ఈ మాటలు చెప్పడానికే కాదు చదవడానికీ ధైర్యముండాలి!

సాధారణం

oshoప్రతివారంలాగే ఈ వారం కూడా “మీరు చదివారా?” లో పాఠకులకు పరిచయం చేయడానికి వీలుగా, ఉద్యోగరీత్యా టెక్కలికి వెళ్లే బస్సు ప్రయాణంచేస్తూ, ఓ పుస్తకాన్ని చదువుకుంటున్నాను. పక్క సీట్లో కూర్చున్న మిత్రుడు ఈశ్వరరావు ఆ పుస్తకం గురించి వాకబు చేశారు. ఎందుకు దానిగురించి చెప్పడమని ఆ పుస్తకాన్ని ఆయన చేతిలోనే పెట్టాను. గత మూడు దశాబ్దాలుగా ఆర్. ఎస్. ఎస్. తో ఆయనకు అనుబంధం వుండడమే గాక, దశాబ్దానికి పైగా వివిధ స్థాయిల్లో ఆ సంస్థలో పనిచేస్తున్న మిత్రుడు ఆ పుస్తకాన్ని విసిరి కొడతాడేమో అనుకున్నాను. నా అంచనాకు భిన్నంగా మా బస్సు కాలేజీలో ఆగేంతవరకు ఆ పుస్తకంలో మిత్రుడు మునిగిపోయాడు. చెప్పే విషయమేదైనా, మీరతనితో ఏకీభవించినా ఏకీభవించకపోయినా, తన మాటల మత్తులో మిమ్మల్ని పడేసే ఆ రచయిత ఓషో కాగా, ఆ పుస్తకం పేరు ‘స్త్రీ విముక్తి కోసం’. 

‘విజయవిహారం’ పత్రికలో అప్పట్లో నెలనెలా ప్రేమగానం శీర్షికతో ఇందిర కొన్ని కబుర్లు ఎంతో ప్రేమగా చెప్పేవారు. ఎవరీ ధైర్యవంతురాలని అప్పట్లో మా మిత్రులమంతా అనుకునేవాళ్లం. స్వేచ్ఛకు అంత ప్రాధాన్యమిచ్చి మాట్లాడేవారు అరుదు. అప్పుడే ఆమె అనువాదం చేసిన ఓషో రచన అంటూ ఈ పుస్తకంలో కొన్ని ముఖ్యాంశాలను ‘విజయవిహారం’లో ప్రచురించారు. అవి చదివాక ఆ పుస్తకం తెప్పించకుండా వుండలేకపోయాను. విప్లవాత్మకమైన అభిప్రాయలను అత్యంత విప్లవాత్మకమైన భాషలో చెప్పడం ఓషోకే చెల్లింది. ఓషోగా కీర్తిని, అపకీర్తిని సమపాళ్లలో మూటకట్టుకున్న ఆచార్య రజనీష్ అమెరికాలో ప్రసిద్ధ గురూజీగా ఓ ఊపు ఊపేశారు. తన మంత్రజాలమంటి మాటలతో అమెరికన్ యువతను పట్టి ఆడించారు. తన స్వేచ్ఛా ప్రపంచంలోకియువతీయువకులను స్వాఘతించారు. ఓషో ప్రవచించే లోతైన, నిగూఢ వేదాంత తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయిన పాశ్చాత్య యువత అక్కడి ఆశ్రమాన్ని ఓ విశృంఖల సెక్స్ కేంద్రంగా మార్చిపారేశారు. ఇప్పుడిప్పుడే మళ్లీ ఓషో భావాలు ప్రపంచ ప్రజానీకం గుర్తిస్తోంది. ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలకు హారతులు పడుతోంది. ఆయన వివరించిన ధ్యాన పద్ధతులకు ఆదరణ పెరుగుతోంది.

