మట్టికీ మనిషికీ మధ్య… (రెండవ భాగం)

సాధారణం

                               కొన్ని వారాల కిందట రాచపాళెం చంద్రశేఖర రెడ్డి రచించిన “పొలి” కావ్యాన్ని పరిచయం చేసుకున్నాం కదా. ఇక ఈ వారం గంటేడ గౌరునాయుడు సృజించిన దీర్ఘ వ్యవసాయ కావ్యం “నాగలి”ని పరిచయం చేసుకునే ముందర కొన్ని వాస్తవాలను మాట్లాడుకుందాం.

ఇంకా వారం రోజులుగా నైరుతి రుతుపవనాలు జిల్లా ప్రజానీకాన్ని, అలాగే రాష్ట్ర ప్రజలందరినీ మురిపించి, కరిగించి కన్నీళ్లు తెప్పించాయి. కురిస్తే ఒకటే వానలు. లేదంటే లేదు. కానీ అది కూడా నిజానికి నిజం కాదు. నాలుగు రోజులు వరసగా వర్షం కురిస్తే మన బతుకులు తెల్లారిపోయేలా మన పాలన ఏడుస్తోంది. కరకట్టలు తెగిపోతాయి. మురుగు కాల్వల్లో నీరు పారదు. రోడ్లు, వీధులు, పొంగి ఇళ్లలోకి నీరు వచ్చేస్తుంది. పార్టీలకు అతీతంగా మన పాలన వ్యవస్థ అలా అఘోరిస్తోంది. 

పూర్వం రోజుల్లో దేవతలు చనిపోకుండా శాశ్వతంగా నిలిచి ఉండేందుకు అమృతం తాగేవారట. అలాంటి అమృతం ఉంటుందో లేదో మన శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేదు గాని, సామాన్య మానవులు మాత్రం నీరు అనే ద్రవ పదార్థం తాగకుండా కనీసం కొన్ని రోజులైనా బతకలేరని చిన్న పిల్లలకు కూడా తెలిసిందే. అందుకే భూమి మీద నీటినే అమృతంగా భావిస్తాం. అయుర్వేదం, నేచురోపతీలలో నీటికెంతో ప్రాశస్త్యం ఉంది. అలోపతి, హోమియోపతి తదితర వైద్యాలలోనూ నీటికి ఉన్న పాత్ర తక్కువేమీకాదు. ఒక గొప్ప శాస్త్రవేత్త నీటి ప్రాముఖ్యతను తెలుపుతూ మూడో ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా నీటి కోసమే జరగబోతుందని శెలవిచ్చాట్ట. అది మాత్రం నిజమని తోస్తోంది.

మన దేశంలోనే కాదు, ప్రపంచంలో చాలాచోట్ల నీటి కొరత క్రమక్రమంగా తీవ్రతరమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం భవిష్యత్తును గురించి ఆలోచించని మనిషి స్వార్ధపరత్వమే. విచ్చలవిడిగా తన ఆధునికతా మాయలో పడి భూమి మనుగడకే మనిషి ప్రమాదం కొని తెచ్చుకుంటున్నాడు. ఇందులో అమెరికాకు కొంచెం ఎక్కువ తిట్లు, పాకిస్తానుకు కొంచెం తక్కువ తిట్టడానికి లేదు. మానవులందరూ కలిసి తెచ్చుకున్న ఉపద్రవమిది. వాటర్ మేనేజ్ మెంట్ గురించి మౌలిక అవగాహన కూడా మనకు లోపించింది- మన బుద్ధికి. వర్షాలు ఏడాదంతా కురవవు. ముఖ్యంగా మనదేశంలో ఏడాదికి నాలుగు నెలలు మాత్రమే వర్షాలు కురుస్తాయి. అప్పుడే భూమికి అందిన నీటిని మిగతా ఎనిమిది నెలలపాటు నేల మీద నిల్వ చేసుకోవాలి. ఇందుకు అనుగుణంగా తగిన ప్రణాళికలు రచించుకోవాలి. వీటన్నింటిని మనం మరిచిపోయాం. నేలమీద పడిన నీరు నిల్వ ఉండదు. వెంటనే భూమిలోకి ఇంకిపోతుంది. అందుకే వాటర్ మేనేజ్ మెంట్ గురించి శ్రద్ధగా ఆలోచించాలి. ట్రాఫిక్ లైట్ల గురించి మూడో తరగతి నుండే పిల్లలకు బోధిస్తాం గాని, నీటి నిర్వహణ గురించి పై తరగతుల్లోనూ మన పిల్లలను ఆలోచించనివ్వం. ఇప్పటికైనా నీటి యాజమాన్యం గురించి, నిర్వహణ గురించి, పొదుపు గురించి, సమర్ధ వినియోగం గురించి అందరికీ బోధపరచాలి. చెరువులు, బావులు, నదులు, సముద్రాలు వంటి సమస్త జలాశయాలను దేవాలయాలుగా భావించి సంరక్షింకోకపోతే భావిభవితకు గడ్డురోజులే అని స్పష్టంగా గుర్తెరగాలి.

