అస్తిత్వ ఉద్యమాలపట్ల కొత్త ఎరుక

సాధారణం

telanganaమూడు భిన్న ప్రదేశాల, సంస్కృతుల, ఆచార వ్యవహారాల ప్రాంతాలను కేవలం భాష ప్రాతిపదికగా ఏకంచేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి యాభై రెండేళ్లు అవుతోంది. దేశభక్తులైన రాజనీతిజ్ఞులు మన పాలకులుగా వుంటే పరిస్థితి మరోలా వుండేది. సంకుచిత దృష్టిగల స్వార్హపరులైన చవకబారు రాజకీయ నాయకులు, తమ బిడ్డల భవితకూడా ఆలోచించ(లే)ని వ్యాపార వర్గం, రెండింటి కలయికవల్ల స్వార్థ ప్రయోజనంతో రాష్ట్రంలో అసమ అభివృద్ధిని ఈ అర్థ శతాబ్దిలో కొనసాగించారు. దాని ఫలితమే ఇప్పుడు రాజుకుంటున్న, మనం నివ్వెరపోయి చూస్తున్న అస్తిత్వ ఉద్యమాలు.

ఇవ్వాళ జరుగుతున్న మోసాలను గుర్తించి ప్రజలంతా ఏకమై తమ ప్రాంతం తమ ఏలుబడిలోకి రావాలని ఎలుగెత్తి చాటుతున్న వేళ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మానసికంగా, సైద్ధాంతికంగా, రాజకీయంగా అన్నివిధాలా తారస్థాయికి చేరుకున్నవేళ, తమ తప్పును గుర్తించి ఒప్పుకుని నిధులను వరదలా ఒకేచోటుకు పారేలా చేస్తే ఆ ప్రజలు కరిగిపోయి పాత తప్పులను క్షమించి తమ ఉద్యమాన్ని ఆపేస్తారా? ఈ పప్పులు తమదగ్గర ఉడకవని నీతిపాఠం చెప్తారా? అని రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నవేళ నా మట్టుకునాకు ఈ బాగోతాన్ని జాగ్రత్తగా గమనిస్తున్న రాయలసీమ, కళింగాంధ్ర ప్రజలు కొత్త పాఠాలు నేర్చుకోలేరా అని విస్మయం కలుగుతోంది. ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయవలసిన నాయకులు, సాహిత్యకారులు, ఉద్యమకారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారా అని ఆందోళన కలుగుతోంది. ఈ సమయంలో చదివిన “తెలంగాణ వ్యాసాలు” అసమ అభివృద్ధి అందజేసిన పరిణామాల పట్ల కొత్త ఎరుకను పంచింది. ఆ పుస్తకాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నాను.

అప్పుడప్పుడు అక్కడా ఇక్కడా ఈ అస్తిత్వ ఉద్యమానికి సంబంధించిన ఆలోచనలను వరవరరావు పాఠకులతో పంచుకుంటూ వస్తున్నారు. ఆ ఆలోచనలను 23 వ్యాసాలుగా స్వేచ్ఛాసాహితి ప్రచురణ సంస్థ “తెలంగాణ వ్యాసాలు”గా పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది. వరవరరావును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. కవి, రచయిత, అనువాదకుడు, సంపాదకుడు, విమర్శకుడు, ఉద్యమకారుడు, ఆలోచనపరుడు అయిన వరవరరావు ఈ అస్తిత్వవాదానికి సంబంధించి మనకు చాలా స్పష్టమైన అవగాహనను ఈ వ్యాసాలద్వారా అందిస్తున్నారు. ఈ పుస్తకంలో అస్తిత్వవాదానికి సంబంధించి మనకు చాలా స్పష్టమైన అవగాహనను ఈ వ్యాసాలద్వారా అందిస్తున్నారు. ఈ పుస్తకంలో అస్తిత్వవాదానికి మూలాలైన ఈ మూడు ప్రాంతాల కలయిక నుంచి ఇప్పుడు విడిపోవాలనుకోవడం వరకు చరిత్ర, భాష, నీరు, రాజకీయపుటెత్తుగడలు, చారిత్రక, సామాజికావగాహన విషయాలను క్రమపద్ధతిలో చర్చించారు.

