అసలు సిసలు పోస్ట్ మోడర్న్ కథలు: “మాయలాంతరు”

సాధారణం

ఒక రోజు ఉదయాన్నే నిద్ర లేచాక ముఖం చూసుకుందామని అద్దం ముందుకు వెళితే అక్కడ మీ ముఖానికి బదులు ఓ పురుగు కనిపిస్తుందనుకోండి. మీ పరిస్థితి ఏంటి? ఫ్రాంజ్ కాఫ్కా అనే ఫ్రెంచి రచయిత “మెటామార్ఫాసిస్” అనే కథను ఇలా మొదలుపెడతాడు. మనిషి రోజురోజుకు ఒంటరివాడై పోవడం (థీమ్ ఆఫ్ ఎలియనేషన్), నాగరికత పేరుతో మానవ జీవితంలో జరుగుతున్న విధ్వంసం ఇలాంటి రచనల్ని సృష్టించింది. రచయిత చెప్పవలసిన విషయం, అందుకు ఎంచుకున్న ప్రక్రియల సారం – రూపం (కంటెంట్ – ఫార్మ్) ఇరవయ్యో శతాబ్దపు చివరి దశకాలలో ముందెన్నడూలేని ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఆంగ్ల సాహిత్యంలో వచ్చిన ప్రతి ప్రయోగం అనతికాలంలోనే తెలుగు సాహిత్యంలో మనం గమనించవచ్చు. అలాంటి ప్రక్రియా ప్రధానమైన శిల్పంగా పోస్ట్ మోడర్నిజమ్ ను చెప్పుకోవచ్చు. చెప్పడంలో వినూతనత్వం, చెప్పే విషయం సమకాలీనం కావడం రచయిత సామాజిక బాధ్యతను ఎత్తి చూపిస్తుంది. ఇలాంటి శిల్ప విన్యాసాల్లో కథావస్తువులను ఎంచుకుంటున్న రచయితలను తెలుగులో లెక్కబెడితే మన చేతివేళ్లు చాలా మిగిలిపోతాయి. ఆ కొద్దిమంది ప్రతిభావంతులైన ప్రభావశీల రచయితల్లో డాక్టర్ వి. చంద్రశేఖర రావు ఒకరు. ఇప్పటికి ఆయన మూడు కథా సంపుటాలను వెలువరించారు. “జీవని”, “లెనిన్ ప్లేస్”, “మాయలాంతరు”. ఇవికాక “ఐదు హంసలు” అనే నవలికను కూడా రచయిత ప్రచురించారు. వీటిల్లో “మాయలాంతరు” కథాసంపుటిని ఈ వ్యాసం పరిచయం చేస్తుంది.

ఈ కథా సంపుటి ప్రత్యేక లక్షణమేమిటంటే ఇందులోని కథలను మనం ఏకబిగిన చదవలేం. కథకూ కథకూ మధ్య కొన్ని రోజుల విరామం కావాలి. జీవితంలోని విషాదమంతా ఈ కథల్లోనే పోగుపడిందా అని భయంకూడా మనకేస్తుంది. భయం, నిరాశ, విషాదం కలగలిసిన వాతావరణంలో కథలన్నీ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఒక్కో కథ చదివిన వెంటనే కొద్ది రోజులపాటు ఆ దైన్యం మనల్ని వెంటాడుతుంది. ఆ దైన్యానికి కారణమెవరో మనకు తెలిసిపోతుంది. రాజ్యాన్నో, అధికారాన్నో, ప్రకృతినో ఏమీ చేయలేని నిస్సహాయత మనల్ని వెక్కిరిస్తుంది. దాంతో మన గుండె మరింత జారిపోయి దైన్యపు ఊబిలోపడి గిలగిల్లాడిపోతాం. సాహిత్యం కొనుక్కుని చదువుకుని ఇంత శ్రమపడడం అంత అవసరమా అని అడిగితే సమాధానం చెప్పలేం కాని, శీతాకాలంలో మంట దగ్గర కూర్చుని చలి కాచుకోవడం, వేసవికాలంలో చల్లటినీడలో సేదదీరాలనుకోవడం దివ్యమైన మానవానుభవాలు. అలాంటి మానవానుభవం పొందాలని కాంక్షించే సాహితీ మిత్రులంతా ఈ “మాయలాంతరు” కథలు చదవవచ్చు. జీవితం అనుభవాల నది ఒడ్డున సేదదీరవచ్చు. అనుభవించవచ్చు. సాహిత్యం నెరవేర్చే ఈ మహత్తర ప్రక్రియనే అరిస్టాటిల్ ‘కెథార్సిస్’ అన్నాడు. గొప్ప గొప్ప విషాదాంత నాటకాలన్నీ మనిషిలో దైన్యాన్ని క్షాళన చేస్తాయని తన “పొయెటిక్స్” లో చెప్తాడు.

