నిబద్ధతగల విమర్శ “కవనమార్గం”

సాధారణం

kavanamargamదాదాపుగా అన్ని తెలుగు పత్రికల్లోనూ సాహిత్యానికి కేటాయించే స్థలమే పరిమితమైతే అందులో విమర్శకూ పుస్తక సమీక్షలకూ ఇవ్వజూపుతున్న ప్రదేశాన్ని గమనిస్తేనే ఆ ప్రక్రియలపట్ల సంపాదకులకున్న గౌరవం తెలుస్తుంది. నిజానికి పుస్తక సమీక్ష ప్రక్రియ కాస్తా పుస్తక పరిచయంగా ఎప్పుడో మారిపోతే, ఇప్పుడైతే స్వీకారం (స్టాంపు సైజులో పుస్తకపు ముఖచిత్రం, దాని దిగువున రచయిత, ప్రచురణకర్త, ధరల వివరాలు ఇవ్వడం) వరకు దిగజారింది. ఇలాంటి అరుదైన సమయంలో థింసా వెలువరించిన “కవనమార్గం” అనే కవిత్వ పరిచయాల, పరామర్శల వ్యాస సంపుటి చదవడం నిజంగా ఎంతో మేధనిస్తుంది.

ప్రకృతిని అనుకరించేది జీవితమైతే, జీవితాన్ని అనుకరించేది సాహిత్యం. సృజనశీలురైన సాహిత్యకారులు జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించగలిగితే జీవన గమన సూత్రాలను వారు అక్షరీకరిస్తారు. వాటిని ఆకళించుకున్న పాఠకులు ఆ చలనసూత్రాలను తమకు అన్వయించుకుని తమ జీవనాన్ని సుఖవంతం, సరళతరం చేసుకుంటారు. సృజనశీలురు, పాఠకులకు మధ్య వంతెనలాగా విమర్శకుడు తన బాధ్యతలను నెరవేర్చాలి. జీవితాన్ని రచయిత పరిశీలిస్తున్న తీరును అంచనా వేయాలి. ఇంకెలా చూస్తుండాలో హెచ్చరించాలి. అదే సమయంలో పాఠకుడికి రచనను మరింత సునిశితంగా అధ్యయనం చేయడానికి సహకరించాలి. ఇలా పదునైన రెండంచుల కత్తిని ఒడుపుగా నిర్వహించగలిగిననాడు ఆ విమర్శకుడి వల్ల అందరికీ హితవు చేకూరుతుంది. దీనికి పూర్తి భరోసానిస్తూ కవులకూ, పాఠకులకూ థింసా తన “కవనమార్గం” సిద్ధం చేశారు.

 తనకు దొరికినంత జాగాలో విస్పష్టంగా తన అభిప్రాయలను వ్యక్తీకరించిన థింసా సమాజంపట్ల, బతుకుపట్ల, రచనపట్ల, సాహిత్య ప్రయోజనంపట్ల, నిర్దిష్టమైన, ప్రగతిశీలమైన అంచనాలున్న విమర్శకుడు. అందుకే 36 వ్యాసాలు చదువుతున్నపుడు అవన్నీ ఒకదానికొకటి పొడిగింపుగా, ఒకే విషయానికి అంశాల చేర్పుగా అనిపిస్తుంది. ఒకే కాన్వాసుమీద చిత్రించిన భాగాల చిత్రంగా కనిపిస్తుంది. కవులు శాశ్వత ప్రతిపక్షం అని గుర్తుచేస్తున్న విమర్శకుడు నిత్యం ప్రజల పక్షం వహిస్తాడని స్పురిస్తుంది. దానికి కావలసిన ముడిసరుకు నడుస్తున్న సమాజాన్ని అధ్యయనం చేయడమేనని హితవు తలకెక్కుతుంది.

