విమర్శకే కాదు నవల అధ్యయనానికి కూడా చుక్కాని

సాధారణం

తన “నవలాశిల్పం” కు రాసుకున్న ముందుమాటలో వల్లంపాటి వెంకటసుబ్బయ్య మంచి నవలకు, వ్యాపార నవలకు మధ్య వున్న తేడాను గుర్తించలేక పోవడం పట్ల ఆందోళన వెలిబుచ్చారు. అక్కడే నవలను అధ్యయనం చేయడం ఎలాగో నేర్పే మంచి గ్రంథం ఇంతవరకు తెలుగులో రాలేదని చెప్తారు. లూకాచ్, కాడ్వెల్, లీవిస్, హెరాల్డ్ బ్లూమ్ తదితర విమర్శకులు రచించిన మాదిరి గ్రంథాలు తెలుగులో లభించడం లేదని విమర్శకుని ఫిర్యాదు. కానీ తెలుగు విమర్శలో విశేషమైన కృషి చేసిన, చేస్తున్న విమర్శకులు చాలా చాలా చాలా తక్కువ మందే కావచ్చు కాని, వారి కృషి మాత్రం అద్వితీయం. రాశిలో తక్కువైనా వాశిలో మాత్రం ఘనమని చెప్పుకోవచ్చు. దురదృష్టవశాత్తూ తెలుగు సాహిత్యంలో విమర్శ రంగంలో రచనలు సాగిస్తున్న అనేక మంది స్వయంగా రచయితలు, కవులు కావడం కూడా మన విమర్శ కుంటుపడినట్టు కనిపించడానికి మరో కారణం. అలాగే విమర్శకులకు విశ్వవిద్యాలయాల దన్ను లేకపోవడం మరో వెలితి.

అంతటిలోనూ మంచిని చూడడం ఆధ్యాత్మిక రంగంలో బావుంటుందేమో కాని, విమర్శ రంగంలో మాత్రం చాలా కటువుగా వ్యవహరించడం అత్యవసరం. గత శతాబ్దపు మధ్య నుంచే మొదలైన అనేక గందరగోళాలు మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దానితో అన్ని విలువలలో ప్రారంభమైన పతనం జీవితాన్ని సంక్లిష్టభరితం చేసింది. జీవితానికి పూచే పువ్వు సాహిత్యం కూడా అంతే సంక్లిష్టభరితంగా తయారైంది. సాహిత్యాన్ని అంచనా వేయగలిగే, పాఠకునికి సరైన దారి చూపగలిగే, రచయితలను హెచ్చరించగలిగే విమర్శకుడి పాత్ర ఇంకా పదును దేరింది. ఈ నేపథ్యంలోనే విమర్శకుడు గులాబీ పుష్పం కింద ముళ్లలాగా కాకుండా వళ్లంతా పళ్లున్న రంపం మాదిరిగా కృషి చేయాల్సివుంది. మనకున్న ఇలాంటి అతి కొద్దిమంది పదునైన విమర్శకుల్లో ఎన్. వేణుగోపాల్ ఒకరు. వేణుగోపాల్ అప్పుడప్పుడు రాసిన నవలా విమర్శ వ్యాసాలన్నీ కలిపి “నవలా సమయం” వ్యాస సంపుటిగా స్వేచ్ఛాసాహితి ప్రచురించింది. ఆ పుస్తకాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నాను.

