కా.రా. కు అభినందన

సాధారణం

ఇటీవల శ్రీకాకుళంలో జె.కె. కమ్యూనికేషన్స్ తన పన్నెండవ వార్షికోత్సవాలు జరుపుకుంది. ఆ సందర్భంగా ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావును సత్కరించింది. జెకెసి ఎండి శ్రీ జల్లేపల్లి శ్రీధర్ గారు కారాను సభకు పరిచయం చేసే అవకాశం నాకు కల్పించారు. అప్పుడు చదివిన ప్రసంగ పాఠమిది. చదివి మీ అభిప్రాయం తెలపండి.

——

కథలెందుకు ఎవరైనా రాస్తారని ప్రశ్న వేసే ముందర కథలెందుకు ఎవరైనా చదువుతారని ప్రశ్న వేసుకోవాలి. మనం చిన్నప్పుడు పాఠాలెందుకు చదువుకున్నాం? ఆ పాఠాలద్వారా మన చిన్నతనంలో మనకు తెలియని జీవితం గురించి మనం తెలుసుకోవాలనే సదుద్దేశంతోనే చదువుకున్నాం. అదే ఉద్దేశంతో మన ఉపాధ్యాయులు కూడా మనకు పాఠాలు బోధించారు. రచయితలకు కూడా అవే ఉద్దేశాలు ఉంటాయని మనకు దీనినిబట్టి అర్థమవుతుంది. అద్సరే, రచయితలు ఏం రాస్తారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఈ అవగాహన వున్న రచయితలు జీవితంపట్ల మనకు అవగాహన మరింత పెంచడానికి రచనలు చేస్తారు. అలాంటి రచయితలు మన తెలుగు సాహిత్య ప్రపంచంలో అరుదుగానే అయినప్పటికి వున్నారని చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. అలాంటి అరుదైన విశిష్ట రచయిత మన ప్రాంతంనుంచి వచ్చినవాడైతే, అలాంటి జనాదరణ పొందిన రచయిత ఇప్పుడు మనమధ్యే వున్నారంటే మనం మరింకెంత గర్వపడాలి!

ముద్దుగా ‘కారా’ అని మనం పిలుచుకునే కాళీపట్నం రామారావు మేష్టారు 1924 నవంబర్ తొమ్మిదో తేదీన వాళ్ల అమ్మమ్మగారింట్లో పొందూర్లో పుట్టారు. కానీ తర్వాత మన మురపాక గాలీ నీరూ పీల్చి బతికారు. షేర్ మహమ్మద్ పురం ఎస్టేత్ గ్రామాల్లో ఒకటైన మురపాకకు అప్పటి కరణం వీరి నాన్నగారు పేర్రాజు గారే. చదువు మాత్రం ఇక్కడా, సిగడాంలోనూ ముద్దుతో చెట్టెకిపోతే, పదో తరగతి పరీక్షలకు వైజాగ్ చేరారు. మనూరులోనే రామకృష్ణ గ్రంథాలయంలో పుస్తకాలతో  సాన్నిహిత్యం ఏర్పరుచుకుని జీవితాన్ని మధించడం నేర్చుకున్నారు. శ్రీకాకుళం గుడివీధిలోవుంటూ చదువుకుని 1942లో ఎస్ ఎస్ ఎల్ సి పరీక్ష పాసయ్యారు. మురపాక గ్రామ గ్రంథాలయం నుంచి శ్రీకాకుళ పట్టణ గ్రంథాలయం దాకా పాకిన ఆయన పఠనం అక్కడితో ఆఅగకుండా విశాఖపట్నం హిందూ రీడింగ్ రూమ్ కు చేరింది. 1943లో మేష్టారి మొదటి కథ “ప్లాటుఫారమో…” రచన ప్రచురితమైంది. అది తెలుగు సాహితీలోకంలో జరగబోయే పెద్ద కుదుపునకు ఓ చిన్న నాంది. 1943నుంచి విశాఖపట్నం చేరిన రామారావు మేష్టారు అనేక ఉద్యోగాలు వెలగబెట్టి 1946 మార్చి 19న సీతామహలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వివాహం ఆయన జీవితంలో ఎన్నో పెనుమార్పులు తెచ్చిపెట్టింది. జీవితంలో స్థిరత్వాన్ని ఇచ్చింది. జీవితానికి కొత్త అర్థాన్ని, అందాన్ని కల్పించింది. భీమునిపట్నంలో టీచర్ ట్రైనింగ్ లో చేరారు. అది పాసయ్యినదాకా అంపోలు స్కూలులో టీచరుగా పనిచేసి, సర్టిఫికేట్ వచ్చిన తరువాతనుంచి అంటే 1948 నుంచి సెయింట్ ఆంథోని స్కూలులో ఉపాధ్యాయుడిగా చేరి 1979లో రిటైరయినదాకా అక్కడే అదే పనిచేశారు.

