ఇరవై ఒకటో వారం చదువు ముచ్చట్లు ఫణీంద్రతో…

సాధారణం
మరో చదువు పురుగు ఫణీంద్ర.        చదివిన చదువు ఇచ్చిన వ్యక్తిత్వం నిలబెట్టుకునే ప్రయత్నంలో రకరకాల ఉద్యోగాలు చేస్తూ ప్రస్తుతానికి జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న ఫణి గమ్మత్తయిన చదువరి.                 ఒకరకంగా తెలుగునేలమీద ఇంత అరుదైన చదువు అభిరుచులు వున్నారని మనకు తెలుస్తున్న కొద్దీ చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా వుంది.     మనకు కావలసిందల్లా మంచి మంచి ప్రచురణలే గాని, తప్పక చదివి తీరతాం.        ఈ వారం ఫణీంద్ర చదువు ముచ్చట్లు వినండి మరి…
చదివింది తక్కువే అయినా చాలా చదివినట్టు హడావిడి చేయగల dilettantish talent నాదగ్గర పుష్కలంగా వుంది. అయినా నా వరకూ ఇది ఒకందుకు బానే వుపయోగపడుతోంది. ఎందుకంటే హడావుడి చేస్తున్నంత ఇబ్బడిముబ్బడిగా చదవడం లేదన్న అపరాధభావన హెచ్చే కొద్దీ నేను మరింత ఆకలితో పుస్తకాల మీద పడుతున్నాను. ఈ మధ్య ఈ ఆత్రంతోనే బాగా చదువుతున్నాను. నేను పుస్తకాలు చదివేటప్పుడు వస్తువేమిటన్నది పెద్దగా పట్టించుకోను. రాసే తీరే నన్ను ఆకట్టుకుంటుంది. నా బ్లాగులోనే ఒకచోట చెప్పినట్టు “పదాల్లోకి రామని మొండికేస్తున్న గహమైన భావోద్వేగాల్ని (abstract emotions) చెవి మెలిపట్టి లాక్కొచ్చి అక్షరాల వరుసలో పేర్చి కూర్చుండబెట్టగలిగే కలంకుశ ధారులైన రచయితలన్నా; కలాన్ని కుంచె మాదిరి వాడుకొంటూ అక్షరాల్తో బొమ్మలల్లగలిగే చిత్రకార-రచయితలన్నా నాకు చాలా ఇష్టం”.     
 
1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి) 
 
నాకు బోర్ కొట్టించిన పుస్తకాలు చాలానే వున్నాయి. కాని “ఎందుకు చదివానురా బాబూ” అనిపించే వరకూ నేనాగను; బోర్ కొడుతుందనిపించగానే, సగంలోనే అయినా, పక్కన పడేస్తాను (బహుశా బాధ పడితే “ఎందుకు కొన్నానురా బాబూ” అని బాధపడాలి). ఇటీవల బోర్ కొట్టి పక్కన పడేసిన పుస్తకం అడివి బాపిరాజు “నారాయణరావు”. ఈయనదే మరో పుస్తకం “హిమబిందు” కూడా ఇలాగే మధ్యలో పక్కన పడేశాను. దీంతో ఇక ఈయనకీ నాకూ పొసగదని నిర్థారణకొచ్చేశాను. “గోనగన్నారెడ్డి” మీద ఓ దండయాత్ర చేసి చూద్దామనుకుంటున్నాను. చూడాలి అదైనా పూర్తవుతుందో లేదో. 
 
అయినా బోర్ కొట్టించడం, కొట్టించకపోవడం పుస్తకాల విలువను నిర్థారిస్తుందని నేననుకోను. “డావిన్సీ కోడ్” ఎక్కడా బోర్ కొట్టించదు. కానీ పుస్తకం పూర్తయ్యాక మళ్ళీ మళ్ళీ తరచి చదువుకునేందుకేమీ ఉండదు. సెకండ్‌హేండ్ పుస్తకాల వాడికి సగం ధరకి అమ్మేయటానికి తప్ప ఎందుకూ పనికి రాదు. మరో పక్క “సెంటిమెంటల్ ఎడ్యుకేషన్” పై పుస్తకంలా తరిమి తరిమి చదివించదు. అయితేనేం, జీవితాంతం పదిలపరచుకోదగ్గ పుస్తకమనిపిస్తుంది. 
 
