ముచ్చటగా మూడోది… కవిత. భరించక తప్పదు…

సాధారణం

చిన్నమాట: లోక్ సత్తా పార్టీ పెట్టకముందు… అంటే ప్రజాసంఘంగా వున్నపుడు దానికి విపరీతమైన అభిమానిని. వారు వెలువరించిన ‘రెండవ స్వతంత్ర పోరాటం’ బులెటిన్ పై చిన్న పరిచయ వ్యాసం రాసి, కంప్యూ-ఇల్లిటరేట్ ను కదా, సేవ్ చేయడంలో జరిగిన పొరపాటు వల్ల దానితోపాటు మరిరెండు పుస్తక పరిచయాల డ్రాఫ్టులను కోల్పోయాను. అంచేత ఈ వారం అనివార్యంగా నా మూడో కవితను పాఠకమిత్రులకు వినిపించక తప్పడంలేదు. ఈ సారికి మన్నించండి. అన్నట్టీ కవిత మొన్న గాంధీ వర్ధంతి (జనవరి 30)న ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రంలో ప్రసారమైంది.

పల్లెకు పోదాం చలోచలో…

అటు సాతవాహనులు ఇటు శాతకర్ణులు

కేలండర్ లో క్రీస్తుకు ముందూ వెనకా

మూడేసి వందల సంవత్సరాలు

ఆంధ్రదేశాన్ని పాలించినపుడు

ఒక్కో గ్రామాన్ని ఒక్కో యూనిట్ గా చేసి

పరిపాలించడం వల్లనే దేశం సుభిక్షంగా వుండేది.

పాత శతాబ్ది పోయే ముందర

స్వతంత్రానికి ముందు నాయకులందరూ

దేశానికి వెన్నెముక రైతేనంటూ

సొంతపాలనలో నాయక వినాయకులందరూ

రైతే రాజంటూ

ఈ శతాబ్దిలో సైతం పదాలు మార్చిమార్చి

ఎన్ని నినాదప్రాయ కూతలు కూసినా

మన ఫోకస్ పట్టణాలమీదనే

అందుకే దౌర్భాగ్యపు విలయతాండవం మనదేశంలో.

అమ్మనూ ఆలినీ ఆత్మగౌరవాన్నీ

చుట్టలా చుట్టుకుని పొట్టచేత పట్టుకుని

కూలికోసం నాలికోసం కడుపునిండా తిండికోసం

వలసపోయి వలసపోయి వలసపోయి

అలసిసొలసిన పల్లెల ఆరున్నొక్క రాగం

వింటున్నావా ఈ క్షతగాత్ర గానం…

ఇంటిని చూసి ఇల్లాలిని చూడమనడం పాత సామెత

పల్లెను చూసి దేశాన్ని చూడమనడం రోత సామెత

ప్రపంచమంతా పారిశ్రామికం వైపు పరుగులు తీస్తుంటే

అందరి ఆకలి తీర్చాల్సిన రైతు తన బాధ్యత మరువక

నేలతల్లిని నమ్ముకుంటూ అదే మట్టి బంధమంటూ

పల్లెపట్టున వున్నవాడి – నోట మట్టికొట్టాం

అతడొట్టిపోయేలా చేశాం.

వేదాలూ ఉపనిషత్తులూ వల్లించిన

ప్రకృతి శరణం గచ్ఛామి నినాదాన్ని పక్కదారి పట్టించాం

అక్కరకురాని వేదవాక్కులకు

వందలకొద్దీ అర్థాలు తీశాం

నాటినుంచీ నేటిదాకా ఇదే తంతు

చేసిన తప్పులే పదేపదే చేస్తూవచ్చాం

పల్లెసీమలే దేశభవితకు పట్టుగొమ్మలన్న

గాంధీని విగ్రహం చేసేశాం

ఆయన ఎన్నడూ తొడగని గాంధీటోపీని నెత్తినెట్టుకున్నాం

గాంధేయవాదాన్ని గాలికొదిలేశాం.

నేటి పల్లెల దౌర్భాగ్యం

కానేకాదు రైతుల పాపం

ఇది కేవలం పాలకుల శాపం

పల్లెకు పోదాం చలోచలో నినాదం

కావాలి అందరికీ ఆచరణప్రాయం

పల్లెకు సోకిన ఈ రుగ్మతకు కాయకల్ప చికిత్స సరిపోదు

చరక శశృత సంహితల సారమంతా ఎక్కించినా రోగం కుదరదు

వేలవేల కోట్లు కుమ్మరించినా బెయిల్ అవుట్ కానేకాదు

పోయినచోటే వెతుక్కోవాలన్నదే నిదానం

అదే సరైన వైద్యవిధానం

పల్లెను పునరుజ్జీవనం చేయగల మార్గం.

ప్రపంచమంతా ఆర్థికమాంద్యంలో చిక్కుకుని

విలవిల్లాడుతూ గింజుకుంటున్నా

మనదేశమింకా పతనం అంచుకు చేరకపోవడానికి

కారణమేమిటని అడక్కపోయినా

అందరూ చెప్తున్నది మనకు సాయం చేసింది

మన వ్యవసాయమేనని

పరిశ్రమలను సేవలను నమ్ముకుంటూ పల్లెలను

నిరసిస్తే అధోగతే.