నైజాం ఆఖరి నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ లాయక్ అలీ ఏలుబడి కొచ్చేసరికి ఆ రాష్ట్ర ప్రజలు గడ్డురోజులను ఎదుర్కొంటున్నారు. శ్రీశ్రీ చెప్పిన ‘వెనుక దగా ముందు దగా కుడిఎడమల దగాదగా’ కాదది. ప్రజల మూలుగులను సైతం పీల్చిపిప్పి చేస్తున్న నైజాం అడ్మినిస్ట్రేటివ్ సెటప్ తో విసిగి వేసారిన ప్రజలు భూమికోసం, భుక్తికోసం, విముక్తికోసం ఆశగా ఎదురుచూస్తున్న రోజుల్లో కమ్యూనిజం అందించిన అవగాహనతో రైతాంగం సాయుధ పోరాటం చేసింది. ఈ పోరులో నైజాము ప్రభువుకు రజాకార్లు సాయపడితే, తెలంగాణ రైతాంగానికి భారత యూనియన్ పోలీసుల సహకారం దొరికిందని చరత్రలో చదువుకున్నాం. దాంతో హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతంలో విలీనమైపోయిందని, తెలంగాణ ప్రజల కష్టాలన్నీ చేత్తో తీసేసినట్టు మాయమైపోయాయని, ఆ తర్వాత తెలుగు మాట్లాడే ప్రజలతో కలిసి ఒక ప్రత్యేక తెలుగు భాషా ప్రాంతపు ‘ఆంధ్రప్రదేశ్’ ఏర్పాటైందని మన తరగతి గదుల్లో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. కాని లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ ఇవన్నీ అర్థసత్యాలేనని అర్థమవుతోంది. అసత్యాలకంటే అర్థ సత్యాలు ప్రమాదకరమైనవి. కమ్యూనిస్టులు కూదా ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ కలలుగన్నారు (ఇప్పటికీ కంటున్నారు). అంతా కలిసే నాగార్జునసాగర్ గా మారిన నందిగొండ ప్రాజెక్టుకోసం ఉద్యమించారు. అంతా కలిసే ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అని నినదించి విశాఖ స్టీల్ ప్లాంట్ తెచ్చుకోగలిగారు. కాని చివరిదాకా కథ అలా సాగలేదు. ‘రెండున్నర జిల్లాల రెండున్నర కులాల’ (ఈ అరలేమిటో వరవరరావు గారు విశదీకరించలే!) సంపన్నవర్గాలు ఆధిపత్య రాజకీయాన్ని, మాయోపాయాన్ని ప్రదర్శించి రాష్ట్రాన్ని కొల్లగొట్టాయి. ఈ జరుగుతున్న దోపిడీని ముందు గుర్తించింది తెలంగాణ ప్రజలు, అక్కడి సాహిత్యకారులు, అక్కడి ఉద్యమకారులు. ప్రజలను చైతన్యపరిచారు. వారి ఆలోచనలను పదునెక్కించారు. ఇప్పుడు ప్రదర్శిస్తున్న ఆగ్రహావేశాలు వాటి ఫలితమే. ఈ అలజడిలో సహజంగానే కొన్నిచోట్ల కొంత ‘అతి’ పొడసూపుతుంది. వరవరరావు లాంటి మేధావులు దానిని తెలియజెప్తూ ఉద్యమాన్ని మార్గనిర్దేశనం చేస్తుంటారు.