2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?
 
ఈ మధ్యనే భారీ యెత్తున షాపింగ్ చేసాను. ఈ కొన్న వాటిలో ఇప్పటికి పూర్తి చేసింది ఒకటే: “Strange Case of Dr Jekyll and Mr Hyde” by Robert Louis Stevenson”. దీనిపై Vladimir Nabokov కోర్నెల్ యూనివర్సిటీలో ఒక ఉపన్యాసం ఇచ్చాడు. అది చదివే ముందు దీన్ని చదివితే మంచిదని కొన్నాను. నచ్చింది. ఇటీవలే పూర్తి చేసిన మరో పుస్తకం ఫ్రాజ్ కాఫ్కా జీవిత చరిత్ర: “Kafka” by Nicholas Murray. నాకు కాఫ్కా నుంచి, కాఫ్కా గురించీ యేదైనా ఇష్టమే. అలా అని కాకపోయినా, ఈ పుస్తకం చాలా బాగుంది. ఈ పుస్తకంలో కాఫ్కా ప్రేమించదగిన వ్యక్తిగానూ కనపడడు, ద్వేషించదగిన వ్యక్తిగానూ కనపడడు; తరచి చూస్తే మనుషులందరి లాగానే, జాలి పడదగిన వ్యక్తిలా కనిపిస్తాడు. 
 
ఈ మధ్యనే కొనకుండా పూర్తి చేసిన ఒక పుస్తకం శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి స్వీయ చరిత్ర “అనుభవాలూ-జ్ఞాపకాలూను”. మా కాకినాడలో “మాదిరెడ్డి సుబ్బారావు గ్రంథాలయం” అని మంచి ప్రయివేటు గ్రంథాలయం వుంది. అదృష్టం కొద్దీ అందులో దొరికింది. చాలా నచ్చింది. తెలుగు వాఙ్మయ క్షేత్రంలో “అందమైన తెలుగు వచనం” అనే రెక్కమాను దిశగా పోతే తగిలే మొదటి గడప శ్రీపాద వారిదే. ఒకరకంగా ఆయనకు ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేకపోవడం మన అదృష్టం. లేదంటే ఆంగ్ల భాషతో కలుషితం కాని అచ్చమైన అందమైన తెలుగు వచనానికి ఆ ఒక్క చిరునామా కూడా దక్కకుండా పోయేది. చేతిలో మచ్చికైన భాష వుండటంతో ఎలాంటి జటిల భావాన్నైనా ఆయనకాయన స్వంతంగా సృష్టించుకున్న పదబంధాల సాయంతో చాలా సులభంగా వ్యక్తీకరించగలడు. ఆయన వాక్యాల్లో ఏదో సంగీత లక్షణం వుంటుంది. ప్రతీ “కామా” తర్వాతా పైసంగతులు వేసుకుంటూ పోతుంటాడు. దీంతో విషయ సంగ్రహణం కోసం ఆపకుండా చదువుతూ పోవాలా, లేక రసాస్వాదన కోసం ఆ లయ బద్దమైన వాక్యాల్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ చదవాలా అన్న మీమాంస కలుగుతుంది. నేనీ రెండో మార్గాన్నే ఎన్నుకోవడం వల్ల పుస్తకం పూర్తి చేయడానికి చాన్నాళ్ళు పట్టింది. అంతేకాదు, ఎంతైనా “కథక చక్రవర్తి” రాసుకున్న స్వీయ చరిత్ర కదా; కాబట్టి సహజంగానే కొన్ని యధార్థ సన్నివేశాలు కూడా, చెప్పే ఎత్తుగడలో నైపుణ్యం వల్ల, కథా స్థాయికి ఎగబాకి మన జ్ఞాపకంలో విడి కథల్లా వేరుపడి నిలచిపోతాయి. ఉదాహరణకి: తను రహస్యంగా దాచుకున్న మదన కామరాజు కథల్ని అప్పటికింకా పిల్లవాడైన శ్రీపాద చేత గుట్టుగా చదివించుకుని ఆనందించిన ముసలావిడ ఉదంతం; ఎంతో అవసరమైన సమయంలో కాకతాళీయంగా మంచి పర్యాయపద నిఘంటువును బహుమతి యిచ్చి సాయపడిన రైల్వే స్టేషన్‌మాష్టరు చాలా యేళ్ళ తర్వాత మళ్ళీ కనిపిస్తే, చాలాసేపు మాట్లాడి కూడా, ఆయన పేరు అడగడం మర్చిపోయి రైలెక్కేసిన వైనం… ఇలాంటివన్నమాట.  తెలుగులో రచించాలన్న తపన వున్న ప్రతీవారూ ఈ పుస్తకం చదివి తీరాలి. ఇది రెండు రకాలుగా వుపయోగపడుతుంది: వస్తుపరంగా చూస్తే రచన పట్ల ఆయన తృష్ణ మనల్ని ఉత్తేజపరుస్తుంది; వచనపరంగా చూస్తే రచనలో ఆయన అలవోకడ మనల్ని అబ్బురపరుస్తుంది. అంతేకాదు, తాతలనాటి కోస్తా ప్రాంతాన్ని సజీవంగా కళ్ళకు కట్టిస్తుంది. నావరకూ శ్రీపాద రచనలన్నీ ఒక యెత్తు; “అనుభవాలూ-జ్ఞాపకాలూను” ఒక యెత్తు. ఈ పుస్తకం చదువుతుంటే అసలు శ్రీపాద ఒక అస్తిత్వవాద నవల రాస్తే యెలా వుంటుందో అన్న సరదా ఆలోచన వచ్చింది; బహుశా ఈ ఆధునిక వస్తువును ఆయన తన భాషతో యెలా సజాయిస్తాడో చూడాలన్న కుతూహలం వల్ల కాబోలు. (ఇక్కడ “అస్తిత్వం” అంటే తెలుగు సాహిత్యంలో ఇప్పుడున్న vulgar meaning కాదు నా వుద్దేశ్యం; అల్బెర్ట్ కామూ తరహా “అస్తిత్వం”.)   
 