తానందుకున్న ప్రతి కవితా సంపుటాన్ని జాగ్రత్తగా, ప్రేమగా చదవడం పూర్తిచేశాక సాహిత్య చరిత్రలో ఆ కవి స్థానాన్ని (కొన్నిసార్లు ఆ కవి దృష్టికోణాన్ని) అంచనావేసి, తన కవిత్వానికి ఎంచుకున్న వస్తువును పరామర్శించి (సార పరీక్ష చేసి), ఆ వస్తువును ఎస్టాబ్లిష్ చేయడానికి వాడిన పదచిత్రాలను, భాషను (రూప నిర్ధారణ) పరిశీలించి, పలుమార్లు మననం చేసుకోదగ్గ కొన్ని మాటల్ని ఉటంకించడం వరకూ ఆ కవినీ, కవిత్వాన్ని, ప్రగతిశీల దృక్పథంతో అవగహన చేసుకోవడానికి పాఠకునికి సహకరిస్తారు. అనంతరం ఆ కవికి, ఆ మార్గంలో కొత్తగా కలం పట్టబోతున్న యువ పాఠకులకు వేటిని పరిహరిస్తే కవిత్వం మరింత ప్రయోజనకరం కాగలదో అందుకు సంబంధించిన సూచనలందించడంతో సమీక్ష ముగుస్తుంది. పేజీలు ఎక్కువైనా (నాళేశ్వరం శంకరం ‘దూదిమేడ’పై 12 పేజీల సమీక్ష), తక్కువైనా (వడ్డెబోయిన శ్రీనివాస్ ‘ముఖచిత్రం’పై ఒకటింపావు పేజీ పరిచయం) అన్ని వ్యాసాలూ ఇలాగే కొనసాగుతాయి.

ఈ విమర్శా వ్యాసాల సంపుటి ఆశారాజు ‘సర్వాంతర్యామి’తో ప్రారంభమవుతుంది. రెండో వ్యాసం కూడా అతనిదే అయిన ‘సారంగి’ని పరిచయం చేస్తుంది. ఈ రెండు సమీక్షలు కాక, ఆసారాజు ‘బద్నాం’కు థింసా రాసిన ముందుమాట 35వ వ్యాసంగా వుంది. ఈ మూడింటినీ కలిపి చదవడం హైదరాబాద్ ప్రేమికుడు ఆశారాజు సమగ్ర సాహితీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోవడానికి తోడ్పడుతుంది. అలాగే ఇందులో మరికొన్ని వ్యాసాల సాయంతో కందుకూరి శ్రీరాములు గురించి ఓ అంచనాకు రావచ్చు. ప్రపంచీకరణ తెస్తున్న విపరిణామాలు, దానికి పాలకవర్గం హింసద్వారా ప్రజామోదాన్ని పొందేట్టు చేయడం, దానివల్ల లుప్తమవుతున్న సామాజిక ప్రమాణాలు, ఈ రంధిలో పడి దిశానిర్దేశం చేసుకోలేని మధ్యతరగతి మానవుడు ఎటు పోతున్నాడో తెలియకుండా కొట్టుకుపోవడం ఆధునిక జీవనంలో అనివార్యమైన మార్పులు. ఈ ‘ఛేంజ్ మేనేజ్ మెంట్’ లో కవుల పాత్ర కీలకమైంది. ఈ అవసరాన్ని, వారు నిర్వర్తించవలసిన బాధ్యతలను థింసా దాదాపు ప్రతి వాక్యంలోనూ గుర్తు చేస్తారు. ఈ మార్పులను విశ్లేషించుకోగలగడం, ప్రజా వ్యతిరేకమైనవాటిని తిప్పికొట్టగలగడం, ప్రజానుకూలంగా మార్చుకోగలగడం, ఇందుకు ప్రజలను సన్నద్ధం చేయగలగడం మన అవగాహనలోకి రావాలి. ఇదంతా వ్యష్టిగా, సమష్టిగా జరగలని కవులు కోరుకుంటారు. అపుడే పేనిన తాడులా మనిషి బలవంతుడవుతాడు. అందుకే పద పదమూ ప్రమత్తత అవసరమని థింసా ఘోషిస్తారు. ఆ చెప్పడమన్నది ఈయన కవికూడా కావడంవల్లనే ఓర్పుతో అనునయంగా చెప్పడం మనం గమనిస్తాం.

