చిన్నారుల అంతరంగ ఆవిష్కరణ

సాధారణం

మూడు నెలల్లో మూడో ఏడుకు చేరుకోబోతున్న నా కొడుకును మూడు వారాల కిందట బజారుకు తీసుకెళ్లాను. అదీ ఇదీ కొంటుండగా ఇంతలో కరెంటు పోయింది. సామాను చేతికందుకుని కొడుకు కోసం చూస్తే కనిపించలేదు. గాబరాగా అటూఇటూ పరిగెత్తిన కొద్ది నిమషాలయ్యాక బయల్దేరిన చోట పెట్టిన నా టూవీలర్ దగ్గర కొడుకును చూసి స్థిమితపడ్డాను. ఆందోళన సద్దుమణిగాక, రాత్రి భోజనాలైన తరవాత నేనూ లతా జరిగిన సంగతి గురించి మాట్లాడుకుంటుంటే ఆ పసిమనసు కథనం ఇట్లా వుంది: “నాన్నా నేనూ చికిన్ కొంటున్నామా, కరెంటు పోయింది. అప్పుడేమో బూచి నాన్నకు ఎత్తుకెళిపే. నేనేమో భయమేసింది కదా – మన బండి దగ్గరకొచ్చేశాను.” ఈ మాటలు నాకు అర్థం కాకపోయి ఉండేవేమో, కాని అప్పుడు నేను “టు కిల్ ఏ మాకింగ్ బర్డ్” నవల చదువుతున్నాను గదా, నా కొడుకు చెప్పిందానికంటే ఎక్కువ అర్థమయ్యాయి.

ఆరేళ్ల అమ్మాయి జా లూయీ స్కౌట్ ఫించ్ తన కథను అత్యద్భుతంగా చెప్పడాన్ని కథాంశంగా చేసిన హార్పర్ లీ నవల “టు కిల్ ఏ మాకింగ్ బర్డ్” పరిచయం ఈ వారం మీ కోసం. 1930ల నాటి అమెరికన్ తీవ్ర డిప్రెషన్ కాలంలో దక్షిణ అలాబామా రాష్ట్రంలో పరిస్థితులను కళ్లకు కట్టినట్టు తన నవలలో వర్ణించింది రచయిత్రి. హార్పర్ లీ తన పాతికేళ్ల వయసులో రాసిన ఆరేళ్ల బాలిక అంతరంగ ఆవిష్కరణ ఎంత బాగా సాగిందంటే నవల ఆసాంతం ఐదుమార్లు చదివినా తప్పుల్ని ఎంచలేం. అంత సహజంగా ఈ నవలను రాయడం వల్లే అమెరికన్ సాహిత్య చరిత్రలో అపురూపమైన పుస్తకంగా చిరస్థాయిగా నిలబడిపోయింది. జాతి విద్వేషం, రేప్, దెయ్యం భయం అనే మూడు విషయాలను ఆరేళ్ల పసి బాలిక దృష్టికోణంలో చర్చించడం ఈ నవలలో కత్తిమీద సాములాంటి థీమ్ లైన్.