అయితే ఈ రోజు కెసిఆర్ నాయకత్వాన టిఆర్ ఎస్ చేస్తున్న రాజకీయ పోరాటం గమ్మత్తుగా వుంటోంది. ఈ అయిదేళ్లలో తెలంగాణ సెంటిమెంట్ చూపించి మూడుసార్లు ఎన్నికలు నిర్వహింపజేశాడు. అది ప్రజాధనం వృధాచేయడం కాదా? దీనికాయన పెట్టిన ముద్దుపేరు లాబీయింగ్. దీనిని వరవరరావు నిరసిస్తారు. “తెలంగాణకు లడాయియే మేలు. లాబీయింగ్ తో వచ్చే తెలంగాణ రూపంలో వేరు తెలంగాణ అవుతుందే కాని సారంలో వీరతెలంగాణ కాజాలదు.” (పే.21) మూడో వ్యాసంలో ‘తెలంగాణ – పత్రికలు’ గురించి రాస్తారు. ‘గోలకొండ’ పత్రికనుంచి మూడు అంశాలు గ్రహించాలంటారు. ఉద్యమ ప్రయోజనం సాధించాలనుకున్నపత్రికలు, పత్రికా రచయితలు వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది వార్త అంటే ఏమిటి? వర్తమాన సమాజంపై పత్రిక దృక్పథం అంటే ఏమిటన్నది ముఖ్యం. పెట్టుబడిదారులైన పత్రికలైనప్పటికీ సంపాదకుల, రచయితల దృక్పథాన్ని బట్టి పత్రిక ప్రజాప్రయోజనాలను కాపాడగలుగుతుంది.

రెండవది పత్రిక ఏ వర్గానికి చెందుతుంది? దాని పాఠకులెవరు? ఏ రకపు, తరగతి, వర్గపు పాఠకులను అది చేరాలి? అందుకోసమే పత్రికల్లో ఏయే అంశాలు చేర్చాలన్న విషయం రచయితలు ఆలోచించాలి. ఇక మూడవది అప్పట్లో గోలకొండ పత్రిక సామూహిక పఠనాన్ని ప్రవేశపెట్టగలిగింది. ప్రజలంతా ఒకచోట చేరడం, విషయం తెలుసుకోవడం, తమలో తాము చర్చించుకోవడం జరిగేది. ఈ వ్యాసంలోనే కటంగూరు నరసింహారెడ్డి ఎడిటర్ గా ‘విశ్వజ్యోతి’ పత్రిక తెలంగాణ సమస్యను ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రస్తావించారు. చాలా ఆసక్తి కలిగించే సంగతిది. పరకాల అనే చిన్న ఊరునుంచి ‘గడ్డం’ నరసింహారెడ్డి ప్రచురించే ‘విశ్వజ్యోతి’ పత్రికలో తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘన ఎట్లా జరుగుతుందో ఒక సంచికలో వేశారట. అందులో కశ్మీరునూ, తెలంగాణనూ పోల్చి చూపారట. ఎప్పుడూ ఢిల్లీపాలనలో గాని, బ్రిటిషు ఇండియా పాలనలో గానిఉండని రెండు పెద్ద సంస్థానాలు కశ్మీరు, హైదరాబాదులు. ముస్లిం ప్రజల కశ్మీరాన్ని హిందూ రాజు పాలిస్తే, హిందూ ప్రజలను ముస్లిం నవాబు హైదరాబాదులో పాలించాడు. ఇలా పోలికలన్నీ చెప్తూ కశ్మీరు సమస్యలో ప్లెబిసైట్ కోసం ఐరాస దృష్టికి ప్రధాని నెహ్రూయే స్వయంగా తీసుకెళ్లారు కాబట్టి తెలంగాణలో కూడా ప్లెబిసైట్ నిర్వహించాలని ఐరాసను కోరారు.

ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో చంద్రబాబు తెలంగాణవాదం పట్ల తీవ్ర అసహనాన్ని ప్రదర్శించేవారు. అసెంబ్లీలోకాని, మరెక్కడా కాని తెదేపార్టీ సభ్యులెవ్వరూ ‘తెలంగాణ’ అన్న మాటనుకూడా వాడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకునేవారు. అదంతా ప్రస్తావిస్తూ చిన్న రాష్ట్రాలు ఏర్పడితే అభివృద్ధి ఉండదన్న చంద్రబాబును “సింగపూర్ వంటి అతి చిన్న దేశాన్ని (నగరాన్ని) అభివృద్ధి నమూనాగా తన ఆదర్శరాజ్యంగా చెప్పుకునే చంద్రబాబు చిన్న పరిపాలనా ప్రాంతం అభివృద్ధికి నోచుకోదని చెప్పడం – తెలంగాణ గురించిన అసహనమే అన్నది స్పష్టం” (పే. 34) అని మందలిస్తారు. అదే వ్యాసంలో “ప్రజాస్వామ్యానికి హిట్లర్, అల్జీరియాకు డీగాల్ ఇటువంటి పాఠాలే చెప్పాలనుకున్నపుడు బ్రెహ్ట్, సార్త్ర వంటి రచయితలు కలాలను కత్తులుగా మలిచి ప్రతిఘటించారు” (పే 36)లో చెప్తారు. కాని ఇప్పుడలాంటి సాహిత్య కళాకారులేరీ తెలుగు సమాజంలో? అందునా రాయలసీమ, కళింగాంధ్రలలో?

ఈ పుస్తకాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి వరవరరావు అక్కడక్కడా చిప్పిన ఈ నాలుగు మాటలు మనకెంతో తెలియజెప్తాయి.

“ఏర్పడినప్పుడు ఒక జాతిని, ఒక భాషా ప్రజలను ఏకం చేయడమనే ప్రకటిత సదుద్దేశంతో ఏర్పడినా, సింహావలోకనం చేస్తే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఒక విద్రోహ చర్య అని యాభైరెండేళ్ల చరిత్ర నిరూపిస్తున్నది.” (పే.6)

“జాతి భావనకు – అభివృద్ధికర శక్తుల పురోగమనానికి వైరుధ్యం వచ్చినపుడు జాతి ఒక పవిత్రమైన సెంటిమెంటుగా మిగలకూడదు. అభివృద్ధికర శక్తుల పురోగమనమే గీటురాయి కావాలన్న అవగాహన ఏర్పడింది”. (పే.9)

“ప్రత్యేక తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని నేను ఒక ప్రజాస్వామిక పోరాటంగా అర్థం చేసుకుంటున్నాను. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాంగా, ఇక్కడ దళారీ పాలనకు వ్యతిరేకంగా సాగే పోరాటంగా చూస్తున్నాను. ఆధిపత్య భావజాలాన్ని, అధీకృత హింసనూ ప్రతిఘటించే ప్రజాస్వామ్య పోరాటంగా ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తున్నాను.” (పే. 12)

ఇవి చాలు. ఈ పుస్తకం ఎటువంటి ఆలోచనలను మనకందిస్తుందో. అస్తిత్వవాద ఉద్యమల పట్ల అభిమానం గల వారందరూ తప్పక చదవాల్సిన, ఆలోచనలను అందరితో పంచుకోవాల్సిన, అవగాహన పెంచుకోవాల్సిన పుస్తకమిది. మరి మీరూ చదవండి!

“తెలంగాణ వ్యాసాలు”

వరవరరావు

స్వేచ్ఛాసాహితి ప్రచురణ

పేజీలు 160, వెల 40 రూపాయలు మాత్రమే.

ప్రకటనలు

5 responses »

  1. ఏమిటో ఏం చెప్పారో కొంచెం అర్థమయింది, ఎక్కువ అర్థం కాలేదు. మరికాస్త వివరంగా రాయాల్సిన విషయాలు చాలా ఉన్నాయనిపించింది. పుస్తక సమీక్షలకు, పరిచయాలకు తేడా ఏమిటో చెప్పండి.

  2. శ్రీకాకుళం జిల్లావారై కూడా మీకెందుకీ ప్రాంతీయ దురభిమానం? తెలుగు వారందరం ఎక్కడున్నా ఒకటే కదా? మీ ఆలోచన మార్చుకొండి. తెలంగాణ వచ్చినంత మాత్రాన ఎవరు బాగుపడతారు? ఎవరు చెడిపోతారు? అందరం కలిసుండాలి అని కోరుకోవాలి.

  3. dear sir “telangana vyasalu” book review is very good the places which are back word must have the rite for the revolution and the varavara rao quations which u have under lined are good and they makes me to think and as usual your style of writing is like guruji

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s