కాలం గతి – మనిషి మతి – కథల శ్రుతి

సాధారణం

katha2000ఒక ఏడాదిలో వివిధ దిన, వార, పక్ష, మాస, వార్షిక పత్రికలలో ప్రచురితమైన కథలనుంచి సుమారు పదిహేను కథల్ని ఎంపిక చేసి ఆ ఏడాది “కథ” పేరిట కథాసాహితి ప్రతియేటా 1990 నుంచి ప్రచురిస్తోంది. ఆ సిరీస్ తెలుగు సాహిత్యలోకంలో ఎంత ప్రాముఖ్యం సంపాదించిందంటే తెలుగు రచయితలు కథ సిరీస్ లో ఎంటరవడం పెద్ద రివార్డుగా భావిస్తారు. ఆ వరుస సంకలనాలు పాఠకలోకం నుంచి అంతే ఆదరణ పొందాయనడానికి నిదర్శనం – కాపీలు విడుదలైన రెండు మాసాలకు ఎక్కడా కాపీలు దొరక్కపోవడమే. ఆ సిరీస్ లో “కథ-2000″ను ఈ వ్యాసం పరిచయం చేస్తుంది. ఈ సంకలనాలకు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ లు సంపాదక బాధ్యతలు వహిస్తున్నారు.

ఏ సాహిత్య రూపమైనా జీవితపు అభివ్యక్తీకరణగానే భావించాల్సినప్పటికీ అందులోంచి ఉత్తమ సాహిత్యాన్ని ఎంచడానికి మనకొక్కటే మార్గం. ఆ సాహిత్యం జీవన సూత్రాలు నేర్పించి, అనుభవాలను సుసంపన్నం చేసి జీవిత పోరాటం అహ్లాదకరంగా సాగేట్టు చేయడానికి తోడ్పడాలి. దానికితోడు శిల్ప సౌందర్యం చేరితే ముగ్ధకు బంగారు ఆభరణాలు తోడైనట్టే.

ఒక ఏడాదిలో తెలుగులో ఎలా లేదన్నా వెయ్యి కథలకు తక్కువకాకుండా వస్తున్న తరుణంలో అందులో డజను మంచి కథలను ఎంపిక చేయడం నిజంగా కత్తిమీద సాము. అదే విధంగా వందలాది కథలు చదివే సంపాదకులకు అదో పెద్ద వ్యాయమం. నడుస్తున్న చరిత్రను చదవడం లాంటి ఫీలింగ్. తత్కాలీన సమాజం, సంక్షుభిత పరిస్థితులు, ప్రభుత్వ విధానలు, ప్రకృతి బీభత్సాలు ఇవన్నీ రచయితల ముడిసరుకులు. వీటితో వండే వంట (రచనలు), అప్పుడే తిన్న (చదివిన) వారికి వేడివేడిగా రుచికరంగా వుంటుంది. కానీ తర్వాత రాబోయే భవిష్యత్తు తరాల కోసం కొన్ని మంచి కథలను ఏరి సంకలనంగా భద్రపరచాలనుకున్నపుడు మరింత సంకట పరిస్థితి ఎదురవుతుంది. ఆ క్రమంలో కథలు చదివిన సంపాదకులు ఏమంటున్నారో చూడండి: “పిల్లలపై చదువుల పేరుతో సాగే హింస, కుటుంబ వ్యవస్థలో స్త్రీలపై అమలు జరుగుతున్న హింస, దళిత, ముస్లిం తదితర మైనారిటీలపై సాగే అవమానకర హింస, భరోసా జీవితం ఛిన్నభిన్నమై రోడ్ల మీదకొచ్చిన కార్మిక జీవితాలపై హింస, పెద్దపెద్ద విదేశీ కంపెనీల పోటీలకు తట్టుకోలేని చిన్న కంపెనీలవారు, చిన్న వ్యాపారస్తులు క్షణక్షణం అనుభవించే హింస, రైతులు, గ్రామీణ చేతివృత్తులవారు పడుతున్న చావునిండిన హింస, ఆఖరికి 70 ఏళ్ల వయసులో కూడా ప్రశాంతంగా జీవితం గడపలేని వృద్ధులు అనుభవిస్తున్న హింస ఇలా జీవనరంగంలో ప్రతి పార్శ్వం అనుభవిస్తున్న హింసకు బాధ్యులెవరు? నేరస్తులెక్కడ? వీరిని ఎవరు ఏ కోర్టులో శిక్షిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దొరికినా దొరక్కపోయినా నేటి సాహిత్యంలో స్పష్టంగా దొరుకుతుంది. అంటే ఆ ఏడాది సాహిత్యంలో అందునా కథాసాహిత్యంలో రచయితలందరూ, ఆ అంశాలపైనా దృష్టి సారించారన్నమాట.

