ముద్దులొలికించే ముద్దు కత

సాధారణం

పదహారో శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలనే కవులుండేవారు. అందులో ఒకరు పింగళి సూరన. మనకు చరిత్రను సరిగ్గా దాదుకునే గుణం లేకపోవడం వల్ల పింగళి సూరన జీవితం గురించి పెద్దగా తెలియదు. సూరనకు సమకాలీనుడైన క్రిస్టోఫర్ మార్లో, విలియం షేక్ స్పియర్ల గురించి మాత్రం ఆ దేశంలో వాళ్లకు బాగా తెలుసు. ఎన్నో వివరాలను సేకరించి, ఖాళీలను సమగ్ర ఆధారాలతో పూరించుకుని ఆ దేశాల్లో భావి తరాల కోసం ఆ పురాతన సాహితీవేత్తలను పదిలంగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. మరి మనమో? సమకాలీనులనే మర్చిపోతున్నాం. సుమారుగా 550 సంవత్సరాల కిందటి అపురూపమైన తెలుగు కవి పింగళి సూరన రచించిన “కళా పూర్ణోదయం” కావ్యాన్ని ఈ వారం పరిచయం చేసుకుందాం.

పింగళి సూరన రాయల కొలువులో చేరిన కొద్ది కాలానికే రాయలవారు అస్తమించడంతో సూరన ఆస్థానం బయటే రచనలు సాగించుకుని బతుకుతెరువు సాగించివుంటాడని మనం అనుకోవచ్చు. “గిరిజా కళ్యాణం”, “రాఘవ పాండవీయం”, “ప్రభావతీ ప్రద్యుమ్నం”, “గరుడ పురాణం” వంటి అద్భుతమైన రచనలెన్నో చేసిన ఆ కాలంనాటికే ప్రబంధ కావ్యం రాసిన వారిదే హవా! “స్వారొచిష మనుసంభవం” లాంటి లబ్ద ప్రతిష్టమైన ప్రబంధ కావ్యం రాసిన అల్లసాని పెద్దన మనవరాలిని సూరన వివాహం చేసుకున్నాక సూరన కూడా ప్రబంధ రచనవైపు దృష్టి సారించాడు. ఆ ప్రయత్నంలోనే “కళా పూర్ణో దయం” ఆవిర్భవించింది. ఒక చిన్న పాయింటును లాగిలాగి కథను అల్లడం ద్వారా “కళా పూర్ణోదయం” విస్తృతి బాగా పెరిగిపోవడం వల్ల మొదటి నాలుగు ఆశ్వాసాలతో మొదటి భాగం, మిగిలినవి రెండవ భాగంగా ప్రచురణకర్తలు ప్రచురించసాగారు. ఈ సమీక్ష(!)లో మొదటి భాగానికే పరిమితమవుతున్నాను.

సూరన గురించి మరొక్క మాట. సంస్కృతం నుంచి మనం తెచ్చిపెట్టుకున్న అలవాటే గాని, రెండు రకాల అర్థాలిచ్చే ద్వర్థి కావ్యాన్ని అత్యున్నతంగా, ప్రతిభావంతంగా “రాఘవ పాండవీయం”లో చిత్రించిన ఘనత సూరనదే. “ప్రభావతీ ప్రద్యుమ్నం” కూడా ప్రబంధమే అయినప్పటికీ “కళాపూర్ణోదయం” కవిత్వంలో, కథనంలో ఇంకా వున్నతంగా వుంటుంది.