వృధాగా సముద్రుడి పాలవుతున్న అనంత జలరాశిని

దారి మళ్లించి ప్రతిపల్లెకు చేర్చాలని

పల్లెగుమ్మంలో పారిశ్రామిక తోరణాలు

రంగరంగ వైభవంగా అలంకరించాలని

విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు ఆరోగ్యారామాలు

వెరశి ఆధునిక దేవాలయాలన్నింటికీ

శాశ్వత చిరునామాలు పల్లెలే కావాలని

అదనీ ఇదనీ ఇంకా ఏదేదోనని

కలవరిస్తూ పలవరిస్తూ

నా దేశపు ప్రతి పల్లెకు జవజీవాలందివ్వాలని

కోరుకునే ఓ మేధావీ

దేశభక్తుడా మానవుడా…

అన్నింటికంటే ముందుగా మన చూపు మారాలని కోరుకో

సంస్కృతి చిహ్నాలు పట్టణాలు కావని పల్లెలని తెలుసుకో

విద్యార్థీ ఉద్యోగీ

కార్మికుడా కళాకారుడా

శ్రామికుడా పారిశ్రామికుడా

సహస్ర వృత్తుల సమస్త కళంకారికులారా

విధిగా ప్రతిఏటా కొంతకాలం

కర్షకుడితో కరచాలనం చేయాలని ప్రతినబూనుకో

పల్లెలోనే అనంత సౌందర్యముందని చాటుకో

నీ సహవాసంతోనే ప్రాణశక్తి లభిస్తుందని గుర్తుంచుకో.

రా! పల్లె పిలుస్తోంది కదలిరా!!

గ్రామాల పునర్నిర్మాణానికి కదంతొక్కరా!!!

ప్రకటనలు

12 responses »

 1. పింగుబ్యాకు: పల్లెకు పోదాం చలో చలో « Rayraj Reviews

 2. పల్లె సంస్కృతి నిజంగా అంత గొప్పదనుకోను. మన శ్రీకాకుళం జిల్లాలో పలాస దగ్గర ఉన్న నువ్వులరేవు గ్రామానికి వెళ్ళి చూడండి. అక్కడ మూఢ నమ్మకాల ప్రభావం చాలా ఎక్కువ. ఒకప్పుడు అక్కడ ఎవడైనా చేతబడి (చిల్లంగి) చేశాడని అనుమానం వస్తే కుల పెద్దలు అతన్ని చంపి శవాన్ని మాయం చేసేవాళ్ళు. పోలీసులు జోక్యం చేసుకోవడం వల్ల అక్కడి పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. జంతుబలులు, పూనకాలు, చేతబడి అనుమానాలు, ఇలా ఎన్నో మూఢ నమ్మకాలు మన పల్లెలలో కనిపిస్తాయి.

 3. మార్తాండగారూ, పల్లెల్లోనే అనంత జీవన సౌందర్యం వుందని నేను నమ్ముతాను. మీరన్న మూఢత్వం ఇంకా కొంత పల్లెల్లో వున్నమాట వాస్తవం. అయితే పట్టణాలలో వున్న దౌర్భాగ్యాలతో పోల్చిచూస్తే శాతం చాలా తక్కువే అని చెప్పాలి. ఉన్న ఆ తక్కువశాతం మూర్ఖత్వం పోవాలంటే మీలాంటి ఉన్నత ఆదర్శాలు వున్న యువతరం తరచుగా పల్లెలను సందర్శించాలి.

  రేరాజ్ గారూ, మీ బ్లాగు బహుబాగు. అరుణారాయ్, మహాశ్వేతాదేవి, వర్ఘీస్ కురియన్ లాంటి కొంతమంది పెద్దలు పల్లెల్లోనో నివాసముంటూ దేశ ముఖచిత్రాన్నే మార్చారు మనకళ్లముందే. మనం తలచుకోవాలేగాని, సాధ్యం కానిదేముంది? అయితే రాజకీయ నాయకత్వం బాగుంటే మార్పు త్వరగా సాధ్యమవుతుంది.

 4. నా బ్లాగ్ లో మీరన్నారు : రాజ్ గారూ, మరీ మిమ్మల్ని నా కవిత ఇబ్బంది పెట్టినట్టందే. మహాశ్వేతాదేవి, అరుణా రాయ్, వర్ఘీస్ కురియన్ నగర జీవనాన్ని విడిచిపెట్టి పల్లెల్లో గడిపి భారత దేశ ముఖచిత్రాన్ని మార్చినవారే. ఇప్పుడు కొత్తగా ఐఐటి, ఐఐఎం విద్యార్థులు కూడా కొన్నాళ్ల ఉద్యోగం తర్వాత పల్లెలకు వలస పోతున్నారు – ఏమైనా చేద్దామని. చూద్దాం … ఇదొక ఉద్యమంగా, మీరన్నట్టు, మారాలి. థాంక్యూ వెరీ మచ్…”

  నా కెందకో ఇక్కడ కూడా రిప్లై ఇవ్వటం సమంజసం అనిపిచ్చింది.