‘కవనమార్గ’మంతా అల్లుకుంటూ పరిమళించిన అనేక భావాలలో రూపసారాల చర్చ ఒకటి. రూపసారాల గురించి ఎంత చెప్పినా కృష్ణమూర్తి యాదవ్ పై రాసిన స్మృతివ్యాసం ‘నెనరు-నెమరు’ లో చెప్పిన ఈ మాట తర్వాత ఇంకా వివరణ అనవసరమేమో! ‘ఏ ఆధునిక కనీ ముందు రూపచట్రాన్ని నిర్మించుకుని అందులో ఆధునిక జీవితాన్ని వస్తువుగా ఇరికించడు. వస్తువును వ్యక్తపరిచే క్రమంలో కవిత్వరూపం రూపుదిద్దుకుంటుంది. వస్తువును రూపించే క్రమంలో ప్రతీకలూ, భావ ప్రతిమలూ, పదచిత్రాలూ, భాష కవి ప్రతిభనుబట్టి, ప్రాపంచిక దృక్పథాన్నిబట్టి పనిముట్లుగా అందివస్తాయి‘ (పే. 27). నిర్మొహమాటత్వం థింసా బలమైన బలహీనత. ‘అల్పపీడనం’ కవి పైడి తెరేష్ బాబును పరిచయం చేస్తూ ఆత్మగౌరవ వ్యక్తీకరణ ప్రయత్నంలో దళిత ధిక్కారస్వరం తెరేష్ బాబుది ఎంత ప్రతిభావంతమైన ప్రయత్నమో చెప్తూనే అతడి దళిత గజల్స్ సాహసంలో పరిణతిలేదని చెప్తారు (పే. 46). పద్మారావు ‘నీలికేక’ను మనసారా మెచ్చుకుంటూనే అతి వైభవీకరణ (గ్లోరిఫికేషన్) దళిత జీవన వాస్తవాలను మేలిముసుగు వేసి మరుగుపరిచే ప్రమాదముందని హెచ్చరిస్తారు (పే. 43). ఈ వ్యాసంలో పద్మారావు వాడిన అలోచనాత్మకమైన ‘కత్తి ప్రయాణం చేయలేనంత దూరం / కరుణ ప్రయాణం చేస్తుంది‘, ‘సృజనానికి రమ్యమే కాదు / గమ్యం కూడా కావాలి‘ లాంటి మాటలు చకచకా గుర్తు చేశారు. గాఢాబివ్యక్తిని అడుగడుగునా దర్శింపజేయించే కవి నాళేశ్వరం శంకరం ‘దూదిమేడ’పై విపులమైన వ్యాసం కవి కవిత్వంపైనా మొత్తంగా తెలుగు కవిత్వంపైనా కొత్త వెలుగును ప్రసరించి తీరుతుంది.

‘కవికి కవిత్వం ఉబుసుపోని ఉత్తుత్తి కబుర్లు కాదు. ఒక జీవన్మరణ సంఘర్షణ. నిత్యావసర దినుసే కాదు. ఒక మానసికావసరం. ఒక ధిక్కారస్వరం. ఒక పదునైన శస్త్రం. ఒక సాహస చర్య‘ (పే. 20). ఈ మాటలు “పీఠభూమి”కి ముందుమాట రాస్తూ కందుకూరి శ్రీరాములు గురించి అన్నవే కావచ్చు. కాని ప్రతిసృజనశీలునికీ అన్వయించేలా వారి కృషి సాగాలి. విమర్శకుడిగా థింసా మాత్రం అలాగే ఈ వ్యాససంపుటిలో సాహితీ వ్యవసాయం సాగించేరు.