ఇక్కడ మనం ఒక్క నిమిషం సాహిత్యాన్ని మరిచిపోయి రాజకీయాల్లోకి వెళ్దాం. అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు పాలన్, దేశంలో కళ్లు మూసుకుని తాపీగా నీళ్లు నములుతూ పావుగంటకొక పలుకు పలికే వెయ్యి నాలుకల వాజ్ పేయి పాలన, అమెరికాలో అతిపెద్ద టవర్లను కూల్చేసి బీభత్సం సృష్టించిన ఆల్ ఖైదా బూచి చూపించి ఏకధృవ ప్రపంచాన్ని ఏలుతున్న అమెరికా అందరినీ బెదిరించడం గుర్తుకొస్తున్నాయా?

ఈ సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఆ ఏడాది తెలుగు కథాసాహిత్యం ఎలా వుండేదో తెలుసుకోవాలనుకుంటే తప్పక చదవాల్సిన పుస్తకం “కథ-2000”. ఈ సంకలనంలో మొదటి కథ ‘కానుగుపూల వాన’. మేజిక్ రియలిజం పేరుతో గోపిని కరుణాకర్ రాస్తున్న కథలను నేనైతే బూతు కథలుగా తప్ప మరొకలాగా చూడలేకపోతున్నాను. ఫ్రాంజ్ కాఫ్కా రాసిన ‘మెటామార్ఫాసిస్’ కథను అర్థం చేసుకోలేడేమో గాని, విశ్వనాధ “వేయిపడగలు” లో పసరిక పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకున్నా బాగుణ్ణు. గోపిని అట్లాంటి శిల్పం మాటున ఇలాంటి చెత్తను రాయకపోయే వాడు. దీని తరువాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కథ మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ‘న్యూ బాంబే టైలర్స్’. ఢిల్లీలోని కథ సిరీస్ లో వరసగా ఎంటరవుతున్న ఖదీర్ బాబు ‘పెండెం సోడా సెంటర్’, ‘దూద్ బఖష్’ కథలతో వెర్రితలలు వేసి విర్రవీగుతున్న గ్లోబలైజేషన్ ను ఆతృతతో పరిశీలించడం గమనిస్తాం. నూతన ఆర్థిక విధానాల వెంబడే వచ్చే పారిశ్రామికీకరణ క్రమంలో దారితెన్నూ లేక విలవిలలాడిపోతున్న చేతివృత్తుల వారికి ఆలోచనతో పాటు ఆత్మవిశ్వాసాన్నిచ్చే కథ ఈ ‘న్యూ బాంబే టైలర్స్’.

ఒకదానిపై మరీ కోపం, మరో దానిపై మరీ ఇష్టం వుండడం వల్ల ఈ రెండు కథలను ప్రస్తావించాను గాని, అన్ని కథలు ఆణిముత్యలే. ఆడెపు లక్ష్మీపతి ‘విధ్వంస దృశ్యం’ అయితేనేం, ఎమ్వీ రామిరెడ్డి ‘వైరస్’ అయితేనేం, ఆరి సీతారామయ్య ‘గట్టు తెగిన చెరువు’ అయితేనేం… ఇవన్నీ సామాజిక జీవనస్థితిని సాహిత్యం యథార్థంగా ప్రతిబింబిస్తుందనడానికి ఉదాహరణలే.

కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసరుగా పనిచేస్తున్న కాత్యాయని విద్మహే గత దశాబ్ది తెలుగు కథపై సుదీర్ఘ విశ్లేషణ వ్యాసం రాశారు. కథాప్రక్రియ పట్ల అభిరుచిగల రచయితలు, పాఠకులు చదివి తీరాల్సిన వ్యాసమిది. ఈ వ్యాసంతో పాటు 14 కథలున్న ఈ సంకలనం వెల 40 రూపాయలే.

కొనడానికైతే ఎక్కడా దొరకకపోవచ్చు గాని, మిత్రుల దగ్గర సంపాదించి మీరు చదవండి.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s