అట్టికస్ ఫించ్ అనే లాయరుగారికి ఇద్దరు పిల్లలు. గారు అని అనడం ఎందుకంటే ఆయన విలువైన వ్యక్తిత్వం వున్న మనిషి కాబట్టి. కొడుక్కి నాలుగేళ్లున్నపుడు లాయరుగారికి కూతురు పుడుతుంది. కూతురికి రెండో ఏడాది తిరక్కుండానే భార్య చనిపోతుంది. ఆ ఇద్దరు చిన్న పిల్లలనూ తనే తల్లీతండ్రీ అయి పెంచుతుంటాడు. అందరూ విడ్డూరంగా చెప్పుకునేటట్టు ఒక నీగ్రో స్త్రీని వంటమనిషిగా పెట్టుకుంటాడు. ఒక చిన్న కల్పిత గ్రామం మేకూంబ్ లో కథంతా జరుగుతుంటుంది. ఆ అమ్మాయి స్కౌట్ ను బడిలో వేయడంతో నవల మొదలవుతుంది. క్రమశిక్షణగల తండ్రివల్ల బడికెళ్లేటప్పటికే స్కౌట్ కు చదవడం చేతనవుతుంది. దాంతో విభిన్నంగా పిల్లలకు పాఠాలు నేర్పించాలనుకున్న పంతులమ్మతో స్కౌటుకన్నీ కష్టాలే. ఇదిలావుండగా అన్నాచెల్లెళ్లకు వేసవి శెలవుల్లో మరో తుంటరి డిల్ స్నేహం వీరికి తోడవుతుంది. పిట్ట కతలు అలవోకగా చెప్పగలిగే డిల్ అన్నాచెల్లెలు జెమ్, స్కౌట్ లు కలిసి ముగ్గురూ అల్లరే అల్లరి. సందడే సందడి. పొరుగింట్లో ఉండే బూ రాడ్లే వీళ్లకో పెద్ద పజిల్. ఎప్పుడూ ఇంటిబయటకు రాని బూ వీళ్ల దృష్టిలో బూచి. అతనెలా వుంటాడో సైతం తెలియదు గాని ముగ్గురూ అతడి గురించి కథలు కథలుగా ప్రచారం చేసుకుంటారు. ఎలాగైనా బయటకు రప్పించాలని పథకాలు సిద్ధం చేస్తారు. ఒక అర్థరాత్రి ఏకంగా ఆ ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నిస్తారు. వారి సంగతి తెలియని ఆ ఇంటి మనిషి నాథన్ రాడ్లే దొంగ అనుకుని తుపాకీ పేలుస్తాడు. కంచె దాటే గాబరా ప్రయత్నంలో ఫ్యాంట్ ఊడిపోవడం కూడా గమనించకుండా జెమ్ పరిగెడతాడు. తిరిగి ఫాంట్ కోసం వచ్చినపుడు ఎవరో నీట్ గా మడతపెట్టి ఆ ఫ్యాంట్ అక్కడ వుంచడం అంతగా పిల్లలు పట్టించుకోరు.

ఇంకా చాలా అద్భుతాలు అలాంటివి అక్కడ జరుగుతాయి. బూ ఇంటి ఎదురుగా వున్న చెట్టు తొర్రలో పిల్లలకోసం రకరకాల వస్తువులు దొరుకుతుంటాయి. తినే బబుల్ గమ్, ఆడుకునే బొమ్మలు ఎవరుపెడుతుంటారో తెలీదుగాని, పిల్లలకు ఎన్నో వస్తువులు దొరుకుతాయి. ధైర్యంచేసి కృతజ్ఞతల ఉత్తరం పెడదామని ఒకసారి పిల్లలు వెళ్లేసరికి నాథన్ ఆ తొర్రని సిమెంట్ తో కప్పేస్తాడు. ఒకసారి స్కౌట్ కు ఎంతో ఇష్టమైన మాడీ ఆంటీ వాళ్ల ఇంటికి నిప్పంటుకుంటుంది. చలిలో వణికిపోతూ రోడ్డుమీద నుంచి విచారంతో ఆ దృశ్యాన్ని చూస్తున్న స్కౌట్ కు ఎవరో రగ్గు కప్పుతారు. ఇదంతా బూ రాడ్లీయే చేస్తున్నాడని నవల చివరివరకూ వారెవరూ నమ్మరు.

ఇంతలో వాళ్ల నాన్నగారు ఒక కేసు ఒప్పుకుంటారు. ఆ కేసు విషయమ్మీద ఊర్లో వాళ్లంతా వారి తండ్రిని లోపల్లోపల మెచ్చుకుంటూనే బయటకు తిడుతుంటారు. అప్పుడు తండ్రి పిల్లలిద్దరినీ వారిస్తాడు. ఎంతో సంయమనం చూపించాల్సిందిగా వారిని ప్రోత్సహిస్తాడు. మయెల్లా ఎవెల్ అనే శ్వేత జాతీయురాలిని టామ్ రాబిన్ సన్ అనే నల్ల జాతీయుడు రేప్ చేశాడన్నది అభియోగం. టామ్ నిర్దోషని ఫించ్ నమ్ముతాడు. దానిని నిరూపించి అతడికి ఉరిశిక్ష పడకుండా చెయ్యాలని అట్టికస్ ఆలోచన. తన పిచ్చి ఆదర్శాలతో పిల్లలను పాడు చేస్తున్నాడనుకుని అట్టికస్ సోదరి అలెగ్జాండ్రా పిల్లల్ని సాకడానికి వారి ఇంటికొస్తుంది. అప్పటికింకా అమెరికాలో స్త్రీలకు ఓటు హక్కు లేదు. వారికి కీలక పదవులు కూడా లేవు.

