ఆరోవారం చదువు ముచ్చట్లు కొల్లూరి సోమశంకర్ తో…

సాధారణం

తన గురించి చెప్పుకుంటూ ఎంతో వినయంగా అమెచ్యూర్ అని అన్నా, నిజానికి కథారచనలో, అనువాదంలో దిట్ట అనిపించుకున్న కొల్లూరి సోమశంకర్ తన దైనందిన జీవితంలో ఎంతో బిజీగా వున్నా, సాహిత్యానికి సముచితంగా సమయం కేటాయించడం పాఠకుల అదృష్టం. తనపేరుతోనే బ్లాగును ప్రారంభించి అనతికాలంలోనే బ్లాగు పాఠకుల అభిమానాన్ని పొందిన సోమశంకర్ సీరియస్ గా తన కలాన్ని ఝుళిపించే అతికొద్ది మంది బ్లాగర్లలో ఒకరు. ఈ వారం చదువు ముచ్చట్లు మన సోమశంకర్ గారితో….

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

ప్రస్తుతం నేను నవలలకన్నా, కథ సంకలనాలు ఎక్కువగా చదువుతున్నాను. ఎందుకంటే, ఒక కథ నచ్చకపోతే వెంటనే మరో కథకి వెళ్ళిపోయే సౌలభ్యం ఉంటుంది.   గత ఏడాది కాలంగా బోర్ కొట్టిన పుస్తకాలేవీ లేవు. సెలెక్టివ్ గా చదువుతున్నాను. గతంలో దౌడ్ అనే ఓ హిందీ నవల చదివాను. రచయిత్రి శ్రీమతి మమతా కాలియా.  16 అధ్యాయాల వరకు నేటి యువతరం అలోచనలు, ఉద్యోగావకశాలు, ప్రభుత్వ రంగం – ప్రైవేటు రంగం మధ్య పోటీ, లక్ష్యాలు, వాటిని అందుకోడానికి పరుగులు… పుట్టి పెరిగిన ఊరికి  దూరంగా బ్రతకడం… ఎత్తులకి ఎదగాలన్న ఆశయంతో నేటి తరం ఏం కోల్పోతున్నారు….ఈ అంశాలను స్పృశిస్తూ కథ సాగింది.  కాని 17వ అధ్యాయం నుంచి కథాగమనం మారిపోయి ఒకే కుటుంబం చుట్టూ తిరిగింది. అప్పటిదాక, ప్రధాన పాత్ర తో పాటు కనిపించిన మిగతా పాత్రల ప్రస్తావన మరుగున పడిపోయింది. నవలని హఠాత్తుగా ముగించినట్లనిపించి ఆశాభంగం కలిగించింది.
2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?
ఈ మధ్య కాలంలో కొన్న పుస్తకం ” ఓ దళారి పశ్చాతాప్తం”. బావుందది. దీనిపై నా బ్లాగులో ఓ టపా కూడా రాసాను. ఇటీవలే చదవడం పూర్తి చేసిన పుస్తకం – “మా పసలపూడి కథలు”. కొన్ని కథలు చాలా బావున్నయి.   
3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?
నా కలెక్షన్‌లో దాదాపు 200 పుస్తకాలు ఉన్నాయి.
4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?
ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. కాలేజిలో ఉన్నప్పుడు బాగా చదివేవాడిని. ఉద్యోగం, సంసార బాధ్యతలు మీదపడ్డాకా, ఇప్పుడు చదవడం కాస్త తగ్గింది. శ్రీపాద, మధురాంతకం, కారా,రావిశాస్త్రి గార్ల రచనలలో నేను చదవాల్సినవి చాలా ఉన్నాయి. అలాగే విశ్వనాధ వారి వేయి పడగలు, పి.వి. నరసింహారావు గారి ఇన్‌సైడర్ చదవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కుదరలేదు.
5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.
చాలామందే ఉన్నారు. కొకు, కారా, రావి శాస్త్రి, అబ్బూరి ఛాయదేవి, డి. కామేశ్వరి, మల్లాది, శ్రీ రమణ, సలీం, జీడిగుంట రామచంద్ర మూర్తి, కె.వి. నరేందర్, వాలి హిరణ్మయి దేవి మొదలగువారి రచనలు బాగా నచ్చుతాయి.  చదువు, అల్పజీవి, అసమర్ధుని జీవయాత్ర, తిలక్ కథలు, అమృతం కురిసిన రాత్రి, అబ్బూరి ఛాయా దేవి గారి ‘తన మార్గం’, బలివాడ కాంతారావు గారి ‘గోపురం’ డి. కామేశ్వరి గారి ‘కాదేది కథకనర్హం’ రావు కృష్ణారావు గారి ‘బతుకుపోరు ‘,  శశిశ్రీ గారి ‘దహెజ్’ కథా సంకలనాలు మొదలైనవి నాకు ఇప్పటికీ ఇష్టమైన పుస్తకాలు.
6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?
ఖచ్చితంగా సంవత్సర కాలంలో కాకపోయినా, కాస్త అటు ఇటుగా,  నేను పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారి “సర్వ సంభవం” పుస్తకాన్ని ఒకరికి బహుమతిగా ఇచ్చాను. నాకు బహుమతిగా వచ్చిన పుస్తకం సుజాత పట్వారి కన్నడం నుంచి అనువదించిన “సంస్కారం” అనే నవల. మూల రచయిత యు. ఆర్. అనంతమూర్తి.   ఇంకా రాకాసి కెరటాలు అనే పుస్తకం. సునామి రావడానికి గల కారణాలు, అదొచ్చే తీరు తెన్నులను సవివరంగా పేర్కొన్న పుస్తకిమిది. 
7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?
ఇప్పుడున్న పత్రికలలో నాకు బాగా నచ్చేవి – విపుల, చినుకు. ఇంకా అన్ని దినపత్రికల ఆదివారం అనుబంధాలు.  నచ్చనివి రాజకీయ పత్రికలు (ఆ మధ్య ఎవరో కాంప్లిమెంటరీ కాపీ గా ఓ పుస్తకం ఇచ్చారు. పేరొద్దులేండి….విసుగేసింది). 

