాకు తెలీదు కానీ.. మీరెంత పని చేస్తారో.. నేనూ అంతే చేస్తా.. ఆడపిల్ల అని నాకు తక్కువ జీతం ఇస్తా అంటే ఊరుకుంటానా” అని అడిగాను.

  దానికి అతను చిన్నగా నవ్వి “మరి అప్పుడు మీకు Reservations ఎందుకు? మాతో సమానమే అయ్యినప్పుడు” అన్నాడు. నాకసలే Reservations అంటే మంట. నాకేమీ అక్కరలేదు అని విసుగ్గా చెప్పాను. అప్పుడు తనే అందుకున్నాడు.. “మీరు మాతో సమానమే.. కానీ అది realize అయ్యేలోపు మీరు వెనకుండిపోయారు. ఇప్పుడు నిజంగా మాతో సమానం అవ్వటానికి, అన్ని రంగాలలో.. అన్ని అవసరాలలో.. మీకీ Reservations బాగా ఉపయోగపడతాయి. You are equals and to prove that u need these.” అని చెప్పాడు. ఎమ్.టీవీ రోడీస్ లో కనిపించిన ఈ కుర్రాడు.. నాకింత ప్రభోదిస్తాడని ఊహించలేదు. 🙂

  పురుషుల పట్ల కినుక దేనికని? అన్న ప్రశ్న చదవగానే వద్దన్నా ఈ సంఘటన గుర్తు వచ్చింది. బాధ ఎవరి వల్ల కలుగుతుందో (కలుగుతుందనుకుంటామో) వారి మీదే కినుక ఉంటుందేమో!! నాకెప్పుడూ అనిపిస్తుంటుంది.. chauvinism మగవారిలో కన్నా ఆడవారిలో ఉంటేనే ప్రమాదకరమని. ఎందుకు అని అడగకండి.. ఓ టపా అవుతుంది సమాధానం చెప్తే!! 😉

  ఇప్పటి వరకూ పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇక మీదటైనా స్త్రీ పురుషులు సహకారం అందించకపోతే.. ఇరువురికీ జీవితం చాలా కష్టం!! నలభై రూపాయలని కాక.. ఓ మంచి పుస్తకమనే దీన్ని కొనుక్కుంటాను.

 3. పూర్ణిమా,
  సరే సందర్భం వచ్చింది గదా, నేను కూడా మళ్ళీ! బాధ ఎవరి వల్ల కలుగుతుందో వారి మీదే కినుక ఎక్కువ అనిపించడం కరక్టే! కానీ బాధ ‘అందరి ‘ వల్లా కలగదు కదా! వారిలో అమ్మ కన్నా ఎక్కువగా ప్రేమించే నాన్నలుంటారు, అన్నలుంటారు, హృదయాన్ని పంచే భర్తలుంటారు, వెన్నుదన్నుగా నిలిచే స్నేహితులూ ప్రేమికులూ ఉంటారు. అందర్నీ ఒకే గాట్న ఎలా కట్టేస్తారు?

  రిజర్వేషన్ అంటే ఉన్న వ్యతిరేకత వల్ల నేను కనీసం సిటీ బస్ లో ఆడాళ్ల సీట్లో కూచున్న మగాళ్లను కూడా లేపను. టికెట్ కొన్నప్పుడు వాళ్లకీ కూచునే హక్కుంది కదాని!

  ప్రకృతిలో ఇద్దరూ భాగమైనపుడు, సహకారం లేకుండా ఎలా జీవించగలుగుతాము? ఇది ఫెమినిస్టుల ఆలోచనల పట్ల మొదటి నుంచీ నాకున్న అభ్యంతరం!

 4. సమిక్ష చాలా బాగుంది. సమీక్షకన్నా కామెంట్లు ఇంకా బాగున్నాయి.
  ఎమ్.టీవీ రోడీస్ లో కనిపించిన ఈ కుర్రాడు.. నాకింత ప్రభోదిస్తాడని ఊహించలేదు. అన్న వాక్యాలు భలె నచ్చాయి. వ్యక్తి బాహ్య రూపం అంతర రూపాన్ని అన్నిసందర్భాలలోనూ, పట్టివదని బాగాచెప్పారు.
  బొల్లోజు బాబా

 5. సుజాత గారు:
  మీతో నేనూ పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నాకు అబ్బాయిల మీద వ్యతిరేకత లేదు.. and I’m not a feminist in any corner of my heart!! 🙂 I hate to be tagged so.మగవారిని ఎందుకు గౌరవించాలి, ఎప్పుడు దూరంగా ఉంచాలి అన్న వాటి పై నాకు చాలా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ నేను ఉదహరించిన సన్నివేశంలో నేను చెప్పదలచుకున్నది ఒక్కటే.. మనకిప్పటికీ సరైన సమానమైన హోదా(??) లేదు. అది పూర్తిగా రావాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. అందాకా కొన్ని అంతఃసంఘర్షణలు తప్పవు. నేను (మీరు కూడా) వంట గురించి టపాయించినప్పుడు అందరి మగవాళ్ళనీ ఉద్ధేశ్యించి రాయలేదు కదా!! అది కేవలం ఒక గ్రూప్ ని టార్గెట్ చేసుకున్నాను. ఇక్కడా అదే దృక్పధం నాది. కవియత్రులను సపోర్ట్ చేయడం లేదు.. అలా అని వారిని అర్ధం చేసుకోడానికి కనీసం ప్రయత్నించకుండా ఉండలేను.

  ఇక నేను దీని గురించి టపాయించాల్సిందే ఏమో!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s