మట్టివాసనతో మత్తెక్కించే ‘దర్గామిట్ట’ కతలు

సాధారణం

జీవిక కోసమో, ఉపాధి కోసమో దేశాలు వలసలు పోయేవాళ్లకు ఆ పరాయి గడ్డలో ఆర్థికంగా కొంత పట్టు సంపాదించాక సొంతగడ్డ గుర్తొస్తుంది. తమ బాల్యం గురించి, ఆనాటి జ్ఞాపకలనూ మధురంగా తలచుకుంటూ వాటిని నెమరువెసుకుంటూ సాహిత్య సృజన చేస్తారు. దానినే మనం ‘డయాస్పోరా లిటరేచర్’ అని పిలుస్తున్నాం. అలెక్స్ హేలీ అన్న అమెరికన్ నీగ్రో తన మూలాలు అన్వేషిస్తూ ఏడు తరాల వెనకకు వెళ్లి, దక్షిణాఫ్రికానుంచి కథ మొదలుపెడతాడు తన ‘రూట్స్’ నవలలో. అప్పట్లో అప్పట్లో దేశవిదేశాల నుంచి ‘రూట్స్’ నవలను ప్రశంసిస్తూ వచ్చిన ఉత్తరాలను సార్టింగ్ చేయడం కోసం హేలీవున్న వీధిలో ఒక తపాలా కార్యలయం పెట్టాల్సి వచ్చిందట.

అదే కాక, డయాస్పోరా సాహిత్యమనదగ్గ ప్రతి రచననూ అటు విదేశాల్లో వున్న దేశీయులేకాక, స్వదేశీయులు కూడా ఘనంగా ఆదరిస్తున్న సంగతి మనం గుర్తించాలి. దేశం దాటితే మనం డయాస్పోరా అంటున్నాం. మరి దేశంలోనే ప్రవాస జీవితం గడుపుతున్న వారి సాహిత్యాన్ని ఏమనాలి? పల్లెల్లో పుట్టి బతుకుతెరువు కోసం పట్టణాలకు, నగరాలకు వలసపోయి అక్కడ ఇరుకు జీవితాల మధ్య, ఇరుకు మనస్తత్వాల మధ్య ఇమడలేక చిన్నప్పటి పల్లె జీవితాన్ని తలచుకుంటూ, అక్కడి దు:ఖంలో సౌందర్యాన్ని, పేదరికంలో ఆనందాన్ని వెతుక్కుంటూ సాగించే సాహిత్య యాత్రను ఏమనాలి? మట్టివాసనలల గుబాళింపులతో మనలను మత్తెక్కించే ఆ సారస్వతాన్ని గుండెలకు హత్తుకోవాలనిపిస్తుంది కదూ!

ఆంధ్రజ్యోతి వారపత్రిక సంపాదకుడిగా తెలుగునేలకు అలాంటి సాహిత్యాన్ని తన “మిట్టూరోడి కతలు”తో పరిచయం చేసిన ఘనత నామిని సుబ్రమన్యం నాయుడిదే. (కొంతమంది శంకరమంచి “అమరావతి కథలు”ను చూపిస్తారు గాని, మీరు ఆ రెండూ చదివితే నా మాట రైటేననొచ్చు!) నామిని స్కూల్ నుంచి బయల్దేరిన మరో మధుర కథకుడు మహమ్మద్ ఖదీర్ బాబు సృజించిన మట్టి పరిమళం “దర్గామిట్ట కతలు”. ఈ వారం ఆ వ్యాసం పరిచయం చేస్తున్నాను.

జమీన్, ఖాదర్ లేడు, దూద్ బఖష్, పెండెం సోడా సెంటర్, లాంటి సీరియస్ కథల కథకుడు ఖదీర్, నామిని సలహాతో తన అమ్మానాన్నల గురించి, తమ పుట్టినూరి గురించి నలుగురికీ తెలియజెప్పాలని చేసిన ప్రయత్నమే ఈ ‘దర్గామిట్ట కతలు’. నామిని రచించిన ‘మిట్టూరోడి కతలు’ సంపుటానికి బాపు తన అభిమానాల జల్లును కురిపిస్తే ఖదీర్ బాబు ‘దర్గామిట్ట కతలు’ చదివిన ముళ్లపూడి తన ‘ముబారక్’లో అభినందనల పులకరింపు వర్షిస్తారు. “ఈ (కతల) నది నీటిలో ప్రతి బిందువు ఒక ఆణిముత్యం. మంచిని ఎగజిమ్మే అగ్ని పర్వతం. ఇందులో నాన్నలూ, అమ్మలూ, అవ్వలూ, తాతలూ అందరూ భూలోక దేవతలు. సుఖసంతోషాలలాగే కష్టాలనూ కన్నీళ్లనూ కూడా నగలుగా వేసుకుని హుషారుగా తిరుగుతారు” అంటూ పొంగిపోతారు ముళ్లపూడి.