3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?
 
మూడొందల చిల్లర పుస్తకాలుంటాయి.
 
4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?
 
చాలా వున్నాయి. ఇప్పటికిప్పుడు గుర్తొస్తున్నవి చెప్పాలంటే: “Erasers” by Alain Robbe-Grillet. అలాగే నబొకొవ్ నవలలు చాలా నేను చదవలేదు; ముఖ్యంగా “The Gift” చదవాలని చాలా కాలం నుంచీ ఆశ పడుతున్నాను; అలాగే ఆయన స్వీయ చరిత్ర “Speak, Memory” కూడా. హెన్రీ గ్రీన్ రాసుకున్న స్వీయ చరిత్ర “Pack my bag” ఒకటి. త్రిపుర కథల గురించి విన్నాను; అవీ దొరకలేదు. ఇక ఇంట్లోనే వున్నా చాలాకాలంగా చదవలేకపోతున్న పుస్తకం: “Ulysses” by James Joyce. సంవత్సరం క్రితం మొదలుపెట్టి ఒక అధ్యాయం దాటగలిగాను. దాన్ని పూర్తి చేయడానికి ఆదిమధ్యాంతం చాలా సన్నాహం కావాలి. ఎప్పుడు కుదురుతుందో.  
 
— అయినా ఈ ప్రశ్నకి సమాధానం ఇంతటితో ముగించేస్తే మంచిదేమో. లేకపోతే ఎన్ని చదవాలనుకుని చదవలేకపోతున్నానో గుర్తుకొస్తున్న కొద్దీ గుండె గాభరా పెరుగుతోంది. 
 
5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.    
 
Franz Kafka: తొందరపడి ఒక శతాబ్దం ముందే పుట్టేసిన స్నేహితుడనిపిస్తాడు. కాఫ్కా పుస్తకాలన్నీ నాకు యిష్టమే. ముఖ్యంగా డైరీలు, The Castle అన్న నవల బాగా యిష్టం. 
 
Vladimir Nabokov: నబొకొవ్ మనిషిగా, రచయితగా నేనెప్పటికీ చేరుకోలేని నా ఐడియల్. కానీ ఆయన పుస్తకాలు ఈ భూమ్మీద వున్నాయి అన్న ఒక్క కారణం చాలు, ఇక్కడ నా పూర్తి జీవితం కిట్టుబాటై పోవడానికి. Lolita, Pale Fire, Collected Stories, Strong Opinions, Lectures on Russian Literature… ఇవే కాదు, ఆయన పుస్తకాలన్నీ, ఇంకా చదవనివి కూడా, చదివినంత యిష్టం. 
  