ఒకరోజు బ్రహ్మ తన భార్య సరస్వతికి ఒక కథ చెప్తున్నాడు. కళాపూర్ణుడనే రాజుకు తల్లి మణిస్తంభుడు, తండ్రి సముఖాసత్తి అనగానే సరస్వతి ఫక్కున నవ్వింది. మగవాడు తల్లి – ఆడది తండ్రీనా అని ఆమె నవ్వుతుంటే ప్రేమ పెల్లుబికిన బ్రహ్మ ఆమెను దగ్గరగా తీసుకుని పెదవులతో పెదవులు అందుకున్నాట్ట. అక్కడితో వూరుకోకుండా మునిపంటితో పెదవుల్ని కొరికాట్ట. దాంతో సరస్వతి తియ్యగా అరిచిందట. ఆ వాణి పెంచుకుంటున్న చిలుక ఆ మూలుగు విని పరవశం చెంది దానినే సాధన చెయ్యడం మొదలుపెట్టింది. బ్రహ్మ దర్శనానికి ఓ సారి రంభ వచ్చినపుడు చిలుక సాధన చేస్తున్న మణితస్వరం విని దాని గురించి ఆరా తీసింది. బ్రహ్మ సరస్వతుల ఏకాంత కేళీ కథనమంతా ఆ చిలుక రంభకు చెప్పేసరికి, కోపం పట్టలేక భూలోకంలో వేశ్యగా పుట్టమని చిలుకను శపిస్తుంది సరస్వతి . దానికి బ్రహ్మ కూడా వంతపాడి ఎవరైతే ‘ఈ కళాపూర్ణుడి కథ’ వింటారో, చెప్తారో వాళ్లంతా దేవలోకం నుంచి భూలోకానికి పోతారని అనేస్తాడు. అప్పటికి ‘కళాపూర్ణుడి కథ’ సరస్వతికి, చిలుకకు, రంభకు మాత్రమే తెలుసు. మరి భూలోకంలోకి ఈ కథ ఎలా వచ్చింది? ఇదే సస్పెన్సు. మొత్తం ఎనిమిది ఆశ్వాసాలతో పింగళి సూరన ఈ ముడిని జాగ్రత్తగా విప్పుకుపోవడమే కళాపూర్ణోదయ ప్రబంధ ఇతివృత్తం. మరి ఆనాటి ప్రబంధాలంటే చెప్పేదేముంది? శృంగారమయం! ఈ కావ్యం కూడా ఇందుకు మినహాయింపు కాదు.

ఈ మొదటి భాగంలో మనకు కళాపూర్ణుడు ఎక్కడా ఎదురవ్వడు. కేవలం బ్రహ్మ ద్వారా అతడి పేరు మాత్రమే పరిచయమవుతుంది. మరిందులో ఇంకేం కథ వుంటుందని ఆశ్చర్యపోకూడదు. కథాకథనంలో సూరన ఒడుపు, మెలకువా తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. కథానాయిక మూడు జన్మల కథను చెప్పాక, కళాపూర్ణుని వివాహం చేసుకోవడంతో కథా నిర్మాణంలో  సంక్లిష్టత బయటపడుతుంది. ఇందులో ప్రస్తావించిన ఏ ఉపకథా ప్రధాన కథానాయకుడితో సన్నిహితంగా సంబంధించి వుండకపోవడం కూడా శిల్పపరమైన చతురతే. కలభాషిణి – మణికంధరులు, రంభ – నలకూబరులు, సుముఖాసత్తి – మణిస్తంభులు, సుగాత్రీ – శాలీనులు మనకు మొదటి భాగంలో పరిచయమయ్యే జంటలు. సాధారణ మానవ అభిరుచులతో ముందుకుపోయే పాత్రలు. వీరిలో దాదాపు అన్ని జంటల ప్రణయ ప్రవృత్తులు (సెక్సువల్ ఇన్ స్టింక్ట్స్) భిన్నంగా వుంటాయి. కలభాషిణి – మణికంధరు లిద్దరికీ ఒకరంటే మరొకరికి వల్లమాలిన ఇష్టమే. అది సబ్-కాన్షస్ లో వుంటుంది. కాని బైటికి మాత్రం రంభ ప్రియుడైన నలకూబరుని వాంచిస్తుంది కలభాషిణి. అందుకే నారదుడు ఆమెకిచ్చిన దీవెన ప్రకారం రంభ రూపం దాల్చిన కలభాషిణికి, నలకూబరుడి రూపంలోవున్న మణికంధరుడి పొందే లభించింది. అలాగే శాలీనుడిది పర్వెర్టెడ్ సెక్సువాలిటి. పొందిగ్గా, అందంగా అలంకరించుకున్న సుగాత్రి పొందు కోరుకోడు. తోటలో పనిచేస్తూ ఒళ్లంతా చెమటలు పట్టిపోయి, ‘పిరుదులు, పాలిండ్లు, కొప్పు’ కంపించేటట్లు మొక్కలకు కుదుళ్లు తవ్వుతున్న సుగాత్రి సొగసు అతడిని ఆకర్షిస్తుంది. తరువాత జన్మలో వారే సుముఖాసత్తి – మణిస్తంభులు.

