మారకపోతే మరుగున పడతాం!

సాధారణం

whomovedmycheeseఒక పిట్టకథలాంటి కథనం లక్షలాది ప్రతులు అమ్ముడుపోయింద0టే విడ్డూరమే. డాక్టర్ స్పెన్సర్ జాన్సన్ రాసిన చిన్న పుస్తకం ‘హూ మూవ్డ్ మై ఛీజ్?’ ఒక్క అమెరికాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రతి ఆదివారం ప్రచురించే బెస్ట్ సెల్లర్స్ లిస్టులో బిజినెస్ విభాగంలో దాదాపు ఐదేళ్లపాటు నిలిచిందంటే ‘పిచ్చి అమెరికన్లు’ అనుకోగలం. ‘అమెరికా కామెడీ అర్థమైతేనే గాని నవ్వలేం’ అనుకోగలం. కాని చైనాలో కూడా రెండు మిలియన్ కాపీలకు పైగా అమ్ముడుపోయిందంటే అందులో ఎంతో కొంత విషయముందనే అర్థం. నేనేమీ చైనా భక్తుడిని కాను గానీ, ఇదే పుస్తకం ఇండియాలో వెర్మిలియన్ ప్రచురణ సంస్థ కూడా లక్షల ప్రతులు అమ్మిందంటే మనం కూడా ఈ పుస్తకాన్ని సీరియస్ గానే తీసుకోవచ్చు. ఈ వారం “హూ మూవ్డ్ మై ఛీజ్?” పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.

ఛీజ్ అంటే దూడను కన్న కొద్దిరోజులపాటు గేదె లేదా ఆవుపాలతో తయారుచేసే జున్ను. ఈ చిన్న పుస్తకంలో జున్ను ఒక ప్రతీక. మనం పొందాలనుకుంటున్న ఉద్యోగానికి, కొనాలనుకుంటున్న వస్తువులకు, నిలుపుకోవాలనుకుంటున్న సంబంధానికి ప్రతీక. జున్నును పెద్ద ఎత్తున చేసేవారు దానిని జాలీ(మేజ్)ల్లో ఉంచుతారు. ఆ మేజ్ ను అనేక దార్లున్న పజిల్ గా రచయిత ఈ నవలలో చూపిస్తాడు. ఆ మేజ్ మనం ప్రస్తుతమున్న పరిస్థితులకు ప్రతీక. నవలలో వుండే నాలుగు పాత్రలూ మనకు ప్రతీకలు. ఆ నాలుగు పాత్రలూ మనలో ప్రతి ఒక్కరిలోనూ నాలుగు భాగాలుగా వుంటాయి. కొన్ని తత్వాలు కొన్ని పరిస్థితుల్లో బయటపడుతూ వుంటాయి.

స్నిఫ్, స్కరీ అనే రెండు ఎలకలు, హెమ్, హా అనే పేర్లున్న ఇద్దరు లిల్లీపుట్ మనుషుల్లాంటి జీవాలు ఒక పెద్ద మేజ్ లో నివశిస్తుంటాయి. ఎలకలు ఒక గుంపుగా, లిటిల్ పీపుల్ మరో జట్టుగా ఆ చోటులో జున్నుకోసం వెతుకుతుంటాయి. జ్ఞానం పెద్దగాలేని ఎలకలు ఒద్దికగా వచ్చిన దారిని గుర్తుపెట్టుకుంటూ మొత్తానికి జున్నువున్న చోటును పసిగడతాయి. త్వరలోనే హెమ్, హాలు కూడా అక్కడకు చేరుకుంటారు. ఎలకలు పెందలకడనే ఆ ‘ఛీజ్ స్టేషన్ సి’ని చేరుకుని, బూట్లు లేసులతో దగ్గరగా కట్టుకుని మెడలో వేసుకుంటాయి. మిగతా ఇద్దరూ బూట్లు ఎటో విసిరేస్తారు.

