ఆత్మగౌరవ వ్యక్తీకరణ ప్రయత్నం ‘ముల్కి’

సాధారణం

mulkiఇటీవల స్పష్టంగా వినిపిస్తున్న ఆత్మగౌరవ అభివ్యక్తి స్వరాలలో ముస్లిం వాద సాహిత్య శాఖ ఒకటి. ఇందులో విరసం వెలువరించిన ‘జిహాద్’ తొలి ముస్లిం సాహిత్య సంకలన ప్రయత్నమని చెప్పుకోవచ్చు. తర్వాత వెలువడిన అద్భుత కవితా సంకలనాలు ‘జల్ జలా’, ‘ఫత్వా’, ‘అజా’ లు ఈ వాదపు లక్ష్యాన్ని, ఆశయాన్ని, గుణ స్వభావాలను సాహితీ లోకానికి స్పష్టంగా చాటాయి. ఈ క్రమంలో ‘ముల్కి‘ మూడో సంచిక ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచికగా వెలువడింది. అయితే ఆర్థిక కారణాల వల్ల దీనిని పెద్ద ఎత్తున తీసుకురాలేకపోయారు. తర్వాత 2005లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ బాధ్యతను స్వీకరించి ‘ముల్కి – ముస్లిం సాహిత్య సంకలనం‘ వెలువరించింది.

వేముల ఎల్లయ్య, స్కైబాబ సంపాదకులుగా వ్యవహరించిన ఈ ‘ముల్కి’ కథ, కవిత, వ్యాసం, ఇంటర్వ్యూలన్నింటితో ఆరు రుచుల సమ్మేళనంగా సాగింది. ఇందులో నాలుగు కథల కహానీ, ఇరవై నాలుగు అభిప్రాయాల ‘వ్యాసం’, నాలుగు పుస్తక సమీక్షల ‘కితాబ్’, పదహారు కవితల ‘షాయరీ’ వున్నాయి. వీటితోపాటు ‘చార్ సవాల్’, ‘ములాఖత్’లు అదనపు ఆకర్షణలు.

ఈ సంకలనం మహమ్మద్ నిసార్ కథ ‘వతన్’తో ప్రారంభమవుతుంది. గ్రామాల్లో హిందూ ముస్లిం కుటుంబాల మధ్య సంబంధాలు స్నేహాన్నిదాటి ఎలా హృదయానుబంధాలుగా వెలసి, వారంతా ఒకే కుటుంబీకులుగా మసలుతారో వివరిస్తుంది. ఉపాధికోసం వున్న వూరు విడిచిపెట్టినా పీర్ల పండగనాడు కుటుంబమంతా అక్కడికి వచ్చి గడపడం మహమ్మద్ అబ్బాస్ కొడుకులకు అలవాటు. ఒక పీర్లపండుగనాడు తమ పల్లెకు వచ్చిన ఆ కుటుంబంతో మహమ్మద్ అబ్బాస్ నెపంగా అక్కడి పెద్దలు రెండు మతస్తుల మధ్యగల సఖ్యతను మరోమారు నెమరువేసుకోవడమే ఈ ‘వతన్’ కథ. చదవడం పూర్తిచేసిన పాఠకుని హృదయం ఆనందంతో ఉప్పొంగి ఆనందబాష్పాలు రావడం ఖాయం.

ఇక వ్యాసాలలో భిన్నమైన దృక్పథాలతో పలువురు అభిప్రాయాలను వెలువరించినప్పటికీ కొన్ని వ్యాసాలు మనకు కొంత అవగాహన పంచి ఆలోచన పెంచుతాయి. నరికొన్ని వ్యాసాలు మన విశ్వాసాలను చెదరగొట్టి మన ఆగ్రహానికి పాత్రమవుతాయి. ముందుగా మొదటిరకం వ్యాసాలు చూద్దాం. సంగిశెట్టి శ్రీనివాస్ ‘వక్రీకరణకు గురైన ముస్లిం పాలకుల చరిత్ర : నిజాం చరిత్రకు చెదలు’ వ్యాసం మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు చెపుతుంది. చరిత్రకారులు నెగటివ్ దృక్పథంతో చరిత్రను రికార్డ్ చెయ్యడంలో జరుగుతున్న ద్రోహాలలో ఒకటి ‘నిజాం నిరంకుశ పాలన’ వర్ణనలు. 1724 నుంచి 1948 వరకు హైదరాబాద్ రాజ్యాన్నిపాలించిన ఏడుగురు ప్రభువుల్లో చివరి నిజామ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కేవలం పది సంవత్సరాల (1938 సత్యాగ్రహ ఉద్యమం నుంచి 1948 రజాకార్ ఉద్యమం వరకు) దుర్మార్గ పాలనను మొత్తం అతడి పరిపాలనకు, అంతకంటే అన్యాయంగా మొత్తంగా నిజాముల పాలనకు అంటగట్టడం ఏ విధంగా చూసినా ఘోరమే.