  థాంక్స్ నేను చెప్పాలి.

  “స్వదేశ్ ” సినిమా ఇంస్పిరేషన్ Aravinda Pillalamarri and Ravi Kuchimanchi పేర్లు కూడా కొందరన్న విని ఉంటారు; తెలీని వారి కోసం ఇక్కడ.”http://en.wikipedia.org/wiki/Swades#Inspiration”

  మీ భావానికి వీళ్ళల్లో వేరియేషన్స్ ఉన్నాయి ; కానీ వాళ్ళు తమ రూట్స్ కై తిరిగొచ్చారు.

  ఎక్జాక్ట్ పల్లె కి కాక పోవచ్చు కానీ, తన తల్లి ఇడ్లీలు అమ్మి పెంచిదన్న ఉద్దేశ్యంతో – IIMA లో చదివొచ్చి కాటరింగ్ సర్వీసెస్ కంపెనీ పెట్టిన శరత్ కుమార్ “ఫుడ్ కింగ్” మన బ్రాండ్ అవ్వచ్చు పల్లెల్లో!అఫ్కోర్స్ బర్గర్ కింగ్ ఇమిటేషన్ నాకు నచ్చదనుకోండి! 🙂

  http://youthmania.net/esarath-babu-the-idli-man-founder-of-foodking-catering-services-pvt-ltd/

  http://battakiran.wordpress.com/2008/06/20/a-crorepati-who-lives-in-a-hut-sarathbabu-in-2008/

  http://timesofindia.indiatimes.com/Cities/Hyderabad-Times/The-dream-merchant-/articleshow/msid-1464169,curpg-1.cms

  http://www.pagalguy.com/forum/cat-and-related-discussion/14780-know-your-iimite-sarath-babu.html

  http://gleez.com/articles/did-you-know/inspiring-rags-riches-tale-sarathbabu

  ఈ భావాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ; కాని అది ఫేషన్ లా అవ్వాలి ; అమెరికా వెళ్ళటం ఫేషన్ అయినట్టు అవ్వాలి;

  ఒకప్పుడు చాలా కష్టపడి అమెరికా వెళ్ళారు – అంటే దానిలో వాళ్ళ పట్టుదల కనబడుతుంది.

  ఇప్పుడు ఊళ్ళో భూములు అమ్మి, లేకపోతే గిర్వి పెట్టైనా సరే కొడుకు వీసా ప్రాసెసింగ్ డబ్బులిచ్చేస్తున్నారు తల్లి దండ్రులు.

  అది తప్పు అనే గ్రహింపు కు వచ్చే సమయం ఆసన్నమైనదనే నే అనుకుంటున్నాను.

  కానీ ఓ రివర్స్ ఎక్సోడస్ దానంతట అదే జరగదు; కొంచెం ప్రయత్నం కావాలి. ఎవరన్నా ఫోకస్డ్ గా ప్రయత్నించాలి.

  నగరాల్లో జీవితం అంత గొప్పదేం కాదు. రెండు మూడు గంటలు రోజూ కార్యాలయలకు, ఇళ్ళకు మధ్య ఎందుకండీ ప్రయాణాలు చేయడం.గ్రామం కాదండీ, జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా సరియైన వసతులు లేక!

  బిపిఓ లన్నీ నగరాల్లో ఎందుకుండాలి!? ఉత్తినే ఉదాహరణాకి అన్ని డొమెస్టిక్ “తెలుగు” కాల్ సెంటార్లూ ఖమ్మం లోనో, సూర్యాపేటలోనో, వరంగల్లోనో ఎందుకు పెట్టకుడదూ!? చెప్పండి!

  ఎందుకంటే నాయకులిక అక్కడ పెద్దాగా రియల్ ఎస్టేట్స్ చేసుకోలేదేమో! కొన్ని ఊళ్ళు రాసిస్తే వస్తారేమో కనుక్కుందామా!?

  నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ ఇలా ఇవన్నీ ఎందుకు అనలేదంటారా!? అనొచ్చు – అది కూడా అనొచ్చు – కాని ఇంట్యూటివ్ గా నాకెందౌకో పై ప్రాంతాల్లో బిపిఓ లు / కాల్స్ంటర్స్ నడపచ్చనిపిచ్చింది. బౌగోళికంగా అవి తెలంగాణాకి, ఆంధ్ర కి ఆల్రెడీ కనెక్టవిటీ ఉన్న ప్రదేశలు అంతే!

  కానీ ఎవరైనా చెయ్యొచ్చు – ట్రై విత్ ఆల్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్, టెలికాం మెదలగు అన్ని సేవా సంస్థల్లో కాల్ సెంటార్లు అవసరమే ! మన జనాభా ఎక్కువ కాబట్టి – మన మార్కెట్లూ పెద్దవే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s