పంతొమ్మిదో వారం చదువు ముచ్చట్లు పరుచూరి శ్రీనివాస్ గారితో…

సాధారణం

పరుచూరి శ్రీనివాస్ గారిని నెటిజన్లు నడిచే గ్రంథాలయం అని పిలుస్తారు. ఎందుకట్లా పిలవడం? జస్ట్… మరికొద్ది నిమషాల్లో మీకే తెలుస్తుంది. బ్లాగు రాయకుండా బ్లాగు లోకానికి ఆప్తమిత్రులైన శ్రీనివాస్ గారిని బహుశా ‘అబ్లాగరి’ అని పిలవచ్చేమో. నేనైతే ఈ జవాబులు చదివి మురిసిపోయా. ఎన్ని పుస్తకాలో…. మరెన్ని పుస్తకల సంగతులో… మరి మీరూ ఎంజాయ్ చేయండి…   “మీరు గతంలో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తులకు మల్లేనే నాకూ చిన్న వయస్సునుండి పుస్తకాలతో అవినావభావ సంబంధం వుంది. పుస్తకాల గురించి, ముఖ్యంగా పుస్తక చరిత్ర (Book History) గురించి చాలా ఆసక్తి వుంది.” అంటూ ఇంటర్వ్యూ ప్రారంభించిన శ్రీనివాస్ గారి చదువు ముచ్చట్లివిగో…

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

“బోర్” కొట్టించి మధ్యలోనే పక్కన పడేసిన జ్ఞాపకాలేమీ లేవు కానీ, అనవసరంగా సమయం వృధా చేసుకున్నాను అనిపించిన పుస్తకాలు చాలా వున్నాయి.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

జర్మన్లో డానియేల్ కేల్మాన్ (Daniel Kehlman) రాసిన “Die Vermessung der Welt” (ఇంగ్లీషులో Measuring the World) అనే నవల. తెలుగులో ఆరుద్రగారి “సినీమినీ కబుర్లు”. ఆంగ్లంలో Anthony Grafton’s _Codex in Crisis_ . ప్రతివారం కనీసం మూడు పుస్తకాలైనా కొంటుంటాను. కాకుండా ఇండియా నుండి ప్రతి నెలా సగటున సీమేయిల్‌లో ఒక కట్ట వస్తుంది (ఇండియన్ పోస్టల్ సర్వీస్ వాళ్ళు పోయిన అక్టోబర్‌గా “sea-mail” సర్వీస్ నిలిపివేశారు. ఇప్పుడు కేవలం “air-mail” మాత్రమే ఉంది. ఇప్పుడు ఇండియా నుంచి పుస్తకాలు తెప్పించుకోవడం చాలా ఖరీదైన విషయం. కానీ తప్పదు కదా.)

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

ఎన్ని పుస్తకాలున్నాయనేది అసలు ముఖ్యం కాదు కదా? అకడెమిక్ జర్నళ్ళలో వచ్చే వ్యాసాలు, వేర్వేరు పత్రికలు కూడా చాలా హెచ్చుగా వున్నాయి.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

