మానవ హక్కుల హననం

సాధారణం

మన దేశంలోనే కాదు, మనుషులున్న ప్రతిచోటా అధికారం కాపాడుకోవడానికి పాలకులు చట్టాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుంటారు. ఇది దాదాపు ప్రతి కాలంలోను, ప్రతి ప్రాంతంలోను జరిగిందే, జరుగుతున్నదే. మన దేశంలో ఎమర్జెన్సీ కాలాన్ని చీకటి రోజులతో పోల్చవచ్చు. ఇందిరాగాంధీ కొన్ని అనవసర భయాలు, తర్క రహిత కారణాలతో దేశంలో పెట్టిన ఆత్యయిక పాలనకు స్వయానా తన కొడుకే కొత్త భాష్యాలు చెప్పడంతో దేశమంతా పోలీసులు పెట్రేగిపోయారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు వికటాట్టహాసం చేస్తూ దురంతాలకు పాల్పడితే, అడ్డుకోవలసిన అధికారులు, కాపాడాల్సిన నాయకులు, న్యాయం చెప్పాల్సిన కోర్టులూ ఏవీ కిమ్మనకుండా ఊరుకున్నాయి. కనీస మాత్రంగానైనా ఎదురు చెప్పలేని నిస్సహా య పరిస్థితిలో ప్రజలు నానాయాతనలు పడ్డారు.

బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు దేశమంతటా చేసినప్పుడు మారుమూలనున్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని కస్తూరిపాడు తాలూకాలో కొబ్బరిచెట్లపేట అనే అరవై వాకిళ్ల అతి చిన్న పల్లెలో బొడ్డేపల్లి పాపయ్య అనే రైతుకూడా తప్పించుకోలేకపోవడం ఆ దుస్థితి తీవ్రతకు నిదర్శనం. పోలీసులు, అధికారులు, రాజకీయ గణాలు చేసిన ఓవర్ యాక్షన్ కు ఇలాంటి వందలు వేలాది కథలు దృష్టాంతాలుగా నిలుస్తాయి. వీటికి విరుగుడుగా నిలవాల్సిన ప్రజా చైతన్యం కొరవడడం, ప్రజా ఆందోళనలు జరగక పోవడం, ప్రజా ఉద్యమాలు సాగకపోవడంతో పాటు ఎక్కడైనా చిన్న ఎత్తున బయలుదేరిన నిరసనలను సైతం అధికారం ఉక్కుపాదంతో అణచివేయడంతో ఆ చీకటి రోజుల గాయాలు ఇప్పటికీ అందరినీ తీవ్రంగా సలుపుతున్నాయి. పోలీసులు అదే మొండి ధైర్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మనిషి ప్రాణం వారి దృష్టిలో విలువ లేనిదయింది. జీవించే హక్కును కాలరాయడం వారి హక్కుభుక్తమయింది. కనీస మాత్రంగానైనా హక్కుల స్పృహ భారతదేశంలో పోలీసులకు కొరవడింది. ఒకవైపు అస్సాంలోను, మరోవైపు కాశ్మీరంలోనూ, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ లోనూ జరుగుతున్న దమనకాండను మనం నిస్సహాయంగా చూస్తున్నాం. పోలీసు ఉద్యోగమంటేనే తల్లులూ, పిల్లలూ హడలిచచ్చే రోజులివి.

నిరుడు మనదేశంలో జరిగిన ఒక తంతును గమనించండి. పదేళ్ల కిందటి కేసుల విషయంలో అధికారం అడ్డదిడ్డమైన సాక్ష్యాలతో కోర్టు తీర్పులను తమకు అనుకూలంగా మలుచుకోగలిగింది – ప్రియదర్శిని కేసులో, జస్సికాలాల్ కేసులో. నిస్సహాయ స్థితిలో వున్న వారి బంధువుల ఆవేదనకు ఎన్. డి. టి. వి., తెహల్కా వంటి ప్రసార మాధ్యమాలు కృషి తోడై, జనమంతా సామూహికంగా గళం విప్పడం వల్ల కేసులు తిరగదోడి నిందితులకు కఠిన శిక్షలు వేయించగలిగాం. కాని ఎమర్జెన్సీ రోజులు వేరు. ఆనాటి పరిస్థితులు వేరు.