ఈ “మాయలాంతరు” కథాసంపుటి ‘నీటి పిట్టల కథలు’ అనే కథతో ప్రారంభమవుతుంది. కథలో మాజిక్ రియలిజం వుంటుంది. మిస్టిసిజం వుంటుంది. పల్లెటూరిలో పొలాలు అమ్ముకుని పట్నం వచ్చి వ్యాపారం సాగించలేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతు కథనే మనకు పూర్తిగా అపరిచితమైన కొత్త కొల్లాజ్ టెక్నిక్ తో రచయిత చెప్తారు. ఒక విధంగా సామాన్య పాఠకునికి ఇదో మానసిక వ్యాయామం. చిన్న చిన్న వ్యాపార స్తులను వడ్డీ వ్యాపారులు కప్పల్ని పాములు మింగేసినట్టుగా మింగేయడం చూస్తాం. ఇంకా వైద్య వృత్తిలో దోపిడీని చూస్తాం. సాహిత్య విద్యార్థులమై తే కథలో కథను చెప్పడమెలానో పరిశీలిస్తాం. మత ఘర్షణల నేపథ్యంలో సాగిన ‘సలీం సుందర్ ప్రేమ కథ’ చైతన్య స్రవంతి ధోరణినీ, అబ్సర్డిటీని, ఎగ్జిస్టెన్షిలియలిజాన్ని దాటుకుని సర్రియలిస్టిక్ ధోరణిలో చెప్పిన ఆధునికానంతర కథగా చెప్పుకోవచ్చు. 2001 ప్రజాతంత్ర వార్షిక సాహిత్య ప్రత్యేక సంచికలో వచ్చినప్పుడే ‘కాకుల ఇల్లు’ కథ పెద్ద దుమారం రేపింది. దళిత నాయకుడిని హత్యచేసిన హంతకులు సాక్ష్యం చెప్పడానికి సాహసించిన వారినికూడా హత్య చేయడం ఈ కథావస్తువు. ఉత్తర తండ్రి పనిచేస్తున్న ఏనిమల్ లేబరేటరీలో పెంచుతున్న ఆవు మాయ. రెండు ఏనుగులంత ఆ ఆవు చిన్నారి ఉత్తర ఇంటలెక్చువల్ ఫ్రెండ్. ఇది గుండె లోతుల్ని తట్టే కథ. దళిత ఉద్యమంలో చురుకుగా పనిచేస్తున్న తల్లిదండ్రులను ఉద్యమానికి విడిచిపెట్టేసి తమ పొట్టచేత పట్టుకుని పట్ట ణాలలో ఉద్యోగాలు చూసుకునే పిల్లల కథ ‘చరిత్ర’. ఆ పిల్లలలో గిల్టీ కాన్షస్ నెస్ ను వివరంగా చిత్రించిన ఈ కథ కూడా టెక్నికల్ గందరగోళమే. ఇంకో కథ పేరు ‘చలికాలం ఒక మేఘం అంతే కథ!’. ఈ కథలో మేఘం దేనికి ప్రతీక – చావుకా? దు:ఖానికా? వ్యథాభరిత జీవితానికా? ముందు అనుకున్నట్టు గ్లూమీనెస్ మోసుకొచ్చే దిగులుకా? కనిపించిన ప్రతివారికీ వాళ్లవాళ్ల వెబ్ సైట్లను పచ్చబొట్లలాగా పొడిచేస్తుంటారీ కథలో. వికృతంగా పెరిగిపోతున్న వినియోగ తత్వాన్ని వెటకారంగా చెప్పడమే కథారచయిత ఉద్దేశం. మోహినీ అపార్ట్ మెంటులో ఒక గదిలో మరణించిన లోకేశ్ వున్నట్టు కథకుడు భ్రమ పడడంకూడా ఈ కథలో ఒక వెంటాడే జ్ఞాపకం (హాంటింగ్ మెమరీ).