నీరు లేకపోతే వ్యవసాయమే కాదు, ఏ పనీ చేయలేం. ఆధునిక జీవనంలో రైతు వెతలకు, కడగండ్లకు అంతే లేదు. సాగునీరందక వ్యవసాయం చేయలేక పోవడం, పాతాళానికి పొలాల్లో గోతులు తవ్వి వచ్చిన  అరకొర నీటితోనే వ్యవసాయం చేయగా దిగుబడి అయిన పంటకు గిట్టుబాటు ధర అందకపోవడం, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ మందులు అన్నీ నకిలీలకు నకలులే మార్కెట్టును ముంచెత్తి రైతు ఆశలను మరింత మసకబారుస్తున్నాయి. అయితే గోరుచుట్టు రోకటిపోటులాగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు రావడంకూడా చిన్న, సన్నకారు రైతులపాలిట సింహస్వప్నమే అయింది. రైతన్న ఆయుధం నాగలి కనుమరుగవుతోంది. ఈ అంశాన్నే కవితా వస్తువుగా తీసుకుని ప్రముఖ కళింగాంధ్ర కథకుడు, పాటల రచయిత, గాయకుడు, కవి గంటేడ గౌరునాయుడు ఈ “నాగలి” దీర్ఘ కావ్యాన్ని రచించారు. నేలతో కాస్తోకూస్తో అనుబంధమున్న ప్రతి ఒక్కరూ గానం  చేసుకోదగ్గ ఈ కావ్యం లోపలికి వెళితే మనసుకు హాయినిస్తూ, గుండెల్ని బరువెక్కిస్తూ , ఆలోచనకు పదును పెడుతుంది.

నాగలిని పరిచయం చేస్తూ కవి ప్రారంభంలోనే ఇలా పలుకుతారు. “జ్ఞానం మట్టి / గానం మట్టి / మౌనం మట్టి / ధ్యానం మట్టి / మట్టిలోలేనిదేదీ / మనిషిలో లేదు / మట్టిలో ఉన్నదేన్నీ / మనిషి వదులుకోలేదు / మట్టికీ మనిషికీ మధ్య / మహోన్నత సంస్కృతికి / వారధి నాగలి / సారధి నాగలి” మొత్తం విషయమంతా పాఠకులకు అర్థమయ్యే ఉంటుంది. అసలు నాగలి ఎవరు ఎవరికి ఇచ్చారు? రైతుకు నాగలి ఆయుధం ఎలా అయింది? నాగలి లేందే రైతు బతకలేని పరిస్థితి ఎలా వచ్చింది? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ ముందుకు సాగిన కవి నదీలోయ ప్రాంతాల్లో సారవంతమైన నేలలో విత్తనాలు చల్లడానికి భూమిని చీల్చడానికి వాడే సాధనంగా రైతుకు నాగలి చేరిందంటారు. అందుకే బలరాముడి ఆయుధం నాగలి అయింది. యదుకుల వంశజుడైన ఆ బలరాముడు పురాతన పురాణ రైతన్న మాట. “చరిత్రకందని సత్యం నాగలి / చాలుచాలున / సస్యవాక్యాల వ్యవసాయ వేదం / లిఖించింది నాగలి“. అలా నదీతీర ప్రాంతంలో నివాస మేర్పరుచుకున్న రైతుకు నాగలి నేస్తమయింది. ఏ నది ఒడ్డు రైతుకైనా నాగలి నేస్తమే. అందుకే కవి కళింగాంధ్రమంతా ప్రవహించే లాంగుల్యా నదిని నేపథ్యంగా తీసుకున్నారు. ఇప్పుడా నది పేరు నాగావళి అయింది. లాంగుల్యా నది, లాంగలి – నాగావళి నది నాగలి పదాల మధ్య ఎంత సారూప్యం!

