ఎ.వి. రెడ్డిశాస్త్రి రెండో కథల సంపుటి “ఈ మంటలు చల్లారవు”

సాధారణం

1897 నాటి గురజాడ అప్పారావుగారి “కన్యాశుల్కం” మొదటి కూర్పును బంగోరె 1969లో స్కాలర్స్ ఎడిషన్ గా ప్రచురించారు. ఆ పుస్తకాన్ని తన ‘సంవేదన’ ఆరో సంచికలో రాచమల్లు రామచంద్రారెడ్డి సమీక్షించారు. అందులో ఇలా అంటారు: ‘షేక్ స్పియర్ అయినా అంతే, ఇబ్సెన్ అయినా అంతే, చెహోవ్ అయినా అంతే, గొప్ప కళాకారులెవరైనా అంతే. వాళ్ల శిల్పం సాధారణంగా అత్యున్నత స్థాయిలోనే ఉంటుంది. కానీ వాళ్ల గొప్పతనం వాళ్ల శిల్పజ్ఞతలో వుండదు. షేక్ స్పియర్ గొప్పతనం అతని రచనల్లోని సర్వంకషమైన జీవిత వాస్తవికతలో వుంది. ఇబ్సన్ గొప్పతనం అతని రచనల్లోని గుండెలు పెకలించే విప్లవ భావనలో వుంది. చెహోవ్ లోని గొప్పతనం మహా కరుణార్ద్రమైన అతని మానవతా దృక్పథంలో వుంది. ఈ సర్వ గుణాల సమగ్ర సమ్మేళనంలో వుంది’.

ఈ మాటల్ని 21వ శతాబ్దపు సాహిత్య విద్యార్థులంతా జాగ్రత్తగా పరిగణించాలి. 20వ శతాబ్దపు రచయితల రచనలను పరిశీలించినపుడు చాలా మెలకువగా వుండడం ఎంతో అవసరం. గత శతాబ్దపు రచయితలంతా తమ కథలకు, కవితలకు, నవలలకు, నాటకాలకు వస్తువులను ఎంత విభిన్నంగా ఎంచుకున్నారో, తాము ఆ వస్తువును పాఠకుడికి అందించే విధానం కూదా అంతే విభిన్నంగా, వినూత్నంగా, విప్లవాత్మకంగా వుండేట్టు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఇందువల్ల పాఠకులకు అదనపు శ్రమ పెరిగింది. చదివింది చదివినట్టు పక్కన పడెయ్యడానికి వీలు లేకుండా పోయింది. తనేం చదివాడో పాఠకుడికి జీవితంలో అదే అనుభూతం కావడం మొదలుపెట్టాక సాహిత్యం – జీవితం సమాంతరంగా రైలు పట్టాలు లాగా వెళ్ళే రోజులు పోయి, అవి ఒకదానినొకటి పెనవేసుకుని చేంతాడులాగా మారిపోయాయి. అందువల్లే చాలావరకు ఇరవయ్యో శతాబ్దపు రచయితల రచనల్లోని సంఘటనలు, దృశ్యాలు, వర్ణనలు వెంటాడే జ్ఞాపకం (హాంటింగ్ మెమరీ)లాగా పాఠకుడి మదిలో మిగులుతాయి. కథలో ఏం చెపుతున్నాదన్నది ఎంత ముఖ్యమో, ఎలా చెప్తున్నారన్నది కూడా అంతే ముఖ్యమైంది. దాంతో కథా నిర్మాణం పరిధి ఎంతో విశాలమైంది.