మంత్ర పబ్లికేషన్స్ పేరిట సంతగోపాల్ వరుసగా ఓషో రచనల అనువాదాలను తెలుగులో ప్రచురిస్తున్నారు. ‘జీవితాన్ని పండగ చేసుకో’, ‘స్త్రీ వికుక్తి కోసం’, ‘జీవిత రహస్యాలు’, ‘యోగ’, ‘మనకు తెలియని క్రీస్తు జీవితం’ వంటి రచనలను తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ఇక ఈ “స్త్రీ విముక్తి కోసం’ పుస్తకంలో ఆయన కొన్ని ప్రశ్నలకు అరిస్టాటిల్ మాదిరి జవాబులు చెబుతూ తన అభిప్రాయాలను పాఠకులతో పంచుకుంటారు. అయితే ఫెమినిజమ్ సిద్ధాంతం పట్ల ఓషోకున్న అభిప్రాయాలను నవీనమే కాదు అవి చాలావరకు ఏంగెల్స్ అభిప్రాయాలతో ఏకీభవిస్తాయి. అయితే పేజీ 37లో ‘వేటాడే సమాజాలలో స్త్రీకి కేవలం కనడం తప్ప మరే పని ఉండేది కాదు’ అనడాన్ని మనం అంగీకరించలేం. డి.డి. కోశాంబి చరిత్ర పుస్తకాలు చదివిన వారు సైతం ఆదిమ సమాజాలలో స్త్రీ పాత్రను తక్కువ చేసి చూడలేరు. 

అలాగే పేజీ 30లో ఈ మాటలు చదివినపుడు మనకు మొదట ఆశ్చర్యం కలుగుతుంది. “ఎవరయితే లోతయిన భావప్రాప్తి అనుభవాలను పొందారో వారే ధ్యానాన్ని కనిపెట్టారు. ధ్యానం భావప్రాప్తి అనుభవం నుండి పుట్టినదే. ధ్యానాన్నికనిపెట్టేందుకు మరే ఇతర మార్గమూ లేదు. కాని ఆర్గాజమ్ సహజంగానే మీకు ధ్యాన స్థితిని ఇస్తుంది. కాలం ఆగిపోతుంది. ఆలోచనలు ఆగిపోతాయి. అహం మాయమవుతుంది. నీవు స్వచ్ఛమైన చైతన్య శక్తివి. మొట్టమొదటిసారి నీకు, నీవు శరీరం కాదు, నీవు మనస్సు కాదు. అన్న విషయం అర్థమవుతుంది. ఆ రెండింటికి అతీతమయిన వారే మీరు – చైతన్య శక్తి స్వరూపం“. ఈ మాటలు చదివినప్పుడు ఆధ్యాత్మిక వాదులు భక్తికి సెక్స్కు ముడిపెట్టాడాన్ని ఎబ్బెట్టుగా చూస్తారు. కానీ గుంటూరు శేషేంద్రశర్మ తన “కాలరేఖలు’ వ్యాససంపుటిలో కూడా ధ్యానాన్ని గురించి దాదాపుగా ఇలాంటి అభిప్రాయలనే వ్యక్తపరచడం ఆశ్చర్యపోతూ పరిశీలిస్తాం. ఇక భావప్రాప్తి అన్న విషయంతో మొదలైన ఈ పుస్తకం దాదాపుగా ఈ విషయం చుట్టూతానే తిరుగుతూ సాగుతుంది.

మొదటి భాగమంతా ఓషో ఈ అభిప్రాయాలనే తన అనర్గళమైన, అనితరసాధ్యమైన సరళిలో చాలా విపులంగా వివరిస్తారు. వేటినీ మనం ఖండించలేం. అలాగని సనాతన సంప్రదాయాలలో బందీ అయిన వాళ్లం వాటినీ ఒప్పుకోళేం కూడా. అన్ని రకాల హక్కులను స్త్రీ హక్కుభుక్తం చేయడానికి సాహసించే పురుషుడేడీ? అయితే అదే సమయంలో స్త్రీవాదులంతా గుర్తెరగవలసిన ఓ హితవుకూడా పలుకుతారు. స్త్రీవాదమంటే పురుషుడిని ఓడించడం కాదు. “వారు (స్త్రీవాదులు) స్త్రీలు, పురుషులు సమానులని నిరూపించే బుద్ధిలేని ప్రయత్నం చేస్తున్నారు. వారు సమానులు కారు. వారు ప్రత్యేకం. యూనీక్. స్త్రీ స్త్రీయే. పురుషుడు పురుషుడే. వారి మధ్య పోలిక ప్రశ్నే లేదు. యిక సమానత్వం గురించి ఆలోచించడంలో అర్థంలేదు. వారు అసమానులు కారు. అలాగని సమానులూ కాలేరు.వారు అద్వితీయులు. వారు ప్రత్యేకం” అంటారు ఓషో. దీనితో ఎంత మంది స్త్రీవాదులు ఏకీభవిస్తారో కదా! తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పే ఓషో ఈ పుస్తకం రెండో భాగంలో మరిన్ని సహజంగా వచ్చే సందేహాలను తీరుస్తారు. ఇందిర అనువాదం ఎంతో సరళంగా, సాఫీగా సాగింది. చాలా అభ్యంతరకరంగా కనిపించే ఆసక్తికరమైన, సత్యవాక్కులతో నిండిన ఈ 150 పేజీల పుస్తకం ఖరీదు 90 రూపాయలే. ప్రయత్నిస్తారుగా!