ఇలా ఈ నాలుగు జంటల తబ్బిబ్బుల ప్రహసనం (కామెడీ ఆఫ్ ఎర్రర్స్) రాసిన కాలంలోనే ప్రపంచంలో మరో వింత జరిగింది. ఇంగ్లండులో షేక్ స్పియర్, ఫ్రాన్స్ లో రబెల్లే, ఇటలీలో ఆర్లండోలు కూడా పదహారో శతాబ్దంలోనే ఇవే అంశాలను కథనం చేశారు. ఇక్కడ ఇండియాలో తెలుగు నేలపై రాయలసీమ కర్నూలు జిల్లా నంధ్యాలలో అదే సమయంలో సూరన అదే అంశంపై రాయడం విశేషం గాక మరేమిటి? (షేక్ స్పియర్ తన నాటకానికి “కామెడీ ఆఫ్ ఎర్రర్స్” అన్న పేరే ఖాయం చేసుకున్నాడు). దాదాపుగా అందరమూ మర్చిపోయిన పింగళి సూరనను వెలికి తీసింది కట్టమంచి రామలింగారెడ్డి గారు. తన “కవిత్వ తత్వ విచారం”లో “కళా పూర్ణోదయా”నికి అన్ని పాశ్చాత్య విమర్శా సిద్ధాంతాలు అన్వయించి అదెంత గొప్ప కావ్యమో తేల్చి చెప్పారు రెడ్డిగారు. సూరన ఇన్ని కథలనూ, ఒక క్రమంలో చెప్పకుండా, ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో చెప్పడం మరొక విశేషం. ఈ మధ్యనే “కళాపూర్ణోదయం” కావ్యాన్ని ఇంగ్లిషులోకి “ది సౌండ్ ఆఫ్ కిస్” పేరిట వెల్చేరు, అతని మిత్రుడు డేవిడ్ డీన్ షుల్మన్ అనువాదం చేస్తే, ఈ టెక్నిక్ ను, కథనాన్ని మెచ్చుకున్న అక్కడి ప్రజలు ఆ పుస్తకానికి బ్రహ్మరథం పట్టారట.

ఇంత ఆద్భుతమైన పుస్తకాన్ని పాత ఎమెస్కో పాకెట్ సైజులో ముద్రించి చాలా తక్కువ రేటుకే అమ్మేది. ఇప్పుడు కొత్త (చెత్త!) ఎమెస్కో పునర్ముద్రణగా వేసి మళ్లీ పాఠకులకు అందుబాటులో వుంచింది. ఆసక్తి గల పాఠకులు ఈ పుస్తకాన్ని చదవితే, తప్పక ఎంజాయ్ చేస్తారని హామీ!!!

ప్రకటనలు

19 responses »

 1. నా మొగుడిని పర్వర్ట్ అంటే నేనొప్పుకోను.! 🙂 ఆయన టేస్టది. మరి ఆయన్ను ప్రాణాధికంగా ప్రేమించిన నాదీ పర్వర్షనేనంటారా?

