ఇరవయ్యోవారం చదువు ముచ్చట్లు నాగరాజుగారితో…

సాధారణం

గతవారం పరుచూరి శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూకు వచ్చిన స్పందన అపూర్వం. శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం, హైదరాబాదులనుంచి బ్లాగు మిత్రులు ఫోన్లపై అభినందించారు. మరో ఐదుగురు మెయిల్లద్వారా బాగుందని చెప్పారు. ఒక బాగా చదువుకుంటున్న పాఠకుడు తోటి పాఠకుడిని ఎంత ప్రభావితం చేస్తాడో కదా! అలాంటిదే ఈ వారం చదువు ముచ్చట మరోటి మీకు అందించాలి. సాలభంజికలు బ్లాగుతో అందరి మన్నన పొందిన పప్పు నాగరాజుగారు ఎంత విస్తృత అభిరుచులు కలిగిన పాఠకులో ఇది చదివాక మీకే తెలుస్తుంది. ప్రస్తుతానికి పనివత్తిడి వల్ల బ్లాగు రాయడం కుదరక తాత్కాలికంగా క్యాప్ బిగించి కూర్చున్న నాగరాజుగారు పెన్ను క్యాప్ ఎక్కడో పోగొట్టుకోవాలని, ఆయనకు తీరుబడి కుదరాలని కోరుకుంటూ… చదువు ముచ్చట్లలోకి వెళ్లండి. 

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

పనికొచ్చేపుస్తకాలన్నీ అంతో ఇంతో బోరింగ్ గానే ఉంటాయి 🙂 బోర్ కొట్టడం అన్నది పుస్తకం లేదా రచయిత కన్నా, ఆ సబ్జెక్టుపై మనకున్న అవగాహనమీద ఆధారపడి ఉంటుందనుకొంటాను. విషయ సాంద్రత తక్కువగా ఉన్న రచనలు బోర్ కొట్టవు గాని, చదవటానికి చిరాగ్గా ఉంటాయి.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

కొన్నవి చాలానే ఉన్నాయి. బెంగళూరులో సెలక్టు బుక్ షాప్ మూర్తిగారికి నాకేం కావాలో తెలుసు, ఆయనే ఫోను చేసి పిలుస్తుంటారు. లండన్ లో ఒక మిత్రుడికి ఏంటిక్వేరియన్ బుక్ షాపుంది – ఆయన కూడా నాక్కావల్సిన పుస్తకాలు సంపాదించి పెడుతుంటాడు. ఒక పది మంది స్నేహితులు ఉన్నారు – వాళ్ళు కూడా ఓ కన్నేసి ఉంచుతారు – మేం ఫాలో అయ్యే ఏరియాస్ లో వచ్చిన పుస్తకాలు, వ్యాసాలు, ఇ-బుక్సు, జర్నల్ పేపర్లూ గట్రా వెంటనే తీసుంచడమో, కొనడమో చేస్తారు. ఈ మధ్య అలా వచ్చి చేరినవి చాలానే ఉన్నాయి.

యూనివర్శిటీలో చదువుకొనే రోజుల్లో రెండు రోజులకో పుస్తకం చదివి ముగించటం ఉండేది. రీసెర్చి చేసే రోజుల్లో అది వారానికొకటిగా దిగజారింది. ఉద్యోగం చేసినన్నాళ్ళూ వారాంతాల్లో ఒకటైనా కొలిక్కొచ్చేది. ఇప్పుడు కన్సల్టింగ్ పనుల్లో పడడం మూలంగానూ, చాలా సబ్జెక్టులలో చేతులు పెట్టడం వల్లానూ – మొదలెట్టేవి బోలెడు ఉంటాయిగానీ, అవి ముగింపుకి రావడానికి చాలా సమయం పడుతోంది. ఏదేమయినప్పటికీ, ప్రతివారం కనీసం ఒక పుస్తకమైనా చివరి పేజీకి రావడమో, లేదా ఇప్పట్లో దీనిని చదవనక్కరలేదని మూసెయ్యడమో మాత్రం చెయ్యగలగుతున్నాను. చదివి ముగించేవి పుస్తకాల కంటే కూడా ఎక్కువగా జర్నల్ పేపర్లు, కాన్ఫరెన్సు ప్రొసీడింగ్సూ ఉంటాయి.

