గాయాల జ్ఞాపకాలను రేపే కల్లోల కాల చిత్రాలు

సాధారణం

రెండేళ్ల క్రితం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పోలీసులు వీరంగం చేశారు. అది నిజంగా ప్రజాస్వామ్యానికి పరాభవం లాంటి సంఘటన. రెండు వారాల కిందట “సిద్ధు ఫ్రమ్ సికాకుళం” అని  సినిమా ఒకటి రిలీజయింది. దాని పేరు మార్చాలని కోరుతూ కొందరు ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులు నిర్మాతను అడగడానికి వెళ్లి కొంత ఆవేశపడి ఒక క్లాత్ బ్యానర్ చించేశారు. దాంతో పోలీసులకు కోపం వచ్చి ఆ పిల్లలను తీసుకెళ్లి సుమారు ఎనిమిది గంటలు పాటు చీకటి కొట్లో పడేశారు. ఈ రెండు సంఘటనలు చదివిన పాఠకులు పోలీసులు విద్యార్థులపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి పరాభవమా అని విస్మయం చెందవచ్చు. దురదృష్టవశాత్తూ ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో సగటు పౌరులందరికీ చర్మాలు గొడ్డు చర్మం మాదిరిగా దళసరి కావడంవల్ల చాలా విషయాలు మనకు పట్టకుండా పోతున్నాయి. పార్లమెంటు సభ్యులు లంచాలు పుచ్చుకుంటూ దొరికిపోతేనో, వ్యభిచారం చేస్తూ సీడీల్లో చిక్కుకుపోతేనో, కోట్లాది నోట్ల కట్టలు నిండు సభలో రెపరెపలాడిస్తేనో ఓ రెండ్రోజులు గొణుక్కుంటాం. వెనువెంటనే మర్చిపోతున్నాం. నిజంగా మనం ఆలోచించడం మొదలుపెడితే ఎన్నో ప్రశ్నలు మనలో ఉదయించాలి. పోలీసులు యూనివర్శిటీల్లోకి ఎందుకు చొరబడాలి? ఎప్పుడిలా చొరబడడం మొదలుపెట్టారు? అసలు పోలీసుల జ్యూరిస్ డిక్షన్ ఏమిటి? పోలీసు పాత్రకు స్వభావానికి, అధికారానికి, విచ్చలవిడితనానికి ఏమైనా పరిధులు, పరిమితులున్నాయా? దీనికి సంబంధించి రాజ్యాంగం ఏమి చెబుతోంది? ప్రభుత్వం ఏం చెప్తోంది? అవి చెప్తున్నట్లుగానే పోలీసు అధికారులు ప్రవర్తిస్తున్నారా? ఒకవేళ అలా ప్రవర్తించకుండా వుంటే అందుకు గల కారణాలేమిటి? అలా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ వారిని అడ్డుకునేవారే లేరా? ఇలాంటివే ఎన్నో ప్రశ్నలు ముసురుకుంటాయి.

ఇవేకాక, ఇలాంటివే మరెన్నో ప్రశ్నలు రేపుతూ, కొన్నింటికి సమాధానాలు చెబుతూ, మరికొన్నింటికి మనల్నే జవాబులు ఆలోచించమని ప్రోత్సహిస్తూ, ఇంకొన్నింటికి పరిష్కారమే లేదన్న నిస్పృహ వ్యక్తపరుస్తూ, మనల్ని ఆలోచనలో పడేసే పర్ స్పెక్టివ్స్ ప్రచురించిన కల్లోల కథా చిత్రాలును ఈ వారం పరిచయం చేసుకుందాం. ఈ వ్యాసాల రచయిత కె. బాలగోపాల్ ప్రస్తుతం మానవ హక్కుల వేదికలో పనిచేస్తున్నారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నెన్నో సామాజిక పరిణామాలను చూస్తూ తనలో తాను సైద్ధాంతిక పరిణామాన్ని పొందినవారు. ఎన్ని మార్పులకు గురైనా, ఎప్పుడూ ప్రజల పక్షపాతిగా నిలిచిన బాలగోపాల్ ఆంధ్రప్రదేశ్ లోనే కాక భారతదేశంలోనే ఒక సమకాలీన మేధావిగా గుర్తింపు పొందారు.