‘పోలిస్ యాక్షన్’ రోజునే నిజాం పాలన అంతమైందని అంతా భావిస్తాం. ఆరెస్సెస్ విషప్రచారానికి బలైన మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లబ్ భాయి పటేల్ కు నిజాం నవాబు వంగి దండం పెట్టే ఫోటోనే ప్రచురిస్తుంది. కానీ ఆ తర్వాత కూడా రాష్ట్ర అవతరణ వరకూ హైదరాబాద్ రాష్ట్రానికి ‘రాజ్ ప్రముఖ్’గా పాలించింది నిజాం మీర్ ఉస్మాన్ అలీఖానేనని ఎందరికి తెలుసు? 1952 మార్చి 23న హైదరాబాద్ శాసనసభను ప్రారంభించింది ఈ ఏడో నిజామే. అదే నిరంకుశ(!) ఏడో నిజాం 1967లో మరణించినప్పుడు శవయాత్రలో లక్షలాది జనం పాల్గొనడం మరో విశేషం. అంతకంటే వింత ఏమిటంటే శాసనసభలో నిజాంకు సంతాపం వ్యక్తపరుస్తూ కాంగ్రెస్, రిపబ్లిక్, కమ్యూనిస్ట్, జనసంఘ్ (అప్పటి బిజెపి) నాయకులు ఆయన సేవలను కొనియాడడం. ఇలాంటి ఎన్నో కనుమరుగైన విశేషాలు ఈ వ్యాసంలో సంగిశెట్టి విపులంగా వివరిస్తారు. చరిత్రగతిలో తెరమరుగైన తెలంగాణ ముస్లిం సాహిత్య వికాసాన్ని, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని, ప్రజాచైతన్యానికి వారధులుగా నిలిచిన యోధులను నేటి తరానికి పరిచయం చేయాలని అప్పీల్ చేస్తారు.

‘ముస్లింలు ముస్లింలుగా సంఘటితం కావాలి’ అన్నవ్యాసంలో హక్కుల ఉద్యమకారుడు కె.బాలగోపాల్ ముస్లింవాదానికి సహానుభూతిగా కొన్ని సంగతులు స్పష్టపరుస్తారు. ‘దేశ విభజన ముస్లింల పాపమేనంటూ అప్పటి తరానికి చెందిన ముస్లింలకు ఆపాదించబడిన పాపానికి తరువాతి తరానికి చెందిన ముస్లింలు భౌతికంగానే కాక మానసికంగాను పరిహారం చెల్లిస్తున్నారు. ఆ ఆపాదన న్యాయం కాదు, అది న్యాయమే అయినా తరువాతి తరం మీద వేసిన భారం ఎంత మాత్రం న్యాయమైనది కాదు’. బాలగోపాల్ ఈ విషయంలో ఇంకా సందిగ్ధంగా వున్నట్టుంది. లేకపోతే ‘అది న్యాయమే అయినా’ అనే మాట వాడరు. నిజానికి ఆ మాట వాడాల్సిన అవసరం లేదు కూడా. ఈ ఒక్క మినహాయింపు తప్పించి మిగతా వ్యాసం చక్కగా సాగుతుంది.

