ఏడు రుచుల సమ్మేళనం ‘ఆమె నవ్వు’ కథల సంపుటం

సాధారణం

జీవితం పట్ల గొప్ప ఎరుకను కలిగించే మంచి కథకుడు యాళ్ల అచ్యుతరామయ్య. అలాంటి మంచి కథల మణిహారం “ఆమె నవ్వు” కథా సంపుటి ఇటీవల తెలుగు సాహిత్యంలో వెలువడిన తాజా ఉదాహరణ. 1991నుండి 1998 వరకు అంటే ఒక దశాబ్దకాలం పాటు తాను రాసిన ఇరవై రెండు కథలను గుదిగుచ్చి “ఆమె నవ్వు” అనే కథాహారంగా మనకు అచ్యుతరామయ్య అందించారు. ఇలా ఒకచోట చేర్చిన రెండు తక్కువ రెండు డజన్ల కథలన్నీ ఎంతో వైవిధ్యం కలిగినవి. చదివే పాఠకులకు వాస్తవిక జీవితానికి సంబంధించి ఒక స్పష్టమైన ఎరుకను అందిస్తాయి. ఇందులో స్త్రీవాద కోణమున్న కథలున్నాయి. మానవీయ కథలున్నాయి. వ్యంగ్య, హాస్య కథలున్నాయి. ప్రగతిశీల దృక్పథమున్న కథలున్నాయి. విప్లవ స్పృహను పెంచే కథలున్నాయి. అందుకే ఈ కథాసంపుటి అంతా ఒక్కసారి చదవడం ఏడు రుచులు కలిగిన భోజనం చేయడంలా అనిపిస్తుంది. పైగా ఆయా రకపు కథల్లో కాలం గడుస్తున్న కొద్దీ రచయితలో పరిణతి స్పష్టంగా కనిపిస్తుంది. రచననుండి రచనకు ఎంతో విభిన్నత కనిపిస్తుంది. అది వస్తువు ఎంపికలోను, శైలిలోను మనం గమనించవచ్చు. 1991లో రాసిన ‘రావణకాష్టం’ కథ రచయితలో అపరిణత స్త్రీవాద అలోచనలు మనకు దర్శనమిస్తే, సంపుటి ముగింపులో రాసిన ‘ఆమె నవ్వు’ కథలో ఎంతో పరిణత స్త్రీవాద దృక్పథం ఈ రచయితలో మనం దర్శిస్తాం.

‘రావణకాష్టం’ కథలో అత్తారింటిలో బాధలు పడలేక పుట్టింటికి చేరుకున్న తులసిని ఎవరూ అర్థం చేసుకోరు. రచయిత ప్రతినిధి పాత్ర ఉమ ఎన్ని రకాలుగా అభ్యంతరాలు వ్యక్తపరిచినా పుట్టినింట అందరూ ఆమెను రకరకాలుగా సర్దిచెప్పి కాపురాన్ని కూల్చుకోవద్దనే హితబోధ చేస్తారు. దాంతో విధిలేక అత్తారింటికి చేరిన తులసి భర్తపెట్టే బాధలు పళ్ల బిగువున భరిస్తుంది. కాని అదనపు కట్నంకోసం ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టేస్తారు. అంతా తెలిసి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉమ ఉండిపోతుంది. ఈ కథలో రెండు విషయాలు స్పష్టంగా అగుపిస్తున్నాయి. స్త్రీల సమస్యలపట్ల రచయితకున్న సానుభూతి మొదటి విషయంకాగా, జీవితాన్ని తన పాత్రలు ఎదిరించేలా రచయిత రాయకపోవడంలో అతని అవగాహనకున్న పరిమితి రెండో విషయం.