ఈ కథా సంపుటిలోకెల్లా నాకు బాగా నచ్చిన కథ ‘నిప్పు పిట్ట, ఎర్ర కుందేలు మరియు అదృశ్యమౌతున్న జాతుల కథ’. చంద్రశేఖర రావు కథన శిల్పాన్ని, శైలిని, వర్ణించగలిగే, వివరించగలిగే మాటలు మనకు దొరికేది ఈ కథలోనే. పేజీ 66లో ఈ వాక్యాలు చదవండి: ‘చావుకు భయపెట్టే గుణం పోయింది. ఇప్పుడు అందరినీ భయపెట్టేది మానవ సంబంధాల ధ్వంసం. వ్యాధికన్నా, చావుకన్నా, ఎక్కువ భయం కలిగించేవి మనుషుల్లోని ఎడారులు’. జ్ఞాపకం వుండడం వల్లనే ఈ బాధలన్నీ, అందుకని కొన్ని విషయాలు జ్ఞాపకం లేకపోతే ఎంతో బాగుంటుందనుకుంటాం. మరికొన్ని విషయాలు మరిచిపోతే మంచిదనుకుంటాం. ఇందులో కథకుడితోపాటు మోహినికూడా ఎలా స్పందిస్తున్నారో చూడండి: ‘జ్ఞాపకాల్ని పోగొట్టుకోవడమే! ఎందుకో క్షణంపాటు జలదరింపులా తోచింది’. ‘నాకీ జ్ఞాపకాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు. ఈ మరణం, వేదన, ఆందోళన, భయం, కోరిక, పోరాటం నాకు సైనికురాలుగా జీవించడమే ఇష్టం‘.  p.68 మోహన సుందరం మాటల్ని కథకుడు ‘సుధీర్ఘమైన దు:ఖగాథ’తో పోలుస్తాడు (పేజీ 70). ఈ పదబంధాన్ని కథారచయితకు కూడా అన్వయించవచ్చు.

‘అపరిచిత భాషలు’ అనే మరో కథ వుంది. నిశ్శబ్దం కూడా ఒక పనిష్మెంట్ లాంటిదేనని ఒప్పుకుని తీరుతాము. ఊరవతల వీధి చివరి ఇల్లు, ఆఫీసు ఉద్యోగంతో అలసిసొలసి ఇంటికి చేరిన భర్త కూడా మాట్లాడడు. ఇది కూడా డొమెస్టిక్ వయొలెన్స్ గా గుర్తిస్తాం. ఐదారేళ్ల కిందట నల్గొండ జిల్లాలో పౌరహక్కుల ఉద్యమ కార్యకర్త బెల్లి లలితను ‘ఎవరో’ అతి కిరాతకంగా చంపేశారు. ఎంత దారుణమంటే శరీరాన్ని పదమూడు ముక్కలుగా కోసి లలితక్క ఊరిలోనే ఒక్కో శరీర భాగం ఒక్కోచోట పడేశారు. (ఆ తరువాత కొద్ది మాసాలకే ఎలిమినేటి మాధవరెడ్డిని అప్పటి నక్సలైట్లు ప్రతీకారంగా హతమార్చారని అప్పట్లో అంతా గొణుక్కునేవారు). ఈ కిరాతకంపై స్పందనే ‘మాయలాంతరు’ కథగా మనం భావించవచ్చు. దళిత రచయిత పాత్రను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఈ కథలన్నీ చదివాక మనకు అనిపించేది రచయిత ఎంతో పొదుపుగా సంభాషణలు వాడుతుంటారని. సినిమాల్లో రీళ్లమాదిరిగా, దృశ్యమాలగా సంఘటన తర్వాత సంఘటన జరిగిపోతుంటాయి. మనోఫలకంపై ఆ కథంతా ఒక రీలులాగా తిరుగుతుంది. భయంగొలిపే నిశ్శబ్దం నేపథ్య సంగీతమవుతుంది. కిందటేడాది నోబెల్ బహుమానం పొందిన హెరాల్డ్ పింటర్ ను ఈ బీభత్స రసం సృష్టించేవానిగా కీర్తిస్తారు. మెనేస్ (బీభత్సం అని తెలుగులో అనొచ్చా?) ను అద్భుతంగా ఆవిష్కరిస్తాడని పింటర్ రచనాశైలిని ‘పింటారెస్క్’ అని పిలుస్తారు. కానీ, అతడు మన చంద్రశేఖరరావు కథలను చదివితే ఏమనుకుంటాడో? ఈ కథనాల్లో కథ సాఫీగా సాగదు. సంఘటనలు కూడా ఒక క్రమంలో వుండవు. శకలాలుగా కథాంశం పాఠకుని చేరుతుంది. వాటన్నింటిని ఓపిగ్గా బ్రెయిన్ టీజర్ పజిల్ లాగా ఒక క్రమంలో పేరిస్తేనే పాఠకునికి సంపూర్ణ చిత్రం ఆవిష్కృ తమయ్యేది. 

254 పేజీలు, 21 కథలతో “మాయలాంతరు” పుస్తకాన్ని 50 రూపాయలకే పొందవచ్చు. ప్రచురణకర్త వివరాలు లేని ఈ పుస్తకంలో పోస్ట్ మోడర్న్ కథలతోపాటు  ”చంద్రశేఖరరావు కథలు, నేపథ్యం, నిర్మాణం” అన్న బి. తిరుపతిరావు వ్యాసాన్ని కూడా చదవొచ్చు. పూర్తిగా ప్రాచ్య సాహిత్యపు ప్రభావంతో రాసిన తెలుగు కథలు కావడం వల్ల నా ఈ వ్యాసంలో చాలా ఆంగ్ల పదాలు అనివార్యంగా దొర్లాయి. కాని కథల్లో మాత్రం రచయిత ఎంతో నిగ్రహంగా తెలుగు పదాలనే వాడడం విశేషం. మరి మీరూ వీటిని చదువుతారుగా!