ఇక రెండో రకం వ్యాసాలకు ఉదాహరణగా షమీవుల్లా రాసిన ‘ఉద్యమ కవిత్వంలో ముస్లింలది ప్రత్యేక శిల్పం’ వ్యాసం నిలుస్తుంది. వ్యాసపు శీర్షిక ఎంతో వినయంగా, ఆత్మవిశ్వాసం ప్రకటించేదిగా వుంది కదూ! ఇంక నెమ్మదిగా వ్యాసంలోకెళ్ళిన రచయిత ముస్లింవాదం ప్రత్యేకతనూ గొప్పదనాన్ని చెబుతూ చెబుతూ శ్రుతిమించుతారు. రాగం తప్పిపోతారు. ఆఖరు వాక్యానికి వచ్చేసరికి ఈ పెడసరితనం ఎలా తయారవుతుందంటే, ‘చివరగా ఒక్కమాటలో చెప్పాలంటే ముస్లిం కవిత్వంలోని శిల్పం అన్ని ఉద్యమ కవిత్వాల్లోకెల్లా ఎంతో ప్రత్యేకమైనది’ అని అంటారు. కంఠస్వరం ఎంత తలపొగరుగా, అహంకారంగా మారిందో చూశారా! అంతకుముందే ‘స్త్రీవాదం కంటే దళితవాదం, దళితవాదం కంటే ముస్లింవాదంలో శిల్పం గుణాత్మకంగా మార్పు పొందిం’దంటారు. ఆఖరుకు ఈ ఆత్మాశ్రయ ధోరణి అలా దారితీస్తుందోనని ఆందోళన కలుగుతుంది. ఏ వాదమూ మరో వాదం కంటే గొప్పదీ కాదు, తక్కువదీ కాదు. అవన్నీ స్పష్టంగా ఆత్మ ధిక్కార స్వరాలు. తమ ఉనికిని, ఇన్నాళ్లుగా తమకు జరిగిన అన్యాయాన్ని, అణచివేతను ఎదిరిస్తూ పూరించిన సమరశంఖాలు. వాటినలానే అర్థం చేసుకోవాలి.

ఎక్కువ తక్కువలు వాదాల్లో వుండవు. ఒక వాదం చాలా గొప్పదనుకోవడం ఆ వాదం పట్ల మనకున్న అనురాగం మాత్రమే. అసలు సాహిత్య వాదాల పుట్టుకే ఆత్మగౌరవ వ్యక్తీకరణ. తమ ఉనికికి ఏర్పడుతున్న తీవ్ర ముప్పునకు వ్యతిరేకతా వ్యక్తీకరణ. తమ హక్కుల సాధనకు వారు వెలిబుచ్చుతున్న ధిక్కార స్వరాలవి. ప్రతి వాదపు పుట్టుకకు వెనుక అనంతమైన ఆక్రోశం, తరతరాలుగా తమని నిర్లక్ష్యానికి గురిచేసిన వారిపైన అంతులేని ఆగ్రహం, తమను అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్న వారిపైన అణువణువునా అసహ్యమూ వుంటాయి. అలాంటి తమ ఆవేదనను సభ్యసమాజానికి తెలియజెప్పి వారి మద్దతు కూడగట్టుకోవడమే ఆ వాదాల సాహిత్య లక్ష్యం. ఇక అక్కడనుంచి దానిని ఉద్యమరూపంలోకి తీసుకుపోవలసింది సామాజిక విప్లవాన్ని కోరుకునే కార్యకర్తలు. సాహిత్య వాదం, సామాజిక ఉద్యమం పరస్పరం పునస్సమీక్షించుకుంటూ ముందుకు సాగాలి. అంతటి కఠోర పరిశ్రమ చేసినపుడే సమాజంలో సమానత్వాన్ని, ప్రజాస్వామిక భావజాలాన్ని పాదుకునేలా చేయగలుగుతాం. సాహిత్యం ముందుకు సాగుతున్న కొద్దీ అభివ్యక్తీకరణల్లో కొత్తకొత్త రూపాలు వస్తూనే వుంటాయి. కొత్తకొత్త శిల్పాలు అన్వేషిస్తూనేవుంటారు. ఈ రోజు సంస్కరణవాదం గానీ, విప్లవ కవిత్వం గానీ ఇంకా గురజాడ, పఠాభి, శ్రీశ్రీ, శివసాగర్ ల వద్దే ఆగిపోలేదు. వారిని సంస్మరిస్తూనే విప్లవాత్మక వ్యక్తీకరణలతో మునుముందుకు సాగుతూనే వుంటుంది. అంతేతప్ప, ‘స్త్రీవాదం కంటే దళితవాదంలో కనిపించిన మార్పుతోనే’ స్త్రీవాదపు నడక ఆగిపోదు. ఇంకా గొప్పదైన స్త్రీవాద సాహిత్యం వస్తూనే వుంటుంది. ‘దళితవాదం కంటే ముస్లింవాదం శిల్పం గుణాత్మకంగా మార్పు’ పొందగానే సరేనని చెప్పి దళితవాదం తన వ్యక్తీకరణను విరమించుకోదు. ఇంకా మహత్తరమైన శిల్పబాణీల్లో తన వాణిని వినిపిస్తుంది. ఒక కొత్తవాదం ఉప్పెనలాగా ముదుకు వచ్చినపుడు పాతవాదం తలవంచుకుని కెరటంలాగా వెనక్కిపోదు. అవి తమతమ సామాజిక బాధ్యతల్ని సంపూర్ణంగా నెరవేర్చాకే వాటి ఉధృతిని తగ్గిస్తాయి. అక్కడితో తాము వచ్చిన పని అయిపోయిందని శెలవు తీసుకుని అదృశ్యం కావు. వాదాలు, ఉద్యమాలు మన సామాజిక భూమికలో నిరంతరం వాచ్ డాగ్స్ లాగా పని చేయాల్సిందే.