ఇక మరుసటి ఏడాది రాసిన ‘ఒక అడుగు ముందుకు’ కథలో రచయితలో ఎంతో పరిణతి కనిపిస్తుంది. ప్రేమ పేరుతో మోసం చేసిన శేషగిరి తనను పెళ్లి చేసుకోవాలని సుధ మౌనపోరాటానికి దిగుతుంది. దీనికి కాలేజీలో ఆమె స్నేహితులంతా మద్దతునిస్తారు. కాని, అభ్యుదయ భావాలున్న లెక్చరర్ మృణాళిని నేరం చేసిన వ్యక్తినే పెళ్లి చేసుకోమనడం ఏమి భావ్యమని సుధను హెచ్చరిస్తుంది. ఇది సంప్రదాయ ఆలోచనకు తిరస్కారం. అంతేకాక ఈ నేరానికి కారణం వ్యక్తి కాదని, యువతీయువకులు ఆ తప్పు చేయడానికి ప్రేరణనిచ్చిన మీడియాను ఎత్తిచూపడం రచయిత సమస్యకు మూలకారణాలు వెతుకుతున్నారని అర్థం చేసుకోవాలి. కోపంలో వున్న సుధ స్నేహితులు శేషగిరిని చితక్కొడతారు. దానినికూడా లెక్చరర్ మృణాళిని ఖండిస్తుంది. సామాజిక సమస్యలను వ్యక్తిగత శిక్షల ద్వారా పరిష్కరించలేమని అంటుంది. నేరానికి దారితీస్తున్న పరిస్థితులను మార్చకుండా నేరస్తులను శిక్షిస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తుంది. ఈ మూడు అంశాలలో రచయిత ఆలోచన రీతిని అభినందించకుండా ఉండలేం.

ఆ తరువాత సంవత్సరం రాసిన ‘అభిమాన భంగం’ కథ ఈ దిశగా రచయిత మరో ముందడుగు వేయడాన్ని పట్టిస్తుంది. బహుమతి కూడా పొందిన ఈ కథ రచయితలోని విప్లవాత్మక ఆలోచన సరళిని పాఠకులు గమనించాలి. కొందరు దుండగులు కౌస్తుభను అత్యాచారం చేస్తారు. ప్రతిఘటించి విఫలమైన తరువాత అదో ఏక్సిడెంటుగా భావించి, మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న ఆమెను కుటుంబం, సమాజం గుర్తుచేసి మరీ గాయాన్ని కెలుకుతుంటారు. ‘ఈ సమస్యను నా వ్యక్తిగత స్థాయిలోనే పరిష్కరించుకోవాలనుకుంటున్నాను. అందుకు ఎవరికైనా అభ్యంతరముంటే వాళ్లూ, సమాజం కట్టకట్టుకుని ఎందులోనైనా దూకమనండి’ అని కౌస్తుభ తల్లిదండ్రులతో చెప్పడం ఖచ్చితంగా విప్లవాత్మకమైన ఆలోచనే. అప్పటికీ వూరుకోక తనను గుచ్చిగుచ్చి ప్రశ్నించే కుటుంబ సభ్యులను విడిచిపెట్టేసి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కు చేరుకుంటుంది. ఆమెకు ముందు జరిగింది మానభంగం, అదీ ఒక్కసారే. కాని రతువాత ఇంట్లో ప్రతి క్షణం జరుగుతున్నది అభిమాన భంగం. దానిని ఎదిరిస్తూ ఆత్మవిశ్వాసంతో కూడిన ఆమె ప్రవర్తన ఆదర్శప్రాయమైనది. రేప్ ను గాయంగా చూడడానికి ఎంతో అవగాహన, సాహసం కావాలి. ఆ రెండూ రచయితకు  పుష్కలంగా వున్నాయి. ఆ దుండగులకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడమో, వారిని శిక్షించడమో వంటివన్నీ వ్యక్తిగతమైన పరిష్కారాలు. కాని కౌస్తుభ వాటికి బదులుగా సామాజిక పరిష్కార మార్గాలవైపు దృష్టి సారించింది. ఆ దిశగా కొంతమంది స్నేహితులతో ఒక సంస్థను స్థాపించి హింసకు గురైన స్త్రీలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటుంది.

