సాహితీ ప్రియులకు నిజమైన విందు ఈ ‘సహృదయం’

సాధారణం

80, 90 దశకాలలో చినవీరభద్రుడి సాహితీ అభ్యాస ప్రతిస్పందనే “సహృదయునికి ప్రేమలేఖలు”. నిజానికివి ఉత్తరాలు కావు. పలు ఉపన్యాస ప్రసంగాలు, కొన్ని పుస్తకాలకు రాసిన ముందుమాటలు. ఇంకా మరికొన్ని సాహితీ వ్యాసాలు. ఈ వ్యాసాలు చదవగానే మనకు తెలిసేది చినవీరభద్రుడు గొప్ప పాఠకుడని. ఇంగ్లిషులో  అయితే ఒరేషియస్ రీడరంటాం. అదే తెలుగులో అయితే భయంకరమైన పాఠకుడంటాం. కథ, కవిత, వ్యాసం, నవల, రిపోర్టులనే భేదం లేకుండా; దేశ కాలాల తేడా లేకుండా; భాషా భేదాలు చూపకుండా సాహిత్యాన్ని, సాహిత్య కారుల్ని రచయిత అధ్యయనం చేసిన సంగతి మనకిట్టే బోధపడుతుంది. ఏనుగు ఆహారం తీసుకుంటున్నట్టుగా కాకుండా, ఆ రచయితల రచనలను ఎంతో సూక్ష్మ పరిశీలనతో చదవడం ఈ “ప్రేమలేఖలు”లో కనిపించే రెండో లక్షణం. కవులు, రచయితలు వాడే మాటలను, ఏ సందర్భంలో, ఎంత ఆర్తితో వాడి వుంటారో, వారి హృదయాల్లో దూరి తెలుసుకుని వివరణాత్మకంగా చెబుతారు. ఒక రచయిత రచనను పరామర్శిస్తూనే ఆ రచయితను ఇతర సమకాలీన రచయితలతో తులనాత్మక అధ్యయనం చేయడం కేవలం చినవీరభద్రుని విమర్శలో విలక్షణత. ఒక నడివేసవి కాలంలో విరగకాసిన గుబురు మామిడిచెట్టు కింద కూర్చుని తన చుట్టూ చేరిన సాహిత్య విద్యార్థులందరినీ నేలమీద కూర్చోబెట్టుకుని సాహిత్య మర్మాలను సాధికారంగా విడమర్చి చెప్తుంటే వుంటున్న అనుభూతి కలగడం ఈ పుస్తకం మూసిన వెంటనే అనుభూతమైన మూడో అంశం.

‘వెయ్యేళ్ల తెలుగు కవిత్వ చరిత్రలో ఆయన చివరి చక్రవర్తి. నవ్య సమాజంలో ఆయన మొదటి పౌరుడూనూ‘ అంటూ శ్రీశ్రీని అంచనా వేస్తారు. మనల్ని శ్రీశ్రీని కొత్త కోణంలో చూడమని చెప్తూ ప్రోత్సహించడంలో భాగంగా శ్రీశ్రీ కవిత్వ నిర్మాణాన్ని ఎలా పరిశీలిస్తున్నారో చూడండి: ‘ “మహాప్రస్థానం”తో పోలిస్తే “ఖడ్గ సృష్టి”, “మరో ప్రస్థానం”లలో ఎన్నో కవితల్లో నిర్మాణపరంగా శిథిలబంధం కనిపిస్తుంది. కాని ఈ డిమాలిషన్ కవి స్వయంగా పూనుకుంటున్నది. మహా ప్రస్థాన గీతాల కాలంలో ఆయన పూర్వ కవితా రీతుల్ని డిమాలిష్ చేస్తూ తన రీతిని స్పష్టంగా ప్రకటించాడు. కాని ’40ల తర్వాత ఆయన తన కవితా రీతుల్నే తను విధ్వంసం చేసుకుంటూ పోయాడు.

