మనిషి నిజనైజం పోరాడడమే

సాధారణం

ప్రకృతితో మనిషికి శత్రుత్వమైతే లేదు కాని, పోరాటం మాత్రం నిరంతరంగా సాగుతూనే వుంతుంది. తనదైన శైలిలో ప్రకృతితో జరిపే పోరాటమే మానవ నాగరకత బీజం. ఫలితంపై దృష్టి పెట్టకుండా పోరాటం కొనసాగిస్తుండడమే మానవ వికాస చరిత్రకు ప్రాణవాయువు. ఈ భీకర సంగ్రామంలో జయాపజయాలు లెక్కచేస్తే ఇంత అభివృద్ధి జరిగేది కాదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నదంతా ఆ నిరంతర పోరు ఫలితమే. ఆ పరంపరను కొనసాగిస్తూ మనం జరుపుతున్న కృషి భావితరాలకు మరెంతో స్ఫూర్తి. ఈ శృంఖలం ఇలా కొనసాగవలసిందే. దీన్నే ఒక నవలికగా రాసిన ఒక రచయితకు ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమానం అందించాం. ఆ రచయిత పేరు ఎర్నెస్ట్ హెమింగ్ వే. ఆ నవలిక పేరు ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ.

1899లో ఇలినాయిస్ లో పుట్టిన హెమింగ్వే అక్కడా ఇక్కడా యుద్ధాల్లో పాల్గొన్నా, చివరకు జర్నలిజంలో స్థిరపడ్డాడు. 1926లో “సూర్యుడు కూడా ఉదయిస్తాడు” (ది సన్ ఆల్సో రైజెస్) అనే నవలతో అమెరికన్ సాహిత్యంలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. “అయుధాలకు వీడ్కోలు” (ఫేర్ వెల్ టు ఆర్మ్స్), “ఈ ఘంటానాదం ఎవరి కోసమో” (ఫర్ హూమ్ ద్ర్ బెల్ టోల్స్) అనే నవలల ద్వారా ఆ స్థానాన్ని స్థిరపరుచుకున్నాడు. 1952లో ప్రచురితమైన “వృద్ధుడూ సముద్రమూ” (ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ) అనే నవల అతడికి పులిట్జర్ బహుమతితోపాటు నోబెల్ బహుమానాన్ని కూడా సంపాదించిపెట్టింది. దీంతో ప్రపంచ సాహిత్యంలోనే హెమింగ్వే పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.

తన రచనల్లోని ప్రధాన పాత్రల్లాగే హెమింగ్వే జీవితం కూడా చాలా సాహసోపేతంగా, ప్రమాదకరంగా గడిచిందనే చెప్పుకోవాలి. కొన్ని యుద్ధాలు, బతుకు తెరువుకోసం ఎన్నో పత్రికలలో ఉద్యోగాలు, ఉన్నచోట వుండకుండా అనేక దేశాల ప్రయాణాలు, స్థిరం లేకుండా పెళ్లి తరువాత పెళ్లి చొప్పున నాలుగైదు పెళ్లిళ్లు, కేవలం రచనా వ్యాసంగం కొనసాగించడానికే వళ్లు గగుర్పొడిచే ప్రమాదభరితమైన ప్రయాణపుటలవాట్లు… ఇలా ఈ రచయిత జీవితమంతా మన నెహ్రూ ఎప్పుడూ చెప్పే ‘లివ్ డేంజరస్ లీ’ అనే మాటకు చాలా దగ్గరగా వుంటుంది. 1961లో ఆత్మహత్య చేసుకునేంతవరకు దాదాపు ఇలానే గడిపిన హెమింగ్ వే ఏ నవలలోనూ తాను ఎరగని జీవితం గురించి రాయలేదు. బుల్ ఫైట్ గురించి రాసినా, సముద్రం గురించి రాసినా, విమాన యానం గురించి రాసినా, యుద్ధం గురించి రాసినా, తను చూసిందీ, ఎరిగిందీ, అనుభవించిందీ మాత్రమే నిబద్ధంగా అక్షరబద్దం చేశాడు. వేటగాడు, జూదగాడు, తిరుగుబోతు, తాగుబోతు, స్త్రీలోలుడు అయిన హెమింగ్వే జీవితం కూడా అతని రచనల్లాగానే చాలా ఆసక్తికరంగా గడిచింది.