అదే ఏడాది అంటే 1993లోనే రాసిన మరో కథ ‘ఫాస్ట్ ఫార్వర్డ్’. పెళ్లిపట్ల రచయితకున్న ఆలోచనను చెప్పేది. సుధాకర్, కౌముది ప్రేమించుకుంటారు. కాని తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించరు. దాంతో కోపమొచ్చి వారిద్దరూ చనిపోదామని నిర్ణయించుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటారు. చివరి క్షణంలో ఇద్దరినీ తల్లిదండ్రులు దక్కించుకుని వారి వివాహానికి సమ్మతిస్తారు. కాని కొంతకాలం స్నేహం తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోకూడదని సరికొత్త నిర్ణయం తీసుకుంటారు. ‘నిరాయుధీకరణ ఒప్పందంపైన సంతకాలు చేసి, పైకి మిత్రదేశాల్లా పోజుకొడుతూ, పోటీపడి మారణాయుధాలను దొంగచాటుగా పోగేసే శత్రుదేశాల్లా, చాలామంది భార్యాభర్తల్లా మేంకూడా ఒకరిపై మరొకరు ఆరోపణాయుధాలను సేకరించుకుంటూ ఏ క్షణాన్నయినా బద్దలవబోయే యుద్ధానికి సిద్ధంగా వుండేవాళ్లమేమో!‘ అని కౌముది ఒకసారి అంటుంది. అంటే అవగాహన లేకుండా ఒక్కటయ్యే దంపతులను ఎద్దేవా చేస్తోందన్నమాట.

ఈ సంపుటిలో యాళ్ల అచ్యుతరామయ్య స్త్రీవాద దృక్కోణంతో రాసిన మరో కథ ‘నేను సీతను కాను’. ఈసారి రచయితలోని విప్లవాత్మక ఆలోచన ధోరణి ఆ కథకు పెట్టిన శీర్షికలోనూ కనిపిస్తుంది. అభ్యుదయ కవి శివకుమార్ భార్య మృణాళిని జర్నలిస్టు. పాతబస్తీలో గొడవలు జరుగుతున్నపుడు కవరేజికి వెళ్లిన మృణాళిని ముష్కరమూక దాడి జరిపినప్పుడు ఒక రాత్రంతా ఆదర్శ భావాలున్న యువకుడు ఉస్మాన్ అలీఖాన్ ఇంట్లో తల దాచుకోవాల్సి వస్తుంది. కాని తన భర్త అభ్యుదయ కవి అయివుండికూడా తనను అవమానించడం తలవంపుగా భావిస్తుంది. ఈ సందర్భంలోనే తన భర్తకు ఒక మావో సూక్తిని జ్ఞాపకం చేస్తుంది. ‘నీవు ఏ రకమైన ఆయుధం పట్టుకోవాలన్నది నీ శత్రువే నిర్ణయిస్తాడు’ అని. ఈ కథలో భర్త దాష్టీకాన్ని ఎదిరించటాన్ని, వివాహ వ్యవస్థ డాంబికాన్ని, ఆత్మవిశ్వాసంగల స్త్రీ పాత్రను సృష్టించడాన్ని ఈ మూడు విషయాలలోనూ రచయిత చతురత, పరిణతి గమనించాలి.

ఈ సంపుటిలోనే వున్నమరో మంచి కథ ‘భర్త కాటుకు కుక్క దెబ్బ’. ఆత్మన్యూనతతో బతుకీడుస్తున్న తన భర్త వలన తనకు రక్షణలేదన్న విషయం అనేకమార్లు వనజకు రూఢి అయిపోతుంది. కేవలం సమాజం కోసం అతడిని భర్తగా వుంచుతుంది తప్ప, అతడివల్ల అన్ని చిత్రహింసలు భరించి విసిగిపోతుంది. ఒకరోజు ఆమె ఒక కుక్కను పెంచడం ప్రారంభిస్తుంది. కుక్క తనకెన్నో విధాలుగా రక్షణగా భావిస్తుంది. ఆ విధంగా భర్తకు ఓ త్రెట్ నిస్తుంది. తనను కొట్టబోయిన భర్తమీదకు కుక్క దాడి చేస్తుంది. ‘తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న వాళ్లను ఎవరైనా అవమానిస్తే చూస్తూ ఊరుకోవడానికి భర్త కాదు. విశ్వాసం వున్న కుక్క‘ అంటుంది. అంతేకాదు మగ సమాజపు దాష్టీకాన్ని ఎదిరించడానికి తనకిప్పుడు ఓ ఆయుధం దొరికింది. తనకిప్పుడు భయం లేదు. భర్తా, పోలీసులు, ప్రభుత్వం కల్పించని భద్రతను ఓ కుక్క కల్పించిందని సంబరపడిపోతుంది వనజ. ఈ కథలో సమాజంలోని మార్పును తేవాలన్న రచయిత తపనను మనం అర్థం చేసుకోవాలి.

