“1857” పై వెలువడిన ఇంగ్లిష్ నవలా సాహిత్యం… మొదటి భాగం

సాధారణం

null

బహిరంగపరచుకున్న బ్రిటిష్ సామ్రాజ్యవాద అభిజాత్యం

భారతదేశ చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలోనే విశిష్ట స్థానమున్న 1857 తిరుగుబాటును ఇప్పటికీ మనం వలసవాదులకు వ్యతిరేకంగా సాగించిన తొలి స్వతంత్ర సమరంగానే భావిస్తున్నాం. ఆ తిరుగుబాటు గుణ, రూప, స్వభావాలు ఎలా వున్నప్పటికీ అప్పటి వలసవాదులు సాగించిన కల్పన సాహిత్యంపైన అది చాలా ప్రభావాన్ని చూపించింది. వలసవాదులు సాగించిన సృజన ఎలా ఉండేదన్న విషయం పట్ల మనకు స్పష్టమైన అభిప్రాయాలుండాలి. లేదంటే వాటిని అర్థం చేసుకోవడంలో చాలా పొరబడతాం. బ్రిటిష్ సామ్రాజ్యవాద మనస్తత్వానికి ఈ తిరుగుబాటు పెద్ద చెంపదెబ్బ. ఒక్కసారి వారి బుర్ర తిరిగి, కళ్లు బైర్లు కమ్మేట్టు చేశాయి తిరుగుబాటు సంఘటనలు. నిజానికి అత్యంత దారుణంగా తిరుగుబాటును అణచివేసినప్పటికీ అప్పటి స్థానిక తిరుగుబాటు నాయకుల చేతిలో చావుతప్పి కన్నులొట్టబోయిన బ్రిటిష్ సైన్యపు ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికే ఆనాడు కల్పన, కల్పనేతర సాహిత్యం వెలువడిందనే సంగతి గుర్తించిననాడే అప్పటి వలసవాద సాహిత్యాన్ని మనం సమగ్రంగా అవగతం చేసుకోగలుగుతాం. ఆ నవలల్లో లేదా ఇతర రచనలలో భారతీయుల దుర్మార్గత్వాన్ని, బ్రిటిష్ వారి చాకచక్యాన్ని వర్ణించారు. తిరుగుబాటు తరువాత వలసవాదులు తమలో వున్న అభద్రతను, ఆందోళనలను పోగొట్టుకోవడానికే మిగతా బ్రిటిష్ అధికారుల వీరోచిత పోరాట గాథలు రాశారు. ఈ రచనలద్వారా వారికి వారే సంఘీభావం ప్రకటించుకున్నట్టుగా మనం గమనించాలి.

1857 సంఘటనల ప్రేరణతో వచ్చిన మొదటి నవలగా లెఫ్టినెంట్ కల్నల్ ఎడ్వర్డ్ మనీ రాసిన “ది వైఫ్ అండ్ ది వార్డ్” లేదా “లైఫ్ ఎర్రర్” (అప్పట్లో నవలకు రెండు పేర్లు పెట్టడం ఆనవాయితీ!) 1859లో వెలువడింది. తిరుగుబాటు సంఘటనలన్నీ 19వ శతాబ్దపు చివరినుంచీ 20వ శతాబ్దపు తొలి దశకాల వరకూ వెలువడిన వలసవాద సాహిత్య సృజనను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఒకవిధంగా “మ్యూటినీ” నవల పుట్టుకకు కారణమయ్యాయి. ఈ రకపు నవలలు ఇటు బానిస భారతంలోనూ అటు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలోనూ విశేషంగా ప్రజాదరణ పొందాయి. ఒక లెక్క ప్రకారం తిరుగుబాటు జరిగిన తరువాత ఆరు దశాబ్దాల కాలంలో సుమారు 70 నవలలు వలసవాద రచయితలు రచించినట్టు కనిపిస్తోంది. ఈ నవలలను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మూడు రకాల ధోరణులు ఆ రచయితల మనస్తత్వంలో కనిపిస్తున్నాయి. తొలి మూడు దశాబ్దాల కాలంలో రచయితలు కొంత ఉదార ధోరణిని కనపరిచారు. భారతీయుల పక్షాన ఏ కొంచెమో నిలబడినట్టు తోస్తుంది. కానీ తరువాత మూడు దశాబ్దాల కాలంలో వెలువడిన రచనలలో భారతీయతపట్ల తీవ్ర అక్కసు వెలిగక్కడం కనిపిస్తుంది. ఇక్కడి విలువలను కించపరుస్తూనే, తమని గురించి అతిగా ప్రస్తుతించుకుంటూ రచనలు సాగించారు. కానీ “స్వతంత్ర భానోదయ” సమయాన మళ్లీ ఉదారవాద ధోరణి పొడసూపింది.