కష్టమైన ప్రశ్న. చాంతాడంత లిస్ట్ అవుతుంది. ఒకటో, రెండో పుస్తకాలు బాగా నచ్చిన రచయితలు చాలా మంది వున్నారు. అలా కాకుండా కొందరి రచనలు (+ వ్యాసాలు) మాత్రం ప్రతిదీ కొని చదువుతాను. అలా చెప్పుకోవలసిన పేర్లలో; Natalie Zemon Davis, Carlo Ginzburg, Robert Darnton, Anthony Grafton, Roberto Calasso, Velcheru Narayanarao, Sanjay Subrahmanyam, Sheldon Pollock, A.K. Ramanujan, Romila Thapar, Steven Pinker, Franz Kafka, Bertolt Brecht, Walter Benjamin, Noam Chomsky, Terry Eagleton, Alan Sokal, Michael Witzel, David Pingree … వీళ్ళలో అధికశాతం అకడెమిక్స్. నేను ఫిక్షన్ ఎక్కువగా చదవను.  ఇంకా తెలుగు విషయానికొస్తే, ప్రస్తుతానికి, మరీ వెనక్కిపోకుండా 20వ శతాబ్దానికి పరిమితమవుతాను. గురజాడ, చాసో, కొ.కు (non-fiction వరకే), శంకరమంచి సత్యం “అమరావతి కథలు” (అన్నీ కాదు), శ్రీరమణ గారి “బంగారు మురుగు, మిథునం, ధనలక్ష్మి” కథలు, కల్యాణసుందరీ జగన్నాథ్ “అలరాస పుట్టిళ్ళు”, చేరా, రారా గార్ల రాతలు (ఏవయినా) … చరిత్ర రచనలో చాలా ఆసక్తుంది కాబట్టి నేలటూరి, మల్లంపల్లి, చిలుకూరిల పుస్తకాలు అన్నీ వుంటాయి. చివరిగా మానవల్లి రామకృష్ణకవి గారంటే మాటల్లొ చెప్పలేనంత గౌరవం. రాసింది కొద్దయినా (లేట్) సి.వి. సుబ్బారావు గారంటే కూడా చాలా గౌరవం. [నచ్చిందా నచ్చలేదా అన్న విషయం పక్కన పెట్టి, ముందు వాళ్ళు అసలేమి చెప్తున్నారో తెలుసుకోవడానికి S.N. Balagangadhara, K. Else, M. Danino, D. Frawley, S. Talageri, S.R. Goel మొదలైన వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా చదువుతాను.]

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

అటునుండి, ఇటునుండి మూడుమూడు 🙂 ఇప్పటి వరకూ! కానీ పుస్తకాల కంటే, నాకు యెక్కువగా పుస్తకాల షాపుల్లో వాడుకోవడానికి అనుకూలంగా గిఫ్ట్ వోచర్లు వస్తుంటాయి. నేను కూడా ఎదుటివాళ్ళు ఏమి చదవడం ఇష్టపడతారో తెలియకపోతే వోచర్లే ఇస్తాను. పుస్తకాల కంటే మిత్రులకి, తెలిసినవాళ్ళకి పంపే వ్యాసాల ఫోటోకాపీలు, e-పుస్తకాలు పెద్ద సంఖ్యలో వుంటాయి.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

నేను ఇండియా వదిలి దాదాపు 20 సంవత్సరాలు కావస్తుంది. అందువల్ల పెద్దగా పత్రికల గురించి తెలియదు. తెలుగు దినపత్రికలు కూడా లోతుగా చదవను. హెడ్‌లైన్లు చూడటం వరకే. కానీ ఒక మంచి సంచికో, ఒక మంచి వ్యాసమో లేక మంచి పుస్తకమో వచ్చాయని నాకోసం ప్రత్యేకంగా తీసి పక్కన పెట్టే సహృదయులు కొందరున్నారు. అందువల్ల దాదాపుగా ఏదీ “మిస్” కాననుకొంటున్నాను. ప్రతి సోమ, శుక్ర, ఆదివారాల్లో “The Hindu” మాత్రం చూస్తాను, కొన్నిcolumns కోసం. Outlook పత్రికొకటి తప్పకుండా ప్రతి వారం చదువుతాను. ఇక్కడ జర్మన్లోనూ, ఇంగ్లీషులోనూ మంచి పత్రికలు చాలా వస్తాయి. New York review of books, London review of books, New Yorker లాంటివాటికి చందా కట్టాను. The little magazine, Z Magazine, Counterpunch నెట్‌లోనే చదువుతాను. గత పదేళ్ళుగా “ఈమాట” వెబ్‌జైన్‌ని తప్పకుండా చదువుతున్నాను. ప్రతి సంచిక కోసం ఎదురు చూసి మరీ చదివే కొద్ది పత్రికల్లో అదొకటి. నిజానికి, బ్లాగర్లు కొందరు ఈమాట వారి రివ్యూ పద్ధతిలో పడి నలిగితే మరింత మంచి రచయితలౌతారని అనిపిస్తుంది. అయితే విమర్శను స్వీకరించగలగడం ముఖ్యం. నా వ్యాసాలు కూడా కొన్ని అలా మెరుగు పెట్టబడినవే.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