నాగలి రైతు జీవితంలో విడి వస్తువుకాదు. నాగలి, నొల్ల, బండి, కొడవలి, గొడ్డలి, బొరిగి, పార, కొంటికర్ర, పువ్వుల కొరడా… మొదలైనవన్నీ రైతు జీవితంలో విడదీయరాని సంబంధం కలిగినవే. నాగలి వాటిలో ముఖ్యమైనది. ఇలా నాగలిని పరిచయం చేసుకున్న కవి తన నాగలి ఎటు పోయిందో కనిపించక ఏడుస్తూ గలగలా పారుతున్న నదీతీరానికి చేరుకున్నాడు. నదీమతల్లి బిడ్డను అక్కున చేర్చుకుంది. రైతు కంట నీరు తుడిచింది. కారణం కనుక్కుంది. నాగలి కత చెప్పడం మొదలుపెట్టింది. తన ఒడిలో ఆడుకుంటూ ఎదిగిన బిడ్డలు కాలమహిమతో మారిపోయారని నది వాపోయింది. నేలను నమ్ముకున్న తన బిడ్డను జమీందారీ, రైత్వారీ, పెత్తందారీ ఒకటేమిటి అన్నీ ఏలాయి. స్వేదాన్ని తాగాయి. బాధలు పడ్డా రైతుదే రాజ్యం. కానీ ప్రపంచీకరణ మొదలైన తరువాత రైతుకు భూమే లేకుండాపోయింది. భూమి చేతులు మారినాక కొత్త కామందు వ్యవసాయం వద్దనుకున్నాడు. రియల్ ఎస్టేట్ ముద్దనుకున్నాడు. కోట్లాది రూపాయల వాన అందులోనే కురుస్తోంది కదా! సరేలెమ్మని సాగు చేద్దామనుకున్న కొందరు డబ్బున్న మారాజులకు రైతుతో సేద్యం లాభం లేదనిపించింది. మనుషులకు బదులు యంత్రాలు వచ్చాయి. రైతుకే చోటులేని చోట నాగలికి దిక్కేది? నాగలి క్రమంగా అంతరించిపోయే ప్రమాదమొచ్చింది.

ఇంతవరకు నాగలి విషాద గాధను చెప్పుకొచ్చిన నదీమ తల్లి నాగలి సాధించిన విజయాలను ఏకరువు పెడుతుంది. దేశంలో నాగలి పట్టిన రైతు చంపారణ్ లోనూ, మోప్లాలోనూ, పలనాడులోనూ, పెదనందిపాడులోనూ, మన్నెంలో, మునగాలలో, మందసలో, చల్లపల్లిలో, సంతాల్ లో, శ్రీకాకుళంలో…. రైతు నాగలి రైతుకు తిరుగుబాటు దారి చూపించింది. మార్గదర్శి కాగలిగింది. దోపిడీ చేసేవాడికి పక్కలో బల్లెం అయింది. రణన్నినాదం ఆలపించింది. రైతు పక్షాన పోరు సలిపింది. అన్ని చోట్లా విజయాలే. అలా నాగలి నడిచిన దారి నెత్తుటి వాగయ్యింది. రైతుకదే ఆపన్న హస్తమయింది. “నాగావళి నేర్పిందే / పడిలేచే కెరటాల పాఠం  / నేలపై లిఖించింది నాగలి / ఉద్యమాల వేదం” అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పట్లో వర్గ శత్రువు ఎదురుగా ఉండేవాడు. పోరాడడానికి సవాలక్ష సాకులుండేవి. మార్గాలుండేవి. బాధ పెట్టేవాడు – బాధ పడేవాడు ఎదురెదురుగా ఉండేవారు. రొమ్ము విరుచుకుని కుమ్ముకునేవారు. కానీ కొత్త పోరాటంలో రూపపు సారం మారిపోయింది. “మారింది రణ స్వభావం / మారిపోయింది యుద్ధ స్వరూపం / శత్రువు కనిపించడు / ఎదుర్కోలేని దాడి / ఎదురీదలేని సుడి / తలవంచక తప్పని కాలమిది / కళింగ నేల ఇది / కన్నీటి చెలమ ఇది“.