 
G.K. Chesterton (అన్ని పుస్తకాలూ): ఆలోచనల్లో స్ఫటికమంత స్పష్టత, వ్యక్తీకరణలో వాడియైన చమత్కారం. ఈయన రాసిందేమిటన్నది నేనెప్పుడూ పట్టించుకోను: వ్యాసాలైనా, విమర్శలైనా, కథలైనా, నవలలైనా, ఏమైనా సరే విచ్చలవిడిగా చదివిపడేస్తుంటాను. ఈయనవి “Father Brown Stories” అని డిటెక్టివ్ కథలు (మార్కెట్‌లో దొరుకుతున్నాయి) బాగా యిష్టం. రచయితలంటే ఎప్పుడూ దీనంగా, దిగులుగా, ఏకాకుల్లా ఉంటారన్న నా అభిప్రాయం ఇద్దరి విషయంలో తప్పైంది: Vladimir Nabokov, G.K. Chesterton. వీళ్ళిద్దరూ “happy writers” అనే అరుదైన జీవ జాతికి చెందుతారు.   
 
Borges (అన్ని పుస్తకాలూ):  ఈయనవి కూడా ఏ genre అన్న విచక్షణ లేకుండా చదువుతాను. నడిచే విజ్ఞాన సర్వస్వాలంటారు కదా. నా దృష్టిలో ఆ epithet అచ్చంగా సరిపోయేది ఈయనొక్కడికే.
 
 J.D.Salinger: (Nine Stories; Franny & Zooey; Raise high the roof beam, carpentars & Seymour – an introduction; Catcher in the rye) : సలింగర్ అలవాటైతే భలే నచ్చుతాడు. మత్తెక్కించే వచనం. మతిపోగొట్టే కల్పనా శక్తి. పైన పేర్కొన్న పుస్తకాల్లో చివరిది బాగా పాపులరైన నవల. కానీ నాకు మొదటి మూడు పుస్తకాలూ చాలా యిష్టం.
 
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి (కథలు): ఈయన అంతా ఆహ్లాదమే. అందమైన తెలుగు వచనానికి అచ్చమైన చిరునామా అని పైననే చెప్పాను. కేవలం సంభాషణల్తో నడిచే ఈయన కథలు చదివి తీరాలి. 
 
మధురాంతకం రాజారాం (కథలు): చాలామంది ఈయన్ని “ఆంధ్రా చెఖోవ్” అనడం విన్నాను. కానీ కొన్ని కథలు చదివితే అసలు చెఖోవ్‌నే ఎందుకు “రష్యన్ రాజరాం” అని పిలవకూడదు అనిపిస్తుంది. I just love him. చిన్నప్పుడెంత ఆనందం ఇచ్చాడో ఇప్పుడూ అంతే ఆనందం ఇస్తున్నాడు. ఈయన కథలన్నీ యిప్పుడు నాలుగు సంపుటాలుగా “విశాలాంధ్రా”లో దొరుకుతున్నాయి.
 
చలం (మ్యూజింగ్స్, ప్రేమలేఖలు): చలం కాల్పనిక రచనల కన్నా నాకు ఇవెక్కువ ఇష్టం. ముఖ్యంగా “మ్యూజింగ్స్” మొదటి వ్యాసాలన్నీ మంచి beat-of-thoughtతో కొనసాగుతాయి. 
 
వీళ్ళుకాక Henry Green, Marcel Proust, James Joyce, Flaubert , Anton Chekov, Samuel Beckett, Ian Mc Ewan; తెలుగులో తిలక్, మల్లాది రామకృష్ణశాస్త్రి, ముళ్ళపూడి వెంకటరమణ, బుచ్చిబాబు, తెన్నేటి సూరి, కాశీభట్ల వేణుగోపాల్ వీళ్ళంతా యిష్టమైన రచయితలే.  
 
6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?
 
