“1857” పై వెలువడిన ఇంగ్లిష్ నవలా సాహిత్యం… రెండవ భాగం

సాధారణం

ఈ వ్యాసపు మొదటి భాగాన్ని మీరు ఇక్కడ చదవొచ్చు. https://chaduvu.wordpress.com/2008/07/30/colonialnovel01/

రాణి గురించి చర్చించిన వలసవాద రచనల్లో రెండు అంశాలు అగుపిస్తాయి. ఝాన్సీకి తమ దత్తపుత్రుని వారసునిగా ప్రకటించడానికి అంగీకరించకపోవడంవల్లే ఆమె తిరుగుబాటు బాట పట్టిందనేది మొదటి అంశం. సామ్రాజ్యవాద తిరుగుబాటు చరిత్రకారులు జాన్ కాయె, జార్జ్ మాలేసన్ లాంటివారు కూడా లక్ష్మిబాయి తిరుగుబాటులో పాల్గొనడానికి కారణం బ్రిటిషువారు అవమానించడమేనని చెప్పడమేకాక ఈ కారణం వల్లనే ప్రజలంతా ఆమె పక్షాన నిలిచారని చెప్పారు.

బ్రిటిషువారిలో కల్లోలం రేపిన రెండో అంశం – ఝాన్సీకోటలో తలదాచుకున్న 60 మంది ఇంగ్లిషువారిని ఊచకోత కోసిన సంఘటనలో రాణి హస్తమున్నదా లేదా అనేది. వారక్కడ సురక్షితంగా వుంటారని హామీ పొందాక కూడా వారిని చంపేయడం వల్ల ఆ సంఘటనను అతిదారుణమైన పైశాచికత్వంగా భావించారు. కాన్పూరులో సతీ చౌరాఘట్, బీబీఘర్ సంఘటనల తర్వాత రెండో దారుణమైన సంఘటనగా బ్రిటిషువారు దీని గురించి మధనపడ్డారు. ఈ రెండు సంఘటనలకు కారణమని భావించిన నానాసాహెబ్, లక్ష్మీబాయిలు దగ్గరి బంధువులు కూడా. అందుకే వీరిద్దరినీ బ్రిటిషు అధికారులు దెయ్యాలుగానే చూశారు. అదే సమయంలో కొంతమంది మాత్రం ఒక సంగతి స్పష్టంగా గుర్తించకపోలేదు. బ్రిటిషు పాలన విధానంలోని లోపంవల్లనే, ఝాన్సీ అధికార బదలాయింపు విషయంలో ప్రభుత్వ నిర్ణయం అడ్డగోలుగా వుండడం వల్లే ఈ సంఘటనలు జరిగాయని గుర్తించారు. ఈ దారుణంలో తనకు ప్రమేయం లేదని లక్ష్మీ వాదించినప్పటికీ బ్రిటిషు అధికారులూ, రచయితలూ చెవిన పెట్టలేదు. కాని తిరుగుబాటు అనంతర పరిశోధన మాత్రం ఈ దురాగతానికి లక్ష్మీబాయికి సంబంధం లేదనే స్పష్టం చేస్తోంది. ఎలాగో బతికి బయటపడ్డ శ్రీమతి మట్లో, రాణి నిర్దోషిత్వాన్ని వివరించారు. రాణి తనయుడు దామోదరరావుకు మరో ప్రత్యక్ష సాక్షి టి.ఏ.మార్టిన్ రాసిన ఓ లేఖలో చాలా స్పష్టంగా ఈ సంగతి చెప్పారు. “జూన్ 1857లో జరిగిన బ్రిటిషు ప్రజల ఊచకోతలో రాణికి ప్రమేయం లేదు. పైగా రెండు రోజులకు సరిపడా భోజన వసతిని కూడా ఆమె సమకూర్చారు” అని రాశారు. కాని అవమానం, ప్రతీకారంతో రగిలిపోయిన బ్రిటిషు రచయితలంతా దయాదాక్షిణ్యాలు లేకుండా స్త్రీలను, పిల్లలను చంపించిన కిరాతకురాలిగానే రాణిని చిత్రించారు.