బూర్జువా సాహిత్య ప్రక్రియ నవల. ఆధునిక యుగంలో ఈ నవలను పాలక వర్గం వినియోగించుకున్నంత సమర్ధంగా మరే వర్గమూ వినియోగించుకోలేదని చెప్పుకోవచ్చు. ఇరవై ఒక్క వ్యాసాలున్న ఈ నవలా సమయం చదవడం పూర్తిచేశాక ఒక్కసారి మనసంతా తేలికవుతుంది. నవల ఎలా చదవాలో అవగతమవుతుంది. వస్తువు, శిల్పం, భాషా ప్రయోగాల జలతారు వలలో పడిపోతే భావజాలపు ఉచ్చులో చిక్కుకుపోతామని హెచ్చరిస్తుంది. జీవితానికి చలన సూత్రాలున్నట్టే, నవలా రచనకూ కొన్ని సోపానాలుంటాయి. అదే మాదిరిగా నవల అధ్యయనానికి కొన్ని కొలబద్దలు వుంటాయి. ఆ తూనిక రాళ్లతో తూచినప్పుడే ఆ రచన ప్రామాణికత నిగ్గు తేలుతుంది.ఆరుంధతీ రాయ్ సంచలనాత్మక నవల ‘ది గాడ్ ఆగ్ స్మాల్ థింగ్స్” పై ఆంధ్రా యూనివర్శిటీలో సెమినార్ నిర్వహించినపుడు తొలిసారి ఆ నవల చదివి భాషా విన్యాసానికి విస్తుపోయి, శైలీ ప్రవాహానికి అచ్చెరువొంది, చదివిందే చదువుతూ మురిసిపోయాం. అకడమిక్ మేధావులైన మా ప్రొఫెసర్లు కూడా అంగుళం ముందుకు కదలక మమ్మల్నీ కదలనివ్వలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అంతే. ఓహో ఒకటే గాలికి ఎత్తేయడం – ఆ నవలను. ఇప్పుడు వేణుగోపాల్ ‘సామ్రాజ్యవాద విలువలు – సాహిత్యం’ వ్యాసం చదివాక ఎందుకు పశ్చిమ దేశాలు ఆ నవలకు అంత సీన్ ఇచ్చాయో అర్థమవుతుంది. (‘నవల మీద ఇప్పటిదాకా జరిగిన చర్చలో ఎక్కువ భాగం ఆక్రమించింది అది సాధించిన విజయం, పొందిన దబ్బు, రచయిత అందంతో సహా సాహిత్యేతర అంశాలు మాత్రమే…’ అంటూ ఈ వ్యాసంలో కూడా వాటితోనే చర్చ ఆరంభించడం మనం గమనించాలి. వ్యాసం నాలుగో పేజీనుంచి మొదలుపెట్టి సందర్భానుసారంగా అక్కడక్కడా మొదటి మూడు పేజీలు తగిలించివుంటే బాగుండేది కదా!) భారతీయ భాషా సాహిత్యాల పట్ల చులకన భావం ఏర్పరుచుకున్న ఒక వర్గపు రచయితల ప్రతినిధిగా, మహానగరాల ఉన్నత మధ్య తరగతి ప్రతినిధిగా అరుంధతీరాయ్ ఈ నవలను రాశారు. పైగా ప్రేమికులు అమ్ము, వేలుతా పాత్రలకు రచయిత మరణశిక్ష విధించడం ద్వారా మూస సాహిత్య ధోరణినే అనిసరించారని వేణుగోపాల్ చెప్తారు.