నా స్నేహితులకు, హితులకు ఈ ఏడాది మూడు పుస్తకాలు బహుమతిగా యిచ్చాను: “Atonement” by Ian McEwan, “Love in the time of cholera”, by Gabriel Garcia Marquez, “Five Point Someone” by Chetan Bhagat.  నేను మూడు తెలుగు పుస్తకాలు బహుమతిగా పుచ్చుకున్నాను. ఇవిగాక కాశీభట్ల వేణుగోపాల్ “అనాదీ – అనంతం”, “ఒక బహుముఖం” కవితా సంపుటాలు, అబ్బూరి రామకృష్ణారావు గారి సంస్మరణ పుస్తకం అరువు తెచ్చుకున్నాను. 
 
7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?
 
ఇపుడున్న పత్రికలేవీ నేను పెద్దగా చదవను.
 
8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?
 
చాలా వున్నాయి. ఇప్పటికిప్పుడు గుర్తొస్తోంది “One Hundred Years of Solitude” by Gabriel Garcia Marquez. ఎందుకో నాకు అస్సలు ఎక్కలేదీ పుస్తకం. అతికష్టం మీద ఓ పావు భాగం చదవగలిగాను. Sloppy writing. ఈయనదే మరో నవల “Love in the time of Cholera” మాత్రం చాలా యిష్టం. అలాగే చాలామంది గొప్పగా చెప్పే Joseph Heller రచన “Catch-22” కూడా నాకు నచ్చలేదు.
 
9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?
 
పుస్తకం కాదు, పుస్తకాలు; నేను ఒకేసారి పార్లల్‌గా చాలా పుస్తకాలు చదువుతాను. ప్రస్తుతం చదువుతున్నవి:
 
 
ఇది ఒక coming of age నవల. జర్మన్ నుంచి అనువాదం. కథానాయకుడు టోర్లెస్ ఒక బాయ్స్ అకాడెమీలో పదిహేనేళ్ళ విద్యార్థి. అయోమయం కలిగించే శారీరక వాంఛలు, తాత్త్విక ప్రశ్నలతో పాటు, తోటి బాలుర మధ్య జగడాలు, రాజకీయాలు, బాల్య సహజమైన క్రూరత్వం వీటి మధ్య అతను ఎలా ప్రయాణించి ఎలా పరివర్తన చెంది బయటపడ్డాడనేది కథ. ఇందులో రచయిత నిజాయితీ నన్ను ఆకట్టుకుంది. అయితే కొన్ని పేజీలు ఎంత పటిష్టంగా వున్నాయో, కొన్ని పేజీలు అంత అస్తవ్యస్తంగా వున్నాయి. ఇది రచయిత పాతికేళ్ళ వయస్సులో రాసిన నవల కావడం మాత్రం నాలో ఆశ్చర్యాన్నీ, అసూయనీ కలిగిస్తోంది.   
 
Due Considerations” by John Updike: ఇది జాన్ ఉపిడ్కె వివిధ పత్రికలకు రాసిన వ్యాసాల సంపుటి. సమకాలీన ఆంగ్ల సాహితీ వాతావరణాన్ని గురించి తెలుసుకోవడానికి ఇతని కన్నా మంచి గైడు ఎవరుంటారు? అందుకే కొన్నాను. అక్కడా ఇక్కడా నచ్చినచోట చదువుకుంటూ పోతున్నాను.
 
Your Lover Just Called” by John Updike: మామూలుగా రెండుమూడొందలకు తక్కువుండని ఈ పుస్తకాన్ని మొన్న వైజాగ్‌లో ఓ సెకండ్‌హాండ్ పుస్తకాల దుకాణంలో పదిరూపాయలికి కొన్నాను. ఇది, మన మునిమాణిక్యం కాంతం కథల్లా, రిచర్డ్ & జోన్ మేపెల్స్ అనే దంపతుల వైవాహిక జీవితాన్ని వివిధ దశల్లో చిత్రించే కథా సంపుటి. అయితే కాంతం కథలు దాంపత్య జీవితపు ప్రకాశవంతమైన పార్శ్వాన్నే హాస్యస్ఫోరకంగా చూపిస్తే, ఈ కథలు వెలుగు నీడలు రెంటినీ కలిపి నిజాయితీతో మన ముందుంచుతాయి. రచయిత మటల్లోనే చెప్పలంటే “[t]he moral of these stories is that all blessings are mixed.” పదిహేడు కథలున్న ఈ సంపుటిలో నేనిప్పటికి నాలుగు కథలే చదివాను. చాలా నచ్చాయి. ఎంతైనా నబకొవ్ మెప్పు పొందిన రచయిత కదా ఉపిడ్కె.   
 