రెండు ప్రపంచ యుద్ధాల అనంతరం జీవితంలో గజిబిజిని, గందరగోళాన్ని, ఛిద్రమైన హృదయాన్ని సమర్ధంగా అక్షరబద్దం చాయడానికి పూనుకున్న రచయితలంతా కొత్తకొత్త ప్రక్రియలకు శ్రీకారం చుడితే, వారిలో శామ్యూల్ బెకెట్, ఆల్బర్ట్ కామూ, జా పా సార్త్ర, ఫ్రాంజ్ కాఫ్కాలు కొందరు మాత్రమే. కాగా వారు ఎంచుకున్న కథన ప్రక్రియల పేర్లు అదే వరసలో కాకపోయినా చైతన్య స్రవంతి పద్ధతి, అసంగతత్వం, అస్తిత్వవాదం… మొదలైనవి. ప్రకృతిలో మిగిలిన అన్ని విషయాల మాదిరిగానే బతుకు కూడా కొన్ని చలన సూత్రాలకు లోబడి పనిచేస్తుంది. సాహిత్యకారుడు ఆ చలన సూత్రాల గుట్టును నేర్పుగా విప్పడంతో మరింత మెరుగైన జీవితం వైపు పాఠకులు పయనించే అవకాశం వుంటుందనేది మరో సాహిత్య ప్రయోజనం.

ఇలా ఇంత సమాచారాన్ని నేపథ్యంగా వుంచుకుని కథలు చదివినప్పుడు మాత్రమే ఇరవయ్యవ శతాబ్దపు కథా రచయితలను మనం సరైన రీతిలో అధ్యయనం చేయగలుగుతాం. అలా చదివితేనే ఉత్తమ రచయితలు సృజించిన ఉత్తమ సాహిత్యాన్ని అత్యుత్తమ రీతిలో అర్థం చేసుకోగలుగుతాం. మరీ ముఖ్యంగా ఎ.వి. రెడ్డి శాస్త్రిగారి కథల్ని అర్థం చేసుకోవాలంటే ఈ మాత్రం అవగాహన ఉండితీరాల్సిందే.

రెడ్డిశాస్త్రిగారి మొదటి కథాసంపుటి “అసంగత సంగతాలు” ను ఇదివరకే పరిచయం చేశాను. ఇప్పుడు రెండో కథాసంపుటి “ఈ మంటలు చల్లారవు” పరిచయం ఈ వ్యాసంలో…

మొదటి సంపుటికి భిన్నంగా బుద్ధిజీవులకు బదులుగా ఇందులో బడుగుజీవుల బతుకుఘోష, బతుకు పోరు మనకు ఎదురవుతాయి. 1977లో ప్రచురితమైన “గేదె” కథతో ఈ సథాసంపుటి మొదలవుతుంది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలవారి సంగతెలా వున్నా శ్రీకాకుళం ప్రజలకు కూడా చదవడానికి ఇబ్బందిపెట్టే పూర్తి గ్రామ్యభాషలో సాగే కథ ఇది. “కర్రెప్పయ్యగారి సొట్టప్పియ్యకు కానీ కర్సులేకుండా గేదిపడ్డ దొరికింది…’ అనే వాక్యంతో కథ మొదలవుతుంది. రెండు దశాబ్దాల తర్వాత ఇలాంటి పూర్తి గ్రామీణ భాషలో కథంతా పూర్తిగా చెప్పడమనే విషయంలో రచయిత అవగాహనను విస్తృతపరుచుకున్నారు. 1993లో ప్రచురితమైన “అస్తమయం” కథలోను, 1995లో ప్రచురించిన “పాముకాటు” కథలోనూ కథనంలోనే కాక పాత్రలు మాట్లాడుకునే సంభాషణల్లో సైతం అంత సంక్లిష్ట భాష కనబడకపోవడం గమనిస్తాం. “గేదె” కథ చదవడానికి పాఠకుడు కాస్త ప్రయాస పడాల్సిన మాట నిజమే. ఎన్నో వ్యయప్రయాసలతో గేదెను పెంచుకుంటున్న సొట్టప్పయ్య తన గేదె పాలిచ్చే సమయానికి మోతుబరి చేతిలో భంగపడడం మనల్ని ఇబ్బంది పెడుతుంది.

