స్త్రీ వాదమే… అంతకుమించి మానవతా వాదం..

సాధారణం

rajani

సమాజ జీవన చిత్రాన్ని చూసి స్పందించడమే సాహిత్యం. సాహిత్య అధ్యయనం వల్ల జీవన సూత్రాల్ని అర్థం చేసుకోగలుగుతాం. జీవితాన్ని శాసించే కీలక చలనసూత్రాలు అవగతం చూసుకున్నవారే నాలుగు కాలాలపాటు నిలిచే రచనలు చేయగలుగుతారు. రచయితలు అనుభవంతో రాటుదేలుతున్న కొద్దీ విమర్శకుల ఉచ్చుల్లో చిక్కుకుంటుంటారు. అలా బయల్దేరిన వివాదాస్పద ఉద్యమాలలో స్త్రీవాదం ఒకటి. స్త్రీవాదాన్ని అత్యంత పరుషమైన ధ్వనితో (టోన్ త్) మనకు అందిస్తున్న విస్తృత కవిత్వంలో ఎర్రజాబిళ్ల ఎరీనా ఒకటి.  అయితే కేవలం స్త్రీవాదం మౌత్ పీస్ స్థాయినిమించి నిండా మానవతావాదం నింపుకొని మన హృదయాలను గాఢంగా హత్తుకోవడం పాటిబండ్ల రజని వాక్యాల ప్రత్యేకత. ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్న ఆ కావ్యాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నాను.

మధ్యతరగతి జీవితం సమస్యల సుడిగుండం. ప్రతి పోరాటమూ ఎన్నో పాఠాలు నేర్పేదే. ఒక్కో పోరాటాన్ని ఒక్కో కమనీయ కవితగా తీర్చిదిద్దారు రజని. సరళీకృత ఆర్థిక విధానాలు ఇంటి ముంగిటనుంచి పెరడుదాకా బార్లా ప్రవహిస్తున్న ఈ రోజుల్లో అన్ని బ్యాంకులు, అన్ని ఆర్థిక సంస్థలు పోటాపోటీగా ఇళ్ళు కట్టుకోవడానికి ఎంతంటే అప్పులు కుమ్మరిస్తున్నాయి. ఈ సంగతి తెలుసుకోలేని నా దేశపు దరిద్ర నారాయణులు రోడ్లు పక్కన సిమెంట్ తూముల్లోనే జీవితాలు గడిపేస్తున్నారు. గృహావసరాలు క్లిష్టమవుతున్న తరుణంలో కవి స్పందన గువ్వా గువ్వా గూడెక్కడేలో ఇలా వుంటుంది: ‘గువ్వా గువ్వా గూడు బాధ నీకే కాదే! / ఆకాశం కప్పు తప్ప సగానికిక్కడ / ఇల్లూ ఇరుగే కాదు / మాటూ మరుగూ లేవు‘. అంతేకాక ‘పంచేందుకు మనసులు ఇరుకైన చోట / కునికేందుకు పంచన చోటు కరువైన చోట / అవ్వా అవ్వా నీకు తోడెవ్వరే?‘ అని వాపోతారు.

గృహిణి సమస్యలు గృహిణివి కాగా ఉద్యోగిని సమస్యలు మరింత విలక్షణంగా వుంటాయి. ఇప్పుడిప్పుడే భారతదేశంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయక తప్పని పరస్థితులు అలవాటవుతున్నాయి. తరాల అంతరంగా మనం తయారుచేసుకున్న మెంటల్ ఫ్రేమ్ వర్క్ ఈ సరికొత్త విషయానికి అడ్జస్ట్ కాక ఉద్యోగినికి మరింత ఇబ్బందిని గురిచేస్తున్నాయి. ఈ దశలోనే స్త్రీవాదులు ముమ్మరంగా అవగాహన కార్యక్రమలు చేపట్టాలి. ఉద్యోగిని ఆదివారం లో కవి రజని ఆదివారమైనా కాస్తంత వసులుబాటు చిక్కుంచుకుందామన్న ఆశ అడియాశేనంటారు. ‘అన్ని బాధ్యతల్ని సమానంగా పంచుకునే మనం / మన బరువు దించేందుకు చేయందించరేమని నిలదీయాలి! మన పిల్లలనుంచైనా / ఇంటిపనంటే ఇంతులది కాదని నేర్పాలి! / అమ్మాయిలతోపాటు అబ్బాయికీ అంట్లు తోమడం అలవాటు చేయాలి!‘.