ప్రకటనలు

9 responses »

 1. నేను పూనాలొ పని చేసే రోజులలో ఈయన గురించి తెలుసుకుందాం అనుకున్నా కాని వీలు పడలేదు ,ఈ మధ్య హైదరబాద్ లొ పుస్తక ప్రదర్సన లొ ఈ పుస్తకం చూసాను.కాని అప్పటికే చాలా పుస్తకాలు కొనేసరి ,తరువాత చూద్దాం అనుకున్న.. మీ టపా చదివాక చదవాలనిపిస్తోంది ,తప్పక కొని చదువుతా !!

 2. ఓషో చెప్పింది నిజమైతే స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస ధ్యాన మార్గంలో ఎల ముందుకు వెళ్ళారు? భగవత్సాక్షాత్కారం ఎలా పొందారు. ఓషో లాంటి వాళ్ళ పుస్తకాలలో హేతువు ని ఎవ్వరూ ఎందుకు ప్రశ్నించరు? నిజంగా మనం అసలైన ఆధ్యాత్మికానికి మళ్ళదలచుకుంటే జీవితానికి పునాది ఐన నైతిక విలువల ని పాటించాల్సిందే. అది లేని జీవితం పేక మేడ లాంటిది.
  సిగ్గు వదిలెయ్యడం ధైర్యం అయితే నాకొద్దీ ధైర్యం. 🙂

 3. నా వ్యాఖ్య ద్వారా రచయిత ని ఖండించడం నా వుద్దేశం కాదు. ఓషో మీద నాకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచానంతే. నా వ్యాఖ్య మీ బ్లాగు స్ఫూర్తి కి వ్యతిరేకం గా అనిపిస్తే నిరభ్యంతరం గా తొలగించవచ్చు.

 4. రవి గారూ,

  మీ వ్యాసం చదివాను. బాగుంది.

  దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఒమర్ ఖయ్యాం గురించి వ్రాస్తూ ఒక మాట చెప్పారు. ఖయ్యాం జీవిత శైలి గురించి అందరికీ తెలిసిందే! ఖయ్యాం హజ్ దీక్ష చేసి మక్కా వెళ్లి తిరిగి వచ్చి చెప్పిన రుబాయీను శాస్త్రి గారు పద్య రూపంలో చెప్పారు-

  కలపయు మట్టిరాళనిడి గట్టిన దేవళమందు నీకు ఏ ఫలము లభించు?
  ప్రేమ రస భావయుతుండవయేని కామినిన్ వలపుము ప్రాణహీనమగు బండలు వేయిటికన్న శ్రేష్ఠమై అలరు గదా మనుష్య హృదయమ్ము ప్రతి ప్రణాయునురక్తులన్!

  ఖయ్యాం చరిత్రలోని కవులను, రచయితలను, ఆలోచింప చేశాడు. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఉన్నంత కాలం ఒక మనుస్మృతి ఉన్నట్లు అనేక మైన భావజాలాలు పరంపరగా వస్తూనే ఉంటాయి!

  ఒషో గారి పుస్తక సమీక్ష బాగుంది.

  సబ్జక్టివ్ అబ్జక్టివ్ అనాలిసిస్లు ఏది ఎక్కడ ఎంచుకోవాలి అనేది అనుభవంతో గానీ రాదు. పుస్తకాన్ని ప్రక్కన నిలబడి సమీక్షించటం మంచి పధ్ధతి.

  అలాగే పుస్తకంలో చెప్పిన మాటల వలన ఒకరి జీవన విధానం, ఒక పరంపర భిన్నమయిపోవు కదా?

  ~వేదాంతం శ్రీపతి శర్మ

 5. అరుణ గారు,

  ఓషో రచనలు అనేకం చదివిన కారణంగా, మీకు సమాధానం ఇవ్వటానికి పూనుకుంటున్నాను, ఈ బ్లాగు యజమాని అనుమతితో.