ఒకరోజు తెల్లవారి నలుగురూ జున్ను తిందామని వెళ్ళేసరికి జున్ను వుండదు. మాయమైపోతుంది. స్నిఫ్, స్కరీలు పెద్దగా ఆశ్చర్యపోవు. ఈ మధ్య కాలంలో జున్ను పరిమాణం, రుచి తగ్గడం గమనిస్తాయి. ఏదో ఒకరోజు జున్ను లభ్యం కాదని ముందే పసిగట్టి వెంటనే ఇంకెక్కడ జున్ను దొరుకుతుందోనని వేటకు బయల్దేరి వెళ్లిపోతాయి. కానీ తాము రోజూ జున్ను తినే చోట ఖాళీగావుండడం చూసి హెమ్, హాలిద్దరూ నివ్వెరపోతారు. ఇద్దరూ కోపంతో చిందులు తొక్కుతారు. విసుక్కుంటారు. తమ జున్ను ఎవరో దొంగలించారని గట్టిగా అరుస్తారు. ఇక్కడ వుండాల్సిన జున్ను ఎటు పోయిందని ఆందోళన చెందుతారు. మొత్తానికి ఆ రోజంతా ఆకలితోనే గడుపుతారు.

బయటకు వచ్చిన స్నిఫ్, స్కరీలు వెతుక్కుంటూ వెతుక్కుంటూ కొత్త ప్రదేశం ఛీజ్ స్టేషన్ ఎన్ చేరుకుంటాయి. తాజా జున్ను దొరుకుతుంది. కాని, ప్రతిరోజూ జున్ను తినేముందర క్షుణ్ణంగా పరిస్థితులను పరిశీలిస్తుంటాయి. కాని లిటిల్ పీపుల్ ధోరణి మారదు. ఇంకా ఎవరో అదేచోటులో జున్నును పెడతారని ఆశరో ఎదురుచూస్తుంటారు. ఆకలికి తాళలేక హా అక్కడనుంచి బయటపడతానని చెప్తుంది. కాని, అందుకు హెమ్ ఒప్పుకోకపోవడమే గాక భయపెట్టేసరికి హా వెనకడుగేస్తుంది. కొద్ది రోజులు గడిచినా అక్కడికి జున్ను రాదు. ఆకలికి తట్టుకోలేక ధైర్యం తెచ్చుకుని హెమ్ ను విడిచిపెట్టి హా బయల్దేరుతుంది. ఆ మేజ్ లో ఒంటరిగా తిరగడానికి హా భయపడుతుంది. జున్నులేని చోట ఆకలితో పడివుండడం కంటే జున్ను దొరికినా దొరకకపోయినా జున్నుకోసం వెదుకులాట జరపడంలోనే ఆనందం వుందని తెలుసుకుంటుంది. ఒక దగ్గర జున్ను అవశేషాలు హాకు కనిపిస్తాయి. అంటే కొంచెం ముందుగా వస్తే జున్ను దొరికేది కదా అని గింజుకుంటుంది. మరింక ఆపకుండా తన అన్వేషణ కొనసాగిస్తుంది. అయితే మలుపు తిరిగిన ప్రతిచోటా, తన మిత్రుడు హెమ్ వస్తే ఆనవాలు కోసం, గోడలమీద కొన్ని వాక్యలు రాస్తుంది. ప్రతి వాక్యం ఛేంజ్ మేనేజ్ మెంట్ లో ఎంతో విలువైనదిగా, అక్కరకొచ్చేదిగా కనిపిస్తుంది.

రెండు మూడు సార్లు హాకు జున్ను అవశేషాలు దొరుకుతాయి. అందులో కొన్ని మిగులు ముక్కలు పట్టుకుని హెమ్ దగ్గరకు వెళ్లి, తనతోపాటు కొత్త ప్రదేశపు అన్వేషణకు రమ్మంటుంది. ఆ కోరికను హెమ్ తిరస్కరిస్తుంది. దాంతో తిరుగుముఖం పట్టిన హా కొద్ది రోజులకే కొత్త ప్రదేశాన్ని కనుక్కుంటుంది. అక్కడ తాజా జున్ను అపరిమితంగా దొరుకుతుంది. తన అన్వేషణ ఇప్పటికి ఫలించింది. కాస్త జున్ను ఆబగా తిని, ఆకలి తీర్చుకుని, అక్కడ ఎదురుగా కనిపించిన పెద్ద గోడమీద మరికొన్ని వాక్యాలు రాస్తుంది. అవి ఇవీ:

మార్పు తప్పక సంభవిస్తుంది.