Dijkstra Archives నుండీ వారనికొక పేపరైనా చదువుతూ ఉంటాను. ఇవి కాకుండా, IEEE, ACM డిజిటల్ లైబ్రరీకి సభ్యత్వం ఉంది – వాటినుంచీ CACM, IEEE Software, Internet Computing, Transactions in Software Engineering జర్నల్సు విధిగా ప్రతినెలా చదవాల్సి ఉంటుంది.

ఏడాది క్రితం మొదలెట్టి, గత మూడు నెలల్లో ముగించినవి, లేదా మధ్యలో మూసేసినవి:

Technical, Professional, Semi-Professional:

 Chiristopher Alaxander: The nature of Order, Vol4 – The Luminous ground,  Geralad Weinberg:  Quality Software Management, Vol2 – First Order Measurements, Russel Ackoff – Idealized Design, Paul Clements: Software Product Lines, Tipton, Krause: Information Security Handbook, Terry Winograd: Bringing Design to Software

Sanskrit Studies, Poetics:

Kunjunni Raja – Indian Theories of Meaning,  Philosophy of the Grammarians (Vol5, Encyclopedia of Indian Philosophies), Dr V. Raghavan – Studies on some concepts of Alamkara Sastra.

Art, Art History, Hermeneutics:


Anand Coomaraswamy – Time and Eternity, BETTINA BAUMER  (Editor), Prakriti – Vol3 – Agamic Tradition and the Arts, Huseyan Alantar: Language of the Designs, J.E. Burton – Purpose and Admiration, A lay study of the visual arts.

History, Biography and History of Ideas:

Wilson Hunter – History of British India, Bruce Malleson – Decisive Battles of India, Smith – Oxford History of India, Marc Seifer – The life and times of Nicola Telsa,  Frances Yates – Giordano Bruno and the Hermetic Tradition, Rosicrucian Enlightenment, Meadows Taylor – Tara, A Maharatta Tale.

General Interest:

Donald Knuth: Things a Computer Scientist Rarely Talks About. Tahir Shah –In Arabian Nights, Robin Williams: The Non Designer’s Design Book ,  Douglas Hofstadter – I am a strange loop, Robert Anton Wilson: Prometheus Raising, వజ్ఘల చినసీతారామస్వామి శాస్త్రి – ద్రావిడ భాషా పరిశీలనము (రెండో సంపుటి).
 
 
 

 

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

కేకు మీది కొవ్వొత్తులూ, కాల్చి పారేసిన సిగరెట్లూ, కొన్న పుస్తకాలు, మా కోమలి కొన్న కోకలూ – వీటికి లెక్కలు చూసుకోకూడదు.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

ఇంటర్లో ఉన్నప్పుడు మధుబాబు షాడో పుస్తకాలు తెగ చదివేవాడిని. ‘మధుబాబు సాహిత్య సర్వస్వం’ ఎక్కడైనా దొరికితే బాగుండునని చాలాకాలంగా చూస్తున్నాను – దొరకటంలేదు. అందులోనూ డ్యూయల్ ఎట్ డబుల్ రాక్ అని షాడో నవలొకటి – మ్చ్ దొరకటంలా.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

ఇది చెప్పటం చాలా కష్టం. వాల్మీకి, Will Durant, Idries Shah, Augy Heytar, Russel Ackoff, Gerald Weinberg, Robert Anton Wilson, Frances Yates, Desmond Morris, Feynman, Mihalay Csikzentmihalay, Jared Diamond, Christopher Alexander, Douglas Hofstadter, Donald Knuth, Edsger Dijkstra, Russel Ackoff, Polya…