Collected Stories” by Vladimir Nabokov: నబొకొవ్ రాసిన మొత్తం అరవై అయిదు కథల్నీ ఒక చోట కూర్చిన సంపుటి. ఇంచుమించు చివరికొచ్చేశాను. పుస్తకం వెనక అట్ట మీద విమర్శకుడు జేమ్స్ వుడ్ అన్నట్టు: “A gorgeous book, a tutor in exquisiteness.”
 
“Charles Dickens” by G.K. Chesterton:  ఇది చార్లెస్ డికెన్స్ పై తన అభిమానాన్ని చాటుకుంటూ చెస్టర్‌టన్ రాసిన లిటరరీ బయోగ్రఫీ లాంటిది. చెస్టర్‌టన్ ఎవరి గురించి రాసినా నేను చదివేది మాత్రం చెస్టర్‌టన్ గురించే; ఇది వరకూ “రాబర్ట్ బ్రౌనింగ్” అంతే, ఇప్పుడీ “చార్లెస్ డికెన్సూ” అంతే. నిన్న ముచ్చటేసి అండర్‌లైన్ చేసుకున్న ఒక టిపికల్ చెస్టర్‌టన్ పేరా ఇక్కడివ్వాలనుకుంటున్నాను (ఇందులో చార్లెస్ డికెన్స్‌లో ఆశావాదాన్ని నిరూపిస్తూ నిజమైన ఆశావాది దాన్ని ఒక వాదంగా, జెండాలా పట్టుకు తిరగడని, ఎందుకంటే అతను తన ఆశావాదాన్ని గుర్తించలేనంతగా అందులో మునిగిపోయి వుంటాడనీ చెప్తున్నాడు చెస్టర్‌టన్):    
 
“Most unquestionably there are ragged and unhappy men whom we could easily understand being pessimists. But as a matter of fact they are not pessimists. Most unquestionably there are whole dim hordes of humanity whom we should promptly pardon if they cursed God. But they don’t. The pessimists are aristocrats like Byron; the men who curse God are aristocrats like Swinburne. But when those who starve and suffer speak for a moment, they do not profess merely an optimism, they profess a cheap optimism; they are too poor to afford a dear one. They cannot indulge in any detailed or merely logical defence of life; that would be to delay the enjoyment of it. These higher optimists, of whom Dickens was one, do not approve of the universe; they do not even admire the universe; they fall in love with it. They embrace life too close to criticise or even see it. Existence to such men has the wild beauty of a woman, and those love her with most intensity who love her with least cause.”
 
పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన “సాక్షి వ్యాసాలు”: నా తెలుగు పద సంచయానికి కాస్త విస్తృతిని, వాడకంలో కాస్త వెసులుబాటునీ కలిపించుకోవాలని ఇది చదువుతున్నాను. నిజానికి పైన చెప్పిన అడివిబాపిరాజు నవలలు కూడా అందుకే మొదలుపెట్టాను. కాని ఆసక్తి కలిగించలేంది పట్టుబట్టి ఏం చదువుతాం? సాక్షి వ్యాసాలు అలా కాదు; మొదలు పెడితే వ్యాసం ముగిసేదాకా కూర్చోబెట్టి చదివిస్తాయి. ఈ సందర్భంగా పానుగంటి వచనం గురించి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రాసిన కొన్ని వాక్యాలు యిక్కడ యివ్వాలనుకుంటున్నాను:   
 
“పానుగంటి వారి రచనలు చాలా చదివాన్నేను. కనబడితే, యిప్పటికీ చదువుతూనే వుంటాను కూడా. ఒక విధంగా చూస్తే, చెప్పుకుని మన జాతి గర్వించుకోదగ్గ రచనలు వారివి. మన హాస్య రచయితల్లో వారొకరు. ప్రముఖులున్ను. అయితే, ఎంత బాగా నవ్విస్తుందో, వారి హాస్యం, అక్కడక్కడ, అంత జుగుప్సా కలిగిస్తుంది. […] సాక్షి వ్యాసాలు పదిమందీ కూచున్న చోట చదవడానికికర్హంగా వుండవు. రసికులందరిలో అనేకానేకాలు చదవనే లేరు. పట్టుపట్టి అదేపనిగా చదివితే మాత్రం భావ సౌకుమార్యం కోల్పోయి, మొరటులయిపోతారు.