ఈ కథాచిత్రాలన్నీ సృజన, అరుణతార, నలుపు మొదలైన పత్రికలలో అచ్చయిన వంటేనే ఇవన్నీ వామపక్ష భావజాలంతో కూడిన వ్యాసాలని అర్థమవుతుంది. అయితే ఇవేవీ వామపక్ష భావజాలపు ప్రచార ఉపన్యాసాలు కావు. రెండు దశాబ్దాల కాలంలో రాష్ట్రం మొత్తం మీద ముఖ్యంగా తెలంగాణలో జరిగిన పాశవిక దాడులను వర్ణించినవి. ఎవరు, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎవరిపై ‘దాడి’ చేశారన్నది వివరిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఇవి అప్పటి సమాజాన్ని, దుర్నీతిని కళ్లకు కట్టినట్టు చూపించే డాక్యుమెంటరీల వంటివి. అప్పటి సమాజమంటే అదేదో క్రీస్తు పూర్వం కథలనుకోకండి. రెండు దశాబ్దాల కిందటే మన రాష్ట్రంలో చెన్నారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో జరిగినవే ఈ సంగతులన్నీ. ఈ పుస్తకంలోని వ్యాసాల జోలికి వెళ్లదలుచుకోలేదు. 80, 90 దశకాలలో పోలీసులు ఎలా పెట్రేగిపోయిందీ, అభద్రతాభావంలోనున్న ప్రభుత్వం వింత వింత చట్టాలతో, కుయుక్తులతో వాటిని ఎలా వెనకేసుకొచ్చిందీ ఈ వ్యాసాలు చదివాక మనకు అవగతమవుతుంది. ఎంతమంది యువత తమ ప్రాణాలు పోగొట్టుకున్నారో తెలిస్తే బాధ కలుగుతుంది. ఆ తల్లిదండ్రులకు కలిగిన పుత్రశోకం మనమెవ్వరం పూరించలేం. అలా హత్యకు గురైన వారి వివరాలు అన్ని వ్యాసాల్లో తెలియజేశారు.

ఈ పుస్తకానికి ముందొక మాట, చివరొక మాట చెప్పింది చలసాని ప్రసాద్. ఈ వ్యాసాల ప్రచురణ ఆవశ్యకత వాటిలో వివరించారు. ‘ఎక్కడ ఓ సంఘటన జరిగినా సామాజిక శాస్త్రవేత్తగా బాలగోపాల్ చేసే విశ్లేషణవైపు ఎందరో ఆశగా, ఆసక్తిగా చూశారు‘ అన్నారు ప్రసాద్. కానీ ఇప్పటికీ చూస్తున్నారని జోడించాలి. బాలగోపాల్ ఉపన్యాసాల్లోనే కాదు, ఇటీవల మానవ హక్కుల వేదిక వెలువరిస్తున్న బులెటిన్లలో కూడా ఆ క్లారిటీ ఆఫ్ స్పీచ్, క్లారిటీ ఆఫ్ థాట్ లను మనం గమనించాలి. విడివిడిగా ఈ వ్యాసాలు రచించే కాలంనాటికి బాలగోపాల్ సైద్ధాంతిక దృక్పథం వేరు. పుస్తకంగా ‘కల్లోల కథా చిత్రాలు’ ప్రచురించేనాటికి అతని సైద్ధాంతిక దృక్పథం వేరు. ఈ మార్పును వివరిస్తూ ‘చివరి మాట’గా వ్యాసకర్త సుదీర్ఘమైన వ్యాసం రాసుకున్నారు. ఈ వ్యాసాన్ని అర్థం చేసుకుంటే మార్క్సిజం, మార్క్సిజం-లెనినిజం, ఉత్తరోత్తరా వాటినుండి వెలువడిన మరిన్ని ఇజాలను అర్థం చేసుకోవడానికి ఒక భూమిక ఏర్పడుతుంది.

