విలేకరులకే కాదు భాషాభిమానులకూ విలువైన కానుక

సాధారణం

journalistమా మిత్రబృందం వేసుకునే అనేకానేక జోకుల్లో పరమ కౄడ్ జోకులన్నీ సాధారణంగా జర్నలిస్టులమీదే వేసుకుంటుంటాం. అదృష్టమో దురదృష్టమో తెలీదు గాని, మేము పనిచేసిన వివిధ ప్రదేశాల్లో యాదృచ్చికంగా అక్కడి జర్నలిస్టు మిత్రులలో ఎక్కువమంది మా జోకులను నిజం చేసేలా లేకితనాన్ని విచ్చలవిడిగా ప్రదర్శిస్తుంటారు. పెద్దగా చదువుకోరు, విషయాలు తెలుసుకోరు. చాలాచాలా చిన్నచిన్న విషయాలనదగ్గవి కూడా వారికి తెలియకపోవడం సంగతలా వుంచి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని చాలా దిగువ స్థాయి మనుషులుగా చూసే కొందరిని చూస్తే చాలా దిగులు, భయం వేస్తుంది. అధికారులు, రాజకీయ నాయకులు వారిని పంటి బిగువున భరిస్తుంటారు. తమ వెనకనున్న పత్రికను చూసి భయపడుతున్న అలాంటి కొందరు రాజకీయులు, అధికారులు తమను చూసే భయపడుతున్నారని భ్రమల్లో బతుకుతుంటారు. “జర్నలిస్టు కరదీపిక”ను పరిచయం చేయబోయే ముందు ఎంత రాయకూడదనుకున్నా ఈ నాలుగు మాటలు రాయకుండా వుండలేకపోయా.

ఆంధ్రజ్యోతి దినపత్రికలో జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాలుగా పనిచేస్తున్న కట్టా శేఖర్ రెడ్డి, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో పనిచేసి ఇప్పుడు ఓపెన్ యూనివర్శిటీలో వున్న సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ఎల్. విజయకృష్ణారెడ్డి, ఆంధ్రజ్యోతి సబ్ ఎడిటర్ రొద్దం శ్రీనివాసుల సహకారంతో రూపొందింది ఈ “జర్నలిస్టు కరదీపిక”. ఇది నిజానికో నిఘంటువు. అయితే దీనిని రూపొందించే కృషిలో భాగంగా ఒక్కో వివరమూ జతచేస్తూ పోయేసరికి జర్నలిస్టులకు అత్యంత అవసరమైన ఒక కరదీపికగా ఈ పుస్తకం ఎదిగింది. అతివాదికి, తీవ్రవాదికి, ఉగ్రవాదికి తేడా తెలియని జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరమైన పుస్తకమిది. ఇందులో అత్యంత ప్రాథమిక విషయాలనుంచి సంక్లిష్ట విషయాల వివరణల వరకు లభించడం విలేకరులకు వరం. మొత్తంగా పత్రికల్లో కనిపించే పదజాలాన్నంతటినీ స్థూలంగా కొన్ని విభాగాలుగా వింగడించుకుని వాటిని ఒక క్రమపద్ధతిలో రూపొందించడం అనువాదకులకు, సబ్-ఎడిటర్లకు ఎంతో సులువుగా వుంటుంది. రాజకీయ పదకోశం, ఆర్థిక పదజాలం, న్యాయపదాలు, శాసన పదకోశం, పత్రికా పదకోశం, విజ్ఞాన శాస్త్రాలు, వ్యవసాయం, వైద్య పరిభాష, క్రీడలు, కళలు – సాహిత్య పదజాలం, నుడికారాలు – జాతీయాలు అనే విభాగాలుగా దాదాపు పత్రికల్లో మనకు ఎదురయ్యే అన్ని పదాలను అర్థ సహితంగా వివరించారు. ఇది బూదరాజు రాధాకృష్ణ రూపొందించిన “ఆధునిక వ్యవహార కోశం”కు పొడిగింపుగా మనం భావించవచ్చు. కేతు విశ్వనాథరెడ్డి గారన్నట్టు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలనుకునే జర్నలిస్టులకు, కాబోయే జర్నలిస్టులకు, పత్రికల గురించి, పత్రికా పదజాలం గురించి తెలుసుకోవాలనుకుంటున్న వారికి అక్షరగవాక్షంగా ఈ కరదీపిక పనిచేస్తుందనడంలో సందేహం లేదు.