1870ల నుంచి 1900 వరకు వెలువడిన నవలల్లో ప్రాతినిధ్యపు వైవిధ్యాలు, వైరుధ్యాలు, దృక్కోణంలో ఏర్పడిన మార్పులను పరిశీళిస్తే ఆసక్తికరంగా వుంటుంది. ఒక ఉదాహరణగా ఈ కాలంలో కొంతమంది రచయితలు తమ నవలల్లో ఝాన్సీరాణి లక్ష్మీబాయిని, 1857 తిరుగుబాటుకు గల కారణాలను విశ్లేషించిన తీరును గమనిస్తే చాలు. ఆ కాలంలో వలసవాద రచయితల దృక్కోణం, వారి ఆసక్తులు స్పష్టంగానే బయటపడతాయి. ఆ నవలల్లో రాణి పాత్రను ఖచ్చితంగా చిత్రించకపోవడమే కాకుండా, వాస్తవాన్ని ప్రతిఫలించాలనే దానికన్నా వారి భావజాలపు ముసుగులతో పాత్రలను తీర్చిదిద్దడాన్ని గమనిస్తాం. ఆ భావజాల ప్రచారంలోనే వారి దృక్కోణం మనకు తెలిసిపోతుంది. అయితే అదే క్రమంలో ఆ నవలలను అధ్యయనం చేసినప్పుడు ఆ ధోరణిలోనూ, భావజాలంలోనూ వస్తున్న క్రమమైన మార్పులను కూడా పసిగట్టడానికి వీలవుతుంది. ఇలా పోగుపడిన సాహిత్యం చాలావరకు ప్రేమ, సాహసగాథలతో కూడుకున్న రొమాన్స్ (భావుక) నవలలే. ఈ నవలాంశాలలో అటు బ్రిటిషువారు ఇటు భారతీయులు లేదా తిరుగుబాటుదారులు అనే స్పష్టమైన విభజనను రచయితలు పాటిస్తుండేవారు. జాతి, సంస్కృతి, లింగ, అధికార వివక్షలతోపాటు సెక్సువాలిటీకి సంబంధించిన అనేక గాధలు అల్లేవారు. ఆసియావాసుల కౄరత్వాన్ని, విశ్వాస ఘాతుకాన్ని, బ్రిటిష్ మహిళలపై చేసిన దారుణాలను వర్ణిస్తూనే, బ్రిటిష్ అధికారుల ధైర్య సాహసాలను, తమ మహిళలను కాపాడుకోవడంలో ప్రదర్శించిన సాహసోపేతమైన మగటిమిని ఆ నవలల్లో వివరంగా చిత్రించేవారు.