ఒక జీవిత కాలపు సాహిత్య కృషినంతటినీ గిరిజనుల శ్రేయస్సు కోసమే అంకితం చేసిన ఏకైక తెలుగు రచయిత భూషణం మేష్టారు గురించి ఎంత మంచిమాట చెప్పారో చినవీరభద్రుడు. అంతటి వివేచనవంతమైన వ్యాసం మరే కళింగాంధ్ర కథకుడైనా చెప్పారా? నాకైతే వెంటనే ఎలాగైనా “సిక్కోలు జీవితాలు” సంపాదించి చదవాలనుంది. మనం తుర్జెనెవ్ గురించీ, దోస్తయెవ్ గురించీ, పూష్కిన్ గురించీ లొట్టలు వేసుకుని మాట్లాడుకోవడానికి ఇష్టపడతాం గాని, మన భూషణం మాష్టారి గురించో, మన బలివాడ కాంతారావు గురించో, మన చాసో గురించో పదేపదే మాట్లాడుకోము. వీళ్ల రచనలను అనేక కోణాలనుంచి చదవడానికి, చదివించడానికి, చర్చించుకోవడానికి ప్రయత్నించం. “కొత్తగాలి”, “కొండగాలి” కథా సంపుటాలలో భూషణం మాష్టారు మాస్టర్ స్టోరీ టెల్లర్ గా విశ్వ సాహిత్యపు ఏ అగ్రశ్రేణి రచయితతోనైనా ఎలా పోల్చవచ్చునో ఎవరైనా ప్రయత్నిస్తే బాగుణ్ణు.

ఆధునికత, ఆధునికానంతరత గురించి, ఇందులో యూరప్ చాపకింద నీటిలా చేస్తున్న హాని గురించి ఒక్క ముక్కలో రచయిత ఎలా చెప్తారో చూడండి: ‘దాని సమస్త రాజకీయ పరిభాషలోనూ, ఆధునికతను గాంధీ, మండేలాలు ఒక రీతిలో, మావో, హోచిమన్ లు మరొక అర్థంలో ఓడించివేశారు. ఈ ఓటమి పర్యవసానంలో యూరప్ తన పదజాలాన్ని, ఆ పదజాలం ఆధారంగా రూపొందిన తన తత్వ శాస్త్రాన్ని నిర్మాణాన్ని, సంస్థల్ని, పునరాలోచించుకోవడం ఆధునికానంతర సంవాదంగా ఇప్పుడు నడుస్తోంది’. ఎంత గుంభనంగా చెప్తున్నారో కదా! “తెలుగు కవిత్వం – వ్యక్తివాదం” అనే వ్యాసంలో ‘మధ్య యుగాల్లో పాప పరిహార పత్రాలు అమ్ముకున్న మతాధిపతులకు, ఆధునిక యుగంలో మేనిఫెస్టోలు పంచుకున్న ఉద్యమాధిపతులకు ఏ మాత్రం తేడా లేదు‘ అనడం ఎన్ని ఆలోచనలకు తావిస్తుందో కదా! డాక్టర్ వి. చంద్రశేఖరరావుగారి కథల సంపుటి “లెనిన్ ప్లేస్”ను సమీక్షిస్తూ తనకు ఈ ప్రయోగాత్మకమైన శిల్పంపట్ల వున్న అనిష్టతను చెప్పకనే చెప్పినట్టు అనిపించింది. ‘పోస్ట్ మోడర్న్ కథకుడు చిన్న చిన్న గుంపుల, సమూహాల, సమాజాల ఐడెంటిటీని ప్రతిష్టించే ప్రయత్నంలో పురాతన అరిస్టాటిలీయ సూత్రాల్ని మరొక రీతిలో ముందుకు తీసుకువస్తున్న నిజాన్ని కూడా ఆయన (డాక్టరుగారు) గమనించాలి‘ అన్నారు చినవీరభద్రుడు. దీన్నెలా అంగీకరించగలం? శిల్పపరంగా అసలు ఆ ప్రయోగాలు చేస్తున్నదెందుకోసం? విధ్వంస జీవన దృశ్యం చిత్రించడానికి కదా. మళ్లీ సూత్రాల ఫ్రేమ్ వర్క్ దీనికి బిగించాలనుకోవడం ముందుకు మూడడుగులు వేసి వెనక్కి ఆరడుగులు వేయడమే అవుతుంది. పికాసో చిత్రాలకు అర్థాలు వెతకగలమా? ఆ చిందరవందర గందరగోళపు దృశ్యాదృశ్యాలను రవివర్మ చిత్రాల మాదిరి సరిచేయగలమా? అన్ని రంగాలలో పతనమవుతున్న విలువలను అక్షరబద్దం చేసే ప్రయత్నంలో వెలువడిందే ఆ కొత్త టెక్నిక్. ‘ఎంటీవీలో పాటల విజువల్స్ లాగా అసంబద్దంగా‘ చంద్రశేఖర రావు కథనం వుంటుందన్నారు చినవీరభద్రుడు (డాక్టరుగారు వాడే కొల్లాజ్ టెక్నిక్ ను, మాజిక్ రియలిజపు ధోరణులనే అసంబద్దమంటున్నారా?). అసలిప్పుడు మన జీవితం ఎంత ‘సంబద్దంగా’ ఏడ్చి చచ్చింది కనుక? పేజీ 194లో ‘ఇటువంటి పరిణతిని రచయిత పొందగలడని ఆశ చూపిస్తున్నాయి’ అంటారు రచయిత. దీనితో కూడా మనం విభేదించాలి. టి. ఎస్. ఇలియట్ ‘ది వేస్ట్ లాండ్’ కావ్యం ఒక పెద్ద శిథిల దృశ్యాల కుప్ప (ఎ హీప్ ఆఫ్ బ్రోకెన్ ఇమేజెస్). అది అలా అర్థం చేసుకోవాల్సిందే. ఏ విలువలు కోల్పోతున్నామో వాటిని రచయితలు చిత్రిస్తున్నారంటే అంతకు ముందున్న సమాజ సంస్కృతినే వారు కోరుకుంటున్నట్టు. వారి ప్రయాణం ఆది నుంచీ ‘హ్యూమన్ ప్లేస్’ వైపే.