పుస్తక సమీక్షల్లో ‘ఊదు గాలింది… పీరు లేచింది’ పేరిట అంబటి సురేంద్రరాజు రాసిన ‘జల్ జలా’ కావ్య సమీక్షలో అన్యాయమైన అవాకులూ చెవాకులూ పేలడం కనిపిస్తుంది. ఇస్లామిక్ ఫండమెంటలిజం అమెరికా ఒక్క దేశానికే కాదు, హిందుత్వ శక్తులకు కూడా శత్రువేనట. అదిచ్చిన శక్తి ప్రస్తుతం నిద్రాణమై వుమ్టే వుండొచ్చు గాక సమీప భవిష్యత్తులో అది జాగృతమవుతుందట. అంటే ఇండియాలో మనమింకా ఎన్నినరమేధాలు, విధ్వంసాలు చవిచూడాల్సిందో కదా! అమెరికా ఆధిపత్య ధోరణి, హిందుత్వ, ఇస్లామిక్ ఫండమెంటలిజం ఇవన్నీదుష్టశక్తికి, దుర్మార్గానికి, అరాచకత్వానికి రకరకాల రూపాలన్న విషయం సమీక్షకుడు మర్చిపోయాడు. ఇలా మురికిలో మునిగిన అంబటి ఏ కూపంలో తేలుతారంటే – ‘ఈ దేశం నిజానికి ఎవరికి చెందుతుందో, ఎవరికి చెందాలో వారికోసం, అంటే దళిత, గిరిజన, బహుజనలందరి కోసం వాళ్లు ‘తలకు కఫన్ కట్టి’ కదులుతున్నారట. అందుకే వారు కవిత్వం రాస్తారట! ‘తురకోని గడ్డం దేశానికి అడ్డం’, తురకదాని బురక దేశానికి మరక’, వందేమాతరం పాడనివారు ఈ దేశంనుండి పొండి’ అన్నవాళ్లకు, ఈ రకం రచయితలకు తేడా ఏమైనా వుంటుందా? ఒకే గీతమీద ఒకరొక కొసన, మరొకరింకో కొసన వున్నట్టే అగుపిస్తోంది.

కొత్త ‘ఆంధ్రజ్యోతి’కి నవ్యశోభనిచ్చిన చిత్రకారుడు అక్బర్ గురించి ‘మిలాఖత్’లో మనకెన్నో విషయాలు తెలుస్తాయి. తెలంగాణ ప్రాంత జీవనాడిని తన బొమ్మలద్వారా మనకందిస్తున్న అక్బర్ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న సృజన కళాకారుడు. అతడి కృషిని మరింత విశ్లేషణాత్మకంగా వివరిమ్చాల్సిన అవసరముంది. అంతటి గొప్ప కళాకారుడు కూడా ఫ్రస్ట్రేషన్ లోపడి “ఏపీ దాటితే బాపు ఎవరో తెలియదనడం’ కొంచెం అతి చేయడమే. ‘బాపు కన్ను ఒక పార్శ్వం నుంచే సమాజాన్ని చూడగలిగింది’ అనడం అక్షరసత్యమే. కాని అక్బర్ కన్ను మరొకటేదైనా కావచ్చుగాని, ఏదో పార్శ్వం నుంచే సమాజాన్ని చూస్తుండడం నిజం కాదా? ఆ ‘వర్గం’ అప్పుడు బాపును ఆదరించింది. ఆరాధించింది. ఎంతో సీనిచ్చింది. ఇవ్వాళ అక్బర్ ను వెలికితీసింది మరో వర్గం. ఇంకా కొత్త చూపున్న కళాకారులెందరో, సృజనశీలురెందరో మరుగున పడివున్నారు. వారందరినీ వెలికితీయాల్సిందే.

