మంచి కథల బంగారం పి.సత్యవతి కథలు

సాధారణం

(మే 21, 2008 వ తేదీ శ్రీకాకుళంలో ప్రముఖ కథారచయిత్రి పి. సత్యవతిగారికి యగళ్ల ఫౌండేషన్, శ్రీకాకుళం వారు యగళ్ల సుశీల కళా పురస్కారాన్ని అందజేశారు. ఆ రోజు పి. సత్యవతి గారిని సభకు పరిచయం చేసిన అరుదైన అదృష్టం నాకు యగళ్ల రామకృష్ణ గారు కలిగించారు. అక్కడచదివిన ప్రసంగ పాఠాన్ని ఇక్కడ యథాతథంగా వుంచుతున్నాను.)

నటుడికి ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, వంటవాడికి తినేవాడు వేసే లొట్టలు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. … అలాగే రచయితకు పాఠకులు అందించే ఫీడ్ బ్యాక్ కొత్త ఉత్తేజాన్నిస్తే, ప్రగతిశీల దృక్పథం గల సంస్థలు ఇచ్చే అవార్డులు వారిని కార్యోన్ముఖులను చేస్తాయి. ఈ ఏడాది సాహిత్యంలో అలాంటి విశిష్ట యగళ్ల పురస్కారాన్ని ప్రముఖ కథా రచయిత్రి పి. సత్యవతికి అందివ్వనున్నారు. సత్యవతిగారి గురించో, వారి సాహితీ జీవనయానం గురించో చెప్పుకోవడమంటే తెలుగులో స్త్రీవాద సాహితీ చరిత్రను పరామర్శించడమే.

ఆరున్నర దశకాల ముందున అంటే 1940 జులైలో గుంటూరు జిల్లా కొలకలూరులో జన్మించిన పి. సత్యవతి జీవితంలోనూ, కెరియర్లోనూ సాహిత్యంతోనే సహచర్యం చేశారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో ఇంగ్లిషు సాహిత్యంలో పట్టభద్రురాలవడమే కాకుండా విజయవాడ ఎస్. ఏ. ఎస్. కళాశాలలో ఉద్యోగ విరమణ చేసేంతవరకు ఇంగ్లిషు అధ్యాపకురాలిగా కొనసాగారు. పాఠాలు బోధించడం, ఇంగ్లిషు సాహిత్యం గురించే కావచ్చు కానీ, ఆమె పరిశీలించిన సమాజం తెలుగుది. అందుకే ఆమె రచనా వ్యావృత్తి తెలుగు సాహిత్యంలోనే. ప్రత్యేకంగా కథాప్రక్రియలో కృషి చేశారు. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలను శ్రద్ధగా ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేసిన సత్యవతిగారు సమాజ గమనాన్ని అంతకంటే నిశితంగా పరిశీలించారనడానికి ఆమె రాసిన కథలూ, వెలువరించిన కథాసంపుటాలూ, అరుదుగానైనా అప్పుడప్పుడూ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు స్పష్టమైన నిదర్శనాలు.

సమాజ గమనాన్ని, సాహిత్య బాధ్యతను గుర్తెరిగిన సత్యవతిగారు కథారచనలో ఒక నిర్దిష్ట గమ్యాన్ని నిర్ధారించుకున్నారు. ఆ బాటలోనే 1970 నుంచి కథారచన చేస్తూ తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆ దారిలో తనకెదురైన పాఠకులను నిరంతరం ప్రమత్తం చేస్తున్నారు. ఆ రంగం వనితాలోకం. ఆ మార్గం మహోన్నత మహిళామార్గం. పితృస్వామ్య సమాజంలో మహిళలకున్న కష్టాలకంటే వారే కొని తెచ్చుకుంటున్న కష్టాలు ఎక్కువైతే, సమాజం వారిమీద బలవంతంగా రుద్దే పీడన, అపచారాలు, అవమానాలకు అంతేలేదు. ఈ ముప్పేట దాడిని సమర్ధంగా ఎదుర్కోవాలంటే జరుగుతున్న దోపిడీ స్వరూపాన్ని, దోచుకునే విధానాలను ఎండగట్టాలి. వివక్ష విశ్వరూపాన్ని ప్రదర్శింపజేయాలి. ఆ బృహత్తర బాధ్యతను చిత్తశుద్ధితో తలకెత్తుకున్న స్త్రీవాద రచయితలలో పి. సత్యవతి అగ్రగణ్యురాలు.

