మన చదువులు చంపేందుకా?… బతికించేందుకా?

సాధారణం

chaduvulaa1‘ఆంధ్రజ్యోతి’ సచిత్ర వారపత్రికగా మూతపడ్డాక రోడ్డున పడిన అనేకమంది జర్నలిస్టులలో నామిని ఒకరు. డయాస్పోరా సాహిత్యాన్ని, నోస్టాల్జియా కొసమెరుపుతో తెలుగు సాహిత్య వినువీధుల్లో ఒక నూతన ట్రెండును సృష్టించిన ఘనుడు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు. నామిని స్కూల్ సంప్రదాయపు తెరలేపిన రచయిత ఉద్యోగంలేని రోజుల్లో పిల్లల చదువులపై దృష్టి కేంద్రీకరించారు. “ఇస్కూలు పిలకాయల కత“, “పిల్లల భాషలో ఆల్జీబ్రా” అనే రెండు పుస్తకాలను ప్రచురించారు. చదువుతున్న చిన్నారులపై సిలబస్ పేరుతో, మార్కులతో, ర్యాంకులపేరుతో ఎంత వత్తిడి మోపుతున్నామో జాగ్రత్తగా పరిశీలించిన నామిని విద్యారంగంపై తన మూడో పుస్తకం “చదువులా? చావులా?”ను ప్రచురించారు. ఆ పుస్తక పరిచయం ఈ వారం… 

పిల్లలు తాము ఎదుర్కొంటున్న మానసిక వత్తిడిని భరించలేక అనేక రకాల వ్యాధులబారిన పడుతున్నారు. కొంతమంది యువతీ యువకులు ఈ వత్తిడివల్లే శాడిస్టులుగా మారి తమ ఇళ్లలో తల్లిదండ్రులను, చిన్నపిల్లలను, బయట మిత్రులను అనేక రకాలుగా హింసిస్తున్నారు. మితిమీరిన వత్తిడివల్ల ఏటికేడాది ఎంతోమంది ముక్కుపచ్చలారని బిడ్డలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పదవ తరగతి, ఇంటర్, ఎంసెట్ పరీక్షల ఫలితాలు వస్తున్నాయంటే గుండెదడ పట్టుకుంటోంది. మరునాడు విద్యార్థినీ విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు ఎన్ని చదవాల్సి వస్తుందోనన్న బెంగతో. ర్యాంకుల రేసులో కార్పొరేట్ కాలేజీల వికృతాలు పెరిగిపోయిన తరువాత ఇంటర్ చదువులతోనే తనువులు చాలిస్తున్న యుక్తవయస్కు లెందరో. ఇవన్నీ కనీవినీ ఎరిగీ నామిని తన “చదువులా? చావులా?” వ్యాసాలను సంకలనం చేశారు.

చిన్నారులు ఎనిమిదో తరగతి చదువుతుండగానే వారికి ఐఐటి సీట్ల గురించి, ఎంసెట్లో రెండంకెల ర్యాంకుల గురించి కలలు కనే తల్లిదండ్రుల నైజాన్ని ‘పిల్లలమీద తల్లిదండ్రుల మోజు‘ అనే మొదటి వ్యాసంలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పదవ తరగతి చదువుతున్న సంధ్యన్న మాట తల్లిదండ్రులందరికీ కనువిప్పు కలిగించాలి. ‘మా అమ్మ సంగతి నాకు బాగా తెలుసంకుల్. నా ప్రాణం తీసేదాకా మా అమ్మ మంచినీళ్లు కూడా ముట్టదు‘. ముత్యాల్లాంటి పిల్లలు బతికుంటేనే కదా, మన జీవనదీపాలను చూసుకుని తరించేది. ఎందుకు వాళ్ల కెరీర్ పట్ల మనమంత ఆతృత పడడం? ఈ పిచ్చి పరుగు ఎటు దారితీస్తుందో కదా!

మనస్తత్వవేత్తలు ఎంత అరిచిగీపెట్టి చెప్పినా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పట్టించుకోని మరో సంగతి – పోల్చడం. తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న మంచి ర్యాంకు సంపాదించుకున్న తోటి పిల్లలతోనో, బంధువుల పిల్లలతోనో తమ పిల్లలను పోల్చడం ఎంత హీనమైన పని! ఇతరులతో పోల్చి తమను ఎంత నీచంగా చూసినా, నిరంతరం తల్లిదండ్రులను ప్రేమించే పిల్లలు మాత్రం అదే పాడుపని చేయరు. ‘ఒక క్లర్కు పిల్లలు ఆఫీసరును చూపించి, ”ఆయనను చూడు ఎంచక్కా ఆఫీసర్. నీవేమో క్లర్కువి. నీకొచ్చే జీతం థూ నాశనం!” అని పలుచన చేస్తారా? ఏ కూతురయినా జయసుధవైపో, రాధికవైపో చూపించి “నువ్వెందుకలా కాలేకపోయావమ్మా?” అని తల్లిని నిలదీస్తారా? అతిశయంతో, మిడిసిపాటుతో వున్న తల్లిదండ్రులు మాత్రం అన్ని విషయాల్లోనూ తమ పిల్లలను ఇతరుల పిల్లలతో పోల్చి చూపడమే కాకుండా – ఘోరంగా మాట్లాడేస్తారు కూడా! ఈ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు బుద్ధి వచ్చేదెన్నడు?