తెలుగులో నేను చదివిన ఆధునిక సాహిత్యం చాలా తక్కువ. తెలుగుబ్లాగు ద్వారా చాలా మంచి స్నేహితులు దొరికారు – వారు చెప్పడం వల్ల అఫ్సర్, సన్నపురెడ్డి, నాయని, శ్రీరమణ, వేల్చేరు, జయప్రభ, కొడవటిగంటి రోహిణీప్రసాద్, విన్నకోట రవిశంకర్, భైరవబట్ల కామేశ్వరరావు, కొల్లూరి సోమశంకర్, అక్కిరాజు, కల్పనా రెంటాల, నిడదవోలు మాలతి వంటి కొంతమంది సమకాలీన రచయితల గురించీ తెలుసుకోగలిగాను. వేల్చేరు గురించి నాకు రెండేళ్లక్రితం వరకూ అస్సలేమీ తెలియదంటే – అందుకు నన్ను నేనే క్షమించుకోలేను. చేకూరి, బూధరాజు వంటి వారి గురించీ కూడా నాకు నెజ్జెనుల ద్వారానే తెలిసింది.  నేను చదివిన వాటిలో  మధురాంతకం రాజారం కథలు, రామకృష్ణశాస్తి గారి కథలు, శ్రీపాదవారి సాహిత్యం, కారా కథలు, రాచకొండ కథలు, నవలలు చెప్పుగోదగ్గవి. నండూరి రామ్మోహనరావు గారి వ్యాసాలు, పుస్తకాలు అంటే చాలా ఇష్టం. నార్ల, బుచ్చిబాబు వ్యాసాలు కూడా. కొడవళ్ళ హనుమంతరావుగారి కంప్యూటింగ్ వ్యాసాలు చదువుతూ నన్దతి నన్దతి నన్దత్యేవ అంటూ ఆనందంతో పరవళ్ళు తొక్కుతూ ఉంటాను.   కవిత్వం – కృష్ణశాస్త్రి, శేషేంద్రశర్మ, ఇస్మయిల్, విన్నకోట.

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

మా ఆవిడ ఓ పందెంలో ఓడిపోయి,  Encyclopedia of Indian Temple Architectures పుస్తకాలన్నీ కొనిచ్చింది పాపం.  సురేశ్ కొలిచాల Hermen Hesse సిద్ధార్థ ఇచ్చాడు, పూర్ణిమగారు ముళ్లపూడి కదంబరమణియం ఇచ్చారు, అరుణగారు  పూర్వగాధాలహరి, త్రివిక్రమ్ తిరుమల రామచంద్రగారి పంచతంత్రం, నా పార్టనర్ సతీష్ బండార్కర్ ఓరియంటల్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్ వారు (BORI) ప్రచురించిన మహాభారతం – క్రిటికల్ ఎడిషన్ ఇచ్చారు. ఇంకో స్నేహితుడినుండీ బోర్హెస్ బుక్ ఆఫ్ సాండ్, ఫిలిప్ బాల్ – డెవిల్స్ డాక్టర్ వచ్చాయి. నేను కూడా ఏవో చాలానే ఇచ్చినట్టున్నా – వివరాలన్నీ అంతగా గుర్తులేవు.

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?
 
 IEEE Spectrum, MIT Technology Review, National Geographic Magazine రెగ్యులర్ గా చదువుతాను.

నేను హైస్కూల్లో ఉన్నప్పుడు – యండమూరి తులసిదళం ఏదో వారపత్రికలో సీరియల్గా వచ్చేది .  మా వీధిలో హోం మినిష్టర్లందరూ, మా చందమామలకి కోతపెట్టేసి, అది కొనుక్కొనేవారు. మమ్మల్ని లైబ్రరీలో చదువుకోమనేవారు – లైబ్రరీలో చందమామ పుస్తకం సర్ఫు నీళ్ళలో ముంచిన చడ్డీలా లుంగలు చుట్టుకుపోయి చూడంగానే ఏడుపొచ్చేది. అసలు యండమూరి వల్లే చందమామ మార్కెట్టు పడిపోయిందని నాకు ఆయనమీద  గుడ్డికోపం. అప్పటినుండీ తెలుగువార పత్రికలంటే నాకు తీరని కసి. ఎప్పుడూ చదవనని చందమామ మీద ఒట్టేసుకొన్నా 🙂 యువ, స్వాతి మాస పత్రికలు, విపుల మాత్రం అప్పుడప్పుడూ చూస్తుండేవాడిని – అవి కూడా విజయనగరం వెన్‌లాక్ లైబ్రరీలో లుంగలు చుట్టుకుపోయిన వాటిని మాత్ర్రమే.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?
  బెడ్రూములో ఒకటి, బాత్రూములో ఒకటి, స్టడీలో మూడో నాలుగో, డైనింగు టేబిలు మీదొకటి, ఆఫిసులో రెండు, బేగులో ఒకటి – ఇలా చాలా పుస్తకాలతో ఒకేసారి పని చేస్తుంటా. ప్రస్తుతానికి  బయట ఉన్నవి – Karl Potter’s Encyclopedia of Indian Philosophies, Vol2  ( The Tradition of Nyaya-Viseshika) ,  Lakshman Sarup – The Nighantu and The Niruktha,  Russel Ackoff – His Classic Writings on Management, Joel Sposky – Joel on Software.  Israel Regardie – The Golden Dawn System of Magic,  Frances Yates – Occult Philosophy in Elizabethan Age,  Bernard Shaw – Prefaces,  Francios Bernier – Travels in Mogul Empire,  Richard Burton – Thousand Nights and a Night (Arabian Nights) – Vol10 – Terminal Essay.