వాళ్లు జున్నును మారుస్తూనే వుంటారు.

మార్పును వూహించు.

జున్ను ఏదో ఒకరోజు అదృశ్యమైపోతుందని తెలుసుకో.

మార్పును క్షుణ్ణంగా పరిశీలించు.

అప్పుడప్పుడు జున్ను రుచిలో మార్పు పసిగడితే, పాడైందే లేనిదీ తెలుస్తుంది.

మార్పుకు అనుగుణంగా త్వరగా మారాలి.

పాత జున్ను ఎంత వేగం అయిపోతే, అంత తొందరగా కొత్త జున్ను రుచి చూడొచ్చు.

మారాలి.

జున్ను కోసం కదలాలి.

మార్పును ఆనందంగా అనుభవించాలి.

సాహసం సేయరా డింభకా! రాకుమారి లభించును.

త్వరితంగా మారడానికి సిద్ధపడండి. మళ్లీ మళ్లీ ఆ ఆనందం పొందండి.

వాళ్లి జున్నును మారుస్తూనే వుంటారు. 

 గత అనుభవం నుంచి పాఠం నేర్చుకున్న హా ప్రతిరోజూ కొత్తగా జున్ను లభించిన ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెడుతుంది. అక్కడ అప్పటికే స్నిఫ్, స్కరీలు వుండడాం చూసి హా ఆశ్ఛర్యపోదు. ఇదిలావుండగా ఒకరోజు అక్కడ ఏదో అలికిడి అవుతుంది. ఎవరో అక్కడకు వస్తున్నట్టు వారికి అనిపిస్తుంది. ఆ వచ్చేది హెమ్ అయితే బావుండునని హా మనస్పూర్తిగా భావిస్తుంది. ఎవరు వచ్చారో రచయిత చెప్పరు. కథ అక్కడితో ఆగిపోతుంది.

ఈ చిన్న పుస్తకంలో మూడు అధ్యాయాలున్నాయి. మొదటి అధ్యాయంలో కథకుడు తన చిన్ననాటి హైస్కూల్ మిత్రులను ఒక చోట కలుసుకుంటాడు. అందరూ తమతమ జీవితాలలో జరిగిన మార్పులను ముచ్చటించుకుంటారు. అతడి స్నేహితులలో ఒకరు ఈ కథ చెప్పడం మొదలుపెడతారు. రెండో అధ్యాయమంతా పైన చెప్పుకున్న కథ వుంటుంది. ఇక మిగిలిన మూడో అధ్యాయంలో మళ్లీ స్నేహితులంతా తమ జీవితంలో మార్పు చెందాల్సిన అగత్యం ఏర్పడినప్పుడు ఎలా ప్రవర్తించారో గుర్తుకు తెచ్చుకుని తమ స్నేహితులకు చెప్తుంటారు. అంటే ఛీజ్ కనిపించక అదృశ్యమైనప్పుడల్లా ఆ నాలుగు పాత్రలలో దేనిలా ప్రవర్తించారో చర్చించుకుంటారు.