ఇక అమ్మానాన్నలు తమ పిల్లల కెరియర్ పేరుతో సాగిస్తున్న చిత్రహింసకు, కొత్త అడ్మిషన్లకోసం బడిలో ఉపాధ్యాయులు పెట్టే నరకలోకపు రంపపుకోతకు తోడైతే చెప్పేదేముంది? గొడ్డును బాదినట్టు బాదడం అటుంచి, ఆత్మహత్యకు పురికొల్పేలా బూతులు తిట్టడం వరకూ నివారించడం ఎవరి చేతిలోనూ పని. పిల్లవాడి మానసిక, శారీరక సామర్ధ్యాలు ఉపాధ్యాయుడి కనవసరం. కావల్సిందల్లా మార్కులు. పిల్లవాడి సమగ్ర వికాసం అతడి కవసరం లేని విషయం. కావల్సింది ర్యాంకులే. చదువుకాక ఇతర లలిత కళలు, క్రీదలపట్ల పిల్లలకున్న అనురక్తి, అభినివేశాలు టీచర్లకనవసరం. కావల్సిందల్లా మార్కులే. అదీ నూటికి నూరు. దానికోసం ఎంతకైనా తెగిస్తాడు. ఇరవై నాలుగ్గంటలూ పిల్లలను బడిలోనే ఉంచేయగలడు. ఒక్కో ప్రశ్నా చేతులు వాచిపోయేలా కాపీ రాయమనగలడు. గుంజీలు తీయమనగలడు. గోడకుర్చీలు వేయించగలడు. వీపుమీద దబీదబీమని పిడిగుద్దులు గుద్దగలడు. బూతులు తిట్టగలడు. మేష్టారు పోలీసు కాగలడు. పాపం పిల్లవాడు నేరస్తుడు కాగలడా? లేడు.

ఈ పాప పన్నాగంలో తల్లిదండ్రులూ ఉపాధ్యాయులే బాధ్యులు కారు. పిల్లలు చదువుకునే సిలబస్ రూపకర్తలు కూడా భాగస్వాములేనని మరో వ్యాసంలో వివరిస్తారు నామిని. పదిహేను, పదహారేళ్లకు వచ్చిన యుక్త వయసు అమ్మాయిలు, అబ్బాయిలకు తెలియని ద్రోహం చేస్తున్న మరి రెండు విషసర్పాలు సినిమా, టీవీలు. ఇక నామిని ఈ పుస్తకంలో లెక్కలు, భౌతికశాస్త్రం ఎంతబాగా చెప్తారంటే… చిన్న ఉదాహరణ –

మునక్కాయ ముప్పావలా లెక్కన వొక ముసలవ్వ వీధిలో మునక్కాయలమ్ముతోంది. ఒక బీదరాలు ఆ అవ్వదగ్గర మూడు మునక్కాయల్ని కొనుక్కుంది. ముసలవ్వ చేతిలోకి రెండుంపావలా, బీదరాలి చేతిలోకి మూడు మునక్కాయలూ చేరిపొయ్యాయి. చదువూ సంధ్యాలేని వాళ్లిదరి మధ్యా భిన్నాలకు సంబంధించిన వొక పెద్దలెక్క గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. 3/4*3=2.25 మూడో మనిషికి తెలీకుండా జరిగిపోయిన ఈ లెక్క ఎగురుకుంటూ స్కూలుకు వచ్చిందనుకోండి. ఒక బోర్డూ, చాక్ పీసుల బాక్సూ, వొక పుస్తకమూ, నాలుగు బెత్తాలూ, వొక డిగ్రీ హోల్డరూ… శవంపడిన ఇల్లు మాదిర్తో ఏడుపులూ, పెడబొబ్బలూ..!” ఇన్ని బాధలు పెట్టి మనం సాధించేదేమిటి? పిల్లల్లో నిజంగా ఆ తెలివే వుంటే వారే రాణిస్తారు. అయినా ఈ సువిశాల ప్రపంచంలో రెండే రెండు ప్రొఫెషన్లు వున్నాయా? ఇంజనీరు, డాక్టరు తప్పితే మరి ఉద్యోగాలు లేవా? మరే ఇతర వృత్తులూ, వుద్యోగాలలో ఆదాయం రాదా? సంతృప్తి లభించదా? ఆరు నెలలపాటు మన చుట్టాలదగ్గర మనకు పెద్దగొప్ప – మన పిల్లలకు మంచి ర్యాంకులు వస్తే. ఈ వత్తిడి తట్టుకోలేక వారు చనిపోతే జీవితాంతం కుళ్లికుళ్లి చావాలి. ఈ సంగతి ఎందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభువులు ఆలోచించరు? ఈ పుస్తకాన్ని నామిని ఈ మాటలతో ముగిస్తారు. “మనం చచ్చిపోయాక మనమీదపడి మన బిడ్డలు ఏడిస్తే కదా మన శవాలు సంతోషించేది! ఈలోగానే మనం తొందరపడిపోయి మన కళ్లముందే పిల్లల్ని చంపుకునేసి వాళ్ల శవాలమీద పడి మనం ఏడ్చేయడం తప్పుగదా!“. 