వర్తమానంలో చలామణి అవుతున్న చెడును విమర్శించడం సులభమే. కాని వర్తమానంలో మంచిని ఎలా స్వీకరించడమనేది ఒక సందిగ్ధం. ఎందుకంటే మార్క్సిజం మొత్తంగా మార్పును కోరుకుంటుంది. వ్యవస్థలో కనిపించే ‘మంచి’ అలాంటి ‘విప్లవాత్మకమైన మార్పు’ను కోరుకోదు. ఈ వ్యవస్థను వున్నదున్నట్లు తిరస్కరించనవసరం లేదని కొంచెం కొంచెంగా సంస్కరించి వ్యవస్థను బాగు చేసుకోవచ్చని ఆ ‘మంచి’ ప్రజలను నమ్మిస్తుంది. వర్గ సమాజంలో ‘విప్లవాత్మకమైన మార్పు’లను ఏ రాజకీయ పార్టీగాని, ఏ రాజకీయ నాయకుడు గాని, పెట్టుబడిదారుడు గాని, భూస్వాములు గాని కోరుకోరు. మరి వీరంతా సహజంగానే ‘విప్లవాత్మకమైన మార్పు’లు కోరేవారిని నిరసిస్తారు, నిరాదరిస్తారు. అక్కడితో ఊరుకోకుండా సంస్కరించి వ్యవస్థను బాగు చేసుకోవాలనుకునే ‘మంచి’ వర్గాన్ని ఆదరిస్తారు, అక్కున చేర్చుకుంటారు. అయితే ఈ ‘మంచి’ పీడించే శక్తులనుండి ప్రజలకు కొంత ఊరట, కొంత రక్షణ కలిగించడమే కాకుండా ప్రజాపోరాటాలకు కూడా ఎన్నో రకాలుగా ఉపకరిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ ‘మంచి’ని గుర్తించి, గౌరవించడమా? దానిపై కూడా పదునైన విమర్శ చేయడమా? ఇది మార్క్సిస్టు విమర్శకులకు ఎదురయ్యే సందిగ్ధం (పేజీ 116). అలా కురిపించిన విమర్శనాస్త్రాలుగానే ఈ వ్యాసాలను ఇప్పుడు బాలగోపాల్ పరిగణిస్తున్నారు.

‘నూరు పూలు వికసించనీ, వేయి ఆలోచనలు సంఘర్షించనీ’ నినాదంతో ప్రచురణ రంగంలోకి దూకిన పర్ స్పెక్టివ్స్ ఇరవయ్యో ప్రచురణ అయిన ఈ “కల్లోల కథా చిత్రాలు” లో పదిహేను వ్యాసాలున్నాయి. వెల 25 రూపాయలు మాత్రమే. జీవితం పట్ల కొత్త దృక్పథం ఏర్పరుచుకోవాలనుకున్న యువతరం చదవాల్సిన పుస్తకమిది. మరి మీరూ చదువుతారుగా!

ప్రకటనలు

One response »

  1. ఇన్ని “ఇజాలు” ఎందుకు ఏర్పడాయండీ? 😦 వాటి వెనుక నిజాలు గ్రహించడానికి నా బోటి వాళ్ళు ఎంత శ్రమించాలో!! :-O సహజంగా అయితే నేను ఇలాంటివి వదిలేస్తాను.

    ఈ పుస్తకాలన్నీ ఇక్కడ దొరుకుతాయా అన్నది అనుమానమే, అయినా ప్రయత్నిస్తాను. నెనర్లు!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s