మరోవైపు, చాలా విచిత్రంగా, అదే బ్రిటిషు రచయితలు ఆమె ధైర్య సాహసాలను కొనియాడుతూ రాశారు. అందరిలోకెల్లా ఆమెను అతిగా పొగిడింది జనరల్ హ్యూ రోజ్. జూన్ 1858లో ఆమెను చివరిసారిగా యుద్ధరంగంలో ఎదుర్కొన్నది ఇతనే. ఆమెను ఓడించిన జనరల్ రోజ్ లక్ష్మీబాయిని “భారతీయ జోన్ ఆఫ్ ఆర్క్” అని ప్రశంసించాడు. ‘తిరుగుబాటు నాయకుల్లోకెల్లా అత్యంత ధైర్యవంతురాలు’ అన్నాడు. లక్ష్మీబాయి నేలకొరిగిపోతున్నప్పుడు దగ్గరుండి చూసిన రోజ్ వర్ణించిన మాటల్లోనే ఇప్పటికీ మన చిత్రకారులు ఆమెను చిత్రిస్తుంటారు. ఎర్ర జాకెట్, ఎర్రటి ఫేంట్, తెల్లవోణీ తొడుక్కున్న రాణి, సింధియా ఖజానా నుంచి తెప్పించిన ముత్యాలహారం, బంగారు కడియపు గాజులు వేసుకుని గుర్రం మీద కూర్చుని, కత్తి పైకెత్తి పట్టుకుని కదనరంగంలో శత్రువులను దనుమాడే దృశ్యమది.

రాణి పాత్ర చిత్రణ గురించిన కొన్ని నవలలను మరికాస్త లోతుగా పరిశీలిద్దాం. 1870లలో వలసవాద రచయితలు వెలువరించిన నవలల్లో చాలా ప్రాముఖ్యమనుకున్న నవల ఫిలిప్ మీడోస్ టేలర్ రాసిన “సీత” 1872లో వెలువడింది. (దీనిని ఇండియాలో ఆసియా ఎడ్యుకేషనల్ సొసైటీ, న్యూఢిల్లీ ప్రచురించింది. వెల రూ. 465 మాత్రమే!) 1857 తిరుగుబాటు నేపథ్యంలో విధవరాలైన హిందూ స్త్రీ, బ్రిటిషు అధికారి మధ్య సాగిన జాత్యంతర ప్రేమకథలా బయటకు కనిపించినప్పటికీ తరచి చూసినప్పుడు తిరుగుబాటు గురించే చెప్పిన కథనంలా వుంటుందీ నవల. పెచ్చుమీరిన జాతి విద్వేషాలను, భారతీయ మహిళలకు సంబంధించిన సంప్రదాయాలలో బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం పట్ల స్థానికుల్లో నివురుగప్పిన నిప్పులాగా వున్న ఆగ్రహజ్వాలల చిత్రీకరణ వుంది. వీటికితోడు రాణి లక్ష్మీబాయిని అటు వీరోచితురాలిగా, ఇటు నీతి తప్పిన మహిళగా అభివర్ణించడమే పెద్ద వైరుధ్యం. ఈ వైరుధ్యం టేలర్ వ్యక్తిత్వంలోనే వుంది. చిన్నప్పుడే ఇండియాలో స్థిరపడిన టేలర్ కు మన సంస్కృతిపట్ల సదభిప్రాయం వుంది. బేరార్ ప్రాంతంలో తిరుగుబాటుదారుల దాడిని భగ్నం చేస్తూనే మరోపక్క తూర్పుఇండియా కంపెనీ విధానాలను ఎండగట్టేవాడు. అవధ్, ఝాన్సీ సంస్థానాల విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఇతడే, తిరుగుబాటును ఉక్కుపాదంతో అణిచివేయాలన్న కానింగ్ పాలసీని సమర్ధించాడు. ఈ నవలలో లక్ష్మీబాయి కోసం ఒక అధ్యాయాన్నే టేలర్ కేటాయించాడు. ఆమెను సమర్ధురాలైన పరిపాలకురాలిగా చిత్రించాడు. బ్రిటిషువారికెంతో విశ్వాసపాత్రురాలైన ఆమె భీకరమైన శత్రువుగా మారడంలో తమ పాలకుల పాత్రను నిందించాడు. ఖిన్నురాలైన లక్ష్మీబాయి దహించుకుపోతున్న ఆగ్రహంతో తన కోటలో బ్రిటిష్ పౌరుల ఊచకోతకు పాల్పడిందన్నాడు. ఈ ‘సీత’ నవలలో టేలర్ ఇండియామీద రాయాలనుకున్న ముక్కోణపు సిరీస్ పూర్తయింది. 17వ శతాబ్దంలో బలహీనమవుతున్న మొఘలుల నుంచి మరాఠాలు నెమ్మదిగా ప్రభవించడం మీద 1657 ప్రాంతాల కథగా “తార” నవలను, 1757 ప్లాసీ యుద్ధం నేపథ్యంలో “రాల్ఫ్ డార్నెల్” నవలను రాశాడు. 1857 సంఘటనల నేపథ్యంతో రాసిన “సీత” ఆ త్రయం (ట్రయాలజీ)లో చివరిది. అలా మొత్తంగా బ్రిటిష్ వాడు ఇండియాలో పాగావేసిన వైనాన్ని చిత్రించాడన్న మాట. సహజంగానే ఇందులో సంఘ సంస్కరణ ధోరణి కనిపిస్తుంది. చెడిపోయిన ఇక్కడి సమాజాన్ని బాగుచేయడానికే తాము వచ్చామన్న అభిజాత్యం అగుపిస్తే ఆ తప్పు మనది కాదు.