మొదట 1998లో విడుదలైన ఈ పుస్తకం అమ్మకాలలో సంచలనం సృష్టిస్తుండగా రచయిత ఇదే కథను స్వల్ప మార్పులతో పిల్లలకు, యుక్తవయస్సు వారికి రెండు పుస్తకాలు విడిగా రాశాడు. దీనిని ప్రేరణగా తీసుకుని మరికొంతమంది రచయితలు మరెన్నో పుస్తకాలు రాశారు. ఉదాహరణకు మన తెలుగు సినిమాల పేర్ల విషయంలో ఒకసారి దొంగ హిట్టయితే అడవిదొంగ, మంచిదొంగ, జేబుదొంగ, దొంగలకు దొంగ, దొంగమొగుడు లాంటి టైటిల్స్ ఎన్నో వచ్చినట్లు ఛీజ్ టైటిల్స్ కూడా ఈ మధ్య మార్కెట్ ను ముంచెత్తాయి. ఉదాహరణకు ‘కెన్ ఐ మూవ్ యువర్ ఛీజ్?’, ‘నో మోర్ ఛీజ్’, ‘హూ డేర్స్ టు మూవ్ మై ఛీజ్?’ లాంటివెన్నో పుస్తకాలొచ్చాయి. ఇక చాలా కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించినప్పుడు, కొన్ని విభాగాలు మూసేసినప్పుడు ఈ పుస్తకాన్ని పెద్ద సంఖ్యలో పంచిపెట్టడం, కార్మికులను మానసికంగా సన్నద్ధం చేయడానికి ప్రయత్నించడం వివాదాస్పదమైంది.

ఏది ఏమైనా మార్పునకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోకపోతే మరుగున పడిపోవడం ఖాయమని హెచ్చరించే ఈ పుస్తకం యువతరం తప్పక చదవాల్సిన పుస్తకం. చాలా నెమ్మదిగా చదివినా అరగంటలోపే ముగించగలిగే ఈ పుస్తకం పిడిఎఫ్ ఫైల్ చదవాలనుకునేవారు నా మెయిల్ ఐడికి ఉత్తరం రాసి ఉచితంగా తెప్పించుకోవచ్చు.

“హూ మూవ్డ్ మై ఛీజ్?” (డాక్టర్ స్పెన్సర్ జాన్సన్)

వెర్మిలియన్ ప్రచురణ, పేజీలు 96, వెల రూ. 150.

ప్రకటనలు

11 responses »

 1. మీరు విషయాన్ని చాలా ఆసక్తికరంగా చెప్పారు. ఈ పుస్తకం యొక్క గొప్పతనమంతా ఇది అమ్ముడుపోయిన కాపీల సంఖ్య. ఎక్కువమంది కొన్నారుకాబట్టి దీనికి గొ్ప్పతనం వస్తుందని మీరు నమ్ముతున్నట్లుగానూ, ఎక్కువగా కొన్నవారికి గొప్పతనం ఉండిఉండవచ్చునుకుంటున్నట్లుగానూ,లేదూ ?… ఎంతో అభద్రతాభావం, భయం, అపనమ్మకం, ఆత్మవిశ్వాసలేమీ ఈ విషయంలో నాకు కన్పిస్తున్నాయి.

 2. … ఎక్కువమంది కొన్నారుకాబట్టి దీనికి గొ్ప్పతనం వస్తుందని మీరు నమ్ముతున్నట్లుగానూ, ఎక్కువగా కొన్నవారికి గొప్పతనం ఉండిఉండవచ్చునుకుంటున్నట్లుగానూ…
  అయ్యబాబోయ్ అజిత్ సార్, కొంపదీసి ఈ అర్థం వచ్చేట్టు నేను రాశానా? మన్నించండి. ఇటీవల పుస్తకాలు అమ్మడంలో పాశ్చాత్య దేశాలు అనుకరిస్తున్న పోకడలను చూసి విస్తు పోతున్నా. ఒకసారి విపరీతంగా అమ్మకాలు అయ్యాక విమర్శకులు కూడా వాటి అమ్మకాలు ఇతోధికంగా పెరగడానికే కృషి చేస్తున్నారు (తెలిసి కొంత, తెలియక కొంత). ఈ టెక్నిక్ ఆఫ్ ట్రేడ్ ను చూసి నివ్వెరపోతూ అన్న మాటలు అంత అధ్వానంగా వున్నాయన్న మాట. మరి నా మిగతా వ్యాసాల మీద మీ దృష్టి సారించండి. నమస్తే.