‘ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ’ నవల తొలిసారిగా 1952 సెప్టెంబరులో ‘లైఫ్’ పత్రికలో ప్రచురితమైనప్పుడు మొదటి రెండు రోజుల్లోనే యాభై మూడు లక్షల ‘లైఫ్’ ప్రతులు అమ్ముడయ్యాయంటే పాశ్చాత్య  పాఠకులు ఈ నవలను ఎంత సాదరంగా ఆహ్వానించారో అర్థమవుతుంది. కథగా చెప్పుకుంటే ఈ నవలలో పెద్ద కథేమీ వుండదు. శాంటియాగో పేరుగల వృద్ధ బెస్తవాడు ఒంటరిగా సముద్రంలో చేపల వేటకు పోతాడు. ఎనభై నాలుగు రోజులుగా అతడి వలలో కనీసం ఒక్క చేపైనా పడదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలాగా ఎనభై అయిదో రోజుకూడా వేటకు బయలుదేరుతాడు. ఊహించడానికి వీలుకానంత ఒక పెద్ద చేప తన వలలో పడుతుంది. అయితే ఆ భారీ మీనాన్ని ఒడ్డుకు తెచ్చేలోపు కొన్ని షార్క్ చేపలు దానిని తినేస్తాయి. కేవలం ఆ పెద్ద చేప అస్తిపంజరాన్ని వెంటపెట్టుకుని వచ్చిన ముసలాడిని లోకం తెలీని పసిపిల్లలు ఆటపట్టిస్తారు. విషయం తెలిసిన వూరువూరంతా అతడు సలిపిన పోరాటానికి విస్తుపోతుంది. ఇంతే కథ.

ఇందులో మనకు పరిచయమయ్యే పాత్రలు రెండే రెండు. ఒకటి వృద్ధుడు శాంటియాగో. రెండోది తన దగ్గర వేట మెళకువలు నేర్చుకోవాలని పరితపించే బాలుడు మానోలిన్. ఇక అసలు మాట్లాడకుండా మనకు పరిచయమయయఏ మరో పెద్ద పాత్ర సముద్రం. నవల చదవడం పూర్తిచేసేసరికల్లా చేపతో పోరాడి పోరాడీ వృద్ధుడు శారీరకంగా అలసిపోతే, అతడిలాగే మనం కూడా శాంత గంభీర స్వరూపురాలయిన సముద్రంతో అలసిపోతాం. శాంటియాగో నాలుగు రోజులుగా ఆ పెద్ద మార్లిన్ చేపతో పోరాడి అలసిపోతాడు. ముసలివాణ్ణించి మరి తప్పించుకోలేని పెద్ద చేప చివరకు చనిపోతుంది. ఆ పెద్ద చేప గాయాలనుండి కారిన రక్తం ఎన్నో షార్క్ చేపలను ఆకర్షిస్తుంది. భయంకర షార్క్ చేపల దాడినుంచి తన పెద్ద చేపను రక్షించుకోవడానికి ఆ వృద్ధుడు మళ్లీ పోరాటం ప్రారంభిస్తాడు. ఆ పెనుగులాటలో కొన్ని షార్క్ చేపలను సంహరించినా, వాటి సంఖ్య ఎక్కువైపోయి ముసలివాడి శక్తులు వుడిగిపోయి డస్సిపోతాడు. షార్క్ చేపల దాడుల తరువాత చివరకు పెద్ద చేప ఏమీ మిగలదు. కేవలం పెద్ద తల, తోక, ఎముకుల గూడు మిగులుతాయి. అయితే ఇదంతా మనిషి తన జీవికలో భాగంగా చేసిన పోరాటంగానే గుర్తుంచుకోవాలి.