కవులకు, కొత్తగా కలం పట్టే వీరులకు ఉపయుక్తంగా ప్రతి వ్యాసం చివరా చేసిన సూచనలు విలువైనవి. సంస్కృత పదాలపై వ్యామోహం వదులుకోవలని కందుకూరి శ్రీరాములుకు చెప్పినా (పే.17), కవితా శీర్షికల ఎంపిలలో జాగ్రత్త గురించి కృష్ణమూర్తి యాదవ్ కు సూచించినా (పే. 25), వెటకారపు మాటలూ, వేళాకోలపు మాటలూ, అశ్లీల పదాలూ పరిహరించాలని ప్రసాదమూర్తిని కోరినా (పే. 53), పురాణ ప్రతీకల్ని తగ్గించమని జూపల్లి ప్రేంచందుకు హితవు పలికినా (పే. 58), చెప్పాలనుకున్న ప్రతి విషయాన్నీ కవితామయం చేయాలనే తపనలో ఎడిటింగ్ చేసుకోవడం ద్వారా జాగ్రత్త పడకపోతే కావ్యంలో బిగుతు కొరవడుతుందని కె.సుదేరాకు చెప్పినా (పే. 73) అవి ఆయా కవులనే ఉద్దేశించినవి కావని గమనించాలి. కవులంతా మనసుకు పట్టించుకోవాల్సిన అపురూపమైన మాటలివి. ఇస్మాయిల్ అనువాద కవిత్వం ‘రెండో ప్రతిపాదన’ను సమీక్షిస్తూ కవిని నీరోతో పోలుస్తారు. ఈ వ్యాసం చదువుతుంటే విశ్వనాథపై రా.రా. విరుచుకుపడిపోవడం గుర్తుకొస్తుంది. కాని, ఇస్మాయిల్ పై సాఫ్ట్ కార్నరున్న ‘కవనమార్గ’పు ముందుమాటకారుడు వి.వి. ఆ సంకలనం తప్ప మరేం దొరకలేదా అని అంటారు.

ఇక ఈ వ్యాసాలన్నీ అమర్చిన క్రమం అంతు చిక్కనిది. అలా కాకుండా అచ్చయిన తేదీల క్రమంలోనో, కవిత్వ సంపుటాల శీర్షికల అక్షరాది క్రమంలోనో, ఆయా కవులపేర్ల అక్షరాది క్రమంలోనో ఏదో ఒక క్రమం పాటిస్తే సాహిత్య విద్యార్థులకు ఉపయుక్తంగా వుండేది. చివర కొన్ని వ్యాసాలలో ఎవరి కవిత్వం గురించిన వ్యాసమో అంత తొందరగా అంతుచిక్కదు. ఉదాహరణకు కె. సుదేరా ‘పొలికేక’పై నాలుగు పేజీల సమీక్షా వ్యాసంలో రెండున్నర పేజీల తర్వాత ఆ వ్యాసం ఫలనా కవిత్వంపైనని తెలుస్తుంది. ఎంత విశ్లేషణాత్మక వ్యాసాలైనా చాలా పొడువైన ఇంట్రోలయి కూర్చున్నాయి. అస్తిత్వ వాదనలపట్ల, ఆత్మగౌరవ వ్యక్తీకరణల పట్ల, ధిక్కార స్వరాల పట్ల, దోపీడీ వివక్షల వ్యతిరేకతల పట్ల వెరసి వీటి అభివ్యక్తీకరణల పట్ల అచంచలమైన విశ్వాసం, అపారమైన సానుభూతిని కనపరుస్తూనే ఈ ధోరణులు సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తున్నాయని థింసా ఆందోళన చెందుతున్నారు. ఇది ఆయన ఆలోచనలోని సారభూత పార్శ్వం. పే. 19లో “నిజానికి ఈ గుర్తింపు రోదనలూ అస్తిత్వ ఖేదనలూ రూపంలో అధికారాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నించి గళ్లాపట్టి నీలదీసేవిగా మనకు కనిపిస్తుంటాయి గాని, సారంలో మాత్రం పాలకవర్గాల కొమ్ము కాస్తుంటాయి. రాజ్యాన్ని ధృడపరుస్తుంటాయి. రాజ్యహింసని ధృవపరుస్తుంటాయి. సామూహిక సామాజిక చేతనని తమంతట తామే ముక్కలుగా తెగ నరుక్కుని, తుంపులు తుంపులు చేసుకుని..” అని రాశారు. దీనికి కొనసాగింపుగా అన్నట్టుగా పే. 56లో “గుర్తింపు రాజకీయాల కెరీరిస్టు ధోరణి ప్రబలి, ప్రెజర్ గ్రూప్ పాలీట్రిక్సుకీ కవిత్వ రంగం ప్రభావితమైంది. మనిషిని సమూహాన్నుంచి విడదీసే వైయక్తిక వాదాన్ని ఈ గుర్తింపు రాజకీయాలు బలంగా ప్రేరేపించాయి” అంటారు. దీని గురించి థింసా మరొక విపులమైన వ్యాసం రాస్తే బాగుణ్ణు. బలంగా, సూటిగా వాదన వినిపించగల విమర్శకుడు ఈ విషయంపై నాబోటి నూతన సాహిత్య అధ్యయనపరులకు కొత్త వెలుగు ఇచ్చినట్టవుతుంది.