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

చేతన్ భగత్‌ది “ది త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్” ఎన్నో అంచనాలతో చదివా దీన్ని. పెద్ద గొప్పగా లేదు. పైగా కొన్ని factual errors (India Vs Australia Test Match గురించి)!     
9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?
బి.వి.ఎన్. స్వామి గారి “నెల పొడుపు” అనే కథా సంకలనం.
10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?
 బాగా ప్రభావితం చేసిన పుస్తకాలు అనే కంటే, నా జీవన విధానాన్ని మలచుకోడంలో నాకు ఉపయోగపడ్డ పుస్తకాలు అని అంటాను. కాలేజి రోజులలో చదివిన అన్ని పుస్తకాలు నాపై ముద్ర వేసాయి. ముఖ్యంగా Robert Schuller రాసిన Success is Never Ending, Failure is Never Final, Neale Donald Walsch రాసిన Conversations with God అనే మూడు భాగాల పుస్తకం, యండమూరి “సిగ్గేస్తోంది”, మల్లాది “అందమైన జీవితం”.   ఎన్ని చదివాం అనేదానికన్నా, వాటి నుంచి ఏం నేర్చుకున్నాం అనేది ముఖ్యమని నా అభిప్రాయం. 
ప్రకటనలు

4 responses »

  1. ఎదిగిన కొద్దీ ఒదగటమనేది సోమశంకర్ గారిని చూసి నాలాంటి వాళ్ళు చాలా నేర్చుకోవాలి.ఒకనాటికి తెలుగువారందరూ గర్వించేస్థాయి ఆయన చేరుకుంటారన్న నమ్మకం నాకుంది.ఈ సందర్భంగా మీ ఇద్దరికీ నా అభినందనలు.

  2. తెలుగు బ్లాగరులలో బాగా చదివేవాళ్ళను చూసాం. బాగా రాసేవాళ్ళనూ చూసాం. కొల్లూరి సోమశంకర్ గారు తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల వారికీ, ఇతర భాషా సాహిత్యాన్ని మనకూ పరిచయం చేస్తూ, ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయనకు నా అభినందనలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s