నిజానికి ఈ నవలను ఆశాజనకంగా కూడా రచయిత ముగించవచ్చు. కానీ రచయిత ఉద్దేశం వేరు. ఆ చేపను యథాతథంగా ఒడ్డుకు తీసుకొచ్చి, మాంసం అమ్మి, చాలా డబ్బు సంపాదించి తనను ఇన్నాళ్లూ చులకనగా చూసినవారిని ఎద్దేవా చేయవచ్చు. రెండు మూడు నెలలుగా తన వలలో పడడంలేదని చెప్పి, తనకో దిరదృష్టవంతుడనే ముద్ర వేసి, తనతో వేటకు పంపడంవలన ఏమీ నేర్చుకోలేడని మానోలిన్ తల్లిదండ్రులు ఆ బాలుడ్ని ఇంకెవరితోనో వేటకు పంపిస్తారు. వారికి కూడా బుద్ధి చెప్పవచ్చు. కానీ అందుకు భిన్నంగా, చాలా సహజంగా, ఈ నవలను రచయిత నడిపిస్తాడు. ప్రకృతిని గెలవడంలో వుండే పోరాట పటిమను, స్ఫూర్తిని పాఠకులలో రగిలించడం ద్వారా ఇంకా ఉన్నత సాహితీ ప్రయోజనాన్ని సాధిస్తాడు. ఇలా అంచనా వేసినప్పుడు ‘ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ’ నవల గొప్ప వ్యక్తిత్వ వికాస పుస్తకంగా కూడా గోచరిస్తుంది. సెల్ఫ్ ఇంప్రూవ్ మెంట్ సిరీస్ పుస్తకాలు రాసేవారు, చదివేవారు కూడా పరిగణించాల్సిన అంశమిది. “నీవు గొప్ప శక్తిమంతుడవు. లే. లే.” అని ఊదరగొట్టేకంటే ఇలా కథ రూపంలో వ్యక్తిత్వ ప్రభను మెరుగుపరచాలనుకోవడం ఉత్తమమైన విధానం. అలా రాయబట్టే నూతన సహస్రాబ్దిలోనూ రాబిన్ ఎస్ శర్మ రాసిన “ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెర్రరి” నవల అంత ఆదరణ పొందింది.

నవల సారాంశాన్నంతటినీ గొప్ప వాక్యంతో రచయిత స్పష్టంగా సూచిస్తాడు. “మనిషి మరణిస్తాడే కాని ఓడిపోడు”. ఈ మధ్య తామరతంపరగా వస్తున్న మన వ్యక్తిత్వ పుస్తకాల్లో తప్పుదోవ పట్టించే ఫిలాసఫి చెప్తున్నారు. ఏదో ఒకటి సాధించడం (ముఖ్యంగా డబ్బు సంపాదించడం) లోనే గెలుపు వుందని కారుకూతలు కూస్తున్నారు. విజయం సాధనలో లేదు. సాధించే ప్రయత్నంలో వుంది. నిజానికి ఫలితం మీద ధ్యాస పెట్టకుండా ప్రయత్నం మీదే మనసు లగ్నం చేసినప్పుడు మార్గాలు పెడతోవ పట్టకుండా నీతిమంతంగా బతకడానికి వీలుంటుంది. దురదృష్టవశాత్తూ తెలుగులో ఇటీవల వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాస్తున్న వాళ్లంతా ఫిలసఫికల్ గా అంత డెప్త్ లేనివాళ్లే. జీవితంలో నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికి రచననొక వృత్తిగా ఎంచుకున్న వాళ్లే.

ఈ నవలలో శాంటియాగో వృద్ధుడు కాబట్టి మనసులో అనుకుంటున్న మాటలను బయటకు మాట్లాడేస్తూ వుంటాడు. బాలుడితోనే కాక, మార్లిన్ చేపతోనూ, సముద్ర పక్షులతోనూ, షార్క్ చేపలతోనూ, సముద్రంతోనూ మాట్లాడుతూ వుంటాడు. అలనాటి మేటి బేస్ బాల్ క్రీడాకారుడు డి మాగియో గురించి మనకు చెప్తాడు. ఈ నవలను ప్రేరణగా తీసుకుని సముద్రానికి బదులు అడవి నేపథ్యంలో, చేపకు బదులు అడవి పందుల వేటతో ఇదే జీవన పోరాట సూత్రాన్ని వర్ణించే కథాంశంతో డాక్టర్ కె. కేశవరెడ్డి “అతడు అడవిని జయించాడు” అనే నవలను తెలుగులో రాశారు. ఆంధ్రా యూనివర్శిటీ ఇంగ్లిష్ ప్రొఫెసర్, సీనియర్ అనువాదకులు సి ఎల్ ఎల్ జయప్రదగారు ఈ నవలను ఇంగ్లిషులోకి అనువదించగా మ్యాక్ మిలన్ సంస్థ ప్రచురించింది. ఇంతకీ ‘ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ’ నవలను ఎవరైనా తెలుగులోకి తెచ్చారా?

ఏ మస్ట్ రీడ్ ఫర్ యూత్.