ఇదిగో, ఇప్పుడే మనం మరికాస్త లోతుగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అతను మన మష్టారు. ప్రపంచం మెచ్చిన మన మాష్టారి ఎదుగుదల క్రమాన్ని విడమర్చి చెప్పుకుంటే మన వూర్లో యువతకు మరెంతో ఉపయోగకరంగా వుంటుందని మా ఆలోచన. ఆయన జీవితం ఏ ఒక్కరికి స్ఫూర్తి కలిగించినా చరిత్రలో ఆయనతోపాటు మనం, మన వూరు శాశ్వతంగా మిగిలిపోతాం. ఆయనకు ఉద్యోగం వచ్చించి 1948లో. అంటే అప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చిందన్న మాట. నెహ్రూగారి సోషలిస్ట్ విధానాలపైనా అందరికీఏన్నో అంచనాలు. గాంధీగారి గ్రామ స్వరాజ్యంపైన ప్రజలందరికీ ఎన్నో ఆశలు. అప్పుడే రామారావుగారు కాస్త లోతుగా అటు రాజకీయాలను, ఇటు సాహిత్యాన్ని మధిస్తూనే జీవితాన్ని కాచి వడబోయడం ఆరంభించారు. ఆయనకన్నీ సగం అర్థమవుతున్నాయి, సగం అర్థం కావట్లేదు. ఆ దశలో వచ్చిన కథలే “రాగమయి”, “అభిమానాలు”, “అభిశప్తులు”, “అశిక్ష – అవిద్య”, “పలాయితుడు”… తదితరాలు.

కానీ జీవితంలో ఒడిదుడుకులవల్ల ముఖ్యంగా అప్పట్లో ఉపాధ్యాయుల జీతాలు అరకొరగా వుండడంచేత మాష్టారికి రాయడానికి తీరుబడి ఉండేదికాదని మనం అనుకోవాలి. అందువల్లనే ఏమో 1956 నుంచి 1966 వరకు సుమారు దశాబ్దకాలం పాటు రామారావు మేష్టారు కథలేమీ రాయలేదు. కేవలం రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారితో కబుర్లు, చదువుకోవడం… ఇవే వ్యాపకాలు. దానితోపాటు ప్రపంచ రాజకీయాలుకూడా తీవ్రంగా మార్పులు చెందుతున్నాయి. సరిగా అప్పుడే ఒక అద్భుతం జరిగింది. 1967లో “యజ్ఞం” కథ ప్రచురితమైంది. అది మామూలుగా చదవడం మొదలుపెట్టిన పాఠకుడు ముగింపు దగ్గరకొచ్చేసరికి ఒక్కసారి ఉలిక్కిపడతాడు. 1967లోనే పశ్చిమ బెంగాల్ లో నక్సల్బరి అనే చిన్న గ్రామంలో కొంతమంది స్థానిక రైతులు అక్కడి ధనిక పీడకులపై తిరుగుబాటు చేసి విముక్తప్రాంతంగా ప్రకటించారు. అప్పుడే ఈ కథ తెలుగులో రావడం తెలుగు సామాజిక వాతావరణంలోనూ, సాహిత్య ప్రపంచంలోనూ పెనుసంచలనానికి దారితీసింది. అక్కడినుంచి రామారావు గారి చూపు మారిపోయింది. గాంధీ, నెహ్రూ కలలుకన్న దేశం మీద భ్రమలు పోయాయి. చక్కనైన, లోతైన, స్పష్టమైన, చురుకైన అవగాహన ఏర్పరుచుకున్న కాళీపట్నం రామారావు వరసగా తొమ్మిది కథలు ప్రచురించారు. తెలుగు కథా రచయితలకు, పాఠకులకు పాఠాలనదగ్గ ఆ తొమ్మిది కథలూ నవరత్నాలే అని చెప్పుకోవాలి. అవి వరసగా “యజ్ఞం”, వీరుడు మహావీరడు”, “హింస”, “నో రూమ్”, “ఆర్తి”, “భయం”, “చావు”, “జీవధార”, “కుట్ర”. 1971లో “యజ్ఞం” కథకు కథకు సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. దానిని అయన బహిరంగంగా తిరస్కరించారు. మళ్లీ రామారావు గారి వ్యక్తిగత జీవితంలో ఎగుడుదిగుళ్ల వల్ల అంటే తల్లిదండ్రుల మరణాలు, బిడ్డల వివాహాలు, మనవల్నెత్తడాలు, భార్యాపిల్లల అనారోగ్యాలు వంటివి కుదిపేయడంవల్ల 1973 నుంచీ మరో రెండు దశాబ్దాలు కథలేవీ రాయడం మానుకున్నారు. అయితే ఈ దశలో సాహిత్యానికి ఆయన చాలా సేవ చేశారు. ముఖ్యంగా యువ కథకులకు చాలా ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని అందించే విధంగా వివిధ పత్రకల్లో అనేక శీర్షికలు, పుస్తకాలకు ముందుమాటలు, వీటన్నిటికంటే ముఖ్యంగా విరసంతోపాటు ఇతరేతర సంస్థలు నిర్వహించిన అనేక వర్క్ షాపుల్లో పాల్గొని యువ రచయితలకు కావలసిన ధైర్యాన్ని, ప్రేరణను అందించారు.