ఇంత సీరియస్ సంగతులన్నీ హాయిగా నవ్వించే భాషలో చెప్పుకొచ్చారు నామిని. టామ్ సాయర్ బుక్స్ పేరిట వెలువడిన ఈ ఎనభై పేజీల పుస్తకం లాంటి కనువిప్పు సంగతుల “చదువులా? చావులా?” ఖరీదు ఇరవై రూపాయలే. మరి మీరూ చదువుతారుగా?

ప్రకటనలు

5 responses »

 1. ఈ పుస్తకం చదివాక, పిల్లల పరిస్థితి ఇప్పుడే ఇలా ఉందంటే ఇక ముందు ఎలా వుంటుందో అని ఒక నిరాశ కలగక మానదు. పిల్లల మనసుల్లో దూరి వాళ్లని నామిని అర్థం చేసుకున్న తీరు పాఠకుల్ని కదిలిస్తుంది.

  ఈ పుస్తకాన్ని నామిని రాయడం పూర్తయ్యాక ఒక పదో క్లాసు విద్యార్థినికనుకుంటా ఇచ్చి ఏం పేరు పెట్టాలో ఆలోచించమంటే ఆ పాపే “చదువులా చావులా” అని పెట్టండి అంకుల్” అని చెప్పిందట. ముందు మాటలో రాశారు. ఆ మాట కూడా మీరు రివ్యూ లో పేర్కొని ఉంటే బాగుండేదనిపించింది రవి గారు!

  ఒక ప్రముఖ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న మా బంధువుల పాప(డే స్కాలర్) కి రోజూ స్కూలు వాళ్ళు తెల్లవారుజామున మూడింటికి ఇంటికి ఫోన్ చేసి నిద్ర లేపుతారు.అప్పుడు లేచి చదువు మొదలు పెట్టాలి. అరగంటకోసారి చేస్తుంటారు, నిద్ర పోకుండా చదువుతోందా లేదా అని! ఈ సంగతి చూశాక నేను ఆ తల్లి దండ్రులకు ఈ పుస్తకం ఇచ్చాను చదవమని. ఏం చేశారో తెలియదు.

 2. >>>
  మనస్తత్వవేత్తలు ఎంత అరిచిగీపెట్టి చెప్పినా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పట్టించుకోని మరో సంగతి – పోల్చడం. తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న మంచి ర్యాంకు సంపాదించుకున్న తోటి పిల్లలతోనో, బంధువుల పిల్లలతోనో తమ పిల్లలను పోల్చడం ఎంత హీనమైన పని! ఇతరులతో పోల్చి తమను ఎంత నీచంగా చూసినా, నిరంతరం తల్లిదండ్రులను ప్రేమించే పిల్లలు మాత్రం అదే పాడుపని చేయరు. ‘ఒక క్లర్కు పిల్లలు ఆఫీసరును చూపించి, ”ఆయనను చూడు ఎంచక్కా ఆఫీసర్. నీవేమో క్లర్కువి. నీకొచ్చే జీతం థూ నాశనం!” అని పలుచన చేస్తారా? ఏ కూతురయినా జయసుధవైపో, రాధికవైపో చూపించి “నువ్వెందుకలా కాలేకపోయావమ్మా?” అని తల్లిని నిలదీస్తారా?
  >>>
  అది భయం వల్ల కూడా కావచ్చు. చిన్నపుడు నేను కూడా నా తల్లితండ్రుల వల్ల ఎన్నో బాధలు పడ్డాను కానీ ధైర్యం లేక చేతకాని వాడిలా నోరుమూసుకునే వాడ్ని.

 3. బండ మోసేవాడికే తెలుస్తుంది బండ బరువెంతో. ఆ విషయం తల్లి తంద్రులకి తెలియక పోతే వాళ్ళు ఆ పుస్తకాన్ని ఏ మూలనో పడేసే అవకాశం ఉంది. చిన్నప్పుడు నేను స్కూల్ పుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు చదివితే మా నాన్న లాక్కునేవాడు లేదా చింపేసేవాడు. ఆ పుస్తకాలు చదివితే నీకేమొస్తుందిరా అంటూ తిట్టేవాడు. వీళ్ళ దృష్టిలో పిల్లలకి స్కూల్ చదువు తప్ప అన్ని అనవసరమే. మనం చదివే బండ చదువులు మనకి సంస్కారం నేర్పవు. అందుకే చదువుకున్న తండ్రులు కూడా తమ పిల్లల్ని బెల్టుతో కొట్టి తాము సంస్కార హీనులమని నిరూపించుకుంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s