ఏకధృవ ప్రపంచపు ఆధిపత్యానికి స్వాగతమ్!

సాధారణం

ఇపుడీ భూమి ఏ మాత్రం గుండ్రంగా లేదట. హమ్మయ్య! ఈ మాట తెలిసిన తరువాత నుండి ఎంతో ప్రశాంతంగా వుంది. ఇన్నాళ్లూ భూమి గుండ్రంగా వుందని పుస్తకాల్లో చదివినప్పుడల్లా ఎక్కడ జారి పడతానో అని చాలా బెంగగా వుండేది. నా భయాన్ని పటాపంచలు చేస్తూ ఈ భూగోళం ఇటీవలే బల్లపరుపుగా తయారైందని ఠామస్ ఫ్రీడ్ మాన్ అనే జర్నలిస్టు సాక్ష్యాధారాలతో సహా నిపూపించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కడుపునిండా భోజనం చేయగలుగుతున్నాను. కంటినిండా కునుకు తీయగలుగుతున్నాను. ఈ పుస్తకం చదివిన చాలామందికి అలానే అనిపించిందట. అందుకే ఈ “ది వ(ర)ల్డ్ ఈజ్ ఫ్లాట్” పుస్తకానికి పులిట్జర్ బహుమతిని కూడా అందజేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఎంతో భరోసాగా వున్నారు. పైగా ఇవేవో ఉత్తుత్తి  కబుర్లు చెప్పడం కాదు. పది సాక్ష్యాలు కూడా పకడ్బందీగా రచయిత చూపించాడు. అలాంటి అరుదైన పుస్తకాన్ని ఈ వ్యాసం పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే నిజానికి పరిచయ వ్యాసం కంటే నేరుగా పుస్తకం చదవడమే మంచిది – భరోసా కుదరడానికి.

రకరకాల సామాజిక దురవస్థలలో కునారిల్లుతున్న ఈ సమాజం కొన్నేళ్ల కిందట తెలివి తెచ్చుకుని ప్రపంచీకరణ పథంలో పడి ముందుకు పరుగులు తీస్తోంది. ఈ సంగతి తెలియని భారత్ లాంటి వాజమ్మ దేశాలు భవిష్యత్తును సరిగా ఊహించుకోలేకపోయాయి. అంచేత స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో అమెరికావైపు చూడకుండా అప్పటి ద్విధృవ ప్రపంచంలో రష్యావైపు చూసి చొంగ కార్చుకున్నాయి. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్టు వారికే వున్న గోచీ ఊడిపోయాక, వారిమీద ఆధారపడ్డ దేశాల గతేమిటి? అధోగతే. ఈ మర్మం తెలుసుకున్న కొందరు మేధావులు 1990ల తర్వాత కమ్యూనిస్టు దేశాలకు ఏమీ చూపించకుండానే అమెరికా చెప్పులపై ప్రత్యేక దృష్టి సారించారు – చప్పరిస్తూ జీవితాన్ని తరింపజేసుకోవడానికి. అందుకే అడగకుండానే అప్పులు. వద్దన్నా రోడ్లేసుకోవడనికి, రంగులేసుకోవడానికి తదితరాలకు డబ్బులు. ఇప్పుడేమో వారు వద్దనుకుని మూసేసుకున్న అణు ప్రాజెక్టులు. అప్పనంగా ఏది కావలిస్తే అది ఇచ్చేయడాలు! అలాగని అడుక్కునే దేశాలు అతి చేయకూడదు. అంటే మరీ ఇదిగా ఏది పడితే అది కోరుకోకూడదు. వారికి మోజు తీరిపోయినవి, వారంతా వద్దనుకున్నవి, వారి పర్యావరణానికి ముప్పనుకున్నవి మాత్రమే మనం కోరుకోవాలి. అప్పుడే ముద్దు.