ఇంకొక మాట – పే. 36లో “మాయమైన బిడ్డలకోసం, కనుమరుగు చేయబడిన ఆత్మీయులకోసం తెలంగాణలోని తల్లుల నిరంతర రోదన అన్య ప్రాంతీయుల అనుభవంలోకి వచ్చేది కాదు” అంటారు. కాని, రాజ్యహింస తెలంగాణకే పరిమితం కాదని థింసా గుర్తించాలి. ప్రజలున్న చోటల్లా విస్తరించిన రాజ్యహింసకు వ్యతిరేకంగా జరిపిన ప్రతిఘటనలో తెలంగాణ వెలుపల అసువులు బాసిన అమరులను మరచినట్టవుతుంది. అయితే చైతన్యవంతమైన తెలంగాణ మాగాణిలో దానికి వ్యతిరేకంగా జరుగుతున్న రాజ్యహింసలో ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోవడాన్ని, ఆ దు:ఖభరిత గాధలను ప్రతిభావంతంగా తెలంగాణ కాల్పనిక సాహిత్యంలో సమర్థంగా వ్యక్తమవడాన అది అందరమూ చదివి అనుభూతం చెంది గుండెకోతకు గురవుతున్నాం. 36 వ్యాసాలు చదివాక నన్ను బాధించిన అంశం, ఏ ఒక్క కళింగాంధ్ర కవి కవిత్వమూ థింసాకు ఎదురవ్వకపోవడం.

థింసా ‘కవనమార్గా’నికి దారినిస్తూ వరవరరావు రాసిన ‘నడవాల్సిన బాట’ ఈ వ్యాసాలను చదవడంలో, జీర్ణించుకోవడంలో ఎంతగానో సహకరిస్తుంది. “ఇప్పటి కవిత్వం అందంగా, రసాత్మకంగా ఉంటేనే సరిపోదు. జీవితంపట్ల, జీవన వైరుధ్యాలపట్ల చదువరికి ఎరుకని కలిగించి భవిష్యత్తుపై ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగిస్తూ చీకట్లోంచి వెలుగులోకి నడిపించేదిగా ఉండాలి” అని పే. 95లో థింసా అంటారు. ఈ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఈ “కవనమార్గం” సృజనశీలురతోపాటు సాహిత్య విద్యార్థులంతా తప్పక అధ్యయనం చేయాల్సిన పుస్తకం.

(ఈ వ్యాసం ఆగష్టు, 2008 “ప్రజాసాహితి” సంచికలో ప్రచురితమైంది.)

ప్రకటనలు

One response »

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s