అధికారం చేసే ఈ మూర్ఖపు వికృత కరాళ నృత్యంలో పాలుపంచుకోవడానికి రాజకీయ పార్టీలేవీ మినహాయింపులు కావని ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్న ఆ చీకటిరోజుల దారుణ వ్యథార్థ గాథలు నిరూపిస్తున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలు పోరాడి నిలువునీరైన ఓ తండ్రి వేదనను ఇటీవల “నాన్న” పేరుతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. కేరళ రాష్ట్రంలోని త్రిచూర్ లో హిందీ ప్రొఫెసరైన టి.వి. ఈచర వారియార్ మలయాళంలో వెలువరించిన తన ఆవేదనాభరిత కథను సి. వనజ తెలుగు పాఠకులకు అందించారు. ఈ పుస్తకాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నాను.

1979 ఫిబ్రవరి 29న నక్సలైట్లు కాయన్న పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ దాడిని పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. మందీ మార్బలతో ఊరిమీద పడ్డారు. కాలికట్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ మీద విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రొఫెసర్ ఈచర వారియర్ ఒక్కగానొక్క కొడుకు రాజన్ కూడా అదే కాలేజీలో ఫైనలియర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రాజన్ ను కూడా పోలీసులు నిర్బంధించారు. అప్పటినుంచి ఇప్పటిదాకా రాజన్ ఆచూకీ లేదు. రాజన్ ఏమయ్యాడో అటు పోలీసులకు గాని, ఇటు తల్లిదండ్రులకు గాని, కనీసం ఇతర విద్యార్థులకు గాని, లేదంటే కోర్టుకు గాని ఇంతవరకు పోలీసులు తెలియజెప్పలేకపోయారు. జయరాం పడిక్కాల్, పులిక్కొడన్ నారాయణన్ అనే ఇద్దరు పోలీసు అధికారులు పెట్టిన చిత్రహింసలకు తాళలేక రాజన్ మరణించారు. లేదా ఆ వాక్యాన్ని ఇలా చెప్పవచ్చు. ఆ ఇద్దరు పోలీసు అధికారుల చేతుల్లో రాజన్ హత్యకు గురయ్యాడు. అంతే, పోలీసులకు సంబంధించినంతవరకు రాజన్ కథ అలా సమాప్తమయింది. రాజన్ శవం ఎముకలు కూడా కనిపించకుండా ఉండేందుకు పంచదార వేసి గోనెసంచిలో కుక్కి కాల్చేశారు. ఈ పనిచేసింది చట్టవిద్రోహులు కారు. రౌడీషీటర్లు కానే కారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు. అదే భారతదేశంలో హక్కుల చరిత్రలో దారుణాతిదారుణమైన సంగతి.

అక్కడి నుండి రాజన్ తండ్రి ఈచర వారియర్ అంతులేని పోరాటం ప్రారంభమవుతుంది. సాయం కోసం కేరళ రాజకీయ నాయకులను కలవాలని వారియర్ బయలుదేరుతాడు. కరుణాకరన్, అచ్యుతమీనన్ లాంటి నాయకులు, బూర్జువా దినపత్రికల సంపాదకులు కూడా అతనికి మొండి చేయి అత్యంత అవమానకరంగా చూపించడం మరో బాధించే అంశం. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వహబుద్దీన్ మాత్రం కోర్టు గుమ్మం ఎక్కి దిగడానికే కాదు, మరెన్నో విధాలా ఆ తండ్రికి సాయపడతాడు. ఎ.కె. గోపాలన్, విశ్వనాధ మీనన్ లాంటి రాజకీయులు నాణేనికి రెండోవైపు వారు. వారియర్ కు సహకరించడానికి సిద్ధపడ్డవారు.

1977 ఫిబ్రవరి 22న ఎమెర్జెన్సీ తొలగిన తర్వాత వారియర్ అందరికీ వినతిపత్రాలు ఇవ్వడం మానుకుని కోర్టును ఆశ్రయించారు. న్యాయవాది రాంకుమార్ సహాయంతో కేసును కోర్టుకు తీసుకెళ్లిన వారియర్ కోర్టు తీర్పుల్లోనే ఊరట పొందగలిగారు. ఎక్కడికక్కడ పోలీసుల దుర్మార్గాలకు వంత పాడుతున్న పాలక వర్గంతో వీరోచితంగా పోరాడుతూ అడుగులు ముందుకు వేయడంలో వారియర్ లో నిజంగా మనకో యుద్ధవీరుడు (వారియర్) దర్శనమిస్తాడు. కేరళ హైకోర్టులో హెబియస్ పిటిషన్ వేసిన వారియర్ కు అనుకూలంగా తీర్పు రావడం గొప్ప విషయం. రాజన్ ను కోర్టు ముందు హాజరు పర్చాలని చెప్పిన హైకోర్టు తీర్పును సవాలు చేస్తూపోలీసులు సుప్రీం గుమ్మమెక్కారు. భారత అత్యున్నత న్యాస్థానం కూడా రాజన్ ను పోలీసులు అరెస్ట్ చేశారని విశ్వసించి అతడిని కోర్టుకు అప్పజెప్పాలని ఆదేశించింది. దాంతో అప్పటి కేరళ ముఖ్యమంత్రి కరుణాకరన్ తన పదవికి రాజీనామా చేయాల్సిరావడం పెను సంచలనం.