ఏది ఏమైనా ఈ రచనలన్నింటి లక్ష్యమల్లా ఒక్కటే. బ్రిటిషువారి ‘సదాచారాన్ని’, ఆ సైన్యపు ఆధిక్యతను ప్రదర్శించుకోవడమే. దీనికోసమే తిరుగుబాటుకు సంబంధించిన కొన్ని మూసపాత్రలు, ఇమేజ్ లు (దృశ్యచిత్రాలు) సృష్టించడం ద్వారా 1857 తిరుగుబాటుకు సంబంధించి కొంత ‘జ్ఞానం’ వాళ్ల ప్రజలకు అందించగలిగారు. ఇండియాలో వివిధ హోదాల్లో వున్న సైనికాధికారులు, పాలనాధికారులు ఈ అంశాలమీద విరివిగా రాయడంతో విదేశాల్లో వున్న పాపులర్ బ్రిటిష్ రచయితలు జి.ఏ. హెంటీ లాంటివాళ్లు కూడా ఇదే మూసలో అనేక నవలలు రచించారంటే ఆశ్చర్యం లేదు. ఈ అంశాలకు సాక్ష్యంగా 1897లో ‘బ్లాక్ వుడ్ ఎడిన్ బర్ మ్యాగజీన్ లో హిల్డా గ్రెగ్ రాసిన “కల్పనా సాహిత్యంలో భారత సిపాయిల తిరుగుబాటు” వ్యాసాన్ని అనేక మంది పరిశోధకులు ప్రస్తావిస్తుంటారు. ఇలాంటి సాహిత్యం విరివిగా వెలువడడం వల్ల ఝాన్సీరాణి లాంటి తిరుగుబాటు నాయకుల గురించి, వారు పోషించిన పాత్ర గురించి, వాళ్ల స్వభావం గురించి, బ్రిటిషు అధికారుల వీరోచితత్వం గురించి కథలు కథలుగా ప్రజల్లో నాటుకుపోయింది. దీంతో వారి ఆలోచనలుకూడా కండిషనింగ్ కు గురయ్యాయనే చెప్పాలి.

రాణి పాత్ర చిత్రణ మనకెన్నో కొత్త పాఠాలు నేర్పిస్తుంది. ముఖ్యంగా బ్రిటిషువారి ఆలోచనలను, దృక్పథాలను వెల్లడి చేస్తుంది. ‘బ్రిటిష్’ కళ్లకు భయమెరుగని యుద్ధ వీరురాలు ఝాన్సీరాణి గురించిన ఊహలు అంబరాన్ని చుంబించేవి. ఆమె సాహసం, వ్యూహ ప్రతివ్యూహాల గురించి అందరి వర్ణన లు మినహాయింపులు లేకుండా ఆకాశానికెత్తేశాయి. ఇవన్నీ మనిషి నుంచి మనిషికి పోయేసరికి మిగతా తిరుగుబాటు నాయకుల కంటే ఆమె చుట్టూనే అనేకానేక రొమాంటిక్ మెరుపులూ మలుపులూ చేరిపోయాయి. తిరుగుబాటుకు గల కారణాల మీద అనేక సిద్ధాంతాలు ఈ రచయితల బుర్రల్లో మెదిలాయి. మత మార్పిడుల వల్ల, సిపాయిల అసంతృప్తుల వల్ల, రైతులు తాలూక్ దారుల మధ్య సంబంధాలు తెగిపోవడం వల్ల, ‘స్థానిక’ జమిందారులు, నాయకులు తాము కోల్పోయిన అధికారాలు పొందాలనుకోవడం వల్ల… అంటూ అనేక కారణాలను సూత్రీకరించారు. బ్రిటిషువారి మీద కక్ష కట్టిన స్థానిక పాలకులు సతారాకు చెందిన నానా సాహెబ్, ఝాన్సీకి చెందిన రాణి లక్ష్మీబాయి, ఘజియాబాద్ మౌల్వీ ఫిరుజ్ షా, తాంతియా తోపే, రావ్ సాహెబ్, కున్వర్ సింగ్ వీరంతా సమష్టిగా ఢిల్లీకి వెళ్లి మొఘలు చక్రవర్తి బహదూర్ జాఫర్ షాతో జట్టుకట్టారు – పూర్వ అధికార వైభోగం సాధించాలని.