ప్రకటనలు

7 responses »

 1. ప్రకృతితో మనిషి ఎప్పటికీ పోరాడజాలడు. అతడు ప్రకృతి ముందు అశక్తుడు. నిస్సహాయుడు. హీనుడు. బలహీనుడు. తెలివితక్కువవాడు కూడా. అతడు ఇప్పటిదాకా పోరాడింది తన అసౌకర్యాలతో ! లేదా అసౌకర్య భావనతో ! ప్రకృతికి తల వంచి ఆమె సూత్రాల్ని అర్థంచేసుకుని ఆ మార్గంలో నడవడం ద్వారా మాత్రమే అతడు ఆ అసౌకర్యాల్ని అధిగమించగలిగాడు తప్ప ప్రకృతితో అతడెప్పడూ పోరాడలేదు. అలా అనుకోవడం అవాస్తవిక భావన. అదే నిజమైతే అతడు అనుభవిస్తున్న సౌకర్యాలలో ఏది ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా నడవగలుగుతోంది ?

  పసితనం, బాల్యం, ముసలితనం, చావు, ఆకలి, కామం మొ|| మన శారీరిక లక్షణాలు కూడా ప్రకృతే. ఋతువులు కూడా ప్రకృతే. భూమ్యాకర్షణ శక్తి ప్రకృతే. వాటిని ఎవరు జయించారు ?

 2. చాలా గొప్పగా విశ్లేషించారు. ఇదివరలో ఇదే పుస్తకాన్ని సుజాత గారు పరిచయం చేసారులోంది.

  ఈ మధ్య తామరతంపరగా వస్తున్న మన వ్యక్తిత్వ పుస్తకాల్లో తప్పుదోవ పట్టించే ఫిలాసఫి చెప్తున్నారు. ఏదో ఒకటి సాధించడం (ముఖ్యంగా డబ్బు సంపాదించడం) లోనే గెలుపు వుందని కారుకూతలు కూస్తున్నారు. విజయం సాధనలో లేదు. సాధించే ప్రయత్నంలో వుంది.

  ఈ మాటలు చాలా బాగా నచ్చాయి.
  ఇప్పుడు వస్తున్న వక్తిత్వ పుస్తకాల్లో డబ్బు సంపాదించటమే ఒక పరమావధిగా చెపుతున్నారు. వ్యక్తిత్వం అంటే కేరీరిజమే అనే భావం లోకి యువతను నెట్టేసారు.
  మీపోష్టులో ప్రస్తుత పుస్తకాన్ని పరిచయం చేస్తూ పై విషయాన్ని ఖండించటం ఆనందం కలిగించింది.

  మంచి పోష్టు.

  బొల్లోజు బాబా

 3. రవి గారు,
  పుస్తకాన్ని చదివినపుడు ఎంత ఎంజాయ్ చేసానో మీ సమీక్ష చదివినపుడూ అంతే ఎంజాయ్ చేసాను.పుస్తకాలని అనుభవించడం లోని ఆనందం ఇంకెందులోనూ లేదనిపిస్తుంది నాకు!

  వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాయడం ఇప్పుడొక ఫాషన్! నాలుగు ఇంగ్లీష్ పుస్తకాలు చదివి, కొంచెం సొంత పాండిత్యాన్ని జోడించి జనం మీదకు వదిలి డబ్బు పోగేయడమే వాటి గమ్యం! బోరు కొట్టకుండా అందులో కథను కూడా చేరిస్తే ఇంకొంచెం ఎక్కువ సేల్సు! వాటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.

  ప్రకృతిని గెలవడంలో ఉన్న పోరాట పటిమను, స్ఫూర్తిని రగిలించడమే ఈ నవల ఉద్దేశం! ఎంత బాగా చెప్పారు మీరు!

  వృద్ధుడు తన చుట్టూ ఉన్న పక్షులతో, చేపలతో, సముద్రంతో మాట్లాడుతూ ఉండటం, మనం అతడి ఎదురుగా కూచుని వింటున్న అనుభూతిని కలిగిస్తుంది. అదొక అద్భుతం!

  బాబా గారు చెప్పినట్టు ఈ నవలను నేను కాదు, పూర్ణిమ అనుకుంటాను పరిచయం చేసింది. నేను కేశవ రెడ్డి గారి మరో నవల “మునెమ్మ” ను పరిచయం చేస్తూ( మీ అంత అద్భుతంగా కాదులెండి, మిమ్మల్ని చూస్తే నాకు ఈర్ష్య) “అతడు అడవిని జయించాడు” గురించి ప్రస్తావించాను, అంతే!