ఆంద్రీయ్ దోర్కిన్ రచన ‘ఇంటర్ కోర్స్’కు రాసిన సుదీర్ఘ పరిచయ వ్యాసం అబ్బురపరిచేది. అంతవేగం జీర్ణించుకోలేని సంగతులెన్నో ఈ వ్యాసంలో వున్నాయి. అత్యుత్తమ సాహిత్య, తాత్విక సమీక్ష వుంటుందన్న ఈ పుస్తకం సంగతేమో కాని, వివాదాస్పదమైన ఈ వ్యాసం మాత్రం జెండర్ స్టడీస్ చేసేవారికి ఉపయుక్తమైనది. ఈ వ్యాసంలో గమ్మత్తుగా కమ్యూనిజంపై సానుభూతి చూపిస్తారు రచయిత. (చినవీరభద్రుడి “పునర్యానం” కవిత్వంలో ఈ సిద్ధాంతం పట్ల లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్లు కొన్ని కనిపిస్తాయి). దానికి భిన్నంగా ఈ వ్యాసంలో ‘కమ్యూనిజం, ఫెమినిజం ఆధునిక మానవతావాదానికి రెండు నేత్రాల్లాంటివని కితాబిస్తారు. ఈ వ్యాస సంపుటిలో చైనా కవిత్వం గురించే కాదు, కన్నడ కవిత్వం గురించి, మరెందరో తెలుగు రచయితల రచనల గురించి ఆహ్లాదంగా చర్చిస్తారు చినవీరభద్రుడు.

ఇక చినవీరభద్రుడి ఆత్మీయమైన అక్షరాలలో మల్లెల మత్తు పరిమళంలా మనల్ని నిలువెల్లా మోహవివశుల్ని చేసే నాలుగో లక్షణం చెప్పి ఈ పరిచయ వ్యాసం ముగిస్తాను. అది రచయితలు కానివ్వండి, రచనలు కానివ్వండి, వాదవివాదాలు కానివ్వండి, వారిలో మంచిని మాత్రమే చూడడం ఈ కవి, కథకుడి, అనువాదకుడి, విమర్శకుడి బలమైన బలం. అందుకే ఇవన్నీ సహృదయుని రాతలయ్యాయి. “ద్వేషించవలసింది చెడ్డని తప్ప / మనుషుల్ని కాదన్నదే / మంచి రచయితలందరి నుంచి మనకు తెలిసేది” అనే వెనుక అట్టపై చెప్పారు. ఈ సత్యాన్ని ప్రతి పుటలోనూ మనం గమనించగలం. (ఒక్క మాట – మునిపల్లె రాజు గారి జర్నలిజంలో సృజనరాగాలు చదివాక పొందిన అనుభూతే ఈ పుస్తకం పూర్తిచేశాక మనం పొందుతామనడం అనవసర ప్రసంగం కాదనుకుంటాను.) ఎమెస్కో ప్రచురించిన ఈ 240 పేజీల పుస్తకం వెల 90 రూపాయలు మాత్రమే. మరి మీరూ చదువుతారుగా!

ప్రకటనలు

14 responses »

 1. చినవీరభద్రుడు గారు బహుముఖ ప్రజ్ఞా శాలి.