  -రవి

 3. నా మేనజర్ నా చేత చదివించిన పుస్తకాల్లో ఇదొకటి. ఆయనే పుస్తకం తెచ్చిచ్చారు. కానీ నాకిది మరీ చిన్న పిల్లల పిట్ట కథలా అనిపించింది. ఈ రచన్ని ఏ టీనేజీలోనో చదివితేనో.. అహో అనుకునేదాన్నేమో, ఓ రెండేళ్ళ క్రిందట చదవినప్పుడు.. “అబ్బే!” అనిపించింది. నాకీ సెల్ఫ్ డెవెలెప్‍మెంట్ బుక్స్ తోనే ఏదో సమస్య అనుకుంటా.

  స్పెన్సర్ వే.. ఒన్ మినిట్ సీరీస్ చదవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఇహ.. ఎలా

 4. ఈ పుస్తకం మా ఇంట్లో ఉంది కానీ నా బుక్ షెల్ఫ్ లో లేదు. అంటే నాకు సంబంధం లేదనుకుని చదవలేదు. మీ సమీక్ష చదివాక వెంటనే చదవాలనిపిస్తోంది.
  అన్నట్టు మీ కొత్త టెంప్లేట్ చాలా బాగుంది.

 5. అమెరికాలో ఒక చిన్న ఐడియా వస్తే దాన్ని పట్టుకొని పెద్ద థియరీ తయారు చేసేస్తారు. దాన్ని గొప్పగా భావించేవారు కూడా చాలామందే వుంటారు (అమ్మకాలే సాక్ష్యం). మనకు ఆ సిద్ధాంతాలు అంతగా నప్పవేమోనని నా భావన. ఐనా ఈ పుస్తకం చదవడానికి బాగుంటుంది, సరదాగా! ఈ పుస్తకం చదివిన వెంటనే ఇలాంటి పుస్తకాలను అవహేళన చేస్తూ Darrel Bristow-Bovey వ్రాసిన ” I Moved Your cheese!” కూడా చదవాలి. అప్పుడు సరైన perspective లో ఇలాంటి రచనలను అర్థం చేసుకోవడానికి వీలౌతుంది.

 6. sir i have all ready read this book but the review is in ur style,but the comments which i have seen after the review makes me to think abuot this book the book is compleately for the chang management which have the base positive attitude but the comments are giving negetive sugetions please dont highlet those comments the opinion of the reader about the book will be changed,we are here to make the people to read the books thanq sir dont think otherwise

 7. వ్యాసాలు చదువుతూ అభిప్రాయాలు రాస్తున్నందుకు నెనర్లు భానూ. పుస్తకాలలో ఎవరి భావాజాలానికి అనుగుణంగా వారు ఎలా రాస్తారో, వాటి పరిచయకర్తలు వాటిని ఎలా పరిచయం చేస్తారో, అదేవిధంగా అభిప్రాయాలు తెలియజేసేవారు అంతే స్వేచ్ఛగా రాస్తారు. రాయనివ్వాలి. అందుకే నేను వాటికి సమాధానాలు ఇవ్వకుండా వుండడానికే ప్రయత్నిస్తాను. అయితే మీలాంటి స్టూడెంట్ ఫ్రెండ్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఇదిగో మీరిప్పుడు అన్న మాదిరిగానే మనకు నచ్చని అభిప్రాయాలను మనం వినడానికి ఇష్టపడకపోవడం వల్లనే ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న రక్తపాతమంతా. పరిచయ వ్యాసాలు చదవడానికి ఎంత తోడ్పడతాయో, చదవకుండా వుండడానికి కూడా అంతే తోడ్పడతాయి. నిజానికివి పాఠకులను మాత్రమే కాదు, రచయితలను కూడా హెచ్చరించడానికి. అయితే ఈ పుస్తకంపై ఇక్కడ జరిగిన చర్చ పుస్తకం అమ్మకాల మీద జరిగింది మాత్రమే. పుస్తకాలు చదవడం పూర్తిగా మానేసిన ఈ తరంలో మీలాంటి నూతన తరపు పాఠకులకు స్వాగతమ్.

 8. sir thanq for ur welcome nd for such a nice reply now i understand abot teir stratagy nd i will try to find out the secrete behind the sales of those normal books really ur reply changed my way of thinking thanq

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s