1979లో డాక్టర్ మానేపల్లి చేసిన మహత్తర ప్రయత్నమైన ‘అవగాహన’ పత్రికలో ప్రచురితమైన కథ “ఈ మంటలు చల్లారవు”. గత దశాబ్దంలోనో, ఈ దశకంలోనో పాఠకులు ఈ కథను అసలు స్వీకరించలేరు. అంత చేదుగా ఇందులో వాస్తవిక గ్రామీణ జీవితాన్ని చిత్రిస్తారు. ఇంత కౄరత్వం, విశృంఖల దోపిడీ, అమాయక పేదలలోని నిస్సహాయతలను ఈ తరం పాఠకులు చాలా కష్టపడి కథను చదివి అందుకుంటారనుకోవడం అత్యాశే. గంగులు తన కొడుకు చేస్తున్న స్నేహాలు చూసి క్షోభపడి ఆవేశపడతాడు. ‘సీ నంజికొడకా! ఏల్ర నీ బతుకు, నివ్వెవుళితో నేస్తం కడతన్నవో కసింత ఆలోసించినావురా!… మనకెవులెవులు ఎనాటెనాటి దెబ్బలు కొట్టినారో మర్సిపోనావురా? నీ కొంపకగ్గెట్టీసిన తొత్తుకొడుకుల కాడికెల్ల ఆల్లతో లాలూసీ అయిపోతావురా? సీ నంజికొడక, నీ బతుకేల్ర!’ అని మందలిస్తాడు. గాని, ఆ రాత్రే గంగులు కొడుకు చెరువులో పడిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. కథంతా చదివిన తర్వాత నాకైతే రచయిత మీద చాలా కోపం వచ్చింది – అంత మెలాంఖలిగ్గా కథ రాసినందుకు. కానీ అప్పటి సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరుచుకుంటేనే ఇలాంటి కథలను అభినందించగలుగుతాం. కారా మేష్టారి “చావు”, “ఆర్తి” కథల్లోని దు:ఖమూ, రావిశాస్త్రి కథల్లోని వ్యంగ్యం మాటున దాగున్న హ్యూమన్ ఎగోని, బహుశా ఆ తరం రచయితలతో ఇలాంటి కథలు రాయించి వుండొచ్చు. ఈ కథకు ముగింపు వాక్యంగా బగాదిని ఓదారుస్తూ అన్న మాటలు ఖచ్చితంగా ఈ కథ చదవడం ముగించిన పాఠకునికి ఏర్పడిన దుఖాన్ని ఉపశమింప జేయడానికేనేమో ననిపించింది. ‘తమ్ముడోరె, రోసాలు, సావులు, బాదలు – యియ్యే మనకి బతుకలంట మిగిల్నాయి. సిన్నిగాడియాల సచ్చిపోనాడని ఈ పొలవ్ ల కూకొని నివ్వేడస్తన్నావు. మరి ఇన్ని నచ్చల గే వాల్లో మన్నాటోల్లు యెంతమంది గోలబెడతన్నారో, ఏడస్తన్నారో, మన కేటెరికా? మన్లాటోల్లకి మిగిలిందల్ల ఏడుపేన్రా’. (అన్నట్టు ‘సేదస్తం’, ‘మొగిలిపువ్వు పూస్తాది’ (పేజీ 11), ‘తారసపడ్డాడు’ (పేజీ 19) లాంటి పదాలు శ్రీకాకుళ గ్రామ్య భాషలో దొర్లుతాయంటారా?)