 2. ఇప్పటికిప్పుడు చదవాలనిపించేలా వర్ణించి వివరించారు రవి గారు! The sound of the kiss మనకి ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పండి! పాత ఎమెస్కో వారి పుస్తకాలు నేను చాలా తీసుకున్నాను మెంబరు గా! ఇది మాత్రం నా దగ్గర లేదు.మళ్ళీ దొరుకుతుందని హామీ ఇస్తున్నారు కాబట్టి కొనాల్సిందే! మరి మిగతా భాగాలెప్పుడుట?

  సుగాత్రి గారన్నట్టు(ఈ సుగాత్రి మా ‘గడి ‘ సుగాత్రి కాదనుకుంటా) శాలీనుడి టేస్టదీ!మీరూ పర్వెర్షనంటారేమి?

 3. మీ వ్యాసముఁ జదివిన తరువాత నేను నేర్చిన కవి సంబంధిత విషయము యల్లసానివారి మనుమరాలినిఁ సూరన పెండ్లి యాడెననునది. కవిచరిత్రల శోధనపై మీరు లేవఁదీసిన ప్రశ్న సమంజసంగానే ఉన్నది. దీనికి నా వద్ద సమాధానము లేదు. ఇంతవరకు నేను నాలోచింపఁలేదు. మీ వాదముఁ వినిపించినఁ సంతోషము.

  పింగళివా రనఁగానే నా మట్టుకు నాకు తెన్నాలి రామలింగడు తిన్నాడుర పట్టెడంత అన్న కందపద్యమే గురుతుకు వస్తుంది. అంతకుఁ మించి నాకేమియుఁ దెలియదు, సూరననిఁ జదువకుండుటఁ జేత. మీ రీ విధముగఁ జెప్పిన పిమ్మట నిపుడే యా పొత్తముఁ సంపాదించి చదువవలెనను కోర్కె ఉదయించుచున్నది (కావున నెమెస్కో వారి ప్రచురణ క్రొత్తయో చెత్తయో చదివిన పిమ్మటఁ నేను కూడ తెలుపఁగలవాఁడను).

 4. సమీక్ష(!) బాగుంది. ఈ కథ నేను చిన్నప్పుడు విన్నట్లో, చదివినట్లోవున్నాను. కాస్త మెదడు బూజు దులపాలి లేక కొత్తగా పుస్తకమైనా చదివాలి. నా అభినందనలు.

 5. బాగుంది. మిగతా భాగం గురించ్ కూడా రాస్తారని ఆశిస్తాను.
  ఉత్సాహం ఉన్నవారికి .. ఈమాట పాత సంచికల్లో కేవీయెస్ రామారావుగారు వచనంలో రాసిన సంక్షిప్త కథ దొరుకుతుంది.

 6. పాత పుస్తకాన్ని చదివించే మీ ప్రయత్నం బాగుంది. కాని అది చదివితే ఏమిటి ఉపయోగం? దీనికి బదులుగా ఏదైనా కొత్త పుస్తకాన్ని పరిచయం చేసి ఉంటే బాగుండేది. పైగా మీరు వారానికి ఒకటే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు. ఇలా పాత పుస్తకాలు గురించి రాసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే అవి దొరకవు. దొరికినా అవి చదవలేం. చదివినా అవి అర్థం కావు. ఎందుకొచ్చిన గొడవ చెప్పండి. చక్కగా పుస్తకాలను పరిచయం చేసే మీరు కొత్త పుస్తకాల గురించి చెప్తే అవి దొరుకుతాయి. వాటిని మేం చదవగలం. పైగా అర్థం అవుతాయి. ఏమంటారు?

 7. అందరూ మర్చిపోయిన తెలుగు సాహిత్యం గురించి, దాని పూర్వ వైభవం గురించి వెలుగులోకి తేవడానికి మీలాంటివాళ్ళు చేస్తున్న కృషి అభినందనీయం. చిన్నతనంలో ఎప్పుడో మా ఇంటిలో చదివినట్లు గుర్తు. మళ్ళా ఆ జ్ఞాపకాలని తట్టి లేపారు. మిగతా భాగల సమీక్షకై ఎదురుచూసే చాలా మందిలో నేనూ ఒకడిని.