కథాసంపుటికి టైటిల్ గా వున్న ‘ఆమె నవ్వు’ కథ మరే పత్రికలోనూ ప్రచురించని కథ. వేణు, మాలతి భార్యాభర్తలు. వేణు, శ్రీలతలు ఆఫీసులో సహోద్యోగులు. ఆఫీసులో వారిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజంటే వీరిద్దరి గురించి నలుగురూ నాలుగు రకాలుగా అనుకునేంత. ఒకసారి వేణు శ్రీలతను ప్రపోజ్ చేస్తే ఆమె తిరస్కరిస్తుంది. ఒకరోజు వేణు మంచమ్మీద తలగడనుంచి చీమలు వస్తున్నాయని తలగడ ఎత్తిచూస్తే కండోమ్ కనిపిస్తుంది. మాలతిపై ద్వేషం పెంచుకుని రెట్టించి అడిగినప్పుడు ఆమె నవ్వుతుంది, కాని సమాధానం చెప్పదు. ఆ నవ్వుకు అర్థం తెలియక సతమతమైపోతున్న భర్తతో చివరకు ఆమె సమాధానం చెప్తుంది. అదికూడా ఏకవాక్య సమాధానం. ‘ఈ గోడ నాతో పాటుగా పన్నెండేళ్లుగా కలిసివుంది. ఇది నాకెప్పుడూ హాని తలపెట్టలేదు. అంతమాత్రం చేత ఈ గోడను నేను ప్రేమిస్తూ కూర్చోలేను కదా!‘ అంటుంది. సమాజంలో ద్వంద్వనీతిని ముక్కుగుద్ది ప్రశ్నించే ఈ కథ అనేక విషయాలను పాఠకులకు బోధిస్తుంది. వివాహేతర సంబంధాలలో సాధారణంగా స్త్రీలనే తప్పుపడతారు గాని, అందుకు కారణాలను సమాజం పరిశీలించదు. నిస్సారమైన భార్యాభర్తల సంబంధాలను పునరుద్దరించాలన్న ఆలోచన చేయని మగ పుంగవులు ఆఫీసులో మహిళా సహచరుల పట్ల ఎంతో చురుగ్గా, మెరుగ్గా, స్నేహంగా స్పందిస్తుంటారు. పాపం ఆ ప్రతిస్పందనలే వారివారి భర్తల దగ్గర దొరకక, లభించక ఇవి నిజమైనవనుకుని, శాశ్వతమని భ్రమించి వివాహేతర సంబంధాలలో కొందరు మహిళలు కూరుకుపోతారు.

‘ఆమె నవ్వు’ కథాసంపుటిలో పైన పేర్కొన్న స్త్రీవాద కథలతో పాటు కడుపుబ్బా నవ్వించే కొన్ని వ్యంగ్య, హాస్య కథలు కూడా వున్నాయి. అయితే ఇవి ఒకవైపు మనల్ని నవ్విస్తూనే మరోవైపు సామాజిక వాస్తవిక విషయాలపట్ల ఆలోచించమని అభ్యర్ధిస్తాయి. వ్యంగ్య సాహిత్యం ప్రయోజనమదే కదా. ‘కొత్తసీసాలో పాత సారా’ ప్రస్తుత సమాజం మీద గురిచూసి పేల్చిన సెటైర్. రాజు ప్రజల గోళ్లూడగొట్టి శిస్తులు, పన్నులు వేసి, లూటీ చేసినా ఖజానా నిండకపోయేసరికి మంత్రితో బాగా ఆలోచించి, రాజరికాన్ని తోసేసి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటుచేస్తాడు. ప్రజలే ప్రభువులన్నది నినాదప్రాయమవుతుంది. రూపం మారుతుంది గాని, సారమదే. కిరీటం, సింహాసనం ఉండకపోయినా రాచరిక వర్గానికే అధికారం హస్తగతమతుంది. ప్రజలు మళ్లీ కష్టపడడం షరా మామూలేగా మిగిలింది. ఈ కథలో ప్రతి వాక్యంలోనూ వెటకారం తొంగిచూస్తుంది. ప్రస్తుతం ప్రజలంతా డబ్బుకు దాసోహమైపోయారని చెప్పే కథ ‘దగాపడిన దేవుడు’. జనం డబ్బు రంధిలో, కీర్తి మోజులో పడి ఆఖరికి దేవుడ్ని సైతం పట్టించుకోకపోవడం ఈ కథలో మనం గమనిస్తాం. ఇదే కథలో దేవుడు ప్రత్యక్షమైనా జనం పట్టించుకోక, పక్కనేవున్న పబ్లిక్ పార్కులో సినిమా నటుడ్ని చూడడానికి పరుగులు తీసే సంఘటన మనకు నవ్వు తెప్పిస్తుంది. లక్ష్మీదేవిని దాచేసిన జనంనుంచి ఆమెను విడిపించడానికి వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు నగలే కొట్టేస్తారు కక్కుర్తి మనుషులు ఈ కథలో.