“అయినా, పంతులుగారికి మంచి గ్రహణ శక్తి వుంది. కథన శక్తి వుంది. భావనా శక్తి వుంది. తన్మయీభవన యోగ్యత వుంది. నిర్వహణ సామర్థ్యమున్నూ వుంది. పంతులుగారు, శబ్దాలు తూచి వేస్తారు. వాక్యాలు పొంకంగా బిగిస్తారు.” 

ఇక్కడ శ్రీపాద ఉదార ధ్వనితో ఏదో మెహర్బానీకి అన్నట్టున్నా, ఈ వాక్యాల్లోని పొగడ్త భాగం అంతా నూటికి నూరుపాళ్ళూ నిజం; కానీ విమర్శ మాత్రం కాస్త వ్యక్తిగత దుగ్ధతో చేసిందిగా నాకనిపించింది (ఆ దుగ్ధకు కారణం “అనుభవాలూ-జ్ఞాపకాలూను”లో కనపడుతుంది కూడా). ఏమో మరి, నేనింతవరకూ ఏడు వ్యాసాల దాకా చదివాను; ఎక్కడా శ్రీపాద చెప్తున్న అసభ్యత గాని, మొరటుదనం గాని నాకు తగల్లేదు. సౌకుమార్యం లేకపోవడం నిజమే; కానీ అదో లోపంగా, రసభంగ కారణంగా నాకు తోచలేదు.        

మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన “కృష్ణాతీరం”: ఈ నవల మొదలుపెట్టి నలభై పేజీలు చదివాను. చిలువలు పలువలుగా కథ చెప్పుకుంటూ పోవడం మల్లాది నైజం. ఒక్కసారి ప్రవాహంలో పడింది తడవు సాఫీగా ముందుకు సాగిపోతాం. సగం కూడా చదవలేదు కాబట్టి నవల గురించి ఏమీ చెప్పలేను.   

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

 
“The Diaries” — Franz Kafka:  ఎప్పుడైనా ఒంటరి ద్వీపంలో తప్పిపోతే నా దగ్గరుండాలని కోరుకునే పుస్తకాల్లో మొదటి పుస్తకమిది. పుస్తక ప్రేమికులు పఠనా వ్యాసంగంలో తరుచూ పొందే ఆనందాల్లో మొదటిది: Recognizing the unrecognized. అంటే — ఏదో వచన వాక్యం చదువుతూన్నపుడో, కవితా పంక్తి చదువుతూన్నపుడో అంతవరకూ మనం మాటల్లో పెట్టని, పెట్టాలనుకున్నా పెట్టలేని, ఎవరూ పెట్టగా ఎప్పుడూ చూడని ఏదో భావాన్ని హఠాత్తుగా గుర్తిస్తాం. ఇది ప్రతీ ఉత్తమ పాఠకునికీ అనుభవానికొచ్చే ఆనందకరమైన అనుభూతి. మరిలా మనలో ఇంతవరకూ రూపమేర్పడని భావాల్ని పదాల్లో గుర్తించడం వల్లనే ఇంత ఆనందం కలుగుతూంటే, ఏకంగా మనమింతవరకూ గుర్తించని మన జీవితాన్నే పదాల్లో చూసుకోగలిగితే అదింకెంత ఆనందమో ఊహించండి. అందుకే నాకీ పుస్తకం అంటే ఇష్టం. నాకు తెలియని నన్ను నాకు పరిచయం చేసిన పుస్తకమది. అందులో ఏం నచ్చిందంటే ఫలానా అని చూపించలేను. It’s like my Bible.    
 
“Lolita” — Vladimir Nabokov: దీని వెనక అట్టమీద “the only convincing love story of our century” అని ఓ వ్యాఖ్యానం ఉంటుంది. ఒక ఫిడోఫైల్ కథని పట్టుకుని ప్రేమ కథ అనడమేమిటా అనుకున్నాను మొదట. కాని పుస్తకం చివరిపేజీలో కొచ్చేసరికి నిజంగా హంబర్ట్ హంబర్ట్‌ది ప్రేమే అనిపించింది. ఈ పుస్తకం ముఖ్యంగా నాకు చేసిన మేలు నబకొవ్‌ని పరిచయం చేయడం. ఆయన నాకు చదవటం అంటే ఏమిటో నేర్పాడు, రాయడం అంటే ఏమిటో నేర్పాడు.  