“తలనొప్పి” ఈ కథల సంపుటిలో ఆఫ్ బీట్ కథగా చెప్పుకోవచ్చు. దు:ఖభరితమైన మిగిలిన కథలతో పోలిస్తే ఇది కాస్త లైట్ గా వుంటుంది. అలాంటిదే “వేట” కథ కూడా. కథ పేరు చూడగానే రచయితకు సమకాలీనులైన అల్లం శేషగిరిరావు వెంటనే గుర్తుకొస్తారు. కానీ ఇది ఆ తరహా కథ కాదు. కేవలం మనుషుల నైజాన్ని, చిన్న చేపను పెద్దచేప మింగడమనే సహజ ఆటవిక న్యాయాన్ని చిత్రించే శేషగిరిగారి “వేట” కథ కూడా 70వ దశకంలో వెలువడిందే. వ్యవసాయం చెయ్యడం అప్పుల పాలవ్వడానికేనని అన్యాపదేశంగా చెప్పే కథ “సాలెగూడు”. కాగా, కథల పుస్తకం చదివిన తర్వాత మనల్ని చాలా కాలం వెంటాడే కథలుగా “ఈ మంటలు చల్లారవు”, “అంత్యారంభాల అంచున”, “పాముకాటు” కథలు గుర్తుండిపోతాయి. కలిగిన వాడు లేనివాడిని ఎన్నో విధాలుగా చేస్తున్న దోపిడీ వాళ్ల జీవితంలో ఎంత విషాదం సృష్టించగలదో ఈ కథలద్వారా తెలుస్తుంది. ఎంత భయంకర మైనవైనప్పటికీ ఎంతో ఒడుపుగా పాములు పట్టేసే వీరుడు కుష్టడికి పాములు కరవవు. అంతకంటే ప్రమాదకరమైన కాటుకు గురవుతాడు “పాముకాటు” కథలో. పాతికేళ్లదాకా సారాచుక్క కూడా రుచి చూపించకుండా తన కొడుకుని సాయిత్రమ్మ పెంచుకుంటూ వస్తోంది. ఎంతో కర్కోటకురాలని అందరూ, ఆఖరుకు తన బిడ్డలు సైతం అనుకుంటున్నా లెక్కచేయకుండా రెక్కల కష్టం మీదే కుటుంబాన్ని లాక్కొస్తూ వస్తోంది. అలాంటిది పెదబాబు తన సెక్యూరిటీ కోసం కొంతమంది వ్యసనపరులు తనచుట్టూ వుండడం అవసరమని ఏర్పరుచుకున్న ప్రైవేట్ సైన్యంలో కుష్టడు నాలుగు సారా చుక్కలకు  కక్కుర్తిపడడంతో సావిత్రమ్మ నిలువునా నీరైపోతుంది. తన కొడుకును పాముకంటే ప్రమాదకరమైన జంతువు కాటేసినట్టే భావిస్తుంది. మద్యం పేదల జీవితాల్లో ఆడుకున్న వైనమొకపక్క, భూస్వాములు పేదల జీవితంతో ఆడుకోవడం మరో వైపు రచయిత ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు.