ఉత్తమ సాహిత్య సృజన డబ్బులకోసం జరగదు కాని, కథో కవితో రాసిన రచయితకు కాస్త సొమ్ము పారితోషకంగా పంపిస్తే, అబ్బ… ఆ రచయిత ఆనందం అంతాఇంతా కాదు. ప్రపంచ దేశాల్లో రచనలమీదే బతుకుతున్న వారున్నారు. మనకలా కాదు. మనమది ఊహించలేని విషయం. డబ్బుల సంగతి దేవుడెరుగు, రచన ప్రచురణకు తీసుకున్నదీ లేనిదీ చెప్పే ఆచారం కూడా లేదు. అయినా రాయడం ఆపలేం. అదేమాట రజని రెమ్యునరేషన్ గ్యాప్లో  ‘అమర్చినదానిపై అయ్యగార్ల చెయ్యైనా, / అన్నీ వార్చాక అత్త పెత్తనమైనా, / పోడు వ్యవసాయమూ మానం / పొయ్యి రాజెయ్యకా మానం / అందుకేనేమో మనం కవులం, సససృష్టికి మనశక్తిని ధారపోసే కౌశికులం‘ అంటారు.

బడి పంతులమ్మే అయిన పాటిబండ్ల రజని ఉపాధ్యాయుడు చేసే ఎంత చిన్న తప్పునైనా పెద్దపదాలతో ఎండగడుతుంది. అలాంటిది ఒక ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు తన విద్యార్థిపైనే అత్యాచారపు అఘాయిత్యానికి పాల్పడితే రెప్ప కాటేసిన కథలో ఎంత తీవ్రంగా స్పందించారో చూడండి: ‘అయ్యవారికి చలట అమ్మాయిల మానాలు / ఆడపిల్లలకిపుడు కొత్త పాఠాలు / భారతదేశం మన పితృభూమి, భారతీయులందరూ మన బావమరుదులు… తరతరాల యోధుల కథల్తో పాటు తమను తాము కాపాడుకోవడం కూడా నేర్పండి. / రాణీ మల్లమ్మ కథ వద్దు రమజాబీ పాఠం చెప్పండి / మాంచాల పద్యాల బదులు మాయాత్యాగి గాధ చెప్పండి / కప్పను కబళించే పాముల్ని గురించే కాక / కను’పాప’ల్నీ కాటేసే రెప్పల విపరీతాన్ని కూడా / ఒప్పులకుప్ప వయసప్పటినుంచే హెచ్చరించండి‘.

ఇక ఈ పదునైన, అందమైన కవితా సంపుటికి శీర్షికగావున్న ఎర్ర జాబిళ్ల ఎరీనా టూరిజం ముసుగులో విదేశీ వింత పశువులు చేస్తున్న బాలవేశ్య వ్యాపారపు వికృతానందంపై మండిపాటు. ‘రండి బాబూ రండి, వెల్ కమ్ టు ఇండియా, ఇప్పుడిది మొగ్గ మెహందీల ఏరియా!‘ అ0టూ ఆ నరక సామ్రాజ్యంలోకి  స్వాగతిస్తున్నారు. ఇక అక్కడనుంచి ఆ కిరాతక దురాగతాన్ని మానవీయ కోణంలో కవిత్వీకరిస్తారు. దాదాపుగా ప్రతి కవితా కోట్ చేయతగ్గదే గాని ఇక్కడితో ఆగిపోతున్నా.

ప్రతి పుటనిండా మానవీయ విలువల్ని సుకుమారంగా, అదే సమయంలో కఠినంగా కవిత్వీకరించిన 95 పేజీల పాటిబండ్ల రజని ‘ఎర్రజాబిళ్ల ఎరీనా’ 20 రూపాయలకే దొరుకుతోంది. మరి మీరూ తప్పక చదవండి.

ప్రకటనలు

2 responses »

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s