శిల్ప విన్యాసాలను అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శించే అరుదైన రచయితల్లో డా. వి. చంద్రశేఖరరావు ఒకరు. “లెనిన్ ప్లేస్”, “మాయలాంతరు”, కథా సంపుటాల తరువాత వెలువరించిన నవల “ఐదు హంసలు”. ఇందులో కూడా వస్తువు శిల్పాన్ని దారుణంగా డామినేట్ చేయడం వల్ల ఎట్లా పేలవంగా తయారైందీ ఒక వ్యాసంలో చెప్తారు. ఈ నవలపై రాసిన సమీక్షా వ్యాసంలోనే ‘ఒక నవల చదవగానే పాఠకులు ఉన్నతీకరించిన చైతన్యాన్ని అనుభవించాలి‘ అంటారు. నిజమే కదా. ఇక ఆటా నవలల పోటీలో లక్ష రూపాయలకు పైగా బహుమతి పొందిన నవల “రేగడి విత్తులు”. రచయిత చంద్రలత ఎలాంటి హడావిడి చేయకుండా ఒక్క నవలతో ఏకంగా సంచలనం సృష్టించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నవల విడుదల తర్వాత ఒక్కొక్క సమీక్ష వచ్చిన తర్వాత ఆ నవల అసలు లొసుగులు బయటపడ్డాయి. ప్రాంతీయ ఆకాంక్షలు ఒకరు రెచ్చగొడితే వచ్చేవి కావు. ప్రజల్లో గూడు కట్టుకున్న నిరాశ నిస్పృహలు క్రమంగా ఉద్యమంగా బయటపడతాయి. ప్రజల ఉద్వేగాలను ఒడిసి పట్టుకోకపోతే రచయిత ఒక భావజాలానికి కొమ్ముకాసే కూలి అవుతాడు. కొందరికి భారీగా కూలి డబ్బులు గిట్టొచ్చు గాక. సాహిత్య చరిత్రలో మాత్రం అపఖ్యాతి మూటకట్టుకుని బతకాల్సిందే. అదే విషయాన్ని చక్కటి విశ్లేషణతో ఈ “రేగడివిత్తులు” నవల సమీక్షలో స్పష్టపరుస్తారు వేణుగోపాల్. విషయసూచికలో తప్ప “వసంతగీతం” సమీక్షా వ్యాసంలో ఎక్కడా ఆ నవల రచయిత పేరు కనిపించదు. ప్రజా సైన్యపు విస్తరణ, నిర్మాణాన్ని చిత్రించిన నవల “వసంతగీతం”లో కథాకథన గమన విశ్లేషణతో పాటు లోపాల వివరణ కూడా వుంది. మార్క్సిస్టు సులోచనాధారి వేణుగోపాల్ విమర్శా శైలి ఖచ్చితంగా యువ రచయితలు, సాహిత్య విద్యార్థులు అధ్యయనం చేయవలసిందే. కళ్యాణరావు “అంటరాని వసంతం” పై ఈ విమర్శకుని పదునైన విమర్శ ఈ సందర్భంలో వుంటే బావుండుననిపించింది. ఇటీవలి తెలుగు సాహిత్యంలో వచ్చిన అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న రచన “అంటరాని వసంతం” ఎలెక్స్ హేలీ “రూట్స్” నవలతో పోల్చదగింది. శిల్పపరంగా దానిని మించి ఎత్తుకెదిగిన నవల. దీనిని వేణుగోపాల్ పరామర్శించి వుంటే ఈ వ్యాస సంపుటికి మరింత సొబగు చేకూరేది.