కథల్లో వున్న విషయాలే సమీక్షలో చర్చించుకునేకంటే, లేని విషయాల గురించికూడా కాసేపు మాట్లాడుకుంటే మంచిది. కాజ్ అండ్ ఎఫెక్ట్ సిద్ధాంతంలో కేవలం ఫలితం మీద మాత్రమే రచయిత దృష్టి కేంద్రీకరించడం ఈ కథల్లో ఒక లోటుగా భావించవచ్చు. కేవలం సమస్యను మాత్రమే చర్చిస్తూ పరిష్కారం దిశగా ఏ కథలోనూ ఆలోచించకపోవడం మనం గమనించవచ్చు. 60లలో ఇదే ప్రాంతంనుంచి వచ్చిన ఉత్తమ సాహిత్యంలో అప్పటికే భూస్వామ్య – కర్షక సంబంధాలను ఎంతో లోతుగా చర్చించిన కథకుల సైద్ధాంతిక ప్రభావం ఈ కథల్లో కనిపించదు. కేవలం బడుగు వర్గాల పక్షపాతిగా మాత్రమే రచయిత అగుపిస్తాడు. వారిలో, వారితో మమేకం కాకపోవడం కూడా రచయితను పడకకుర్చీ మేధావిగానే నిలబెడుతుంది. భూమి సంబంధాల వంటి కీలక విషయాల చర్చలు వచ్చినపుడు కూడా కేవలం రైతుల వెతలపై దృష్టి సారించిన రచయిత ఇంకా అంతకుమించి లోపలికి తన దృష్టిని సారించకపోవడం కూడా ఒక లోటే. కథల్లో స్త్రీ పాత్రల చిత్రణలో సాయిత్రమ్మ, మాలచ్చిమి, సూరి, దాలి, పాత్రలు మాత్రమే రక్తమాంసాలున్న పాత్రలు. ఇన్ని కథల్లోనూ ఒకే ఒక్క కథలో మాత్రమే (పెదబాబు మినిబార్ లోవున్న మందుసీసాలు “ఆడోళ్లు బట్టల్లేనట్టున్న ఆకారంలో” వున్నాయని) రచయిత ఫ్రాయిడియన్ స్లిప్ ఆఫ్ టంగ్ మాదిరిగా బయటపడడాన్ని బట్టి రచయితను మేల్ చావనిస్ట్ అనడానికి వీలులేదు. పాముకాటు కథలోనే ఇంగ్లిషు మేష్టారి పాత్ర ఎందుకు? కేవలం టైటిల్ చిరిగిపోతే రచయితను పోల్చుకోవడానికి తప్ప్. కథాకథంలో దేనికీ ఉపయోగపడని పాత్ర అది.

అయితే ఇదంతా భూతద్దంలో చూసిన రంధ్రాన్వేషణ గానీ, కథలన్నీ ముగించిన తర్వాత కేతు విశ్వనాధ రెడ్డిగారన్నట్టు మనకు కూడా అనిపించక మానదు. “గ్రామీణ సమాజం ఎటువైపు సాగిపోతూ వుందో, అది ఏ రకపు అభివృద్ధికి సంకేతంగా మారిపోతూ వుందో ఈ కథలు పట్టిస్తాయి. ఈ కథల్లో కనిపించే తరాల మధ్య అంతరం అదేదో సుఖాన్వేషణ నుంచి ఊడిపడింది కాదు. బతకలేని తనం నుంచీ, బతుకుదెరువు కోసం చేసే ప్రయత్నం నుంచి, శ్రమనుంచి, విశ్వాసం నుంచి, పోటీ ప్రపంచంలో దిక్కుతోచని స్థితిగతుల నుంచి పుట్టింది”.

ఈ రెందు సంపుటాలు కాక మరో సంపుటానికి సరిపడా కథలని ఇటీవల రెడ్డిశాస్త్రి రచించి, ప్రచురించారు. అయితే ఇందులో ఎక్కువ భాగం అస్తిత్వవాద ధోరణుల ప్రభావంతో రాస్తున్న మినీ అబ్సర్డ్ కథలే. “బొమ్మల కొలువు” వంటి ఏ కొద్ది కథలో మినహాయించి మిగిలినవన్నీ జీవితంలో అసంబద్దతను వెల్లడించే కథలు రాస్తున్న రెడ్డిశాస్త్రి తెలుగు సాహిత్యంలో రచన, అధ్యయనం, బోధన సాగిస్తున్న అతికొద్దిమంది రచయితల్లో ఒకరని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

మరి మీరూ “ఈ మంటలు చల్లారవు” కథా సంపుటి చదువుతారుగా! ఈ పుస్తకం కావలసినవారు కేవలం 40 రూపాయలను శ్రీకాకుళ సాహితి, కథానిలయం, శ్రీకాకుళం చిరునామాకు పంపి తెప్పించుకోవచ్చు.

ప్రకటనలు

One response »

  1. పింగుబ్యాకు: ఏడోవారం చదువు సంగతులు రెడ్డిశాస్త్రిగారితో… « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s