వలసవాదుల రచనలను పరిశీలించే ముందు ఝాన్సీరాణి గురించిన వాస్తవాలను మనం తెలుసుకోవాలి. మోరోపంత్ తాంబే, భగీరథి బాయి అనే బీద బ్రాహ్మణ దంపతులకు లక్ష్మీబాయి జన్మించింది. ఆమె బాల్యమంతా బెనారస్, బితూర్, బుందేల్ ఖండ్ ప్రాంతాల్లో అబ్బాయిలతోనే కలిసిమెలిసి ఆడుతూపాడుతూ గడిపింది. ఆమె బాల్య మిత్రులలో నానాసాహెబ్ ఒకరు. అందువల్లనే ఆమె చిన్నతనంలోనే గుర్రపుస్వారీ, కుస్తీ, మల్ల యుద్ధం లాంటి వాటిల్లో ప్రావీణ్యం సంపాదించింది. ఝాన్సీకి చెందిన మరాఠా రాజు గంగాధరరావు రెండవ భార్యగా ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరంతా బ్రిటిష్ విధేయులు. 1853లో గంగాధరరావు మరణించేవరకూ ఆమె బ్రిటిష్ వారిని ప్రశంసించింది. రాజు పెంపుడు బిడ్డ దామోదరరావును వారసునిగా బ్రిటిషువారు అంగీకరించకపోవడంతోనే రాణి మనసు మారింది. లండన్ కోర్టులో కేసుకూడా వేసింది. కాని ఓడిపోయింది. అలాంటి పరిస్తితుల్లో ఝాన్సీకి వచ్చిన తిరుగుబాటుదారులతో లక్ష్మీబాయి చేతులు కలిపి బ్రిటిషు సైన్యానికి వ్యతిరేకంగా కత్తి ఎత్తింది.

ఆ తిరుగుబాటుకున్న స్వభావంలాగే, అందులో లక్ష్మీ పాత్రకూడా ఆధునిక చరిత్రకారులలో పెద్ద చర్చ  రేకెత్తించింది. ఈ తిరుగుబాటును ప్రథమ స్వతంత్ర సంగ్రామమని పిలిచిన జాతీయవాద చరిత్రకారులంతా రాణిని బ్రిటిష్ వ్యతిరేకిగా, వలసవాద వ్యతిరేకిగా చిత్రించడమే కాకుండా జాతీయవాదానికి, దేశభక్తికి ఆమెనో చిహ్నంగా నిలబెట్టారు. ఆర్. సి. మజుందార్ లాంటి మరికొందరు చరిత్రకారులు మాత్రం రాణిని ‘జాతీయవాది’ పీఠంనుంచి పక్కకు తోసి ‘అసమ్మతి తిరుగుబాటుదారు’గా కొంతవరకు చిత్రించగలిగారు. ఆమెకు బ్రిటిషువారు సరైన న్యాయపరమైన సహాయం చెయ్యకపోవడం వల్లనే తిరుగుబాటుదారులతో చేతులు కలిపారని చెప్పారు. ఇటీవలి చరిత్రకారుడు తపతిరాయ్ కూడా 1858 ఫిబ్రవరి వరకు కూడా లక్ష్మి బ్రిటిషువారి సహాయం కోసం ఎదురుచూసిందనే చెప్పారు. కాని ఆ తరువాత మాత్రం తిరుగుబాటు సంఘటనల్లో, జరిపిన పోరాటాల్లో ఆమె చూపిన తెగువ, చాకచక్యాలను చరిత్రకారులంతా ముక్తకంఠంతో మెచ్చుకున్నారు. విభిన్న గ్రూపులకు చెందిన బుందేలా రాజపుత్రులను, మరాఠా బ్రాహ్మణులను, ఆఫ్గన్ పఠానులను, పురబియా సైన్యాన్ని ఏకం చేయడంలో ఆమె సమర్ధత సాటిలేనిదని వారంతా పొగిడారు.

…..(మిగతా – రెండో భాగంలో)

ప్రకటనలు

2 responses »

  1. ఇదే విషయంపై రెండేళ్ళ క్రితం ఒక మంచి పుస్తకం వచ్చింది. The Indian Mutiny and the British Imagination, Gautam Chakravarty, Cambridge University Press, 2005. మీ రెండో భాగం పూర్తయిన తరువాత వివరంగా మాట్లాడుకుందాం.

    శ్రీనివాస్

  2. పింగుబ్యాకు: “1857″ పై వెలువడిన ఇంగ్లిష్ నవలా సాహిత్యం… రెండవ భాగం « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s