ఇవి కాకుండా, తెలుగులో నూకాల చిన సత్యనారాయణ  గారి సంగీత శాస్త్ర సుధార్ణవము. కావ్యకంఠ గణపతిముని – భారతచరిత్ర పరీక్ష, మడికి సింగనార్యుడి ద్విపద భాగవతము (దశమ స్కంధము) – critically edited by A.Mahadeva Sastri (Tanjaore Saraswathi Mahal Library Publication)  చదువుతున్నాను. ఈ సింగనార్యుడు పోతన కంటే ముందువాడట, భాగవతాన్ని ద్విపద కావ్యంగా రాసాడు. సరస్వతీ మహల్ లైబ్రరీలో ఉన్న తాళపత్ర గ్రంథాన్ని అక్కడ లైబ్రరియన్ గా పనిచేసిన మహదేవశాస్త్రిగారు పరిష్కరించి ప్రచురించారు. ఈ మధ్యనే దొరికింది.

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?
 
 వాల్మీకి రామాయణం. హైస్కూల్లో ఉన్నప్పుడు – కొ.కు నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం, నండూరివారి విశ్వదర్శనం పుస్తకాలు సైన్సు, ముఖ్యంగా ఫిజిక్సుపై ప్రగాఢమైన ఆసక్తిని కలిగించాయి.  కాలేజీ రోజుల్లో ఫైన్మాన్ లెక్చెర్స్ ఇన్ ఫిజిక్స్ చదివినప్పుడు ఒక సబ్జెక్టుని ఎంతగా ప్రేమించవచ్చో తెలిసొచ్చింది, యూనివర్శిటీ రోజుల్లో Dijkstra’s Discipline of Programming  ఒకానొక రోజు లైబ్రరీలో నాకంటబడుండకపోతే బహుశా నేను ఆత్మహత్య చేసుకొనేవాడినేమో – దాన్ని చదివి జీర్ణం చేసుకోడానికి మాత్రం మూడేళ్ళు పట్టింది. ఇప్పటికీ అందులో non-determinacy being bounded  అనే థీరమ్ నాకు చాలా ఇష్టం. Will Durant – Story of Civilization. ఇంకా Russel Page – The Education of a Gardner, Rafael Lafort – Teachers of Gurdjeiff,  P.D.Ouspensky – Teritium Organum, Christopher Alaxander – Pattern Langauges and Nature of Order.  Jeffry Bellman – Consultant’s Calling ఇలా చాలానే ఉన్నాయి.

11. చివరిగా ఒక మాట:

పరుచూరి తెలుగులో పబ్లిషింగ్ ఎంత దీనావస్థలో ఉందో చెప్పారు – నాదీ అదేమాట. మనం వెనక్కి వెళ్తున్నట్టున్నాం – వావిళ్ళ వారి పుస్తకాలు చాలా బాగుండేవి. ఇప్పుడు టెక్నాలజీకి కొరతేంలేదు, కాని ప్రాంతీయ భాషల్లో ఉన్న పుస్తకాలకి ఓ ISBN నంబరుగానీ, CIP గానీ, నంబర్ లైన్లు గానీ ప్రసక్తే ఉండదు. బుక్ డిజైన్ అన్న కాన్సప్టే ఉన్నట్టుగా తోచదు. ఇక సొంతగా వేసుకొన్న పుస్తకాలకి కొండవీటి చాంతాడంత ముందుమాటలు, స్థానిక ఎమ్.ఎల్.ఏ గారో,  జిల్లా పరిషత్ హైస్కూలు హెడ్‌మాస్టరుగారో రాసిన యోగ్యతా ప్రతాలు, దాతలు-విరాళాల చిట్టాపద్దులు, ఫొటోల్తో సహా రచయిత వంశవృక్షం – ఇవన్నీ పాఠకుడికి అవసరమా? రెండు అట్టల మధ్య తమ రచనని బంధించడానికి ప్రచురించినట్టుగా ఉంటాయేగానీ, పాఠకులు చదవడం కోసం ప్రచురించినట్టుగా ఉండవు.  పుస్తకం చివర్లో బిబ్లియోగ్రాఫిక్ రిఫరెన్సులూ, ఇండెక్సూ వంటివి చాలా తక్కువ పుస్తకాలలో కనిపిస్తాయి.  మోతీలాల్ బనార్శీదాస్, మున్షీరామ్ మనోహర్లాల్, మనోహర్ పబ్లిషర్స్, అడయార్ రీసెర్చి లైబ్రరీ, BORI  వంటి కొన్ని ప్రచురణ సంస్థల ప్రచురణలు మాత్రం చాలా బాగుంటున్నాయి.

కొల్లూరి సోమశంకర్ గారు లైబ్రరీల దుస్థితిని వర్ణిస్తూ పొద్దులో ఒక కథ రాసారు. నాకు తెలిసి అసలు పరిస్థితి అంతకన్నా చాలా ఘోరంగా ఉంది. పెద్ద లైబ్రరీలనుంచీ పుస్తకాలు వేలకు వేలు మాయం అయిపోతున్నాయి. మనక్కావల్సిన పుస్తకం ఏ లైబ్రరీలో ఉందో చెప్తే, ‘సంపాదించి’ పెట్టే సోర్సింగ్ ఏజెంట్లున్నారు.

లైబ్రరీలలో మిగిలున్న పుస్తకాలు దుశ్శాశనుడిచేత పరాభవంపొందిన పాండవపత్నిని తలపిస్తూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం పూనేలో బండార్కర్ లైబ్రరీని కొందరు దుండగులు నాశనం చేసారు. వీటన్నిటికీ కారణం ఒకటే – ప్రజలకి లైబ్రరీలతో ఎటువంటి సంబంధం లేకపోవటమే. సరస్వతీ ప్రార్థనలు రోజూ చేస్తారు – తీసుకొన్న పుస్తకం మాత్రం తిరిగి ఇయ్యరు. నా పుస్తకాలు చాలానే అలా పోయాయి కూడా. అలాగని, ఎవరైనా అడిగితే పుస్తకం ఇయ్యకుండా ఉండలేం కదా? ఎందుకంటే, పుస్తకం ఉండాల్సింది చదివేవాడి చేతిలో – అద్దాల బీరువాల వెనకాల కాదు.

Book Preservation, Book Restoration గురించీ లైబ్రరియన్లకి కూడా కనీశ అవగాహన ఉండదు. ఏవో కొన్ని యూనివర్శిటీ లైబ్రరీలకి తప్పించి, పబ్లిక్ లైబ్రరీలకి నిధులు లేనే లేవు. మన దేశం నాలెడ్జి సొసైటీ అయిపోవాలంటే ఎలా అవుతుంది? ఈ మధ్యకాలంలో చాలామంది రచయితలు వాళ్ళ పుస్తకాలు సొంత ఖర్చులతో వాళ్ళే ప్రచురించుకొంటున్నారు. ఇంటికొచ్చిన బంధువులకీ, స్నేహితులకి ఒక కాపీ ఉచితంగా ఇస్తారు – అదే చేత్తో ఓ యాభై కాపీలు కొన్ని లైబ్రరీలకి ఉచితంగా పంపవచ్చు కదా? ఆ ఆలోచనకూడ రాకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.  ఇప్పుడు జాలంలో ఉన్న వెబ్ పత్రికలైనా, సమకాలీన రచయితలనుంచీ అనుమతి పొంది, వారి రచనలని పి.డి.ఎఫ్ రూపంలో ఆర్కైవ్స్ లో ఉంచగలిగితే, కొన్ని పుస్తకాలైనా కాలగర్భంలో కలిసిపోకుండా ఉంటాయోమో.