  వారు వ్రాసిన పుస్తకం పై మీ సమీక్ష చాలా అర్ధవంతంగా, వివరణాత్మకంగా సాగింది. వెంటనే ఆ పుస్తకం కొనుక్కుని చదివేయాలనిపించేంత కదిలించింది.

  మీ విశ్లేషణ ను ఒట్టి ఉటంకిపులతో సరిపుచ్చకుండా సహేతుకమైన వాదనలతో కూడిన విభేధించటం కూడా చాలా బాగుంది. మీ విభేధనాలు కూడా ఆలోచింపచేసాయి.

  టి.ఎస్. ఇలియట్ కావ్యంపై మీరు చేసిన వాఖ్య (మీదనే అనుకుంటున్నాను) చాలా బాగుంది.

  ఏతా వాతా మీ వ్యాసం ద్వారా నేతెలుసుకొన్నది మీరు కూడా ” భయంకరమైన పాఠకుడి” లానే అనిపిస్తున్నారు. (ఎబ్బెట్టుగా లేదూ? 🙂 )
  అభినందనలు.

  చిన్న సూచన అన్యధా భావించరని తలుస్తాను.
  పుస్తకంలోని ఉటంకింపులను పైనా క్రిందా లైన్ స్పేస్ ఇచ్చి వ్రాసినట్లయితే చదవటానికి బాగుంటుంది.

  బొల్లోజు బాబా

 2. చిన వీరభద్రుడు గారి రచనలు దేనికదే అద్భుతం! ఒకసారి ఆయన ఇండియా టుడేలో అరకు యాత్ర రాసింది చదివేదాకా అరకు అంత అందంగా ఉంటుందని నాకు తోచలేదు.

  తప్పక కొనాల్సిందే! చదవాల్సిందే!

  “మనం చాసో గురించో, బలివాడ కాంతారావు గురించో పదే పదే మాట్లాడుకోం.”…ఎందుకు మాట్లాడుకోమండీ? చాసో కథల గురించి మీరు మొదలెట్టండి, నలుగురూ మీకు తోడు వచ్చి, నాలుగు మాటలు పంచుకుంటారు.(అందులో నేనూ ఉంటాను.) మొదలెట్టాల్సింది మాత్రం మీ లాంటి వారే మరి!

 3. చినవీరభద్రుడు గొప్ప పాఠకుడు,వ్యాఖ్యాత వరకూ ఒప్పుకుంటాను,గొప్ప రచయిత అనటం నాకు ఆంత సమంజసంగా అనిపించటం లేదు.ఆయన తత్వవేత్తల మీద రాసినపుస్తకమొకటి దానికో పెద్ద ఉదాహరణ.గొప్పవాళ్ళమీద ఆయన వ్యాఖ్యానాలవరకూ నాకు ఓకే

 4. బాగుంది మీ సమీక్ష. వీలైనంత త్వరలో ఒక పట్టు పట్టాలి.
  voracious కి సరియైన తెలుగు పదం “భయంకరమే”నా? ఈ మధ్యకాలంలో భయంకరమన్న పదం భయంకరంగా వాడబడుతోంది. అందుకని అనుమానం.

  మంచి పుస్తకాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు!

 5. దేవరాపల్లి రాజేంద్రకుమార్ గారు, చినవీరభద్రుడి కొన్ని కలలు కొన్ని మెలకువలు మీరు చదవలేదనుకుంటాను. అలాగే పునర్యానం అనే కవిత్వం కూడా మీరు చదవలేదనుకుంటాను. అంతేకాక, ఆయననువాదం చేసిన అబ్దుల్ కలాం ఆత్మకథ ఒక విజేత ఆత్మకథ కూడా మీరు చదవలేదనుకుంటాను. ఇంకా ఇండియాటుడే లో వచ్చిన సాలోచన వ్యాసాలు మీరు చదవలేదనుకుంటాను. అవీకాక అపుడపుడూ రాసిన ప్రశ్నభూమి లాంటి కథలు కూడా మీరు చదవలేదనుకుంటాను. ఒకవేళ వీటిల్లో ఏ ఒక్కటి మీరు చదివినా చినవీరభద్రుని గురించి తక్కువగా అంచనా వేయరు. ఆయన గొప్ప పాఠకుడు. అంతే. అదొక్కటే చాలు. ఆయన ఒక వాక్యమైనా రాస్తే అది పాఠకుల అదృష్టం. లేదంటే లేదు. ఏమంటారు?

