భారతీయ విజ్ఞానాన్ని ఆకళించుకున్న విదేశీ ఘనుడు

సాధారణం

భారతీయ వేదాంతాన్ని భారతీయులే అర్థం చేసుకోవడం కష్టం. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ, సంసార బంధం ఇలాంటి భావాలను నమ్మడమే కొందరికి కష్టమైతే, వాటిని అవగతం చేసుకోవడం కొందరికి ఇంకా కష్టం. వేదాలు అర్థం చేసుకోవడం కష్టమని భావిస్తే వాటి సారంగా ఉపనిషత్తులు వెలిశాయనీ, వాటినీ మనుషులు కొరకలేకపోతే వాటి సారాంశంగా భగవద్గీత వెలిసిందని కొందరు నమ్ముతారు. వాటి సారాంశం అంటే భారతీయ అధ్యాత్మిక సారం జనావళికి అందించడానికి ఆదిశంకరులు మొదలు ఇప్పటి ఆధ్యాత్మిక వాదులందరూ ప్రయత్నాలు చేస్తున్నవారే. ఆ వివరణలు, బోధనలు ఎంతమంది అర్థం చేసుకున్నారన్నది క్లిష్టమైన ప్రహేళిక. ఇదంతా భారతీయుల సంగతి. మరి ఈ భారతీయ అధ్యాత్మికతను అందుకోవాలనుకుంటున్న పాశ్చాత్యుల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి.

అలా తెలుసుకుందామని ప్రయత్నం చేసినవారు తర్వాత మన దేశం విడిచిపెట్టలేదు. ఈ గడ్డమీదే తనువులు చాలించారు. జీవిత పర్యంతం భారతీయ జీవనసారాన్ని అవగాహన చేసుకోవాలని ప్రయత్నించేరు. ఆ క్రమంలో వాళ్లు రాసిన పుస్తకాలు మనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంథాలయ్యాయి. అలా అందరూ తమ హృదయాలకు హత్తుకున్న “సిద్ధార్థ” నవలను ఈ వ్యాసంలో పరిచయం చేస్తున్నాను. 1946లో ఈ నవల సాహిత్యంలో నోబెల్ బహుమానం కూడా అందుకుంది.

1877లో జర్మనీలో జన్మించిన హెర్మన్ హెస్ ప్రపంచ యుద్ధంలో మాతృదేశం పోషించిన పాత్రపట్ల విముఖత చెందాడు. ఆ దేశాన్ని విడిచిపెట్టి దేశదిమ్మరిలాగా ప్రపంచమంతా తిరిగాడు. ఇండియా సూదంటురాయిలాగా అతడిని ఆకర్షించింది. మనదేశాన్నే తన ఆధ్యాత్మిక నిలయంగా హెస్ తర్వాత చెప్పుకునేవాడు. 1911లో స్విట్జర్లాండ్ చేరుకుని అక్కడే స్థిరపడిపోయాడు. 1922లో ఈ “సిద్ధార్థ” నవల, ఆ తర్వాత కొన్నేళ్లకు “స్టెపెన్ వూల్ఫ్” నవలను ప్రచురించాడు. తన యాత్రానుభవాలను “ది జర్నీ టు ది ఈస్ట్” గా ప్రచురించాడు. 85 ఏళ్ల వయసులో పరమపదించిన హెస్ ను ఇప్పటికీ తమ ఆత్మీయ రచయితగా జర్మన్లు గౌరవించడం విశేషం. “సిద్ధార్థ” నవలలోకి వెళ్లేముందర ఒక్క మాట. జిమ్మీ, రెమో, లవ్ కుమార్, రేవంత్ లాంటి చిత్రవిచిత్రమైన పేర్లు పెట్టుకునే మనం ఒక జర్మన్ దేశస్థుడు, ఒక స్విస్ భాషా రచయిత తన నవలలో ఎలాంటి పేర్లు పెట్టాడో తెలిస్తే విస్మయం చెందుతాం. సిద్ధార్థ, గోవిందుడు, కమల, కామస్వామి, వాసుదేవుడు.. ఇవీ పాత్రల పేర్లు!

సిద్ధార్థుడనే బ్రాహ్మణ యువకుడు తన తండ్రి తాతలు తరాల తరబడి పరమ నిష్టాగరిష్టంగా చేస్తున్న పూజానుష్టాది కార్యక్రమాలవల్ల ఆత్మజ్ఞానం కలగట్లేదని రూఢి పరుచుకుంటాడు. తన మిత్రుడు గోవిందునితో అడవులలోని శ్రమణుల వద్ద చేరుతాడు. అక్కడ శ్రమణ గురువులకు శుశ్రూష చేసి అష్టాంగ విద్యలు నేరుస్తారు మిత్ర ద్వయం. కొన్నేళ్లపాటు సాధన సాగించిన అనంతరం ఆ మార్గం కూడా లాభం లేనిదని తేల్చుకుంటారు. తమ వద్దనుంచి వెళ్లవద్దన్న శ్రమణ గురువునే వశీకరణ విద్యతో హిప్నటైజ్ చేసి వెళ్లిపోవడానికి అనుమతి సంపాదిస్తాడు సిద్ధార్థుడు. జేతవనంలో గౌతమ బుద్ధుని ఉపదేశం విన్నాక గోవిందుడు బుద్ధుని అనుసరించి బౌద్ధం స్వీకరిస్తాడు. సిద్ధార్థుడు గౌతమబుద్ధునితో కొంత సంవాదం చేశాక మళ్లీ నూతన మార్గాన్ని ఆశ్రయించదలుస్తాడు. అహంత నుండి విడివడాలని జరిపే ప్రయత్నంలో, దానితోనే దాగుడుమూతలు ఆడుకుంటున్నట్లుగా గుర్తించిన సిద్ధార్థుడు తనను గురించి తాను తెలుసుకోవాలని బయల్దేరతాడు. దారిలో అడ్డంగా నది పారుతూవుంటుంది. ఒక పడవ నడిపేవానితో పరిచయమయ్యాక ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుని అతడి సహకారంతో నదిని దాటి పట్టణం చేరుకుంటాడు.