ప్రకటనలు

12 responses »

 1. అమ్మో!! ఈ పుస్తకాల పేర్లు కూడా మొత్తం చదువుతుంటేనే బుర్ర తిరిగిపోతుంది. మనకు చెప్పినవే ఇన్ని పుస్తకాలుంటే , చెప్పనివి వాళ్లింట్లో ఉన్నవి ఇంకెన్నో. ఇవి కదా అసలైన చదువు ముచ్చట్లు. నాగరాజు, పరుచూరి , కొత్తపాళీగారివి. పుస్తకాల నిధులే ఉన్నాయి వీళ్ల దగ్గర..

 2. జీవితకాలానికి సరిపడా పుస్తకాలు దొరికాయండి.

  నాగరాజు గారు, మధుబాబు గారి పుస్తకాలు మా వూరికెళ్ళే దారిలో హిందూపురం అన్న వూరున్నది. ఆ వూర్లో దొరుకుతాయి. కాకతాళీయంగా మొన్న శనివారమే ఓ పుస్తకం (టార్గెట్ ఫైవ్ అని షాడో స్పై థ్రిల్లర్) కొన్నాను. మీ ఫేవరేట్ పుస్తకం దొరికుతుందేమో నేనూ చూస్తాను. 🙂

 3. నాగరాజుగారి సమాధానాలు చదివి మళ్ళీ అంత నిడివిగా సమాధానం రాసేయాలని బహు కోరికగా వుంది కానీ, సమయాభావం వల్ల ప్రస్తుతానికి ఆయన్ను కదిలించి రాయించుకున్న మీకు, చాలా వివరంగా రాసిన నాగరాజుగారికి thanks చెప్పి ముగిస్తాను.

  చేంతాడంత కామెంటుతో ఈ వారాంతంలో మళ్ళీ రాక. 🙂

  — శ్రీనివాస్

 4. sir i dont know who is nagaraju kani e interview chadivite matram telusukovalsina manishani telisindi kani aayana cheppina pustakala list chuste naku e vayasulone heart attack vastundi sir nijanga nenu chala venakabadi unnanu ilanti vari inspiration nalanti vallaku entina avasaram thanq for such a nice interview

 5. భానూ, కామెంట్ రాసినందుకు కృతజ్ఞతలు గాని, ఎంచక్కా ఇదే లేఖిని లో రాసి, ఆ వచ్చిన తెలుగును కాపీ చేసి, ఇక్కడ కామెంట్ బాక్స్ లో అతికించేస్తే ఎంతబాగుంటుందో కదా. దానికోసం చూడండి. ఇక, శ్రీనివాస్ గారి, నాగరాజు గారు చదువు ముచ్చట్లు మిమ్మల్నే కాదు నన్నూ, యావత్ నా బ్లాగు పాఠక మిత్రులందరినీ తన్మయ, విస్మయ పరిచినవే. ఇక ఒకటొకటిగా వారు పేర్కొన్న పుస్తకాలను దొరక పుచ్చుకుని వాటి పనిపట్టడమే మనం చేయాల్సిన పని. అందుకే నిజానికి ఈ ఇంటర్వ్యూలు.

 6. ఇదీ లెక్క. ఇదీ చదువంటే. ఇవీ చదువు ముచ్చట్లంటే.
  పరుచూరి, నాగరాజు.. మీ బ్లాగు పదునెక్కుతోందండీ.
  మనకు పేర్లు తెలియనివేవో చెబుతున్నందుకు కాదు, వారి విషయ విస్తృతికి, చదువుకీ ఆశ్చర్యం వేస్తుంది.. మంచి ఇంటర్వ్యూలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
  గొప్ప చదువరులతో మీ చదువు కళకళ్లాడాలి. మరి కొందరి గురించి మీకు త్వరలోనే ఉప్పందిస్తా.

 7. ఆయన పెన్ను క్యాప్ కావాలంటే అది దొరికేవరకూ వాళ్ళింట్లోనే తిష్టేసుకుని కూచుంటా. ఆ క్యాప్ మళ్ళీ ఆయనకు దొరక్కుండా భద్రంగా మీ ఊరికి పంపించడానికి ఒక లారీ పంపిస్తారూ? 😉

  అన్నట్లు నేను ఆయనకు ఇచ్చిన పుస్తకం విద్వాన్ విశ్వం గారిది. చాలా యేళ్ళ కిందట చందమామలో ద్విపదలోనూ, వచనంలోనూ బాపు బొమ్మలతో సీరియల్ గా వచ్చిన పంచతంత్ర కథలు అవి.