  -నాగార్జున

 6. అయ్యా,నాగార్జున గారు,మీరు చెప్పినవాటిలో కొన్ని చదివాను,కొన్ని చదవలేదు.చదివినవి ఎవరో చెప్పారని చదవలేదు,చదవనివి ఎవరూ చెప్పలేదని ఆపలేదు.ఆయన రచనలు మీకు విపరీతంగా నచ్చొచ్చు.నాకు నచ్చకపోవచ్చు.ఆయన ఒక గొప్ప పాఠకుడు,అది నేనూ చెప్పాను కానీ, ఆయన ఒకముక్కరాయకపోతే దురదృష్టవంతులయ్యేంత దయనీయమైన స్థితిలో తెలుగు పాఠకులు లేరని అంటాను,మీరేమంటారు??
  గొప్పపాఠకుడు అంటే ఎవరో,ఎలా ఉంటారో,ఎలా ఉండాలో గతంలో సతీష్ చందర్,మిసిమి పత్రిక వ్యవస్థాపకుడు ఆలపాటి రవీంద్రనాధ్ గురించి వార్త దినపత్రికలో ఒక వ్యాసం రాసారు.ఇన్ని చదివిన మీరు అఒక్కటీ చదివి చూడండి.

 7. – దేవరాపల్లి రాజేంద్ర గారికి సమాధానంగా నాగార్జున గారు రాసిన జవాబును తొలగించాను. నాగార్జున గారు మన్నించాలి. మాటకు మాట మన సాహిత్య వాతావరణంలో వద్దులెండి.

  – చలం గారు, నా దగ్గరైతే చినవీరభద్రుడి ఫోన్ నెంబరు గాని, చిరునామా గాని లేవు. మీరు మన గూగుల్ తెలుగు గుంపులో ప్రయత్నిస్తే దొరకొచ్చు. మీకు తెలిస్తే గనుక దయచేసి, ఈ వ్యాసం సంగతి ఆయనకు తెలియజెయ్యండి.

  – ఈ పుస్తకం వచ్చి చాలా ఏళ్లే అయింది. ఆ అట్ట ఆ పుస్తకానిదే.

  – వ్యాసానికి స్పందించిన అందరికీ బోల్డు నమస్కారాలు.

 8. చర్చ కూడా సందర్భోచితంగానే ఉంది. వ్యక్తిగత వ్యంగ్యాలు కాస్త పక్కనె పెడితే, అర్ధవంతం కూడా అవుతుంది.
  భద్రుడు అన్నిటికన్నా ముందు గొప్ప పాఠకుడు. అందులో సందేహం లేదు. ఐతే, కథా శిల్పం దగ్గర్నించి, లోతన తాత్త్విక విషయాల దాకా ఆయనకి కొన్ని కచ్చితమైన అభిప్రాయాలున్నై. అంచేత ఆయన ప్లేటో గురించి రాసినా, చంద్రశేఖర్రావు కథల గురించి రాసినా ఈ ఫిల్టరులో వడపోత కచ్చితంగా జరుగుతుంది. ఆ ఫిల్టరు ఒకటుందని గ్రహించి దాని సంగతీ సందర్భం ఏవిటో తెలుసుకునే స్పృహలో పాఠకులు ఉంటే ఏ ఇబ్బందీ లేదు. గొడవ ఎక్కడొస్తుందంటే జనాలు ఎప్పుడూ “నిష్పాక్షిక విమర్శ” కోరతారు. విమర్శ కానీ విశ్లేషణ కానీ ఉన్నప్పుడు అసలు నిష్పాక్ష్కం ఎలాగవుతుందో నాకర్ధం కాదు. అట్లాంటి నిష్పాక్షికం ఏదన్నా ఉన్నా, ఇంటర్మీడియటు తెలుగు క్లాసంత బోరుగా ఉంటుందే తప్ప అందులోంచి పాఠకులకి అందేది ఏవీ ఉండదని కూడా నా అనుమానం.
  నా గోల సర్లేండి గానీ .. కవిత్వం విరివిగా రాసిన రోజుల్లో భద్రుడు కొన్ని మంచి పద్యాలు రాశారు. కథకుడిగా ఆయన ఎప్పుడూ నాకు పెద్ద నచ్చలేదు. విమర్శకుడిగా వ్యాఖ్యాతగా ఇప్పుడే ఆయన రచన మరో పార్శ్వాన్ని చూస్తున్నా. మళ్ళీ కలుద్దాం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s