ఆ పట్టణంలో వేశ్య కమలను చూస్తాడు. ప్రేమ కళను ప్రసాదించమని వేడుకుంటే ఆమె డబ్బు కావాలంటుంది. డబ్బెలా సంపాదించాలని సిద్ధార్థుడు ఆమెనే అడుగుతాడు. అసలు నీకేం తెలుసునని కమల ప్రశ్నిస్తుంది. “నేను ఉపవాసం ఉండగలను. నేను ఆలోచించగలను. నేను వేచివుండగలను” అనంటాడు. చివరకు కమల తన మిత్రుడు కామస్వామి అనే వ్యాపారి వద్దకు సహచరునిగా పంపిస్తుంది. నెమ్మదిగా వ్యాపారంలో మెళకువలు తెలుసుకున్న సిద్ధార్థుడు కామస్వామికి లాభాలు చూపిస్తాడు. తను భాగం పొందుతాడు. కమల దగ్గర కామకళా మెళకువలు తెలుసుకుంటాడు. కమల సాంగత్యంలో వున్నాగానీ, కామస్వామితో వ్యాపారం నిర్వహిస్తున్నా గానీ తామరాకుమీద నీటిబొట్టులా వున్న సిద్ధార్థుడు క్రమంగా డబ్బుకు, మత్తుకు చిత్తై, తాగుడు జూదాలకు బానిసై కళాకాంతులు కోల్పోతున్న దశలో ఆత్మ మేల్కొంటుంది. సర్వం విడిచిపెట్టేసి కట్టుబట్టలతో బయలుదేరుతాడు సిద్ధార్థుడు. మళ్లీ ఎదురుపడిన నదిలో ఆత్మహత్య చేసుకుందామని ఉద్యుక్తుడై ఆత్మప్రబోధంతో చివరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. అక్కడ పడవ నడుపుతున్న వాసుదేవునితోపాటు నివశిస్తానంటాడు. సిద్ధార్థుని నదిని వినమని హితవు పలుకుతాడు వాసుదేవుడు. ఇంతలో ఒకరోజు కమల ఒక బాలుడ్ని సిద్ధార్థునికి తమ బిడ్డగా అప్పజెప్పి కన్ను మూస్తుంది.

పుత్రవాత్సల్యంతో బాలుడ్ని చేరదీయబోతాడు. బాలుడు విసుక్కుంటాడు. అల్లరిచేసి చేసి ఒకరోజు చెప్పాపెట్టకుండా అడవిలోకి పారిపోతాడు. సిద్ధార్థుడు వెంబడిచబోతే వాసుదేవుడు ఎంతగానో వారిస్తాడు. వినకుండా అడవిలోనూ, పట్టణంలోనూ వెదికి వెదికి పుత్రుడిమీద బెంగతో, దు:ఖంతో నదిని చేరిన సిద్ధార్థునికి నదిలో తన ప్రతిబింబానికి బదులు అనేక చిత్రాలు గోచరిస్తాయి. తన బాల్యం నుంచి వేలవేల దృశ్యాలు ఆ నదీజలంలో అగుపిస్తాయి. అవన్నీ మిళితమై వేలవేల గొంతులుగా నినదిస్తాయి. ఆ గొంతులన్నీ ఏకమై ఓంకారంగా ప్రణవనాదం ఆలకిస్తాడు సిద్ధార్థుడు. బోధి చెట్టుకింద బుద్ధునికెలా ఎరుక కలిగిందో, నదిని విన్న సిద్ధార్థునికి అదే జ్ఞానోదయమైంది. అప్పుడు వాసుదేవుడు ముందుకొచ్చి, దీనికోసమే తానిన్నాళ్లూ ఇక్కడ వేచివున్నట్టుగా చెప్పి, ఇక తన అవసరం సిద్ధార్థునికి లేదని చెప్పి అంతర్ధానమవుతాడు. కమల ఉద్యానవనంలో విడిదిచేసిన బౌద్ధ సన్యాసుల్లో గోవిందుడు కూడా వుంటాడు. సమీపంలో ఒక సిద్ధుడు పడవ నడిపేవానిగా వుంటున్నాడని తెలుసుకున్న గోవిందుడు ఆ సిద్ధునిలో తన సిద్ధార్థుని గమనించి సంతోషభరితుడవుతాడు.