తరువాత ముఖ్యమంత్రి ఎ.కె. ఆంటోనీ హైకోర్టు తీర్పుమీద కేరళ ప్రభుత్వం చేత ఒక విచారణ కమిషన్ ను నియమించారు. దాంతో మళ్లీ కేసు తప్పుదోవ పట్టించడానికి వీలైంది. కొంతకాలం నడిచి సుప్రీంకోర్టులో మూలపడ్డ కేసులో వారియర్ తన కొడుకు మరణాన్ని జీర్ణించుకుని నష్టపరిహారం కోరడం అతడి అన్నకే కాదు రాజన్ మిత్రులకు కూడా చాలా కోపం తెప్పించింది. కానీ తరువాత వారియర్ తీసుకున్న నిర్ణయం మన విప్లవ నేతలు కూడా గమనించాలి. రాజన్ స్మృతిచిహ్నంగా జిల్లా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ వార్డు పేరుతో ఒక ప్రత్యేక వార్డు నిర్మాణానికి ఉపక్రమించడం. తరువాత రాజన్ మిత్రుల చొరవతో అదంతా పూర్తయి ప్రజలకు ఉపయోగపడుతోంది.

వారియర్ తన కుమారుడి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో సమాధానాలు చెప్పలేక తన భార్యను పోగొట్టుకుంటారు. తన సంబంధాలను తృణప్రాయంగా అలక్ష్యం చేస్తారు. ప్రజలను సమీకరిస్తారు. ఉద్యమాన్ని లేవదీస్తారు. కానీ మన దళసరి చర్మపు పోలీసు వ్యవస్థకు ఇవేవీ పట్టవు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కూడా కాలరాయాలనుకోవడం క్షమించరాని నేరం.

పుస్తకం చదవడం పూర్తిచేశాక మనమంతా అంతులేని దుఖంలో కూరుకుపోతాం. వారియర్ చెప్పిన కథనంలోని ‘ఎవరి మీదా ద్వేషం లేదు’ అన్న అధ్యాయం మన కంట నీరు తెప్పిస్తుంది. ఒక్కసారి కదిలిపోతాం. ఇదే అధ్యాయంలో వారియర్ చెప్పిన మాటలు మనను ఆలోచనలో పడేస్తాయి. “రాజన్ మృతికి కారకులైన ఆ పోలీసాఫీసర్ల  మీద పగ తీర్చుకోవాలని నాకుందా, లేదా అనే ప్రశ్న నన్ను అనుమానంలో పడేసేది. నేను హిందూ మత విశ్వాసాల మధ్య పెరిగాను. గుడి, ప్రార్థనలు, నైవేద్యాలు, మతాచారాలు నిండి ఉండే ఇంట్లో మెలిగిన వాడికి ప్రతీకార వాంఛ అసహజమైనది. కానీ ఒంపు తిరిగిన మీసాలు అటూ ఇటూ కదులుతుండగా ఉద్రిక్తంగా వాదించే పులిక్కోడన్ నారాయణన్ ను టెలివిజన్ లో చూసినప్పుడల్లా నా మనసులో ప్రతీకార వాంచ మెరిసేది. నా కొడుకుకు ఎదురైన అసహాయ వేదనా మయక్షణాలు నాకు గుర్తొచ్చేవి. అసంకల్పితంగానే లెక్కలు తీర్చుకోవడం గురించి నేనాలోచించేవాడిని. అంతకుముందెన్నడూ ఎరగని ఆగ్రహం నా మనసులో ప్రవేశించేది. ప్రతి ఒక్కటీ మరచి పోయానని నాకనిపించినప్పుడల్లా దాన్ని మరింత స్పష్టంగా గుర్తు తెచ్చుకునేవాడిని.” తన కన్న కొడుకును పొట్టన పెట్టుకున్నా ప్రతీకార వాంఛతో రగిలిపోకుండా న్యాయపోరాటం చేశాడా సామాన్య వృద్ధుడు. అధికారం ఉండీ ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు మన పోలీసులు. సరిగ్గా ఇక్కడే మనకు జీవన పోరాటం గురించి, హక్కుల పోరాటం గురించీ ఈచర వారియర్ రూపంలో కొత్త కొత్త పాఠాలు తెలిసి వస్తున్నాయి. నలబై రెండు పేజీల ఈ చిన్న పుస్తకం “నాన్న”లో పోలీస్ కస్టడీలో మరణించిన తన కొడుకు ఆచూకీ కోసం ఓ తండ్రిపడ్డ  తపనను అక్షరం వెంట అక్షరం రాసుకుంటూపోతూ ఈచర వారియర్ మనకు అందించారు. దీనిని సి.వనజ తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ కేసు విషయంలో కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పును చివరి పదిహేడు పేజీలలో అందించారు. దీనిని నల్సార్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అనువదించారు.