ముస్లిం వాద ధోరణిని ప్రతిఫలించే పదహారు కవితలు చదవడం నిజంగా షాయరీ వినడమే. మొత్తం సంకలనం చదవడం పూర్తిచేశాక హృదయం బరువెక్కుతుంది. ఇప్పుడే బలంగా వీస్తున్న ముస్లిం వాద వాణి మనసును సూటిగా మనసును తాకుతుంది. వారి అవేదనను ఆర్ద్రతతో అర్థం చేసుకోగలుగుతాం. స్త్రీవాదాన్ని, దళితవాదాన్ని సమాదరించినట్టే ముస్లిం వాద సాహిత్యాన్ని సహానుభూతితో అర్థం చేసుకుంటాం. మనసా వాచా కర్మణా మన చేయూతను వారికందించడానికి సిద్ధమవుతాం. ఈ దిశగా ఓ విశిష్ట, బృహత్తర ప్రయత్నం ‘ముల్కి – ముస్లిం సాహిత్య సంకలనం’. తప్పక చదవండి.

ప్రకటనలు

2 responses »

  1. ఐదవ పేరాలో చెప్పిన విషయాలు పాఠకులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. “రాజ్ ప్రముఖ్” అన్నది ఈనాటి గవర్నర్ వ్యవస్థకు సమానమైనది. సెప్టెంబర్ 17, 1948 నాడు సర్దార్ పటేల్ కు నిజాం వంగి సలాం పెట్టాక ఆయన పాలన అంతమైన విషయం వాస్తవం. ఆనాడే నిజాం రాజ్యం (అప్పటికి అదొక దేశం) “హైదరాబాదు” రాష్ట్రంగా రూపొంది భారత దేశంలో విలీనమయింది. అప్పటి నుండి 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల వరకు హైదరాబాదు రాష్ట్రం భారత ప్రభుత్వం నియమించిన మిలిటరీ జనరల్ పాలనలో(ఈ రోజుల్లో రాష్ట్రపతి పాలనలాగా) ఉండింది. 1952 ఎన్నికల తరువాత శ్రీ బూర్గుల రామకృష్ణారావు ముఖ్య మంత్రియై పాలించారు. అయితే ఏ రాజులయితే సంధి చేసుకొని వాళ్ళ దేశాలను భారత దేశంలో విలీనం చేయడానికి అంగీకరించారో వారిని ఆ యా రాష్ట్రాల “రాజ్ ప్రముఖ్” లుగా (గవర్నర్లకు బదులుగా) భారత ప్రభుత్వం నియమించింది. అంత మాత్రాన వారు పాలించారంటే ఎలా? ఈ రోజు మన రాష్ట్రాన్ని పాలిస్తున్నది ముఖ్యమంత్రా? గవర్నరా? అలాగే నిజాం రాజ్ ప్రముఖ్ బాధ్యతలను నిర్వహించారు. ఆయన 1956 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం (నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా) ఏర్పడ్డాక కూడా కొనసాగారు. అంటే ఆంధ్ర ప్రదేశ్ ను సంజీవరెడ్డి తదితరులు కూడా పాలించనట్టేనా? అలా రాష్ట్రానికి గవర్నర్ పదవితో సమానమైన రాజ్ ప్రముఖ్ బాధ్యతలను నిర్వహించిన వ్యక్తి మరణిస్తే, శాసన సభలో నివాళులర్పిస్తే అంత ఆశ్చర్యం దేనికి? తెలంగాణ చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చకపోవడం వల్ల అవగాహనా రాహిత్యంతో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ నేటి తెలంగాణ దుస్థితి.

  2. వర్గాలకు , వర్ణాలకు అతీతమైనది బాపు గారి చిత్రం ఎవరు అంగీకరించినా, అగీకరించకపొయినా, కేవలం బాపు వల్లే తెలుగు చిత్రకళకు ఒక స్థాయి వచ్చింది, ఆ మహానుభావుడి పేరు ఉచ్చరించే అర్హత లేని వాల్లు తమ తమ అమూల్య మైన సమయాన్ని ఇటువంటి వాటిపై కాకుండా , కాస్త కన్ను, కాలూ తిన్నగా వేయడంపై శ్రద్దపెడితే బొమ్మలు చూసే తెలుగుపాఠకులకు బొల్డంత మేలుచెసినవాల్లవుతారని ఎవరైనా అక్బర్ కు చెబితే బావుణ్ణు .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s