ఈ నవలలో మూడు విశేషమైన సంభాషణలు ఉంటాయి. ఈ సంభాషణలు అర్థం చేసుకోవడానికి భారతీయులమైన మనకే ఇబ్బందనిపిస్తే, వీటిని అక్షరబద్దం చేసిన రచయిత హెర్మన్ హెస్ కు పాదాభివందనం చేయాలనిపిస్తుంది. గౌతమ బుద్ధునికీ సిద్ధార్థునికీ మధ్య సందేహ నివారణ చర్చ ఆద్యంతం ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా వుంటుంది. “సిద్ధాంతాల పొదలలోనూ, వాక్యాల వైరుధ్యాలలోనూ చిక్కుకోవద్ద”ని బుద్ధుడు సిద్ధార్థునికి చెప్పినా ఆయన లక్ష్యపెట్టడు. అనుభవంతోనే తెలుసుకోవాలని ముందుకు వెళతాడు. వినడం మాత్రమే కాదు, సమస్త విజ్ఞానాన్ని నదే నేర్పుతుందనే వాసుదేవుడి మాటలు తలకెక్కుతాయి – ప్రగాఢమైన దు:ఖాన్ని అనుభవించిన తర్వాతే. నదిని విని జ్ఞానం పొందుతాడు. ఆ జ్ఞానాన్ని ఇవ్వమని గోవిందుడు అడిగినప్పుడు అదే చెబుతాడు. జ్ఞానమనేది ఒకరు చెబితే తెలుసుకోదగింది కాదు. పైగా మనం వస్తువును వదిలి మాటలు పట్టుకోవడం వల్లనే శాంతి దొరకట్లేదంటాడు.

ఈ నవలను 1957లో ఎమెస్కో (ఇప్పటి ఎమెస్కో కాదు. దీనికీ దానికీ నక్కకూ నాగలోకానికి ఉన్నంత దూరం) తెలుగులో బెల్లంకొండ రాఘవరావుగారి చేత అనువదింపజేసి ప్రచురించారు కూడా. ఆ కాపీలు ఇప్పుడెక్కడా దొరకడం లేదు. పాత లైబ్రరీల్లో ఏమైనా దొరకొచ్చు. పికాడర్ ప్రచురణ సంస్థ ప్రచురించిన (నేను చదివిన ప్రచురణ ఇంగ్లిష్ అనువాదం హిల్డా రోజ్ఞర్ ది) నవల మార్కెట్లో దొరుకుతోంది. తప్పక చదవాల్సిన (మస్ట్ రీడ్) పుస్తకాల్లో “సిద్ధార్థ” నవలొకటి. మరి మీరూ చదువుతారుగా!

ప్రకటనలు

11 responses »

  1. ఈ నవల నా ప్రాణం. ఇంగ్లీషు నవలలు చదవడం అలవాటు లేకపోయినా, ఈ నవల చాలా ఓపిక గా చదివాను. బుద్ధుడి ఆత్మ దీపో భవ అన్న మాట కు నిదర్శనం సిద్ధార్త నవల. ఓ అద్భుతమైన పుస్తకాన్ని పరిచయం చేసారు. ధన్య వాదాలు.

  2. ప్చ్,ఈ నవల చదివాను అనుకున్నాను,అర్ధమయ్యిందనీ అనుకున్నా,హెర్మన్ హెస్సీ మిగతారచనలూ చదవాలనీ భావించాను.కానీ మీ వ్యాసం చదివాక అదంతా ఒక భ్రమ అని తేలిపోయింది.నాకూ ఈ తెలుగు అనువాదమివ్వండి రవికుమార్ గారు.నాలుగైదేళ్ళ తర్వాత ఇచ్చేస్తా 🙂

  3. నరేంద్ర భాస్కర్ S.P.
    నమస్తే
    అర్జెంటుగా ఇప్పుడీ పుస్తకం చదవాలి-చాలా కృతఙ్తలు మంచి పుస్తకం పరిచయం చేసారు.

  4. Ee pustakam chala chetta pustakam ani naa abhiprayam. Adyatmikata peruto manushulalo pudutunna enno prasnalanu champestunnaru. Prakrutiki sambandhinchina gnananni manishiki andakunda chestunnaru. Kevalam adyatmikatato manushula samasyalu teeripoatayanukovatam murkatvam. Ivi mana samasyala nunchi manalni tappudova pattistayi kaani alochimpacheyyavu. Ituvanti pustakalu manaku haani chestaye kaani melu cheyyavu.

  5. రాంబాబు గారి స్పందన ఆసక్తికరంగా ఉంది. నిజానికి ఆయన చెప్పిందే ఈ పుస్తకంలో చివరికి తేలేది, ఆధ్యాత్మిక తప్పించుకోవడానికి మార్గం కాదనీ, కష్టాలనుంచీ బయటకు తీసుకురాదనీ, ఏదో ఎత్తులకి మనల్ని తీఎసుకు వెళ్ళదనీనూ 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s