  “ఓషో చెప్పింది నిజమైతే స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస ధ్యాన మార్గంలో ఎల ముందుకు వెళ్ళారు?”

  ఓషో వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనించండి.

  “ఎవరయితే లోతయిన భావప్రాప్తి అనుభవాలను పొందారో వారే ధ్యానాన్ని కనిపెట్టారు. ధ్యానం భావప్రాప్తి అనుభవం నుండి పుట్టినదే. ”

  అయితే, ధ్యానానికి మూలం భావప్రాప్తి ఒక్కటే అని ఆయన చెప్పలేదు. అదీ ఒక మార్గం. ఓషో స్వయంగా రామకృష్ణ పరమహంస గురించి చెబుతూ, రామకృష్ణ, గదాధరుడుగా ఉన్నప్పటి సంఘటన ఉటంకించారు. (మీకూ తెలిసి ఉండవచ్చు)

  గదాధరుడు చిన్నప్పుడు ఓ సాయంత్రం నిలువెత్తు చెరుకు తోటలో నడుస్తూ వెళుతున్నప్పుడు, నీలాకాశపు యవనికపై, కొంగల బారు వెళుతుండటం చూశాడుట. ఆ దృశ్యం తన్మయత్వం కలిగించి అపస్మారక సమాధి (ధ్యాన) స్థితిలో వెళ్ళాడుట.

  “ఓషో లాంటి వాళ్ళ పుస్తకాలలో హేతువు ని ఎవ్వరూ ఎందుకు ప్రశ్నించరు? నిజంగా మనం అసలైన ఆధ్యాత్మికానికి మళ్ళదలచుకుంటే జీవితానికి పునాది ఐన నైతిక విలువల ని పాటించాల్సిందే.”

  ఎవరో చెప్పిన నైతిక విలువలను మనం పాటిస్తే మనం second hand మనుషులం అవుతాం, అది బానిస మనస్తత్వం. ఓషో స్వయంగా ఎప్పుడూ తను చెప్పిన మాటలు ఆచరించమనలేదు. ఒకరు చెప్పిన విలువలను అర్థం చేసుకుని, మన జీవితానికి నప్పితే ఆచరించాలన్నది బోధ సారాంశం.

  అలాగని సమాజం మీద తిరగబడి నేరస్తుడు గా మనుగడ సాగించటం reactive అవుతుంది. ఓషో అప్పుడూ reactivity నీ నేరాలను సమర్థించి ప్రోత్సహించలేదు. తను ఎప్పుడూ వాడే పదం rebel, rebellion, rebellious. అంటే, తనను తాను ఉద్దరించుకోడానికి నడుంబిగించటం. ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయినా చలించకపోవటం. జీసస్, బుద్ధుడు, మహా వీరుడు వగైరా ఆ కోవకు చెందిన వారే.

 6. రవి గారు,
  మీరు ఇంతకు ముందు మీ బ్లాగులో ఓషో గురించి రాసినపుడు చదివి ఓషో పుస్తకాలను చదవాలని(ఇదివరలో వాళ్ళూ వీళ్ళూ ఆయన గురించి రాసినవి చదవటమే తప్ప ఆయన రాసినవి చదవలేదు) నిర్ణయించుకుని , అమలు పరచలేదు. ఇక్కడ మీ వ్యాఖ్య చదివాక ఇలా బద్ధకిస్తున్నందుకు నాకు నేను అక్షింతలు వేసుకుంటూ ఇక ఎలాగైనా సరే చదవాలని నిర్ణయించుకున్నా!

  రవి కుమార్ గారు,
  మంచి పుస్తకం పరిచయం చేసారు. ధన్యవాదాలు.

 7. ఆర్.ఎస్.ఎస్. వాళ్ళకి అంత సహనం ఉంటుందంటే నేను నమ్మను. మా నాన్న కూడా ఆర్.ఎస్.ఎస్.లో పని చేశాడు. ఆర్.ఎస్.ఎస్. వాళ్ళకి అసహనం ఏ స్థాయిలో ఉంటుందో నాకు తెలుసు.

 8. dear ravi sir really i am very new to this topic having divinity and searching divinity in sex be cause i dont know this but in the book “siddhardha” herman hess told that siddhard had searched his life in the hugs of kamala and he searched some thing with the sextual expereance with kamala and i thik osho may be write” and it is really one pe of dhyanam” or searching a new way in dhyanam . really review is good

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s