మరో నవల ఫ్లోరా ఆనా స్టీల్ రాసిన “ఆన్ ది ఫేస్ ఆఫ్ వాటర్స్” 1896లో వెలువడింది. స్కాట్ లాండుకు చెందిన ఈమె బ్రిటిషు అధికారిని వివాహం చేసుకుని ఇండియా వచ్చింది. మొత్తంగా 22 ఏళ్లపాటు ఇక్కడే గడిపిన స్టీల్ ఈ నవల రాయడానికి ఎంతో పరిశోధన చేసింది. ప్రభుత్వ డాక్యుమెంట్లు చూడడమే కాకుండా ఆయా సంస్థానాలను కూడా చూసింది. ఈ నవల సామ్రాజ్యవాదుల్లోనే కలకలం రేపింది. దానికి కారణం అంతవరకు వచ్చిన సాహిత్యంలో బ్రిటిష్ అధికారులు స్థానిక నాయకుల భార్యలను, కుమార్తెలను ప్రేమించడం లేదా స్థానిక స్త్రీలే బ్రిటిషు అధికారులతో లేచిపోవడం లేదా స్థానిక స్త్రీలు బ్రిటిషు అధికారులు, సైనికులతో అక్రమ సంబంధాలు కలిగి వుండడమే చిత్రితమవుతోంది. ఇదంతా వాళ్ల పురుషాహంకారాన్ని సంతృప్తపరుచుకోవడంగానే కాకుండా ‘సైనిక’ మనస్తత్వాన్ని రెచ్చగొట్టడంగా కూడా చూడాలి. స్టీల్ నవలలో కథానాయిక భర్తకు వేరే వివాహిత స్త్రీతో అక్రమ సంబంధం వుందని తెలుసుకుని అసంతృప్తితో మరొక బ్రిటిషు వ్యక్తితో లేచిపోతుంది. ఇంటినుంచి పారిపోవడం, తిరుగుబాటు సంఘటనలు ప్రారంభమవడం ఒక్కసారే కావడంతో వారి ప్రయాణం ఆపదలో పడుతుంది. కథానాయికకు విధవరాలైన రాణి ఫర్ఖుందా జమానీ ఆశ్రయమిస్తుంది. ఆమెకూ బహదూర్ షా జాఫర్ పెద్దకొడుకు అబూల్ బకర్ కూ సాగే ప్రేమను కథానాయిక గమనిస్తుంది. కాని తిరుగుబాటుదారుల దాడుల్లో అబూల్ మరణిస్తాడు. ఫర్ఖూందా పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ జీవితం వెళ్లబుచ్చుతుంది. 1857 సెప్టెంబర్లో ఢిల్లీని బ్రిటిష్ సైనికులు ఆక్రమించుకున్నాక కథానాయిక క్షేమంగా తన దేశానికి చేరిపోతుంది. ఆమె సాగించిన వర్ణనలు అప్పటి స్థానిక పాలకుల జీవితాలను పట్టి చూపిస్తాయి. ఈ నవలలో కూడా స్టీల్ దురదృష్టవశాత్తూ తలెత్తిన తిరుగుబాటువల్ల రేగిన అలజడి మళ్లీ బ్రిటిష్ పునరాక్రమణవల్ల సద్దుమణిగిందనీ, ప్రజలు ప్రశాంతంగా గాలి పీల్చుకున్నారని చెప్పడం మరిచిపోకూడదు.