పిల్లలున్న ఇంట్లో భార్యాభర్తలు రాత్రిల్లుపడే అవస్తలను ‘రసభంగం’ కథలో హాస్యాత్మకంగా చిత్రించారు అచ్యుతరామయ్య. ఎంతో ఇబ్బందిపడి అర్థరాత్రివరకు మేలుకునివుండి కొడుక్కి హోంవర్క్ పూర్తిచేస్తాడు కథకుడు. కాని మర్నాడు బడికి శెలవు ప్రకటిస్తే ప్రాణం చివుక్కుమంటుంది. మధ్య తరగతి జీవుల సరసం విరసమైతే ఒక్కోసారి విరసం సరసమవుతుంది. ‘శ్రీవారికి శఠగోపం’ అనే మరో వ్యంగ్య కథలో నాస్తిక భర్త, స్త్రీవాద భార్యల అన్యోన్య దాంపత్యం చూసి మనకు నవ్వాగదు. ఆకాశంలో సగం, పనిలో సగం అంటూ అన్ని పనులు వాటాలు వేసుకుని మరీ జీవితాన్ని నడిపించే ఆ కుటుంబం ఇంటికి ఒకసారి చుట్టాలు వస్తారు. అంతాకలిసి తిరుపతి ప్రయాణమవుతారు. దాదాపుగా ప్రతి వాక్యంలోను ఎంతో కళాత్మకంగా హాస్యం ఒలికించిన రచయిత ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం.

స్త్రీవాద, వ్యంగ్య, హాస్య కథల తరువాత మానవీయ విలువలను ప్రతిపాదించే కథలకు ఈ సంపుటిలో స్థానమిచ్చారు అచ్యుతరామయ్య. రచయిత కొన్నిచోట్ల జీవిత మౌలిక విలువలను ప్రశ్నిస్తారు. మరికొన్నిచోట్ల విలువలపట్ల మనుషుల దివాళాకోరుతనాన్ని నిలదీస్తారు. ఇంకొన్ని చోట్ల నూతన మానవీయ విలువలను ఆవిష్కరిస్తారు. వాటిని అనుసరించమని అన్యాపదేశంగా తన పాఠకులను అభ్యర్ధిస్తారు. ‘అసలైన జ్ఞానం’ కథలో న్యాయంకోసం కష్టపడి పోలీస్ స్టేషనులో కౄర పోలీసు చేతిలో హత్యకు గురవుతాడు కృష్ణయ్య. అతడి ముసలితల్లి ఆవేదన చూడలేక ఆరా కోసం వెళ్లిన కథకుడు పోలీసు మిత్రుడి మాటలు విని బెదిరిపోయి పారిపోతాడు. కాని కథకుడి తల్లి జ్ఞానబోధ చేస్తుంది. వ్యక్తిగా చేయలేని పని సమష్టి పోరాటం చేయగలగడం ద్వారా సాధించవచ్చని హితవు పలుకుతుంది. కథకుడ్ని కార్యోన్ముఖుడిని చేస్తుంది.