మీలాగే ఒకేసారి నాలుగైదు పుస్తకాలు చదువుతుంటాను. అమితవ ఘోష్ రాతలంటే ఇష్టం. ఆయన కొత్త నవల “Sea of poppies” మార్కెట్‌లోకి రాగానే కొని మొదటిరోజు ఒక వంద పేజీలు చదివాను. అప్పటినుండి పక్కన పడుంది. పూర్తి చేయాలి. అలాగే డేవిడ్ షూల్‌మాన్ 2006 లో తను తెలుగుదేశంలో (ముఖ్యంగా రాజమండ్రిలో) గడిపిన రోజుల్లో రాసుకున్న డైరీ “Spring, heat and rains – A south Indian diary” నవంబరు, 2008 లో విడుదలవ్వగానే కొన్నాను. అది కూడా సగం చదివుంది. ఈ మధ్యలో పాత తెలుగు సినిమా, పాట చరిత్రపైన ఒక చిన్నపాటి వ్యాసం మొదలెట్టి దానికోసమని మార్గరెట్ కజిన్స్ 1935 లో రాసిన “The music of orient and occident – essays towards mutual understanding” అనే పుస్తకం పట్టుకున్నాను. అనుకోకుండా ఈవారంలో ఇంకో రెండు తెరిచాను; Kim Plofker’s _Mathematics in India_ (PUP, 2009) and Douglas Hofstadter’s “Gödel, Escher, Bach An eternal golden braid” (2000). చివరిది పాత పుస్తకమే అయినా కొత్త ముందుమాట రాసాడని మళ్ళీ తెప్పించాను ఈమధ్యే) నేను చదివే పద్ధతి కొంచెం గందరగోళంగా వుంటుంది :).

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

ఒక పుస్తకం చదివేయగానే నా ప్రవర్తనో, ఆలోచనారీతో పూర్తిగా మారిపోయాయని చెప్పలేను కానీ, చాలా పుస్తకాలు బాగా ఆలోచింప చేసాయి. ముఖ్యంగా చెప్పుకోవలసినవి రాచమల్లు రామచంద్రారెడ్డిగారి వ్యాస సంకలనం “సారస్వత వివేచన” (ఆయన నడిపిన “సంవేదన” పత్రికలో రాసిన సాహిత్య వ్యాసాలు, సంపాదకీయాలు, సమీక్షలు), వెల్చేరు నారాయణరావుగారి “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం”, కొ.కు సాహిత్యం, చరిత్ర, సంస్కృతులపై రాసిన వ్యాసాలు, కోశాంబి రచనలు (దాదాపుగా అన్నీను!), కె. బాలగోపాల్ వ్యాసాలు (చాలా వరకు), Christopher Caudwell రాసిన Illusion and reality, C.P. Snow’s “Two cultures”, Velcheu Narayanarao, David Shulman and Sanjay Subrahmanyam’s “Textures of time – writing history in south India 1600-1800”, ఐరావతీ కార్వే రచన “యుగాంత”. ఇంకా చాలా ఉన్నాయి.

11. ఆఖరుగా మీనుంచి ఏదైనా ఒక మాట?

తెలుగులో ప్రచురణ రంగం నిరుత్సాహం కలిగిస్తుంది. పుస్తకాల్లో విషయాన్ని పక్కన పెట్టినా, పుస్తకాలు అచ్చవుతున్న తీరు ఘోరంగా వుంది. ఎక్కువ సందర్భాల్లో సరయిన కాపీ ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ కూడా జరగడం లేదు. రచయిత/రచయిత్రులు ఇచ్చింది ఇచ్చినట్లే అచ్చయి పోతాయి. మంచి ఎడిటింగ్ విలువను ఎవ్వరూ గుర్తిస్తున్నట్లు కనపడటంలేదు. ముగింపుగా, ఈ “పుస్తకయానం”లో నాకున్న పెద్ద అండ, “నవోదయ” (అట్లూరి) రామమోహనరావుగారు. దాదాపు ప్రతిరోజూ నాకీ పుస్తం కావాలి, ఆ వ్యాసం చూసి పెట్టగలరా, అని విసిగించే నన్ను ఎంతో ఓపికతో భరించి, సహించి ప్రతిదాన్నీ వెతికి, సాధించిపెట్టే ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవడం నా ధర్మం, కర్తవ్యం. నిజానికి ఆయన నాకు చేసే సాయం మాటల్లో చెప్పలేనిది!!