“Sentimental Education” — Gustave Flaubert:
  ఒక పాత్ర పూర్తి జీవితాన్ని పుస్తకపు కొన్ని పేజీల్లో ఒద్దికగా ఇరికించగలగడం మంచి నవల లక్షణం. కానీ ఎంత మంచి నవలైనా చదవడం పూర్తి కాగానే పాత్రలు పాత్రలుగానే మిగులుతాయి. అందులో చూపించిన జీవితానికి, పుస్తకం మూయగానే మన చుట్టూ వచ్చి ఆవరించుకునే వాస్తవ జీవితపు స్థల-కాల ప్రమాణాలకు పొంతన కుదరక రెండూ దూరం జరిగిపోతాయి.  చాలా గొప్ప నవలలు మాత్రమే, పుస్తకం మూసిన తర్వాత కూడా, పుస్తకంలోని పాత్రలతో కలిసి మనమూ ఓ జీవితాన్ని పంచుకున్న అనుభూతి కలిగిస్తాయి. ఈ పుస్తకం నాకలాంటి అనుభూతినే మిగిల్చింది. నేను మళ్ళీ మళ్ళీ చదువుకొనే పుస్తకాల్లో ఇదొకటి.

Crime and Punishment“, “Brothers Karamazov” — Dostoyevsky: ఈ రెండూ నన్నేవిధంగా ప్రభావితం చేసినయ్యంటే చెప్పలేను గానీ, వీటిని చదవడం వల్ల నాలో ఏదో మార్పు కలిగిందని మాత్రం చెప్పగలను. దాస్తోయెవ్‌స్కీ రచనల్లో కనిపించే feversih ferver అంత తొందరగా మర్చిపోలేం. ముఖ్యంగా “బ్రదర్స్ కరమజొవ్”లో కొన్ని అధ్యాయాలైతే మతి పోగొట్టేస్తాయి.  

 
— ఓపిక వీలు కల్పించిన మేరకు ఇంతే నా పుస్తకాల సంగతులు.
ప్రకటనలు

5 responses »

 1. బాగుంది.
  Henry James is considered a great stylist in English fiction, both in language and in constructing the fiction.
  Henry Miller is considered a tsunami wave that redefined the art of novel. You may want to try both of these.
  మంచి తెలుగు కావాలంటే ఉన్నవ వారి మాలపల్లి, ఉప్పల వారి అతడు ఆమె కూడా ప్రయత్నించండి. అతడు ఆమె స్టైలిస్టిక్ గా కూడా చాలా చిక్కగా ఉంటుంది.

 2. తెలుగు లో సాధికారికంగా పద్యాలు చెప్పగల ఫణీంద్ర గారు ఇన్ని ఆంగ్ల పుస్తకాలు చదవడం అబ్బురపరుస్తోంది.

  రవి కుమార్ గారు, మీ చదువు ముచ్చట్లు కొనసాగించండి.

 3. Thank you Ravikumar garu for introducing such a voracious reader to us. Since Mr. Phanidra is very modest, he has said that he has dilettantish talent, but he has got real talent. He must give a little access to the others to get in touch with him, to share his knowledge. Please try to get his e-mail id or mobile no.

 4. @ కొత్తపాళీ గారూ, మరి అతి సాదాసీదాగా కనిపించే మహత్తర, విశీషణాలులేని, విస్తృతంగా వచనం రాసిన కొడవగంటి కుటుంబరావును కూడా మంచి తెలుగు కోసం చదవచ్చని అనుకుంటా.

  @ అనామకుడు గారూ, ఫణీంద్ర కలం కలలు పేరుతో నాగొడవ (బ్లాగ్ స్పాట్ లో) బ్లాగ్ రాశేవారు. కానీ ఇప్పుడు రాయడం ఆపేశారు. ప్రస్తుతానికి రాయకుండా ఆపిన ఫణీంద్ర మళ్లీ బహు బాగుగా బ్లాగాలని కోరుకునేవాళ్లలో నేనూ ఒకణ్ణి. (ఈ విషయంలో నా అజ్ఞానాన్ని గుర్తించి, గుర్తింపజేసిన ‘అరుణమ్’ అరుణగారికి కృతజ్ఞతలు.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s