  మంచి పుస్తకాల గురించి మీలాంటి వారితో ఎంత సేపయినా మాట్లాడాలనిపిస్తుంది.

 4. 🙂 Agreed! A must read for youth.

  ఈ పుస్తకం చదివినప్పుడు నాకు ఎంత అర్ధమయ్యిందనిపించిందో, నాకు తెలియనిదేదో మిగిలిపోయిందీ అని అనిపించింది. ఇది ఒకసారి చదివితే అయ్యిపోయే పుస్తకం కాదు. చదివే కొద్దీ జీవితాన్ని బాగా అర్ధం చేయించే పుస్తకం. దీని గురించి నేను త్వరలో రాయడానికి ప్రయత్నిస్తాను.

  By the way, any inputs on the famous “Iceberg theory” by this author?

 5. ఎప్పటిలాగే చాలా మంచి సమీక్ష. పూర్ణిమ గారు పరిచయం చేసిన ఈ పుస్తకం గురించి మీ టపా వల్ల ఇంకొంచం తెలుసుకునే అవకాశం కలిగింది.

  నిజం చెప్పాలంటే ఈనాటి వ్యక్తిత్వ వికాసం పుస్తకాలంటే నాకూ కొద్దిగా చులకన భావనే. అవేవో మన మీద రుద్దుతున్నట్టు ఉంటుంది తప్ప మనసులో నిలిచిపోయేట్టు ఉండవు.

  నా చదవాల్సిన లిస్టులో దీనినీ చేర్చుతా !

 6. రవిగారు,ప్రపంచభాషలన్నిటిలొకీ(నేను చదివినవన్నీ తెలుగు,ఇంగ్లీషు అనువాదాలే అనుకోండి)అత్త్యుత్తమమైన ఉద్గ్రంధం ఇది.మీరు ఇలా ఇచ్చిన అరటిపండును ఆరార తింటాం మేమందరం 🙂
  ప్రపంచంలోనే అత్యంతచిన్న కధ రాసినవాడూ మన కధానాయకుడే.ఆజానుబాహుడే కానీ అరవిందదళాక్షుడు కాదు మనవాడు,మయోపియాబాధితుడు.
  హెమ్మింగ్ వే రాసిన “ది స్నోస్ ఆఫ్ కిలిమంజారో”సినిమాగా వచ్చింది,హాలీవుడ్ దిగ్గజం గ్రెగరీ పెక్ నటించగా చూసే అవకాశం నాకు లభించింది.ఈ ఓల్డ్ మాన్ అండ్ ది సీ కూడా పలుమార్లు తెరకెక్కింది(వెండి తెర,బుల్లితెర).ఈనాడు జర్నలిజం స్కూలులో మా గురువుగారు బూదరాజు రాధాకృష్ణ గారి అభిమానానికి నన్ను పాత్రుడిని చెయ్యటంలో ఈనవలను ఒక్కటంటే ఒక్కపేజీకి సంక్షిప్తీకరించిరాయటం కూడా ఒక కారణం 🙂
  నిజం చెప్పాలంటే గత ఇరవైఏళ్ళుగా ఈ నవలను చదూ…తూ..నే ఉన్నా,కానీ పిసరంతకూడా వంటబట్టలా.ఈ మహోజ్వలరచన స్పూర్తిగా మీరన్నట్లు కేశవరెడ్డి గారి నవలే కాక,దానికి ముందుగా ఇటీవలే కన్నుమూసిన కమెండో,వెరైటీ పత్రికల సంపాదకుడు వినుకొండనాగరాజు గారు “ఊబిలో దున్న”పేరిట ఒక నవల,ఒరిజినల్ ఎన్ కౌంటర్ ఎడిటర్ పింగళి దశరధరామ్ ఒక నవల(పేరు నాకు గుర్తులేదు) తెలుగు పాఠకులకు అందించారు.అలాగె ఈ నవలను వినుకొండనాగరాజు గారు వెరైటీ పత్రికలో ఒకమాసపు నవలా అనువాదం గా అందించినట్లు గుర్తు.

 7. చాలా..చాలా..చాలా బాగా రాసారు. “విజయం సాధనలో లేదు. సాధించే ప్రయత్నంలో వుంది.” ఈ నవల సినిమా గా కూడా వచ్చింది. ముళ్ళపూడి వెంకటరమణ సినీ రమణీయం లో దీన్ని సమీక్షించారు.

  ఈ మధ్య వస్తున్న వ్యక్తిత్వ రచనల గురించి, బాబా గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s