ఈ సంక్లిష్ట పరిస్థితిలో మూలిగే నక్కమీద తాటిపండు పడినట్టుగా రైతుమీద దాడులు పెరిగాయి. భూమి తనది కాకుండా పోయింది. కొత్తగా కొనుక్కున్న భూమి సొంతదారు వ్యవసాయం చేస్తే చేస్తాడు లేదంటే లేదు. అతడికది కేవలం వ్యాపారం. రైతుకు వ్యవసాయమే జీవితం. అందుకే కవి తరపున కథ చెప్తున్న నదీమ తల్లి నాగావళమ్మ ఇలా ఆక్రోశిస్తుంది. “ఇప్పుడీ నేలమీద / రైతులు లేరు తండ్రి / ఉన్నది వ్యాపారులే / ఇప్పుడీ పొలాల్లో / వ్యవసాయం లేదు తండ్రీ / ఉన్నదల్లా వాణిజ్యమే / వాణిజ్యం ఒక తిరుగుడు గుమ్మి / తిరుగుడు గుమ్మిలో పడిన నాగలి / రేపటి తరాల కోసం / పురావస్తు ప్రదర్శన శాలలో / ప్రదర్శనకైనా నోచుకుంటుందా?” అక్కడితో కథ ఆగిపోలేదు. బాధనంతా పళ్ల బిగువున భరించి వ్యవసాయం చేద్దామనుకున్న రైతుకు నకిలీ అనే విషసర్పం కాటేస్తోంది. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందులు… మరేది దిక్కు? అందుకే పొట్ట చేత పట్టుకుని, ఉన్న ఊరును, కన్న తల్లిని వదిలి వలసపోతున్నారు. అత్మాభిమానాన్ని ఆకలి కాపాడగలదా? రండి. ఆలోచనపరులారా రండి. ఏం చేద్దామో ఆలోచించండి. పరిస్థితి ఇప్పటికే విషమించింది. రైతుల వెతలను తీర్చడానికి ఏం చేద్దాం? ఈ ప్రశ్నలతో కవి నాగలి గానాన్ని ఆపేస్తారు. అక్కడ్నుంచి మనల్ని ఆలోచించమని కోరుతారు. మనమేం చేస్తున్నాం మరి?

నాగలి కావ్యం కావాలనుకున్నవారు నేరుగా కవితో మాట్లాడి ఆ అపురూప కావ్యాన్ని కేవలం 20 రూపాయలు పంపించి తెప్పించుకోవచ్చు. గంటేడ గౌరునాయుడిగారి ఫోన్ నెంబరు:9441415182. must read!

ప్రకటనలు

2 responses »

  1. నిజమే, మీరు చెప్పినట్టు పిల్లలుగా ఉన్నపుడే నీటి వాడకం గురించి జాగ్రత్తగా చెప్పుకోవాలి. లేదంటె కష్టాలు తప్పవు. కొత్త ఆలోచనలు కలిగించే వ్యాసాలు రాస్తున్నారు. అయితే యువతకు పనికి వచ్చే పుస్తకాల గురించి కూడా పరిచయాలు రాయండి.

    -శ్రీనివాస్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s