కోర్టులు మరింత సమర్ధంగా పనిచేసి, ప్రజా సంఘాలు నిత్య చైతన్యంతో కృషిచేసి, హక్కుల సంఘాలు నిరంతర సంఘర్షణ జరిపిన నాడే మన పోలీసుల విధులు, బాధ్యతలను గుర్తెరిగేటట్టు చేయగలం. లక్ష్మణరేఖను దాటినప్పుడల్లా కొరడా దెబ్బల్లాంటి కోర్టు తీర్పులు, కళ్ళు బైర్లుకమ్మేలా ప్రజాందోళనలు మాత్రమే వారిని అదుపులో పెట్టగలుగుతాయి. చట్టం వికటాట్టహాసం చేస్తున్నపుడు దారిలో పెట్టాల్సిన ప్రభుత్వం ఏమైనా చేస్తుందనుకోవడం మన భ్రమ మాత్రమే. ఇంత మంచి పుస్తకం అనువాదం రూపంలో అందించిన హైదరాబాద్ బుక్ ట్రస్టుకు అభినందనలు.

(ఈ పరిచయ వ్యాసం వీక్షణం మాస పత్రికలో ఇదివరకే ప్రచురితమైంది.)

ప్రకటనలు

6 responses »

 1. చాల మంచి పుస్తక పరిచయం. అప్పట్లో ఎందఱో వారియర్లు. మరి ఎందఱో రాజన్లు. ఇందిరా గాంధీ తరువాత తగిన మూల్యం చెల్లించారు. కాని రాజన్లు తిరిగి రారు కదా. ఎమర్జెన్సీ చీకటి రోజుల గురించి శ్రీ కులదీప్ నయ్యర్ రాసిన THE JUDGEMENT అనే పుస్తకం కూడా ఒక గొప్ప రచన. వీలు అయితే దీనిని కూడా పరిచయం చెయ్యండి బ్లాగు మిత్రులకు. ఎంతో బాద కర మైన విషయమేమిటంటే, ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ఒక్కడంటే ఒక్కడు, IAS, IPS (ఎంతో మేధావులు అయిన ) ETC. ఆఫీసుర్స్ గాని, మరి ఎ ఇతర ఉద్యోగి కాని, ఎమర్జెన్సీ కి నిరసనగా తమ తమ ఉద్యోగాలకి రాజీనామా చేయలేదు. (స్వతంత్ర పోరాటం లో చేసినట్లు). కాకా పోగా, ఆ అవకశాని చాలా మంది కాష్ చేసుకొన్నారు.

 2. మీ సమీక్ష చదువుతుంటేనే అంతులేని దుఃఖం కలుగుతోంది వారియర్ ని తలుచుకుని!

  ముఖ్యంగా ఆయన తన ప్రతీకార వాంచను నియంత్రించుకోవడం! మానవమాత్రులకు సాధ్యమయ్యే పనిలా అనిపించలేదు. ఒక్క రోజు ముందు మీరీ టపా రాసినా ఈ పాటికి పుస్తకం నా చేతిలో ఉండేది. నిన్ననే పుస్తకాలు కొన్ని కొన్నాను.

  విశాలాంధ్ర సుల్తాన్ బజార్ శాఖ మీద నాకో ఫిర్యాదు ఉంది. మనం అడిగితే తప్ప ఏ పుస్తకమూ చూపించరు, వాటి గురించి చెప్పరు. రెగ్యులర్ గా వెళ్ళే వాళ్లక్కూడా! నిమ్మకు నీరెత్తినట్టు కూచుని బిల్స్ రాసుకుంటూ ఉంటారు.

  నవోదయ వాళ్ళు ‘ఈ పుస్తకం చదివారా, ఇది కొత్తగా వచ్చింది చూడండి..” అని మన అభిరుచి ని అనుసరించి మంచి పుస్తకాలు వాళ్ళే చూపిస్తారు.

  మంచి పుస్తకం కోసం తప్పదుగా….ఏం చేస్తాం…మళ్ళీ వెళదాం!

 3. పింగుబ్యాకు: ఆదివాసుల పొలికేక - ‘అడవి తల్లి ‘ « మీరు చదివారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s