‘వ్యాపార సాహిత్యం – సంస్కృతి’ వ్యాసంలో పాలక వర్గ అవసరాలను తీర్చిదిద్దడానికి, వ్యాపార వర్గానికి అధిక లాభాలు అందివ్వడానికి పనికివచ్చే వ్యాపార సాహిత్యం ఏయే దశలలో ఎలా పరిణమించిందీ, తన పరిణామ క్రమంలో విశాల ప్రజా బాహుళ్య ప్రయోజనాలను ఎలా విస్మరించిందీ నిశితంగా చర్చించారు. ఎస్. డి. వి. అజీజ్ “సాలెగాడు” నవల ఎలా స్వాతంత్ర్య సమరయోధుని పోరాట గాథకాదో సోదాహరణంగా వివరించారు. విమర్శకుడు అన్నట్టు చరిత్రను మన ఊహలకు, కోర్కెలకు అనువుగా మార్చేందుకు మనకు హక్కు లేదు. అయితే పాలకులకు ఈ మాటలు అసలు పట్టవు. ఎవరు అధికారంలోకొస్తే వారికి అనుగుణంగా చరిత్రను పునర్లిఖించడానికి సకల సన్నాహాలు చేస్తుంటారు. కానీ సృజన కళాకారుడిది మాత్రం విలక్షణమైన బాధ్యత. వ్యక్తులను, సంఘటనలను, పరిణామాలను చాలా నికార్సుగా అంచనా వేయగలగాలి. తిరునగరి రామాంజనేయులు నవల “సంగం”ను సమీక్షిస్తూ రాసిన వ్యాసంలో పోరాట నవల అంటే ఏమిటని విశ్లేషించారు. చివరకు “సంగం”ను ఒక నవలగా కాక అంతబాగాలేని ఒక రిపోర్టుగా పరిగణిస్తారు. చక్కటి సరళతతో, వివరంగా ప్రారంభ స్థాయి పాఠకులకు సైతం సుబోధకరంగా సాగిన విమర్శనాత్మక వ్యాసం రంగనాయకమ్మ “జానకి విముక్తి” నవలపై రాసింది. కాగా భావంలో క్లిష్టత వల్ల, చెప్తున్న విషయం పట్ల అంగీకారం లేకపోవడం వల్ల కాబోలు అర్థం కాకపోవడమే కాక గందరగోళంగా తయారైన వ్యాసాలు రెండు. ఒకటి ఎగ్నెస్ స్మెడ్లీ “భూమి పుత్రిక” నవల కాగా, రెండవది ఓల్గా “స్వేచ్ఛ” నవలపై రాసిన వ్యాసాలు. పితృస్వామిక సమాజం గురించి, ప్రేమ గురించి, స్వేచ్ఛ గురించి మార్క్సిస్టు దృక్కోణంలో వేదాంత స్థాయిలో చర్చించిన వ్యాసాలు కావడం చేత కాబోలు ఈ వ్యాసాలు నాకు మింగుడుపడక అర్థం చేసుకోలేక పోయానేమో అనికూడా పాఠక మిత్రులు గమనించాలి. ఈ వ్యాస సంపుటిలో ప్రధానంగా గత శతాబ్దిలో వెలువడిన నవలల విశ్లేషణ మాత్రమే అందించగా, ఈ శతాబ్దంలో వచ్చిన నవలలపై ఇంకా సమగ్ర విమర్శ వేణుగోపాల్ కలంనుంచి రావలసివుంది. అయితే ఆ విమర్శ మరింత కటువుగా, కొరడా దెబ్బ మాదిరిగా వుండడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జీవితంలో పని వత్తిడి పెరిగిన తర్వాత కవిత్వం మీద, కథ మీద దృష్టి పెట్టినంత సునాయాసంగా నవలమీద రచయితలు తమ దృష్టిని కేంద్రీకరించ లేకపోతున్నారు. దానితో ప్రగతిశీల నవలా రచన దాదాపు మృగ్యమైపోయింది.

పాఠకుడి చైతన్యాన్ని, అవగాహనను, సంస్కారాన్ని పెంచగలిగిన రచన ప్రక్రియ నవల. ఈ నవలా విమర్శను మరింత పదునుదేరించడంలో ఈ “నవలా సమయం” ఎంతగానో తోడ్పడుతుంది. అట్ట వెనుక రాసినట్టు ‘ఆ అరుదైన రంగంలో కృషి చేస్తున్న ఎన్. వేణుగోపాల్’ అన్న మాటకు బదులు…’ఆ రంగంలో అరుదైన ప్రతిభతో కృషి చేస్తున్న…’ అనివుంటే బాగుండేది. 21 వ్యాసాలతో, 176 పేజీలతో వెలువడిన ఈ “నవలా సమయం” ఖరీదు 50 రూ. మాత్రమే. ఈ పుస్తకాన్ని “స్వేచ్ఛా సాహితి, జి1, మైత్రీ రెసిడెన్సీ, 3-6-394, వీధి నెంబరు 3, హిమాయత్ నగర్, హైదరాబాద్ – 500029” చిరునామాకు డబ్బులు పంపి తెప్పించుకోవచ్చు.

మరి మీరూ చదువుతారుగా!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s