కొ.మె.   ఇప్పుడే The Hinduలో రాం గుహ, బెంగుళూరులో షాంబాగ్ నడిపిన “Premier bookshop” మూతపడిందని రాస్తే చాలా బాధేసింది. ఆ షాపుకి నేను వెళ్ళింది ఒక్కసారే (2004) అయినా చాలా గొప్ప జ్ఞాపకాలున్నాయి. http://www.hindu.com/mag/2009/03/15/stories/2009031550090300.htm

ప్రకటనలు

7 responses »

 1. పరుచూరిగారి చదువు బ్రహ్మాండంగా ఉంది. అలా చదివెయ్యాలని నాకు భలే ఆశ. 🙂
  మీ పరిచయ వాక్యాల్లో ఆయనేం చేస్తుంటారు, ఎక్కడుంటారు వంటివి చెబితే బాగుండేది. ఇంకెందుకాలస్యం… పప్పు నాగరాజుగారినీ, ఫణీంద్రనీ కూడా మీ ఇంటర్వ్యూల్లో ఇరికించండి.

 2. బాగుంది. “అబ్లాగరి” బిరుదు హ హ హ.
  ఈ సందర్భంగా నా నించి రెండు ముక్కలు.
  ఒకటి .. నవోదయ రామ్మోహన రావుగారు జిందాబాద్!
  రెండు .. ది లిటిల్ మేగజీన్ .. మంచి సమకాలీన సాహిత్యం, సామాజిక విశ్లేషణ, సమకాలీన చిత్రకళ మీద ఆసక్తి ఉన్న వారందరూ తప్పక చందా కట్ట వలసిన పత్రిక.

 3. “పుస్తకాలు చదవడం కూడ ఒక కళ” అని ఈ ఇంటర్యూని చదివిన వాళ్ళల్లో కొంతమందన్నా గ్రహిస్తే సంతోషం.

  చాలా మంది “ఎన్ని పుస్తకాలున్నాయనేది అసలు ముఖ్యం కాదు కదా?” అన్నది గ్రహించరు. అలాగే అంతకు ముందు తెలియని పేర్లు, నోటికి తిరగని పేర్లు చెప్పినప్పుడు,”ఔరా” అని అనుకోవడం కూడా ఈ బ్లాగ్ ప్రపంచంలో చూడవచ్చు.

  చదువరికి తగిన పుస్తకాన్ని అందించడం కూడా ఒక కళ అన్నదాని మీద మన ప్రచురణ కర్తలకి కాని వారి అమ్మకం దారులకి కాని కనీసపు అవగాహన కూడా లేదు. శ్రీనివాస్ గారన్నట్టు, ““నవోదయ” (అట్లూరి) రామమోహనరావుగారు” లాంటి వారు లేకపోతే వారన్ని పుస్తకాలు చదవగలిగి ఉండేవారా?

  పుస్తకం అమ్మడంలోను “కొనడం” లోను లాభం చూసుకోవడం వల్ల ప్రచురణలోను, చదువరి చదువులోను “ప్రమాణాలు” తగ్గిపోయినవి అన్నది పచ్చి నిజం.

  పుస్తకాలు చదవడం మీద ఒక మంచి “చదువరి” అలోచనా విధానాన్ని పరిచయం చేసినందుకు – రవి కుమార్ గారికి ధన్యవాదాలు.

  “అబ్లాగరి” ప్రయోగం బాగుంది.

 4. అబ్లాగరి అయినా బ్లాగ్బంధువు – పరుచూరి శ్రీనివాస్ గారి ముఖాముఖి బావుంది.

  అలాగే నేను చదవాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయని అర్థమయింది. మీ బ్లాగును కూడా రెఫరెన్స్ కింద వాడుకోవాలండి. నెనర్లు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s