ఇక పుస్తకంలోకి వెళ్లేముందర రచయిత గురించి కూడా రెండు మాటలు చెప్పుకుందాం. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వారానికి రెండుసార్లు చొప్పున శీర్షికలు రాసే సీనియర్ జర్నలిస్ట్, రచయిత థామస్ ఫ్రీడ్ మాన్ టెలివిజన్ ప్రయోక్త కూడా. రచయిత రాసే కాలంలు చదవాలనుకున్న పాఠకులు మన దక్కన్ క్రానికల్ పత్రిక తిరగేస్తే చాలు. టెలివిజన్ కార్యక్రమాలు తీస్తూ దేశదేశాలు తిరుగుతూ తాను చూసిన ప్రపంచాన్ని తాను అర్థం చేసుకున్న క్రమంలో కొన్ని పుస్తకాలు (“ది లెక్సస్ అండ్ ది ఆలివ్ ట్రీ” వంటివి) రాశారాయన. మనమంతా 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టిన ఐదేళ్లలోనే ఆ శతాబ్దపు సంక్షిప్ర చరిత్ర పేరుతో ఈ “ది వరల్డ్ ఈజ్ ఫ్లాట్” పుస్తకాన్ని ఫ్రీడ్ మాన్ రాయడం మరో విశేషం.

ఈ రచయితకు కంప్యూటర్ల గురించి పెద్దగా తెలియదు. అయితే వాటిని నిస్సందేహంగా వాడుకోగలరు. అలాగే పుస్తకంలో చాలా విషయాలు మనకు వివరించడానికి ఆయనింట్లోకి మనను పట్టుకెళ్తారు. ఆయన భార్యను, ఇతర మిత్రులను పరిచయం చేస్తారు. ఎంతో ఫ్రెండ్లీగా వుండడానికి ప్రయత్నిస్తారు. ఇక విషయలను తానర్థం చేసుకున్న తీరులోనే మనకు కూడా అఆఇఈ స్థాయిలో వివరిస్తారు. దాంతో మనకు రచయితతో సహానుభూతి ఏర్పడి ఆయన చెప్పిందల్లా విని తలలాడిస్తాం. పైగా ఆయన చెప్పిన ప్రతిమాటకు సాక్షాత్తూ వివిధ కంపెనీల స్థాపకుల, అధిపతుల తాన తందాన సాక్ష్యాలు. ఏ మాత్రం ఏమరుపాటుగా వున్నా భావజాల ప్రభావంలోకి పోయే పకడ్బందీ రచనాశైలితో సాగే ఈ పుస్తకాన్ని చదవడం గొప్ప అనుభవం.

ఇవ్వాళ మనం చూస్తున్న ప్రపంచీకరణ రాత్రికి రాత్రి జరిగిపోయింది కాదు. అదో క్రమం. ఎన్నో సంఘటనలను అర్థం చేసుకుంటేనే గాని, ఆ చిక్కుముడిని విప్పలేం. ఈ ప్రపంచీకరణ మూడు స్థాయిల్లో జరిగిందని ఫ్రీడ్ మాన్ అంటారు. ప్రపంచీకరణ 1.0 దశలో దేశాలు, వాటి ప్రభుత్వాలు విశ్వీకరణకు లోనయ్యాయి. ఇది నిదానంగా జరిగి పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంది. రెండో దశ ప్రపంచీకరణ 2.0 లో కేవలం కంపెనీలే విశ్వీకరణ అయ్యాయి. 20వ శతాబ్దం పూర్తయ్యేసరికి ఈ ప్రక్రియ సంపూర్ణంగా ముగిసింది. ప్రస్తుతం నడుస్తున్న ప్రపంచీకరణ 3.0 దశ ఈ క్రమంలో చివరిది (!). శరవేగంతో నడుస్తోంది. ఇప్పుడు వ్యక్తులు విశ్వీకరణకు లోనవుతున్నారు. ఇదే క్రమంలో మొదట దేశాలు, తరువాత కంపెనీలు సంపన్నమయ్యాయి. ఇప్పుడు వంతు వ్యక్తులది. అందుకే బిల్ గేట్స్, లక్ష్మీ మిట్టల్ తదితరుల పేర్లు ఐశ్వర్యవంతుల జాబితాలో చేరేది. వాటికి అంత ప్రచారమిచ్చేది.