ఈ కతలు రాయడం వెనకున్న అసలు కత గురించి రచయిత ఖదీర్ ఓపిగ్గా వివరిస్తారు. నామిని స్కూల్ ఆఫ్ నెరేషన్ ఆఫ్ సాయిల్ ఎలా మొదలైందో చెప్తారు. ఈ కతలకు మార్గదర్శనం కోసం వెతకగా వెతకగా దొరికిన కొన్ని పుస్తకాలు ఇవేనంటారు. ‘పచ్చనాకు సాక్షిగా’, ‘పెన్నేటి కతలు’, ‘అమరావతి కతలు’, ‘అంటరానోళ్ల ఆత్మకతలు’, ‘మాదిగోడు కతలు’. అయితే ఒక్కో పుస్తకమూ దానికున్నపరిధులూ, పరిమితులూ చెప్తారు. అయితే నామిని ‘ముకన్నడి సేద్యం’, ‘మిట్టూరోడి కతలు’, ‘సినబ్బ కతలు’ మర్చిపోయారు. (లేకపోతే అప్పటికింకా విడుదల కాలేదేమో) మొత్తానికి నాడి దొరికిన తర్వాత వైద్యుడికి రోగనిదానం చేయడం సులువైనట్టు కథల పట్టు, గుట్టు తెలిసాక కావలి అనే ఆంధ్రరాష్ట్రంలోని ఒకానొక మధ్యతరగతి చిన్న పట్టణంలో దిగువ మధ్య తరగతి ముస్లిం కుటుంబ జీవనచిత్రం అవలీలగా చిత్రించారు. వీక్లిలో వారంవారం కత తర్వాత కత అచ్చవడం మొదలవగానే తెలుగు పాఠకులు నీరాజనాలు పట్టారు. (అప్పుడే ఖదీర్ బాబుకు తయారైన వేలాది అభిమానుల్లో నేనూ ఒకడిని.)

ఇక అభిమానుల ప్రశంసలను ఖదీర్ బాబు ఎలా రిసీవ్ చేసుకున్నారో తెలుసా? ఇది చదవండి. ‘కడప రెడ్డి ఒకాయన ఫోన్ చేసి ‘పలావెంకారెడ్డి పలావు పెట్టీవా?’ అని అడిగినాడు. (లేని) నా బ్యాంకు ఖాతాలో లక్షలొచ్చి పడిపోయినాయి. మద్రాసునుంచి ఒకమ్మాయి ‘మీ మస్తాన్ సురేష్ ఎలా ఉండాడు?’ అని జాబు రాసింది. అంతే నా అకౌంట్లో కోట్లొచ్చి పడిపోయినాయి. రోజు ఉబ్బితబ్బిబ్బవడమే. ఒకరోజు ఆంధ్రజ్యోతికి ముళ్లపూడు వెంకటరమణగారు దేవుడిలాగా వచ్చి రంజానుకదా అందుకని చేతిలో స్వీటు పాకెట్ పెట్టారు. ఇప్పటికే ఖాతా నిండిపోయింది. నెత్తిమాత్రం ఖాళీగా వుంది. రెండు కొమ్ములు మొలిచినాయి.” అంటారు.

ఇహ కతల జోలికా వెళ్లకపోవడమే మంచిది. మీసాల సుబ్బరాజు, మనసున్న అమ్మానాన్నలకు తోడు నాయినమ్మ, పలావెంకారెడ్డి, పెండెం రవి, నేరెళ్ల మస్తాన్ సురేష్, జైబూన్ అపా, జరీనాంటీ, వీళ్లు మనుషులయితే, ఇక సంఘటనలు ఎన్నో అన్నీ పరవశింపజేసే కథలే. చిక్కటి మానవత్వ మహనీయ విలువలకు చక్కటి అత్తరులాంటి హాస్యం జోడించి నవ్వుతున్నప్పుడే కన్నీళ్లు చిప్పిల్లే కతల అద్భుత సమాహారమే ఈ “దర్గామిట్ట కతలు”. కతలకు ముందూ వెనకా మోహన్ తొడిగిన బొమ్మలు మరో అదనపు ఆకర్షణ.

కావలి ప్రచురణలుగా వెలువడిన 140 పేజీల ఈ కతల సంపుటి 45 రూపాయలకే దొరుకుతోంది. హృదయానికి ఆహ్లాదం, ఆనందం పంచే ఈ కతలు మీరూ తప్పక చదవండి.

ప్రకటనలు

2 responses »

  1. నేను విశాలాంధ్ర, నవోదయ publications వాళ్ళకి phone చేసి “లేవ”నిపించుకున్నాను. బాబ్బాబు “కధ”లెక్కడ దొరుకుతాయో చెబుదురూ… phone number కూడా ఇవ్వ గలిగితే చాలా బాగుంటుంది.

    అన్నట్టు మర్చి పోయాను నేను కూడా పోలేరమ్మ బండ కధలు చదివానండోయ్… కాకపోతే ఎవరో నా దగ్గరనుండి ఆ పుస్తకాన్ని “సంగ్రహించారు” (దీన్ని దొంగిలించారు) అని చదువుకోగలరు.

  2. అవును దర్గామిట్ట కధలు భలే బావున్నాయి. ముఖ్యంగా – చాలా ముఖ్యంగా – అతి ముఖ్యంగా ఆ Illustrations. Loved them.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s