కోర్టు కేసు విచారణకొస్తుంది. ఇంట్లో ప్రేమకు, ఆదరణకు నోచుకోని పదహారేళ్ల పడుచు మయెల్లా, టామ్ మంచితనాన్ని చూసి మురిసిపోయి ఇంటికి పిలిచి అతడ్ని వాటేసుకుంటుంది. ఆమెను తోసేసి టామ్ బయటకుపోతాడు. మూర్ఖుడైన తండ్రి ఆమెను చావచితగ్గొట్టి టామ్ పైన కేసు పెడతాడు. వాస్తవం స్పష్టంగా వున్నా నల్లజాతివారికి ఎలాంటి హక్కులూ లేకపోవడం వల్ల కోర్టు ఉరిశిక్ష ఖరారు చేస్తుంది. పైకోర్టుకు అప్పీలు చేసుకుందా మనుకునేలోగా తప్పించుకునే ప్రయత్నం చేశాడనే నెపంతో పోలీసులు టామ్ రాబిన్సన్ ను కాల్చిపారేస్తారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అట్టికస్ ఉదాత్తమైన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. సమాజాన్ని, ముఖ్యంగా పిల్లలను ఈ విషయంలో అనునయిస్తూనే అన్ని విషయలను ఓపిగ్గా వివరిస్తుంటాడు. మానవీయ విలువలను తేలికైన మాటలతో చెప్పడం అతడికే చెల్లింది.

ఈ కోర్టుకేసులో తననూ తన కుటుంబాన్నీ అప్రతిష్ట పాలు చేశాడని భావించిన మయెల్లా తండ్రి బాబ్ ఎవెల్ కత్తి పట్టుకుని ఒక రాత్రి అట్టికస్ కుటుంబంపై దాడి చేద్దామని వస్తాడు. ఆ గొడవలో ఇన్నాళ్లూ భయపడుతున్న బూ రాడ్లే బయటకొచ్చి బాబ్ ను తోసేస్తాడు. అతడు కత్తి గుచ్చుకుని చనిపోతాడు. బాబ్ కత్తి బాబ్ కే గుచ్చుకుని చనిపోయాడని కోర్టు నమ్మి బూను నిర్దోషిగా విడిచిపెడుతుంది. బూచి అనుకున్న బూ నిజానికి సిగ్గు, గిల్టీనెస్ అనే వ్యాధులు కాని వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తి అని తేలుతుంది.

 ఇలా ఓ రెండేళ్లలో జరిగిన సంగతులన్నింటిని ఆరేళ్ల పాప చూసినట్టు యథాతథంగా వర్ణించడం రచయిత్రి హార్పర్ లీ చతురత. మానవ సహజ ఉద్వేగాలను, సామాజిక స్థితిగతులను ఏ మాత్రం వక్రీకరించకుండా చెప్పడం నిజంగా గొప్ప విషయం. చిన్నా పెద్దా, మగాఆడా, జాతి ప్రాంతం తేడా లేకుండా మనిషి మనస్తత్వం ఒక్కటే అని వివరించిన ఈ నవలను రాబర్ట్ ముల్లిగాన్ దర్శకత్వంలో 1962లో అదే పేరుతో సినిమాగా తీస్తే ఆస్కార్ అవార్డులు కూడా వరించాయి. 1960లో మొదటిసారి ప్రచురితమైన ఈ నవలకు “అట్టికస్” అని పేరు పెట్టాలనుకున్నా తర్వాత రచయిత్రి నిర్ణయం మార్చుకుంది. తన జీవితంతో ఎన్నో పోలికలున్న ఈ నవల విజయం మీద రచయిత్రికే కాదు, ప్రచురణకర్తలకు కూడా పెద్ద ఆశలు లేవు. కాని విడుదలైన వెంటనే మార్కెట్లో సృష్టించిన సంచలనం ఐదు దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ సద్దుమణగలేదు. దాదాపు 40 భాషల్లోకి అనువాదమైన ఈ నవల ప్రపంచ ప్రజలందరికీ పరిచయమే అంటే అబద్దం కాదు.

ఇండియాప్లాజాలో అమెరికన్ ఎడిషన్ నూట పాతిక రూపాయలకే దొరికింది. మరి మీరూ సంపాదించి చదవండి. తప్పక ఎంజాయ్ చేస్తారు.

“టు కిల్ ఏ మాకింగ్ బర్డ్” (హార్పర్ లీ), గ్రాండ్ సెంట్రల్ పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ, పేజీలు 281, ధర ఏడు అమెరికన్ డాలర్లు.

ప్రకటనలు

7 responses »

  1. It is a great pleasure to read your review on “To Kill a Mockingbird”,a Pulitzer Prize-winning novel by Harper Lee, published in 1960. You are doing a great service by introducing good books to the readers. Please keep on writing to help lazy readers like me.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s