ఇలా ఎవరు పడితే వారు సంపన్నులు కావడానికి వీలుగా భూమిని చదును చేయడంలో సహకరించిన పది గొప్ప విశేష శక్తుల గురించి వివరంగా తెలుసుకోవాలి. మొదటిది 9 నవంబర్, 1989 నాడు కూలిన బెర్లిన్ గోడ దీనికి కావలసిన భూమికను ఏర్పరిచింది. ఒక కంప్యూటర్ నుంచి సమాచారాన్ని దూరాలతో సంబంధం లేకుండా ఎక్కడికైనా చేరవేసే వీలు కల్పించిన నెట్ స్కేప్ నేవిగేటర్ రెండో కీలకాంశం. మనుషుల ప్రమేయం లేకుండా కంప్యూటర్లు తమలో తాము మాట్లాడుకోవడానికి వీలు కల్పించిన వర్క్ ఫ్లో సాఫ్ట్ వేర్ మూడో కీలకం. ఈ మూడు కలిసికట్టుగా ఈ విశాల ప్రపంచాన్ని చదునుచేయడానికి తోడ్పడి భూమినంతటినీ ఓ ప్రపంచ కుగ్రామంగా తయారుచేశాయి.

ఓపెన్ సోర్స్ ఇప్పుడు పాతపడిపోయిన పదం. మన డాక్యుమెంట్లే కాక, మన మ్యూజిక్ ఫైళ్లు, వీడియో వివరాలు, సంగీత కచేరీలు, ఒకటేమిటి దేనినైనా పరిమాణంతో సంబంధం లేకుండా ఒకరి నుంచి మరొకరికి సునాయాసంగా పంపించడానికి, తెచ్చుకోవడానికి సకరించిందే నాలుగో కీలకమైన ఓపెన్ సోర్సింగ్ సాఫ్ట్ వేర్. ఇక ఒక పనిని ముక్కలు ముక్కలుగా విభజించుకుని, వాటిని తలో ప్రాంతానికి పంపించి, తక్కువ ఖర్చుతో త్వరితంగా పని ముగించుకోవడానికి పనికొచ్చిన ఐదో కీలకం అవుట్ సోర్సింగ్. పాపం భూమి బల్లపరుపుగా అయిపోయిందని తెలియక ఇంకా సగభాగం పగలు, సగభాగం రాత్రి అవుతుండడం వల్ల దేశాలు దాటి, ఖండాలు దాటి ఈ పనులను పరిష్కరించగలిగే ఆరో వెసులుబాటును ఆఫ్ షోరింగ్ అని వ్యవహరిస్తున్నారు. ఒకచోట చిన్న ధారగా మొదలై క్రమక్రమంగా ఉరవడిగా ప్రవహించే నది మాదిరిగా ఇవ్వాళ వ్యాపార రంగంలో ఉత్పత్తి, పంపిణీ, అమ్మకాలను ఒక మార్గంలో పెట్టడం ద్వారా వాల్ మార్ట్ లాంటి కంపెనీలు రీటెయిల్ రంగంలో సృష్టించిన పెను సంచనాలను “సప్లయ్ చైనింగ్” అనే ఏడో కీలకంగా రచయిత వర్ణించారు. వీటికి పరాకాష్టగా ఒక కంపెనీ మరో సంస్థ పనిని చేసిపెట్టడం ఎనిమిదో కీలకం ఇన్ సోర్సింగ్ అన్నారు. దీనిలో యుపిఎస్ కంపెనీ తోషిబా తరపున వాళ్ల కంప్యూటర్లు రిపేర్ చేయడాన్ని విపులంగా ఉదాహరిస్తారు. ఇక వీటి ఫలితంగా వచ్చిన తొమ్మిదో కీలకం సమాచార విప్లవం.

మీకు తోచిన వ్యక్తి, మీకు తోచిన విషయం, మీకు నచ్చిన ప్రదేశం గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు క్షణాల్లో పని. పూర్వం విఠలాచార్య సినిమాల్లో ఫలానా రాశిలో, ఫలానా నక్షత్రంలో పుట్టిన ఫలానా రకమైన అమ్మాయి ఎక్కడ దొరుకుతుందంటే వెంటనే మంత్రదండం ఊపితే మాయపుటద్దంలో ఆ అమ్మాయి వెంటనే కనిపించేది. ఇప్పుడలాగే మనకు కావలసిన సమాచారం ఏదైనా క్షణాల్లో సెర్చ్ ఇంజన్లు వెతికి పెడుతున్నాయి. గూగుల్, యాహూ, ఎం ఎస్ ఎన్ లాంటి పవర్ ఫుల్ సెర్చ్ ఇంజన్లు మనకు ఎలాంటి సమాచారాన్నయినా అందిస్తున్నాయి. అదే తొమ్మిదో కీలకం. పదో కీలకాన్ని ఫ్రీడ్ మాన్ స్టెరాయిడ్స్ అని వర్ణించాడు. ఇందులోకి మనం ప్రస్తుతం వాడుతున్న అన్ని రకాల ఎలెక్ట్రానికి పరికరాలు చేర్చారు. మొబైల్ ఫోన్లు, ఐపాడ్లు, ఇన్ స్టంట్ మెసేజ్ లు, వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ మొదలైనవన్నీ స్టెరాయిడ్లే.