 8. నేను ఇటీవల చదివిన పుస్తకాలలో ఇదొకటి. “రెంటాల గోపాలకృష్ణ” అనే ఆయన తర్జుమా చేసిన గద్య వర్షను.

  అసలు ఎన్ని మలుపులో కథలో అనిపించేలా ఉంది చదువుతుంటే. మీరు రాసిన ఈ టపా చాలా బాగుంది.

  ఇప్పుడు పద్య వర్షను చదివితే అర్థమవుతుందేమో 🙂

 9. నాగార్జున గారు,
  క్షమించండి, మీతో విభేదిస్తున్నందుకు! ఒక పుస్తకం చదవటం వల్ల ఏమిటి ఉపయోగం? అని ప్రశ్నిస్తే సమాధానం ఏముంది? మానసికానందం!

  మీరు చెప్పిన లెక్క ప్రకారం కొత్త పుస్తకాల్లో కూడా అన్నీ మనకి పనికొచ్చేవే ఉంటాయని ఏముంది?

  ప్రతి పుస్తకమూ ఉపయోగపడేలాగానే ఉండాలి అంటే అవి టెక్స్ట్ పుస్తకాలై ఉండాలి! మానసిక వికాసానికి మించిన ప్రయోజనం ఏముంటుంది పుస్తకానికి?
  అర్థం కావని ఎందుకు అనుకుంటారు, గద్యం వెర్షన్ దొరుకుతుందని చెప్పారుగా రవి గారు?

  దొరకని పుస్తకాన్ని దొరికించుకుని చదవడంలో ఉన్న మజా ఒకసారి అనుభవించి చూడండి మరి! ఏమంటారు?

 10. పూర్ణిమ .. లంకె అదే.
  నాగార్జున గారు, మీ కొత్త పుస్తకపఠనాభిలాషని అభినందిస్తూనే పాత పుస్తకాల గురించి మీ అభిప్రాయంతో తీవ్రంగా విభేదిస్తున్నాను. మన పద్య సాహిత్యంలోని ఆణిముత్యాలు మన పూర్వులు సంపాయించి పెట్టిన ఆస్తుల్లాంటివి. మనం చెయ్యాల్సిందల్లా వాటిని ఆస్వాదించి అనుభవించడమే. అది కూడా చెయ్యలేక వాటిని వొదిలేసుకుంటే .. తండ్రి తాతలు కోట్లు సంపాయించి పెడితే అనుభవించడం చాతకాక ఆ ఆస్తిని మురిక్కాలవలో పారబోసుకున్న వాడికంటే దౌర్భాగ్యులం ఐపోతాము.
  కళాపూర్ణోదయమే కాదు, మరెన్నో గొప్ప కావ్యాలు టీకా తాత్పర్యాలతోనూ, వివరణ లేకుండానూ ఇప్పటికీ లభ్యమవుతున్నాయి.
  ఉదాహరణకి ఇక్కడ చూడండి.
  http://www.avkf.org/BookLink/book_link_index.php

 11. @ ప్రవీణ్ .. గద్య వర్షను పద్య వర్షను .. బాగుంది.
  ఇంకా నయం, మృదులాంత్రక బుద్ధి పోనిచ్చుకోక వర్షను 10.0.4 అన్నావు కాదు.
  బైదవే, ఆ రెంటాల గోపాల కృష్ణగారు ఎవరో కాదు, మన కల్పన రెంటాల గారి తండ్రి గారే.

 12. రవి కుమార్ గారు, ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించాలి. ఆఫీసులో జీ మెయిలు పని చేయదు మరి. వేగు పంపినందుకు చాలా సంతోషించాను. చాలా చక్కగా ఉంది పరిచయం..మరిన్ని రావాలి..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s