 8. @ శ్రీకాంత్:
  Here are the details you asked:
  Collected works of Ganapathi Muni, Volume-9 (Bharatacaritramimamsa), Edited by K. Natesan and Dr. Sampadananda Mishra, Published by Sri Ramanasramam, Tiruvannamalai, TamilNadu – 606603, Rs.300/- కాని, ఇందులో సంస్కృతమూలం మాత్రమే ఉంది (అదీ దేవనాగర లిపిలో). చాలా ఏళ్ళ క్రితం గుంటూరు లక్ష్మీకాంతంగారు తెలుగులో సంగ్రహానువాదం రాసారు, దాని కాపీ ఒకటి మా ఇంట్లో ఉంది, నేనదే చదువుతున్నాను. అది ఇప్పుడు దొరకదనుకొంటాను.
  @ రవి:
  మీ అమ్మకడుపు చల్లగా, ఎంత శుభవార్త చెప్పారు. వివరాలతో ఉత్తరం రాస్తాను.
  @ పరుచూరి శ్రీనివాస్:
  That would be a treat. Looking forward to it.

  త్రివిక్రమ్ గారిచ్చిన పంచతంత్రం రాసింది విద్వాన్ విశ్వం, తిరుమల రామచంద్రకాదు. పొరపాటుకి క్షంతవ్యుడిని.

 9. నాగరాజు గారిలో ఉన్న గొప్పతనంమేంటంటే.. బోలెడన్ని పుస్తకాలు చదవడమే కాదు, ఆ పుస్తకాల గురించి, వాటిలోని విషయాల గురించి వివరంగా చెప్పగలిగే ఆయన శక్తి, కుశలత కూడా. అందరికీ ఉండదది. చెబుతున్నపుడు వింటూంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.

  వైవిధ్యమైన ఆయన అభిరుచులు చూడండి.. కంప్యూటరు సైన్సు పుస్తకాలొక పక్కా, సంగీత శాస్త్ర సుధార్ణవము, ద్విపద భాగవతము, ద్రావిడ భాషా పరిశీలనము, టెంపులు ఆర్కిటెక్చరు! ఇవిగాక మధుబాబు డిటెక్టివు పుస్తకాలట!! 🙂

  భాను ప్రకాష్ గారూ, నాగరాజు గారు చక్కగా రాస్తారు కూడాను. మంచి జనాదరణ పొందిన బ్లాగుల్లో ఆయనదీ ఒకటి. అయితే కొన్నాళ్ళ కిందట, నిర్దయగా, మూసేసారు. మచ్చుకు ఆయన రచనొకటి ఇక్కడ ఉంది చూడండి.

  నాగరాజు గారూ, మీ బ్లాగును తెరవవలసిన అవసరం మరోసారి కనబడింది, చూసారు గదా!

  దుప్పల రవి గారూ, మరో మేలిమి ఇంటర్వ్యూ! నెనరులు.

 10. శ్రీ రవికుమార్ గారికి నమస్కారం.శ్రీ పప్పు నాగరాజు గారితో ఇంటర్వ్యు చాలా బాగుంది.కావ్యకంఠ గణపతి ముని గారి నవద్వీప నిజయం గురించి కొంతసేపటి క్రితం చదివేను.ఈ నారరాజు గారెవరు అని నా భార్యనడిగేను.ఆమె ఉరు విజయనగరం కాబట్టి.నాకు తెలియదంది.ఇప్పుడు పై ఇంటర్వ్యూ చదివాక కొంత తెలిసింది.విశ్సమీమాంశ కు తెలుగులో గుంటూరు వారు వ్యాఖ్యానం ఇప్పుడు లభ్యం కాదు కాని.దానిని కావ్యకంఠభారతి (అనకాపల్లి)వారు పునర్ముద్రించేరు.అది కొన్ని గ్రంధాలయాల్లో దొరుకుతుంది.నా కాపీ ఎవరో తీసుకొని మరి తిరిగి ఇవ్వలేదు.-మూర్తి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s