తన ఉద్యోగ జీవితం నుంచి రిటైరయిన తరువాత ఓ అరుదైన  ఆలోచన వచ్చిందాయనకు. మొత్తంగా తెలుగు కథ పుట్టిన దగ్గరనుంచి వచ్చిన తెలుగు కథలన్నింటిని ఒకచోట చేర్చితే ఎలా వుంటుందన్న ఆలోచన అది. బహుశా ప్రపంచంలో మరెక్కడా జరగని ప్రయత్నం. నెమ్మదిగా ఆ ఆలోచనను ఇతరులతో పంచుకుని ఓ క్రమబద్దమైన ప్రణాళికతో కృషి చేయడం మొదలుపెట్టారు. ఒక్కరే ఒక సైన్యంగా పనిచేసి 1997లో కథానిలయాన్ని ప్రారంభించి ఓ దశాబ్ద కాలం తిరిగేసరికి ప్రపంచమంతా శ్రీకాకుళం వైపు చూసేలా కృషి సలిపారంటే అతిశయోక్తి కాదు. కొన్ని వేల కథలు, కొన్ని వందల కథల పుస్తకాలతో ఈ రోజు కథానిలయం తెలుగు సాహిత్య పరిశోధకులందరికీ ఓ పెన్నిధిలా సహకరిస్తోంది. 1996లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు కారాను వరించింది. దానిని ఆయన ఈసారి తిరస్కరించకుండా స్వీకరించారు. అక్కడనుంచి తన కలల నిలయం కథానిలయానికి విరాళాలు సేకరించడం ప్రారంభించారు. జనపీఠ అవార్డు పేరిట కారాభిమానులంతా కలిసి ఉమ్మడిగా కథానిలయానికి విరాళాలు సేకరిద్దామని బయల్దేరారు. ఇరవై రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల దాకా పైసాపైసా పోగుచేసి లక్ష రూపాయల్ని విరాళంగా సేకరించి కారాభిషేకం చేసుకుంటే అందులో ఐదు పైసలు తన జేబులో వేసుకోకుండా కథానిలయం అభివృద్ధికే వెచ్చించిన అపురూప సౌమ్యుడు కాళీపట్నం రామారావు. ఎనభైకి మించిన ఈ వయసులో కూడా ఇప్పటికీ పుస్తకం ఇస్తానంటే ఎన్ని కిలోమీటర్లయినా లెక్కచేయకుండా పరిగెత్తి వెళ్లే ఈ బాలవృద్ధుడ్నో, వృద్ధబాలుడ్నో సన్మానించడం మనల్ని మనం సన్మానించుకోవడమే. ఈ సన్మానం మన వూరంతా మన ఊరి బిడ్డడికి అత్యంత ఆప్యాయంగా చేసుకుంటోంది. మనందరికీ బాగా తెలిసిన ఈ నాలుగు వాక్యాలను మరోసాతి ముచ్చటించుకునే అవకాశం కలిగినందుకు జెకెసి తన అదృష్టంగా భావిస్తోంది.

చల్లని చిరునవ్వును వెన్నెలలా విరజిమ్మి వెదజల్లే మన కాళీపట్నం రామారావు మేష్టారికి మరింత ఆరోగ్యం, మనశ్శాంతి అందివ్వాలని మీతోపాటు జెకేసి ఆ దేవదేవుడ్ని ప్రార్థిస్తోంది.

అందరికీ వందనాలు. నమస్తే.

ప్రకటనలు

4 responses »

  1. నిజమే, ఆ రోజు నెట్లో గాబరాగా వెతికితే కారా ఫోటో దొరకలేదు. ఇదే దొరికింది. జెకెసి వారు ఇంకా ఫోటో ఇవ్వలేదు. దయచేసి ఎవరైనా కాళీపట్నం రామారావు గారి ఫోటో జెపి ఇ జి ఇమేజ్ గా పంపించి సహాయం చేయగలరా? వెంటనే సంబంధం లేని ఈ ఫోటో తీసేస్తాను. -రవి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s