రాశిలో తక్కువైనా వాసిలో అమోఘమనిపించుకున్న ప్రముఖ స్త్రీవాద రచయిత పి. సత్యవతిగారి సాహితీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే ఆమె వెలువరించిన కథా సంపుటాలను పరిశీలించి, పట్టి పట్టి అధ్యయనం చేయాలి. ఆ అంచనాకు మనకున్న గీటురాళ్లు ఏ మాత్రం సరిపోవు. అయితే కొండను అద్దంలో చూపినట్టు ఆ విదుషీమణి సారస్వత కృషిని చూపే ప్రయత్నమిది.

మర్రినీడ‘ అనే పెద్దకథ గల సంపుటితో జూన్ 1975లో పి. సత్యవతిని రచయిత్రిగా నవభారత్ బుక్ హౌస్ సాహితీలోకానికి పరిచయం చేసింది. ఆంధ్రజ్యోతి సతిత్ర వారపత్రికలో ఒక ప్రయోగంగా అందులో ప్రచురించిన కథలపై పెట్టిన సాహితీ బ్యాలెట్ లో అప్పటి పాఠకులు ఈ పెద్దకథను బహుమతికి అర్హమైన కథగా ఎంచుకున్నారు. అప్పటినుంచీ అడపాతడపా బహుమతులు ఎన్నో ఆమె ఇంటి గుమ్మాన్ని తట్టాయి. వాటిలో పేర్కొనదగ్గ అవార్డులుగా 1997లో అందుకున్న చాసో స్ఫూర్తి అవార్డును, అదే ఏడాది లభించిన కొండేపూడి శ్రీనివాసరావు అవార్డును, 2002లో వరించిన రంగవల్లి విశిష్ట వ్యక్తి పురస్కారాన్ని, 2004లో స్వీకరించిన పొట్టి శ్రీరాములు యూనివర్శిటీ విశిష్ట పురస్కారాలను పేర్కొనవచ్చును.

ఆనక డిసెంబరు 1998లో పన్నెండు కథల బంగారం “సత్యవతి కథలు“, మే 1995లో ఇంకో పదిహేను కథలతో “ఇల్లలకగానే…“, తాజాగా సెప్టెంబరు 2003లో మరి పన్నెండు కథల  మాగాణిగా “మంత్రనగరి” సంపుటాలు ఆమె సాహితీ క్షేత్రంలో దిగుబడి పంట. మధ్య తరగతి మహిళ మనస్తత్వాన్ని పురుషస్వామ్యం రకరకాల మాయోపాయాలతో బురిడీ కొట్టించడం, స్త్రీలు బాధనంతా పళ్ల బిగువున భరిస్తూ గడపడం మొదటి సంపుటిలో గమనిస్తాం. ఆ క్లిష్టతా చట్రం నుంచి ఒక సంపూర్ణ మానవిగా ఎదగడానికి పడాల్సిన శ్రమ, ఆ క్రమంలో తెంచాల్సిన కట్టుబాట్ల శృంఖలాలు రెండో సంపుటిలో కథనీకరిస్తే, ఈ మొత్తం జెండర్ ఆధిపత్యపు ప్రహసనాన్ని చాపకింద నీరులాగా సమాజం ఎలా నియంత్రిస్తుంటుందో, విషవలయపు విశ్వరూపమెలా వుంటుందో సరికొత్త సాహిత్య టెక్నిక్ (మాజిక్ రియలిజమ్, కొల్లాజ్) తో మూడో సంపుటిలో ఆవిష్కరించారు. రాజకీయాల జోలికి పోకుండా స్త్రీ జీవితాన్ని విభిన్న కోణాల్లో స్పృశించడం ద్వారా పాఠకులకు, ఆలోచనాపరులకు కొత్తకొత్త ఆలోచనలు ఆవిష్కరింపజేసేలా యదార్థ గాథలు, వ్యదార్థ దృశ్యాలను అక్షరీకరించడం పి. సత్యవతిగారికే చెల్లింది. ఈ కృషిలో ఆమె విజయవంతంగా మరింత ముందుకు పయనిస్తూనేవుంటారు.

ప్రకటనలు

4 responses »

  1. హిదరాబాద్ బుక్ ట్రస్త్ ప్రచురించిన అదవితల్లి ని ఈమధ్యనే చదవదం జరిగింది.అనువాదం చెసినవారు పి.సత్యవతి గారు. వారూ వీరూ ఒకరే అనుకుంటాను. అనువాదం చాలా బాగుంది. ఆ పుస్తకం గురించి హెచ్ బి టి బ్లాగు లో చూడవచు.

    http://hyderabadbooktrust.blogspot.com

  2. సత్యవతిగారి గురించి ఈ మధ్యే విన్నాను. ఈ పోస్ట్ చదివాక ఇక ఆమె పుస్తకాలు చదివి తీరాలి అనిపిస్తుంది. Thanks 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s