ప్రకటనలు

8 responses »

 1. మీ సమీక్ష చాలా బాగుంది. పుస్తకాన్ని చదవాలనిపించే ఆసక్తి కలిగించింది.

  చిన్న సవరణ: కాఫ్కా ఫ్రెంచి రచయిత కాడు; జర్మన్‌ రచయిత. అతని ‘మెటమార్ఫసిస్‌’ కథ కూడా అద్దంలో చూసుకోవడంతో మొదలు కాదు, నిద్ర లేవడంతో మొదలౌతుంది.

 2. చంద్రశేఖర రావు గారు చాలామందికి (నాకు కూడా) ఒకసారి చదివితే కొరుకుడు పడని రచయిత. “ఐదు హంసలు” నవలికకి ఆటా (American Telugu Association) వారి నవలల పోటీలో బహుమతి వచ్చింది. అప్పుడది ఆటా వారి ద్వైమాసిక ప్రింటు పత్రిక “అమెరికా భారతి” లో ధారావాహికగా ప్రచురించబడింది. (“ఏవి తల్లీ నిరుడు కురిసిన.. ” నిట్టూర్పు..) చంద్రశేఖర రావు గారి కథ “ఫూ..” కి 1998 తానా (Telugu Association of North America) కథలపోటీలో బహుమతి వచ్చిది. “ఫూ..” కథని ఈమాటలో చదవచ్చు.

  సమీక్షలు చక్కగా రాస్తున్నారు, కానీ, బ్లాగులో అక్షరాల సైజే మరీ చిన్నదిగా ఉంది. అక్షరాల సైజు కొంచెం పెద్దది చేస్తే పాఠకుల సౌకర్యం exponential గా పెరుగుతుంది. గమనించగలరు.

 3. పూర్ణిమ, కొత్తపాళి, ఫణి, ప్రవీణ్, పద్మ గార్లకు వ్యాసం ఆద్యంతం చదివినందుకు కృతజ్ఞత.

  పూర్ణిమ గారూ, పుస్తకాలు దొరికేచూటు గురించి శ్రీకాకుళవాసిని నాకెలా తెలుస్తుంది? మాకిక్కడ కథల పుస్తకాలు అమ్మే షాపు ఒక్కటి కూడా లేదంటే మీరెవరూ నమ్మరు. ఏ పుస్తకం కొనాలన్నా విశాఖపట్నం వెళ్ళాల్సిందే. ఇక శ్రీకాకుళం అనగానే కథానిలయం చాలామందికి గుర్తుకొస్తుంది. ఒక సాహితీ మిత్రుని మాటల్లో చెప్పాలంటే అది కథలను నిక్షిప్తం చెయ్యడానికే గాని, చదివించడానికి కాదు. కొత్త పాఠకులనూ తయారు చెయ్యలేదు. రచయితల సంగతి సరేసరి.

  ఫణిగారూ కాఫ్కా జర్మనా? థాంక్యూ.

  పద్మగారూ, నేను కంప్యూఇల్లిటరేట్ ను. దిలీప్ గారు దిద్దించిన ఒరవడిలోనే రాసి నా వ్యాసాలు అందిస్తున్నాను. మీరు ‘వ్యూ’లో అక్షరాల సైజు పెంచి చదవచ్చనుకుంటా. నేనలాగే చదువుతుంటా.

 4. రవి గారు,
  చంద్రశేఖర రావు గారి రచనలు నాకు బాగా నచ్చుతాయి. నేను ఇదివరలో ఆయన కథలు విడి విడిగా పత్రికల్లో ప్రచురితమైనపుడు చదివాను. మాయలాంతరు గురించి ఆ మధ్య నా కజిన్ ఒకడు చెపితే కొనాల్సిందే అనుకుంటున్నా. మీ సమీక్ష చదివాక కొంచెం వాన తగ్గాక తప్పకుండా కోఠి వెళ్ళాల్సిందే అనుకుంటున్నా!

 5. మన్నించండి రవిగారు.. హైద్ లో ఉంటున్నా నాకు చాలా పుస్తకాలు దొరకటం లేదు. ముద్రణలు లేవు అని చెప్తున్నారు. అందుకే “మార్కెట్” లో ఉందా అని అడిగే ఉధ్దేశ్యం!! మీరు కాకపోయినా మరెవరైనా చెప్తారేమో అన్న ఆశ!! 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s