‘గిల్లీన్’ పేరుతో కల్నల్ జె.ఎన్.హెచ్. మెక్లీన్ అనే ఆంగ్ల మిలటరీ అధికారి 1887లో రచించిన “ది రాణి: ఏ లెజెండ్ ఆఫ్ ది ఇండియన్ మ్యూటినీ” నవలలో రాణీని దారుణంగా చిత్రించాడు. కిరాతకమైన రాణి ఆఖరుకు తాను అనుకున్నది సాధించడానికి తన శరీరాన్ని కూడా ఉపయోగించిందని ఆరోపించాడు. “ది ఇండియన్ మ్యూటినీ అండ్ ది బ్రిటిష్ ఇమాజినేషన్” అన్న పుస్తకంలో గౌతం చక్రవర్తి లెక్కించిన దాని ప్రకారమైతే ఆ శతాబ్దపు చివరి దశకంలో 1857పైన 19 నవలలు ప్రచురితమయ్యాయట. మినహాయింపులు లేకుండా అవన్నీ బ్రిటిషువారి స్వాతిశయాన్ని కాపాడేవి, సామ్రాజ్యవాద సంస్కృతిని నిలబెట్టేవిగానే నిలిచాయి.

1893లో వెలువడిన హ్యూమ్ నిస్బెట్ రచన పేరుతో సైతం రచనా స్వభావాన్ని వెల్లడించేదిగానే వెలువడింది. “ది క్వీన్స్ డిజైర్ : ఏ రొమాన్స్ ఆఫ్ ది ఇండియన్ మ్యూటిని” లో బానిస దేశపు స్త్రీలను ఎంత హీనంగా చిత్రించాలో దానికి పరాకాష్టగా లక్ష్మీబాయి పాత్రను నిలిపాడు. నిమ్న తరగతికి చెందిన బ్రిటిష్ అధికారి జార్జ్ జాక్సన్ ను బంధించిన లక్ష్మీబాయి అతడితో కులికినట్లుగా రాశాడు. అయితే 1901లో మైఖేల్ వైట్ మళ్లీ ఆమె పాత్రకు జీవం పోశాడు తన “లచ్చిమిబాయి : ఇండియా జోన్ ఆఫ్ ఆర్క్” నవలలో. అయితే మరీకొంచెం అతిచేసి ఆమెను మరణించేవరకు కన్యగానే వున్నట్టు చిత్రించాడు. ఈ విధంగా వాస్తవానికి విరుద్ధంగా కేవలం తమ భావజాలాల వ్యాప్తే పరమావధిగా సాగిన వలసవాద రచనలు ఆంగ్లేయుల మెప్పుకోసమే రాసినట్టుగా అగుపిస్తోంది. ఇదే సమయంలో భారతీయ భాషల్లో వెలువడిన నవలల్లో తిరుగుబాటు ప్రభావం ఎలా వున్నది పరిశీలించి తీరవలసిన ఆసక్తికరమైన అంశం.

దిగువ పేర్కొన్న వ్యాసాల ఆధారంగా ఈ వ్యాసం రూపొందింది. ఆసక్తికరమైన మరిన్ని వివరాలకోసం ఈ వ్యాసాలను చదవండి. వీటి పిడిఎఫ్ ఫైళ్లు కావలసిన వారు duppalaravi@gmail.com ను సంప్రదించండి.

1. “వలసవాద తిరుగుబాటు సాహిత్యంలో ఝాన్సీరాణి పాత్ర చిత్రణ” (ఇంద్రాణి సేన్) ఎకానమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ. మే 12, 2007.

2. “తిరుగుబాటు నవల” (ఐశ్వర్య లక్ష్మి) పై సంచికే.

3. ఇంద్రాణి సేన్ రచించిన “విమెన్ అండ్ ఎంపైర్” పుస్తకంపై కె. సౌమిత్ర ఛౌధురి ‘ఫ్రంట్ లైన్’ (26.03.2004)లో రాసిన సమీక్ష.

4. సిపీఐ (ఎం) వీక్లీ ‘పీపుల్స్ డెమోక్రసీ’ వెబ్ సైట్ లో జూన్ 10న్ ఇంద్రాణి సేన్ రాసిన “19వ శతాబ్దపు వలసవాద నవల” వ్యాసం.

5. గౌతమ్ చక్రవర్తి రాసిన “ది ఇండియన్ మ్యూటిని – ది బ్రిటిష్ ఇమాజినేషన్” (కేంబ్రిడ్జి ప్రచురణ)కు ముందుమాట వ్యాసం.

               (ఈ వ్యాసం ఆగష్టు, 2007 ప్రజాసాహితి సంచికలో ప్రచురితమైంది.)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s