… ఈ వ్యాసం మిగతా భాగం మరికొన్ని వారాల్లో…

ప్రకటనలు

9 responses »

 1. నేను ఈ పుస్తకాన్ని ఇప్పుడు చదువుతున్నాను. చాలా బాగుంది. మీ వ్యాసపు తరువాతి భాగాల కోసం ఎదురుచూస్తుంటాను.

 2. రవీ,

  ఒక చిన్న సవరణ. ఫ్రీడ్ మాన్ కు పులిట్జర్ బహుమతి ఇచ్చింది “వర్ల్డ్ ఈజ్ ఫ్లాట్” పుస్తకానికి కాదు టెర్రరిజంపై చక్కగా రిపోర్టింగ్ చేసినందుకు. 2002 సంవత్సరంలో జర్నలిజం-కామెంటరీ విభాగం కింద ఆయనకు ఈ బహుమతి దక్కింది.

  ఫ్రీడ్ మాన్ పుస్తక సమీక్ష “స్వేచ్చా వాణిజ్యం” కుప్పకూలుతున్న ఈ రోజుల్లో రాయడం యాధృచ్చికమేనా లేక కావాలనే రాశారా?

 3. చాలా బాగుంది రివ్యూ. థామస్ ఫ్రీడ్ మాన్ కొద్ది నెలల క్రితం ప.గో జిల్లా పక్కన ఉన్న ఈతకోటలో నడిపే సత్యం గ్రామీణ బీపీవో ని చూడటానికి వచ్చారు . దాని మీద కాలం కూడా వ్రాసారు . ఇక్కడ కారు బ్యాటరీలతో కంప్యూటర్స్ కి పవర్ ఇచ్చేపరిస్తితి సూచి ఆర్ఛర్యపోయారు

 4. రవి, చదవాల్సిన పుస్తకం ఇది.
  @ Dileep: you are right about the Pulitzer. He got it 2002.

  Thomas quote for your blog’s young readers:

  “When we were young kids growing up in America, we were
  told to eat our vegetables at dinner and not leave them.
  Mothers said, think of the starving children in India
  And finish the dinner.’
  And now I tell my children:
  ‘Finish your homework. Think of the children in India
  Who would make you starve, if you don’t.’?”

 5. @ ప్రవీణ్, శ్రావ్య, రాజేంద్ర, రాజు, దిలీప్, శివ గార్లకు నెనర్లు.

  @ దిలీప్ సార్, ఫ్రీడ్ మాన్ కు పులిట్జర్ వచ్చింది ఆయన జర్నలిజపు కృషికా? సరే, తప్పయింది. స్వే. వా. కుప్పకూలక ముందు ఈ పుస్తకం రాశాడనుకుంటాను. ఇప్పుడు వీళ్లందరి రాతలూ, మాటలూ నాకూ వినాలనుంది. నాలుక ఎలా తిరగేస్తారో కదా?

  @ శివ సార్, మంచి సమాచారం జతచేశారు. పనిలోపని ఆ కాలమ్ లింక్ ఇవ్వాల్సింది.

  – రెండో భాగం రాయడానికే ధైర్యం చాలడం లేదు. చూద్దాం.

 6. మీరు చెప్పింది బాగుంది.కానీ,ఒకానొక వేళలో నాకు మీ మీద నాకు చాలా కోపమొచ్చింది.మీరు”భారత్ లాంటి వాజమ్మ దేశాలు”అని మీరొక భారతీయులై కూడా అనటం భావ్యమా?తప్పు తెలుసుకుంటారని ఆశిస్తూ…. చైతన్య .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s