అఫీసులో ఇంటిగురించి, ఇంటిలో ఆఫీసుగురించి ఆలోచిస్తూ రెండుచోట్లా తన విధులను సక్రమంగా నిర్వర్తించలేక చేతకాని దద్దమ్మ అనిపించుకున్న అమరేషు చనిపోదామనుకుని బయల్దేరి అడనిలో అన్నకు చిక్కుకుపోతాడు. అక్కడ జీవితానికి పరమార్థం తెలియజెప్పిన మనిషిని పోలీసులకు పట్టివ్వబోతాడు. మనుషులు నిజంగా కష్టం వచ్చినపుడు ఎంత స్వార్ధపూరితంగా ప్రవర్తిస్తారో చెప్పే ఈ కథ ‘నేటి సిద్ధార్థ’. ఇక ‘ఆనందమే జీవిత మకరందం’ కథలో జీవించడం మానేసి బలవంతంగా బతుకును ఈడ్చుకొస్తున్న డాక్టర్ ప్రభాకర్ దంపతులకు ఆనందంగా ఎలా బతకొచ్చో ప్రాక్టికల్ గా నిరూపిస్తారు అతని స్నేహితుడు చైతన్య, దక్ష దంపతులు.

ఇక మరో రెండు గొప్ప మానవీయ కథల్ని తప్పక ప్రస్తావించితీరాలి. అందులో ఒకటి ‘గారడీ’ అయితే రెండోది ‘బ్రతుకుబడి’. పట్టణంలో ఉద్యోగం చేస్తున్న రాంప్రసాద్ ఒకసారి తన పల్లెకు వస్తాడు ‘గారడి’ కథలో. పల్లెలో మూఢ నమ్మకాలు చూసి నివ్వెరపోతాడు. గారడి చేస్తున్నవాణ్ని ఛాలెంజ్ చేస్తాడు. కాని చివరి క్షణంలో రాజీపడతాడు. కథ నిర్వహించిన తీరు నిజంగా అద్భుతం. ఈ కథ చదువుతున్నపుడు పాఠకుడు ప్రతి క్షణం తరువాత ఏం జరగబోతోందోనని ఉత్కంఠకు గురవుతాడు. చివర్లో అందరి పరిస్థితి చూసి మన హృదయం ద్రవిస్తుంది. ఇక ‘బ్రతుకు బడి’ కథలో తన పనిమనిషి రంగి ఎవరితోనో తప్పు చేసిందని తెలిస్తే అది తన కొడుకుతోనే అని ముందు భయపడుతుంది అనసూయమ్మ. ఇటీవల తన కొడుకు చేస్తున్న ఆదర్శ పనులను చూస్తుంటే ఆమెకు అనుమానంగా వుంది. కాని ఈ విషయమై రంగిని నిలదీసినప్పుడు ఆమెతో తప్పు చేసింది తన భర్తని తెలిసి కుంగిపోతుందామె. ఆపై తన కొడుకు ఆదర్శ కార్యక్రమాలకు అండగా నిలబడుతుంది.

వృత్తిరీత్యా కాలుష్య నియంత్రణ మండలిలో శాస్త్రవేత్త అయిన యాళ్ల అచ్యుతరామయ్య ప్రవృత్తిరీత్యా కథకుడిగా జీవితాన్ని ఒడిసి పట్టుకున్న తీరు అబ్బురమనిపిస్తుంది. సామాజిక జీవన వాస్తవికతను అద్దం ముందు చూపెట్టినట్టే తన కథలను ఈ “ఆమె నవ్వు” కథా సంపుటిలో తీర్చిదిద్దారు. ఈ కథలు చదవడం పాఠకులకు మంచి అనుభవం. ఈ కథా సంపుటి సృజన ప్రచురణలు, ప్రగతి నగర్, కూకట్ పల్లి, హైదరాబాద్ వద్ద లభిస్తుంది. ఖరీదు 50 రూపాయలు మాత్రమే. రచయిత ఫోన్ నెంబరు 9290436524.

ప్రకటనలు

One response »

  1. ఇది ఆరో సారి ఈ పేజీకి రావడం. మరీ ఇంత పెద్ద వ్యాసం చదవలేకపోతున్నాను. దీనిని చిన్నది చేయలేరా? సమీక్షా వ్యాసాలు ముద్దుగా ఉంటేనే బావుంటాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s