ఇక్కడితో ఈ పుస్తకం ముగిసిపోయుంటే దీనిని మరో నిఘంటువుగా పరిగణించేవారం. కానీ ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. జర్నలిస్టులకు ప్రాత:స్మరణీయంగా మిగిలిపోవడానికి రచయితల కృషి ఇక్కడినుంచే మొదలయింది. జర్నలిజం అంటే ఏమిటి? అనే విభాగంలో అసలు పాత్రికేయ వృత్తికి సంబందించిన అన్ని రకాల వివరాలు అందించేరు. పే. 224లో జర్నలిస్టుకు వుండాల్సినవేమిటి? అన్న ప్రశ్నకు సమాధానంగా భాషా సంపద, భావ సంపద, జ్ఞాన సంపద, ఆచరణ వుండాలన్నారు. మరి ఉండకూడనివేమిటో చెప్పలేదు. వార్తలంటే ఏవో, వార్త నిర్మాణం ఎలా వుండాలో, వార్త రచన ఎలా సాగాలో ఉదాహరణలతో చెప్పారు. రాజకీయాలు ప్రజాజీవితంలో ప్రముఖమైన స్థానం ఆక్రమించుకున్నాక, పత్రికల యాజమాన్యాల చేతుల్లో పవర్ పాలిటిక్స్ వుంచుకునేందుకు వీలుగ జిల్లా ఎడిషన్లు వెలిశాయి. ఇక అందులోకి విలేకరులంటూ ఒక సైన్యాన్ని తయారుచేసుకుని జనం మీదకు వార్తలు వదులుతున్నాయి. ఈ పుస్తకంలో వార్త స్వరూప స్వభావాలు చదివి, ఆనక జిల్లా పేజీల్లో వార్తలను చదువుతుంటే కడుపు తిప్పేస్తుంది. సబ్ ఎడిటింగ్ గురించి, అనువాదం గురించి చాలా వివరాలు అందించేక విలేకరుల గురించి మరింతగా వివరించి, అప్పుడు పత్రికా చట్టాల గురించి చర్చించారు. జర్నలిస్టులు వార్తలు రాసేటప్పుడు పాటించల్సిన నైతిక నియమావళిని (ఎథిక్స్) 38 పాయింట్లతో తెలియజేయడం ఆసక్తికరంగా వుంది. ఆ తరువాత విలేకరులు విధిగా చదవాల్సిన పుస్తకాల జాబితా ప్రచురించారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వంద పుస్తకాల జాబితాను ఇచ్చారు. ఇది ఆసక్తిగల పాఠకులకు ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. కానీ శ్రీకాకుళంలాంటి చిన్న పట్టణాలలో మంచి కథల పుస్తకం అమ్మే దుకాణాలు కరువుగా వున్నపుడు ఇలాంటి ఉత్తమ గ్రంథాలు మరెలా సంపాదించగలగడం? పత్రికలే ప్రధాన కార్యాలయాల్లో తీర్చిదిద్దినట్టుగా గ్రంథాలయాలను అన్ని ఎడిషన్ సెంటర్లలోనూ ఏర్పాటుచేసిన నాడు ఆ కొరత కొంతవరకు తీరుతుంది.

మరో పన్నెండు పేజీల్లో తెలుగు పదసంపద అన్న శీర్షికలో తెలుగు భాషా పదాలను గుదిగుచ్చారు. వత్తు అక్షరాలు ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, పొట్టలో చుక్క ఎక్కడ పెట్టాలి, మరెక్కడ పెట్టకూడదు వంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక పుస్తకం చివర్లో ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి సంబంధించి విపులంగా, ప్రపంచానికి సంబంధించి లఘుటీకలా గణాంక వివరాలు అందించారు. బూదరాజు రాధాకృష్ణ “జర్నలిజం-అవగాహన”, కె. రామచంద్రమూర్తి “వార్తా రచన”ల తరువాత అంతే ఆసక్తికరమైన, అవసరమైన, నిత్య ఉపయుక్తమైన పుస్తకం ఈ “జర్నలిజం కరదీపిక”. సుమారు 340 పేజీల ఈ పుస్తకం ఖరీదు 175 రూపాయలే. వున్న చిన్నచిన్న భాషాదోషాలను సవరించుకుంటూ అతి త్వరలో లైబ్రరీ ఎడిషన్ గా విడుదల కానున్న ఈ పుస్తకం ప్రతి జర్నలిస్టూ, భాషపట్ల అనురక్తి వున్న ప్రతి ఒక్కరిదగ్గరా వుండల్సిన పుస్తకం. మరి మీరూ ఓసారి చూస్తారుగా!

ప్రకటనలు

8 responses »

  1. మండలాల్లో జర్నలిస్టులకు ఉండే విషయ పరిజ్ఞానం చాలా తక్కువుంది. వృత్తిమీద ఎవరికీ గౌరవం లేదు. విలేకరిగా అధికార్లవద్ద పనులు చెయ్యించుకోడానికి వచ్చేవారే ఎక్కువ. అధికార్లవద్ద వీరు వేసే తెలివితక్కువ ప్రశ్నలకు విలేకర్లపై గౌరవం పోతుంది. దయచేసి పత్రికా నిర్వాహకులు కొంచెం ఆలోచించి విలేకర్లను అపాయింట్ చేస్తే మంచిది. జర్నలిస్టు వ్యవస్థకు గౌరవం దక్కుతుంది.

  2. నేను ఈ పుస్తకం చదివాను.. నాకు బాగా ఉపకరించింది.. నిజంగా జర్నలిజం నిఘంటువుగానే ఉంటుంది.. కొత్తగా జర్నలిజంలోకి వచ్చేవాళ్లకే కాదు.. ఇప్పటికే జర్నలిజంలాంటి దాంట్లో ఉండి మొనగాళ్లమని జబ్బలు చరుచుకునే వాళ్లకు కూడా దిక్కూచిలా పనికొస్తుందని నా అభిప్రాయం..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s